Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 6

                                 


                     మీ అనారోగ్యమే మా మహాభాగ్యం

  
                         


    మా కాలనీ వాళ్ళు తరచుగా ఏదొక సందర్భంలో మీటింగులు పెట్టడం మామూలే అని మీకీపాటికి తెలిసే వుంటుంది. అందులోనూ శాయిరామ్ మళ్ళీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అయ్యాక పరిస్థితి మరింత విషమించింది. ఇంచుమించుగా ప్రతాదివారం మీటింగుళు పెట్టేస్తున్నాడు. ఆ ఆదివారం మీటింగ్ కాలనీ వాసుల ఆరోగ్యం గురించి అని ముందే అందరికీ తెలియజేశాడు.

 

    తొమ్మిదింటికల్లా కాలనీవాళ్ళు చాలా మంది మీటింగుకి హాజరయ్యారు. నేనూ అక్కడికి చేరుకునే సరికి శాయిరామ్ మైక్ దగ్గర నిలబడి స్పీచ్ దంచేస్తున్నాడు.

 

    "... మొన్నటికి మొన్న మా రెండో అబ్బాయికి దగ్గుగా ఉందని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఏదో టాబ్ లెట్లు, టానిక్ రాసిచ్చి ముప్పై రూపాయలు ఫీజు తీసుకున్నాడు. ఆ మందులు వాడేసరికి వాడికి దగ్గుపోయి వాంతులు మొదలయినాయి. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరకు తీసుకెళితే వాంతులు తగ్గటానికి మళ్ళీ టాబ్ లెట్లు రాసిచ్చి ఫీజు ముప్పయ్ రూపాయలు తీసుకున్నాడు. దగ్గుకి వాడిన టాబ్ లెట్స్ తాలూకు ప్రభావం వల్ల వాంతులవడం మామూలేనని డాక్టర్ శెలవిచ్చాడు. వాంతులకు మందులు వాడేసరికి - అవి తగ్గి అజీర్ణం మొదలయింది. అది ఆ వాంతుల తాలూకు మందుల ప్రభావమట! మళ్ళీ కొత్త మందులూ, ముప్పయి రూపాయల ఫీజు!- ఇలా ఎంతకాలం డాక్టర్ కి ముడుపులు చెల్లిస్తుండాలో అర్థంకాక ఆ విషయం అడిగితే "మీ అనారోగ్యమే మాకు మహాభాగ్యం" అన్నారాయన చిరునవ్వుతో! కనుక సోదరులారా! ఇప్పుడు మనందరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకంటే ఈ సమస్య నా ఒక్కడిదీ కాదు. మన కాలనీలో అందరూ వందలకు వందలు ప్రతి నెలా డాక్టర్లకు సమర్పించుకుంటున్నాము. రోగాలతో ఓ బాధ- డాక్టర్ ల ఫీజులతో మరో బాధగా ఉంది మనకు. ఈ విషయం మీద సోదర సోదరీమణులందరూ తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తాను."

 

    వెంటనే రాజేశ్వరమ్మ గారు ఆడాళ్ళ మధ్యలో నుంచి లేచి నిలబడింది.

 

    "మీరు చెప్పింది నిజమే అన్నయ్యగారూ! మొన్నో డాక్టర్ సచ్చినోడు మా చంటిదానికి టి.బి. ఉందని చెప్పి ఇంజక్షన్ ళు, టాబ్ లెట్ ళు మొదలెట్టేశాడు. పదిహేను రోజుల్తరువాత దాని స్కూలులో డాక్టర్ ఆరోగ్యం శుభ్రంగా వుందని కార్డు పంపించాక అనుమానం వచ్చి వేరే డాక్టర్ తో పరీక్ష చేయిస్తే టి.బి.లేదు, గాడిద గుడ్డూ లేదని చెప్పేశారు. అయితే అనవసరంగా టీ.బి. ఇంజెక్షన్ లూ, టాబ్ లెట్ లూ వాడడం వలన మరేదో రోగం ముంచుకొచ్చిందని చెప్పి అది తగ్గటానికి ఇంకా ఏవో ఇంజెక్షన్ ళు రాసిచ్చారు. దీనికంతా కలిసి వెయ్యిరూపాయలు అప్పయింది! ఆ పాడు సచ్చినోడు అలా అబద్ధాలు చెప్పకుండా ఉంటే ఆ వెయ్యిపెట్టి గ్రైండర్ కొనుక్కునేదాన్ని" అందామె ఆవేశంగా.

 

    అందరూ రాజేశ్వరమ్మ గారి చంటిదాని గురించి కొద్దిసేపు సానుభూతితో మాట్టాడుకున్నారు.

 

    ఆ తరువాత కాలనీ కమిటీ మెంబర్ శంకర్రావ్ మైక్ ముందు నిలబడ్డాడు. ఆయన తాలూకు వైద్యనారాయణోహరి అనుభవం ఇలా రసవత్తరంగా సాగింది.

 

    అది 1970వ సంవత్సరం. మా ఆవిడ విపరీతమయిన కడుపునొప్పితో బాధపడుతూంటే అర్దరాత్రి మా రైల్వే హాస్పిటల్లో లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను.

 

    "ఇది ఎపెండిసైటిస్! వెంటనే ఆపరేషన్ చేసెయ్యాలి-" అంటూ ఏదో కాగితం మీద రాసిచ్చి, అర్దరాత్రి తన నిద్ర పాడయినందుకు విసుక్కుని అర్జంటుగా మమ్మల్ని బయటకు పంపి తలుపేసుకుంది. మా ఆవిడను మర్నాడు పొద్దునే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళి ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేయమంటే వాళ్ళు గంటసేపు ఆపరేషన్ చేసి అది ఎపెండిసైటిస్ కాదనీ, అంచేత ఆపరేషన్ కేన్సిల్ చేసేస్తున్నామనీ తేల్చారు.

 

    ఆ నర్సింగ్ హోమ్ ఇన్ ఛార్జ్ నామీద మండిపడింది.

 

    "ఇది ఎపెండిసైటిస్ అని ఎవరు చెప్పారు మీకు?"

 

    "మా రైల్వే హాస్పిటల్ లో డాక్టరండీ!"

 

    "ఆవిడకేమయినా బుద్ధుందా?"

 

    "ఉందనుకునే మా రైల్వేవాళ్ళు మా రైల్వే హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చారండీ!"

 

    "ఆవిడకు బుద్ధి లేదు అని నేను చెప్తున్నాను" అందావిడ కోపంగా.

 

    "సరేనండీ!"

 

    "అంతేగాదు- మీ రైల్వే డిపార్ట్ మెంట్ కి కూడా బుద్దిలేదు-"

 

    "ఆ సంగతి కూడా ఇప్పుడే తెలిసిందండీ!"

 

    "ఉంటే కడుపునొప్పి అన్నంత మాత్రాన ఎపెండిసైటిస్ అని రాసేయరు."

 

    "మా రైల్వేలో రాసేస్తారండీ" అన్నాను నిజం ఒప్పుకుంటూ.

 

    "టు హెల్ విత్ యువర్ రైల్వే అండ్ టు హెల్ విత్ యువర్ లేడీ డాక్టర్."

 

    "అలాగేనండి"

 

    "అది ఎపెండిసైటిస్ అయితే మరి ఆవిడకి మీ రైల్వే హాస్పిటల్లోనే ఎందుకు ఆపరేషన్ చేయలేదు?"

 

    "చేస్తాననే అందండి ఆవిడ- కానీ నేను ఒప్పుకోలేదు."

 

    "ఎందుకని ఒప్పుకోలేదు?"

 

    "ఆ ఆవిడ నేనూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నామండి. పైగా ఇప్పటికీ ఎలాంటి తగవులుకానీ, విభేదాలుగానీ, కక్షలుగానీ మామధ్య లేవండీ! అంచేత ఇంకొంత కాలమయినా సుఖంగా సంసారం చేయాలన్న ఆశతో మా హాస్పిటల్లో ఆపరేషన్ కి నేను అభ్యంతరం చెప్పి మీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కి తీసుకొచ్చానండీ."

 

    "మరీ సంగతులన్నీ ముందే చెపితే, నేను మళ్ళీ పరీక్షించి అది అపెండిసైటిస్ అవునా! కాదా! అని తేల్చుకుని అప్పుడు ఆపరేషన్ ప్రారంభించే దానిని కదా!"

 

    "మా లేడీ డాక్టరు..."

 

    "టు హెల్ విత్ యువర్ లేడీ డాక్టర్...."

 

    "ఆవిడక్కూడా ఏ రాష్ట్రందో తెలీదుగానీ ఓ యం.బి.బి.యస్. డిగ్రీ ఉంది. ఆవిడ చాలా రోజుల్నుంచీ రోగులకు మందులిస్తోంది కదా అని ఆలోచించి-"

 

    "ఆ ఆ లు రానివాళ్ళు కూడా మనదేశంలో లక్షల మందికి మందులిస్తున్నారని పేపర్లలో చదవలేదూ?"

 

    "చదివానండీ!"

 

    "మరి మందులివ్వడం పెద్ద ఘనకార్యం అన్నట్లు మాట్లాడతారేమిటి?"

 

    "ఇంతకూ మా ఆవిడకున్న జబ్బేమిటండీ! ఆ కడుపునొప్పి ఎందుకొచ్చిందంటారు?"

 

    "అది అమీబియాసిస్-"

 

    అమీబియాసిస్సాండి!"

 

    "అవును"

 

    "అంటే ఏమిటండీ"

 Previous Page Next Page