Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 7


    "మీరు ఏ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు?"

 

    "రైల్వేలో."

 

    "అందుకే ఇలా మా టైమ్ వేస్ట్ చేస్తున్నారు. అమీబియాసిస్ అంటే ఏమిటో మీకు వివరంగా చెప్పాలంటే నాలుగ్గంటలు పడుతుంది. నాలుగ్గంటలు అంటే రెండు ఆపరేషన్లు. రెండు ఆపరేషన్లంటే రెండువేలరూపాయలు అర్థమయ్యిందా?"

 

    "అయ్యిందండీ!"

 

    "అయితే ఎనిమిదొందలు ఫీజు కట్టి ఈ మందులు కొని వాడండి."

 

    "ఎనిమిదొందలు ఎందుకండీ? ఆపరేషన్ చెయ్యలేదుగా?"

 

    "చెయ్యకపోయినా చేసినంత పనయింది కదా! పేషెంట్ కి కంప్లీట్ రెస్ట్- పంచదార లేకుండా పాలు ఇవ్వండి. వారం రోజులు ఇంజెక్షన్లు- ఫీజివ్వండి. త్వరగా!"

 

    ఫీజిచ్చి బయట పడ్డాను.

 

    మందులన్నీ వాడినా కడుపునొప్పి తగ్గకపోయేసరికి డాక్టర్ని మార్చాక తప్పలేదు. కొత్త డాక్టరు అన్ని రిపోర్ట్స్ చూసి, వివరాలు అడిగి తెలుసుకుని అరగంట సేపు ఆలోచించాడు. అతను ఆలోచిస్తున్న కొద్దీ నాకు భయం ఎక్కువయిపోసాగింది.

 

    "రేపు రండి! చెప్తాను" అన్నాడు సీరియస్ గా.

 

    "అంటే - ఇదేం ప్రమాదకరమయినది కాదు గదా?" అనుమానంగా అడిగాను.

 

    "ఆ విషయం కూడా రేపే తెలుస్తుంది."

 

    "ఇప్పుడు చెప్పడం కుదరదా?"

 

    "కుదరదు."

 

    "ఎందుకని?"

 

    "నిజం చెప్పమంటారా?"

 

    నాకు చెమటలు పట్టేసినయ్. మా ఆవిడ మొఖం పాలిపోయింది. ఇద్దరికీ ఏడుపొక్కటే తక్కువ. తప్పకుండా అది ప్రాణాలు తీసే జబ్బే అయుంటుందనిపించింది.

 

    "చెప్పండి, నిజం చెప్పేయండి. ఫరవాలేదు" అన్నాను వణుకుతూ.

 

    "నేను ఎం.బి.బి.యస్. పరీక్షలన్నీ కేవలం డజను జబ్బులకు సంబంధించిన పాఠాలే చదివి పాసయ్యాను. ఆ జబ్బులే పరీక్షలు అడుగుతారని మా మావయ్య చెప్పాడు. ఆయన ఇదివరకు హెల్త్ మినిష్టర్ లెండి. అందుకని మిగతా జబ్బులన్నీ వదిలేశాను. అంచేత ప్రస్తుతం ఆ డజను జబ్బుల్లో- ఇరుక్కున్న పేషెంట్ వస్తేనే వైద్యం చేయగలను. మిగతా జబ్బులయితే ఇంటికెళ్ళి రాత్రంతా గైడ్ చదివి ప్రొద్దున్న వైద్యం చేస్తాను. కనుక మీరు రేపొద్దున్న రండి. ప్రస్తుతానికి ఇదంతా చెప్పినందుకు పాతిక రూపాయల ఫీజివ్వండి చాలు" అన్నాడు. నేను పాతిక రూపాయలు అతని చేతిలో పెట్టి బ్రతుకుజీవుడా అని బయటపడ్డాను. మరో డాక్టర్ మా ఆవిడను పరీక్షించి, "ఖచ్చితంగా ఇది గాస్టిక్ ట్రబులే" అన్నాడు ధీమాగా.      

 

    "అంటే ఏమిటండీ?"

 

    "అంటే సెప్టిక్ అల్సర్!" అంటే ఎసిడిటీ వల్ల అల్సర్ ఫారమ్ అవుతుందన్నమాట. అంటే వీటి వల్లే కడుపు మంటలు వగయిరా వస్తాయన్నమాట. అంటే అంతే. ఇంకేమిలేదు."


    "మరి దీనికేం చేయాలంటారు?"

 

    "ముప్పయ్ రూపాయలు నాకు ఫీజు ఇవ్వాలి. ఇస్తే మందులు రాస్తాను."

 

    "ఫీజు ఇస్తాన్లెండి- ఇవ్వకుండా పారిపోను గదా!"

 

    "అలా అని జెప్పి- మీ రైల్వే డ్రైవర్ ఒకతను మందులు రాసేశాక ఫీజివ్వకుండా మందుల కాగితం తీసుకుని ఎక్స్ ప్రెస్ లాగా పారిపోయాడు. అప్పటినుంచీ నేను రైల్వే వాళ్ళకు ఫీజు ముందు తీసుకుని తరువాత ట్రీట్ మెంట్ చేస్తాను- ఏదీ ఫీజివ్వండి"

 

    నేను ఫీజిచ్చాక అతను మందులు రాసిచ్చాడు.

 

    "చూడమ్మా, నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి" అన్నాడు మా ఆవిడతో.

 

    "అలాగేనండీ."

 

    "సాధారణంగా నువ్వేం ఆలోచిస్తుంటావు?"

 

    "అవీ- ఇవీ- ఆలోచిస్తుంటానండీ"

 

    "అవీ- ఇవీ- అంటే ఏమిటి?"

 

    "అంటే, ఇదివరకు ఎక్కువగా కాలనీలో ఇరుగుపొరుగువాళ్ళు ఏమయినా కొత్త వస్తువులు గానీ, చీరెలుగానీ, కొంటే వాటి గురించి ఆలోచించేదాన్నండీ, కాని ప్రస్తుతం ఆ ఆలోచనలు పోయాయండీ."

 

    "మరిప్పుడు ఏ విషయం ఎక్కువగా ఆలోచిస్తుంటారు."

 

    "ఇప్పుడు మా అన్న గురించి ఆలోచిస్తూంటానండీ!"

 

    "ఎందుకు మీ అన్న గురించి ఆలోచించటం?"

 

    "పాపం మా అన్న రాత్రింబవళ్ళు శ్రమపడుతున్నాడు కదండీ! అందుకనీ చాలా ఆవేదనగా ఉంటుందండీ!"

 

    "చూడమ్మా! మగాడన్నాక శ్రమపడక తప్పదు కదా! దాని గురించి ఎవరయినా ఆలోచిస్తుంటారా? ఇంతకీ మీ అన్నయ్య ఏమి పని చేస్తారు?"

 

    "మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదండీ! మీకు తెలీదూ!"

 

    "అంటే నువ్వు మాట్లాడేది యన్.టి.ఆర్. గురించా?"

 

    "అవునండీ! ఆయనే కదండీ! 'అన్న' అంటే?"

 

    "చూడమ్మా ప్రస్తుతం నువ్వు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా గడపాలి. అప్పుడే అల్సర్ నయమవుతుంది."

 

    "అన్న మా స్త్రీల మంచికోసం ఇంత పాటుపడుతూంటే ఆలోచించకుండా ఎలా వుండగలనండీ?"

 

    "ఉండాలమ్మా! లేకపోతే అల్సర్ తప్పదు."

 

    మా ఆవిడ అయిష్టంగానే అంగీకరించింది.

 

    అల్సర్ కి కొన్ని రోజులు ట్రీట్ మెంట్ అయాక మరో కొత్త డాక్టర్ ని చూడక తప్పలేదు.

 

    ఆయన అంతవరకూ డాక్టర్లు రాసిన, చేసిన పనులన్నీ చదివాడు. ఎక్స్ రేలు చూశాడు.

 

    "అసలు ముందిది ఎపెండిసైటిస్ అని రాసిన లేడీ డాక్టర్ కి బుద్ధి లేదు" అన్నాడు అన్నీ చదివాక.

 

    "అవునండీ! ఆ విషయం రెండో డాక్టర్ చెప్పారు."

 

    "నన్నడిగితే ఆ రెండో డాక్టర్ కీ బుద్దిలేదు."

 

    "పోనీ మూడో డాక్టర్ కండీ?"

 

    "మూడో డాక్టర్ కి అంతకన్నా లేదు!"

 

    "లేదాండీ?"

 

    "ఏ మాత్రం లేదు- ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళ దగ్గరకెందుకెళ్ళారు మీరు?"

 

    "బుద్ధిలేదన్న సంగతి వాళ్ళు చెప్పలేదు కదండీ ముందు - అందుకని."

 

    "నన్నడిగితే అసలు మీకు బుద్ధిలేదంటాను"

 

    నాక్కోపం వచ్చింది.

 

    "మీక్కావాలంటే ఇంకో అయిదు రూపాయలు ఎక్కువ ఫీజు తీసుకోండి, అంతేగాని ఇలా తిట్టటానికి వీల్లేదు."

 

    "లేకపోతే ఏమిటయ్యా మీ ఆవిడ ఆ కొత్త ఆవకాయ పచ్చడి పూటకి నాలుగు బద్దల చొప్పున వేసుకుని మింగుతుంటే కడుపు నొప్పి రాకేం చేస్తుంది. ఈ మాత్రానికే ఆపరేషనూ పాతిక రకాల మందులూ, ఇంజక్షన్లూ, అరడజను డాక్టర్లూ- ఏమిటీ నాన్సెన్స్? నా ఫీజిచ్చి ఇంక ఇంటికిపోండి! మీ ఆవిడకు వారం రోజుల వరకు కేవలం మజ్జిగన్నం తినిపించండి. అంతే దెబ్బకు ఎగిరిపోతుంది. కడుపునొప్పి."

 

    చివరకు ఆ విధంగా రెండువేల రూపాయల ఖర్చు తరువాత కేవలం మజ్జిగన్నంతో కడుపునొప్పి మాయమయిపోయింది. కనుక సోదర సోదరీమణులందరూ నా అనుభవాన్ని బట్టి ఆలోచిస్తే "మీ అనారోగ్యమే- మా మహాభాగ్యం" అనేది డాక్టర్ల పాలసీగా కనబడుతుందని ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు నా సలహా ఏమిటంటే, మన కాలనీ వాళ్ళందరం కలసి బాగా పేరు, అనుభవం, నైపుణ్యం వగైరాలన్నీ గల డాక్టర్ ని మన కాలనీ కోసం మనమే ఏర్పాటు చేసుకుంటే అందరకీ బోలెడు ఫీజులు కట్టే పరిస్థితి తప్పడమేకాకుండా, సరయిన వ్యాధి నిర్ణయం, తగిన వైద్యం జరిగే అవకాశం ఉందని మనవి చేస్తున్నాను" అంటూ ముగించాడతను. అందరూ ఆ సలహా అద్భుతంగా ఉందని తప్పట్లు కొట్టారు.

 Previous Page Next Page