"వెంటనే మళ్ళీ అర్ధరూపాయ్ కాయిన్స్ పోగు చేసి వరుసగా అన్ని పోలీస్ స్టేషన్స్ కీ ఫోన్ చేస్తూండగా సంధ్యారాణీ, మరో యువకుడూ మెడలో పూలదండలతో ఆటోదిగారు.
అందరం కాసేపు నిశ్చేష్టులమయిపోయి తరువాత పరుగుతో వెళ్ళి వాళ్ళచుట్టూ మూగాము.
"ఏమయిపోయావే నా తల్లీ" అంటూ భోరున ఏడ్చేసింది వాళ్ళమ్మ కౌగలించుకుని.
"నేనేమయిపోతాను మీ పిచ్చిగానీ- గత సంవత్సరంగా నేను బస్ లో ఆఫీస్ కెళ్ళి వస్తున్నాను కదా. రోజూ లకడీకాపూల్ ట్రాఫిక్ జామ్ లో అయిదారు గంటలపాటు మా బస్ ఇరుక్కుపోవటం మామూలే కదా! రోజూ మా బస్ పక్క బస్ లో - ఇదిగో- ఇతను కూడా అదే ట్రాఫిక్ జామ్ లో ఉంటూండేవాడు. ఇద్దరం పక్కపక్క బస్సుల్లో ఎదురెదురు కిటికీల దగ్గర సీట్లల్లో కూర్చోవడం వల్ల ఇద్దరం 'హలో' అనుకున్నాము. క్రమేపీ కబుర్లలోకి దిగిపోవటం అలవాటయింది. మొన్నటిది మరీ లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల కబుర్లు చెప్పుకుని చెప్పుకుని ఇంక చెప్పుకునేందుకు ఏమీలేక ప్రేమలో పడ్డాము. ఎంత ప్రేమయినా ఎక్కువసేపు చూసుకుంటూ కూర్చుంటే బావుండదు కదా! అందుకని పెళ్లి చేసుకుంటే బావుంటుందని నిర్ణయించుకున్నాం. పెళ్లి అయితే ట్రాఫిక్ జామ్ లో ఎంతసేపున్నా ప్రాబ్లమ్ వుండదు కదా౧ ఇంట్లో చేసే కాపురం- రోడ్ మీదే చేయవచ్చు- మా గొడవంతా చూపి మిగతా పాసింజర్లందరూ జాలిపడి ఆ పక్కనే ఉన్న పూలదుకాణంలో దండలు తెచ్చిచ్చి పెళ్లి జరిపించారు. ఎక్కడో పెళ్ళి పౌరోహిత్యానికి వెళ్ళాల్సిన పురోహితుడొకాయన కూడా అదే బస్ లో ఉండడం చేత బస్ లోనే ఘనంగా పెళ్లి జరిగిపోయింది.
పాసింజర్ అందరూ పాపం కూడబలుక్కుని ఓ బస్ అంతా ఖాళీచేసి మాకిచ్చి మొదటిరాత్రి ఆనందంగా గడపమని ఆశీర్వదించారు. మూడు నిద్రలు అయాక - ఇదిగో- ఇప్పుడే వస్తున్నాం-"
ఆమె తల్లిదండ్రుల మొఖంలో ఆనందం నిండిపోయింది.
"ఆ! కట్నం లేకుండా అల్లుడు దొరికాడా? ఏమండీ! వెంటనే లకడీకాఫూల్ కెళ్ళి ఆ ఏరియా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఫోటోలన్నీ తీసుకురండి. వాళ్ళు మనపాలిట ఇలవేలుపులండీ! వాళ్ళ ఫోటోలను రోజూ మన దేవుడిగదిలో ఉంచి పూజలు చేయాలి! ఎంతోకాలం నుంచీ కట్నాలబాధ వలన చేయలేకపోయిన అమ్మాయి పెళ్ళి కేవలం వాళ్ళ ట్రాఫిక్ జామ్ల పుణ్యమా అని ఎంత చవకగా అయిపోయిందో చూశారా?"
అంటూ భర్తను కౌగిలించుకుంది హ్యాపీగా.
రామచంద్రమూర్తి అప్పటికప్పుడే ఫోటోలు తేవటానికని "యాషికా కెమెరా అరువు తీసుకుని లకడీకాపూల్ వెళ్లిపోయాడు.
ఆ సాయంత్రం కాలనీలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఫోటోలకు పూజలు, ప్రార్థనలు జరుగుతూంటే మేమంతా ఆనందంగా ప్రసాదం తినసాగాము.
"నిజంగానే ట్రాఫిక్ జామ్స్ వలన ఎన్నో లాభాలున్నాయేమో అని నాకు అనిపిస్తుంది." అన్నాడు రంగారెడ్డి అనుమానంగా.
అందరం ఆశ్చర్యపోయాం.
"ట్రాఫిక్ జామ్స్ వల్ల లాభాలా?" రంగారెడ్డిని పిచ్చాడిని చూసినట్లు చూస్తూ అడిగాడు జనార్ధన్.
"అవును! అలా ఓవర్ గా ఎక్స్ ప్రెషన్ లు ఇవ్వకుండా మీరూ బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించండి! బోలెడు లాభాలు కనబడతాయ్. అసలు నన్నడిగితే మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళూ మన రాష్ట్ర రాజకీయ నాయకుల దగ్గరా, మన రాజధాని పోలీస్ అధికారుల దగ్గరా శిక్షణ తీసుకోవాలి. అప్పుడు దేశమంతా హైదరాబాద్ మోడల్ ట్రాఫిక్ జామ్స్ ఏర్పాటు చేసుకుని అద్భుతమయిన లాభాలు ఎంజాయ్ చేయవచ్చు-" సీరియస్ గా అన్నాడతను.
దాంతో అందరూ నిజంగానే ఆలోచనలో పడ్డారు. ముందు యాదగిరికే ప్లాష్ వెలిగింది.
"అవ్! రంగారెడ్డి కరెక్ట్ గా జెప్పిండు! నేను అబ్జర్వ్ జేస్తనే ఉన్నా కదా! ట్రాఫిక్ జామ్స్ ఉండెడిది రోడ్స్ లో అస్కల్కి ఒక్క యాక్సిడెంట్ కూడా అవటం లేదన్నా! ఎందుకో ఎరికనా? మోటార్ సైకిల్ గానీ, కారుగానీ అస్సలు ముంగటికి కదుల్తే గదా యాక్సిడెంట్ అవ్వనికి" అన్నాడు కొత్తగా ఏదో డిస్కవర్ చేసినంత ఉత్తేజంతో-
"దానికంటే పెద్ద లాభం ఇంకోటుంది బ్రదర్" అన్నాడు గోపాల్రావ్.
అందరూ అతని వేపు ఆసక్తితో చూశారు.
"ఏమిటది?" అడిగాన్నేను.
"మత కలహాలకు మనదేశం చాలా ప్రసిద్ధికదా! ప్రపంచమంతా మనదేశం గురించి చెప్పుకుని నవ్వుకుంటూనే ఉంటారు. ఇప్పుడీ ట్రాఫిక్ జామ్స్ ల వల్ల మతకల్లోలాలు, గ్రూప్ ఫైటింగ్ ళు, కులపోరాటాలు అస్సలుండవ్! ఎందుకంటే జనమంతా మన ఇరుకు వీధుల్లో ఇంకా ఇరుక్కుని నిలబడటం వల్ల పక్కవాడిని పొడిచేంత స్థలం కూడా దొరకదు. దాంతో పొడుచుకోడాలు, కాల్చుకోడాలు ఏమాత్రం సాధ్యపడదు. దాంతో ఆటోమేటిగ్గా "భాయి భాయి" లెవల్లో కల్సిపోయి ఐకమత్యంతో ఆ ట్రాఫిక్ జామ్ నుంచి ఎలా బయటపడాలా అనే ఆలోచిస్తారు-"
"మూడోది దేశంలో వరకట్నాల సమస్య పూర్తిగా రూపు మాసిపోతుంది" అంది రాజేశ్వరి.
"ఎలా?" లేడీస్ నుంచి ఎవరో అరచారు.
"ఎలాగేముంది? ట్రాఫిక్ జామ్స్ అన్నాక గంటల తరబడీ, ఒకోసారి విదేశీ ప్రముఖులు మన రాష్ట్రానికొచ్చినప్పుడు - రోజుల తరబడీ ట్రాఫిక్ జామ్స్ అవుతాయ్ కదా! అప్పుడు ఆ ట్రాఫిక్ జామ్స్ లో పెళ్ళి కాని యువతీ యువకులు కూడా ఇరుక్కోక తప్పదు కదా! దాంతో గత్యంతరం లేక టైమ్ పాస్ కోసమయినా ఒకరినొకరు పలుకరించుకోవటం, జీవితం గురించి వేదాంత ధోరణిలో మాట్లాడుకోవటం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం- ఆ తరువాత ప్రేమలో పడటం- ట్రాఫిక్ జామ్ క్లియర్ అవగానే పెళ్ళి చేసేసుకోవాలని నిర్ణయించుకోవటం- అలా లవ్ మారేజీలు పెరిగిపోతాయ్. దాంతో వరకట్న సమస్యలు ఆటోమేటిగ్గా పరిష్కారమయిపోతుంది-" ఆవేశంగా చెప్పిందామె.
కొంతమంది లేడీస్ తప్పట్లు కొట్టారు ఆనందంగా.
"ఆ రోజులు త్వరగా రావాలి!" అని కూడా అరచారు వాళ్ళు.
"వీటికన్నింటికంటే కూడా గొప్పలాభం ఇంకోటుంది" అంది పార్వతీదేవి.
"ఏమిటది?"
"ట్రాఫిక్ జామ్స్ ఇలాగే విజయవంతంగా అమలుపరుస్తే మనదేశంలో ఆహారకొరత వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని లక్షలమంది ట్రాఫిక్ జామ్స్ లో ఇరుక్కుపోయి కనీసం రెండురోజులకో పూటయినా భోజనం మిస్ అవుతారు. ఆ విధంగా కొన్ని లక్షల టన్నుల ఆహారధాన్యాలు మిగిలిపోతాయ్-"
"నన్నడిగితే దానికన్నా కూడా మంచిలాభం ఇంకోటుంది. అదేంటంటే రైళ్ళల్లో, బస్సుల్లో, టాక్సీల్లో రద్దీ డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. ఎంచేతంటే వాటిల్లో వెళ్ళాల్సిన ప్రయాణీకులు కొన్ని లక్షలమంది ట్రాఫిక్ జామ్స్ లో ఇరుక్కుపోయి టైమ్ కి స్టేషన్ గానీ, బస్ డిపోకి గానీ చేరుకోలేరు- దాంతో వాటిని మిస్ అయిపోయి ప్రయాణం రద్దు చేసుకుంటారు-"
ఓ ముసలాయన ఉత్సాహంగా అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చాడు.
"అసలు విషయం మర్చిపోయారర్రా! ఈగలు, దోమల కన్నా ఫాస్ట్ గా పెరిగిపోతున్న మన జనాభా పెరుగుదల ఈ ట్రాఫిక్ జామ్స్ ల వల్ల సగానికి సగం పడిపోతుంది-"
అందరూ ఈలలు వేసి తప్పట్లు కొట్టారు.
"సోదరులారా! ఈ ట్రాఫిక్ జామ్స్ వల్ల లాభాలకు అంతు ఉన్నట్లు లేదు. అందుకని ఇంక ఈ టాపిక్ ఆపి ఇళ్ళకు వెళ్తే బాగుంటుంది." అన్నాడు రంగారెడ్డి చిరాకుగా. అందరూ ఇళ్ళకు వెళ్తోంటే రేడియోలో వార్తలు వినబడుతున్నాయ్.
ఆంధ్రప్రదేశ్ పౌరులకు పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి!
ఇక నుంచీ వీధుల్లో నడిచిగానీ, వాహనాలలో గానీ వెళ్ళదల్చుకున్న ప్రజలందరూ విధిగా టిఫిన్ కేరియర్ లో భోజనాలు, తాగడానికి నాలుగులీటర్ల మంచినీళ్ళు, ఒక తలగడ, ఒక దుప్పటి తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నారు! స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు తమతో పాటు ఆఫీస్ ఫైల్స్ కూడా తీసుకెళ్ళి ట్రాఫిక్ జామ్స్ లో ఆ ఫైల్స్ తాలూకు పని అంతా పూర్తి చేయాల్సిందిగా చీఫ్ సెక్రటరీ ఆదేశిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వెంటనే డ్యూటీ దిగిపోయినట్లు సంతకం చేసి, బస్ లోనే నిద్రపోయి తిరిగి ట్రాఫిక్ జామ్ క్లియరయిపోయినప్పుడు మళ్ళీ డ్యూటీలో చేరాల్సిందిగా జనరల్ మేనేజరుగారు కోరుతున్నారు..."
ఆ తరువాత ఇంకేం విజ్ఞప్తులు, ఎవరెవరు చేశారో మాకు తెలీదు. అందరం నిద్రలోకి జారిపోయాం.
* * * * *