"నువ్వు పుట్టింది డ్యాన్సులూ, డ్రామాల కోసంకాదు" అన్నాడు రామం ఓసారి.
"మరి దేనికోసం?" అని ఆమె ప్రశ్నించింది.
అతను కఠినంగా మాట్లాడుదామనుకుని కూడా విఫలుడై "నువ్వు వీటికన్నిటికి అతీతురాలివి" అన్నాడు.
ఈ మాటకు ఆమె పరవశత్వం పొందింది. కాని యిది బలహీనతగా ఆమె అంగీకరించదు. తనకు చాలా టాలెంట్సు వున్నాయనీ, అవి హేండిల్ చేయటం ఎలాగో తెలియటల్లేదనీ బాధపడేది.
పైగా ఆమెకోసం మగ స్నేహితులు చాలామంది వస్తూండేవారు. వాళ్ళందరూ ఆమె యిక్కడ చదివేటప్పుడు క్లాస్ మేట్స్.
వాళ్ళతో చనువుగా మాట్లాడటానికీ, చొరవగా బయటకు పోవటానికీ ఆమెకి భయంగానే వుండేది. "నేను నా యిష్టప్రకారం చేయలేకపోతున్నాను" అని వాపోయేది.
అత్తగారికీ, మామగారికీ ఆమె వ్యవహారం ఏమీ నచ్చలేదు. కాని రామం సంపాదనపరుడు. అతని వ్యవహారంలో వేలు దూర్చటంకన్న "వాడే సరిదిద్దుకుంటాడులే" అని ఊరుకున్నారు.
రామానికిది తీరని మనోవ్యాధిగా పరిణమించింది. మొదట చాలా విశాలబుద్ధితో వుండాలనుకున్నాడు. వుండలేకపోయాడు. ఆమె అభిరుచుల్ని గౌరవించాలనుకున్నాడు. గౌరవించలేకపోయాడు. ఆమెను ద్వేషించకూడదను కున్నాడు. ద్వేషించసాగాడు. ఆఖరికి అతని యిష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుమానించసాగాడు.
ఓసారి మనోరమ ధైర్యంచేసి కాలేజీ ఓల్డు స్టూడెంట్సు వేడుకల సందర్భంలో నాటకంలో వేషం వేసింది.
ఇంటికి వచ్చి, "ఎంత బాగుందీ అనుభూతి? అబ్బ! చాలా బాగుంది. చాలా బాగుంది" అన్నది తనలోతాను అనుభవిస్తున్నట్లు.
రామం తల ఎత్తి ఆమెవైపు చూశాడు. అతడికళ్ళలో నీళ్లు తిరిగాయి.
తన నటన అద్భుతంగా వుందని అంతా మెచ్చుకున్నారట. "నేను సినిమాలలో వేస్తే ఎలా వుంటానంటారు?" అని ప్రశ్నించింది భర్తను గోముగా.
ఈనాడు తనని అడిగినట్లు ఆ సమూహంలో నాటకాల వాతావరణంలో ఎందర్ని అడుగుతోందో మనోరమ? వాళ్ళ తెలివితేటల్ని వ్యక్తపరుస్తూ వాళ్లు చమత్కారాలు విసురుతోంటే, స్వార్థంకోసం ఆమెను పొగుడుతూంటే- ఆ మాటలు, వాతావరణం అతను ఊహించలేకపోతున్నాడు.
"మనోరమా!" అన్నాడు రామం గాద్గదికంగా.
ఆమె విస్మయంగా చూసింది ఈ కంఠధ్వనికి.
"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?"
ఆమెకు దుఃఖం కలిగింది. "ఎందుకా అనుమానం?" అనడిగింది.
"అట్లయితే... నా అభిప్రాయాన్ని గౌరవిస్తావు కదూ!"
"ఆమె అతని దగ్గరకు జరిగి "ఏమిటి చెప్పండి" అంది ప్రాధేయ పూర్వకంగా.
"నీకు ఎన్నో అభిరుచులు వుండవచ్చు మనోరమా! కాని ఇది ఊహా ప్రపంచం కాదు. వాస్తవిక జగత్తు. ఇందులో సుఖంగా జీవించటానికి మనం ఎన్నో పరిస్థితులతో రాజీపడాలి. కొంత త్యాగం చేసుకోవాలి మనల్ని. లోకం నువ్వనుకున్నంత అమాయకమైందీ, అందమైనదీ కాదు. అయినా ఆసక్తులుగా, ప్రవత్తులూ ఒక దశలోనే మనోరమా. ఈ దశ వేరు. ఓ యిల్లు, అత్త, మామ. మా అమ్మ, నాన్నగారూ చాలా బాధపడుతున్నారు నీ గురించి."
రామం ఆమెకు... సున్నితంగా వున్న విషయం చెప్పేశాడు.
ఆమె అమాయకంగా అతన్ని చూస్తూ "మీకూ ఇష్టంలేదా!" అనడిగింది జాలిగా.
"నా ఇష్టం. అయిష్టం."
"నాకు చెప్పండి. మీకూ ఇష్టంలేదా?"
రామం మనస్సుని పదిలపరుచుకుని "నాకూ ఇష్టంలేదు మనోరమా!" అన్నాడు.
ఆమె అక్కడ ఒక్కక్షణం నిలువలేకపోయింది. ప్రక్కగదిలోకి వెళ్లి మంచంమీద వాలిపోయింది. "తను ఏం పాపం చేసింది? తనని ఎవరూ అర్థం చేసుకోరేం? తన హృదయం ఎంత నిష్కల్మషమైనదో, తన భావాలు ఎంత ఉన్నతమైనవో ఎవరు గ్రహించరేం?"
ఆమె కళ్లనుండి అశ్రువులు స్రవించాయి.
ఎంతసేపూ తన మనస్తత్వం, భావవిహారంతప్ప ఈ లోకంగురించి ఆలోచించదేం? అని రామం మనసులో చికాకు పడసాగాడు. తను కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఎంత అల్లరిచిల్లరిగా తిరిగాడు? యెంత చిద్విలాసంగా జేవిమ్చాదు౧ తలుచుకుంటే ఈనాటికీ అలా వుండగలడు తను. కాని భర్తగా మనిషికి ఓ బాధ్యత. తనలో మార్పు తెచ్చుకున్నాడు. మనోరమ అలాంటి మార్పు తెచ్చుకోదేం? చుట్టూ కొన్ని గీతలు గీసుకున్నంత మాత్రాన మనిషి అశాంతి పూరితుడు ఎప్పుడూకాడు. పైగా ఈ చుట్టుగీతలు మానవుడ్ని ఎంతో ఉదాత్తుడ్ని చేస్తాయి. మనోరమలోని మృదుత్వం యెంత ఆహ్లాదకరమైనదో. మితిమీరిన ఆమె వ్యక్తిత్వం అంత అసహ్యాన్నికూడా కలుగజేస్తున్నది.
పిల్లలంటే గిట్టదట ఆమెకు. తనకు ఎక్కడ పిల్లలు పుడతారో అని అనుక్షణం హడలిపోతూ వుంటుంది.
ఇద్దర్నీ ఒకరకం అసంతృప్తి అలుముకున్నది. తను చేతులారా తన స్వేచ్చని నాశనం చేసుకున్నానని మనోరమ భావించసాగింది. తొందరపడి అతన్ని పెళ్ళి చేసుకున్నాననీ, అతనికి విశాలభావాలు లేవనీ విచారపడుతోంది. ఇన్ని భావాలుగల స్త్రీని పెళ్ళిచేసుకుని భరించటం యెంత కష్టమో రామం అవగతం చేసుకుంటున్నాడు.
అతనికీ మనశ్శాంతిలేక వ్యాపారంమీద మనస్సు ఎక్కువ నిమగ్నం చేయసాగాడు.
"ఓ! నాకు పిచ్చెక్కుతోంది" అనుకున్నది మనోరమ. తనలో ఏదో ప్రత్యేకత వుంది. అది లోకం గుర్తించాలి. తాను విశిష్టవ్యక్తిగా పరిగణించబడాలి. కాని తాను ఏమీ చెయ్యలేకపోతోంది. అసమర్థురాలిగా తయారవుతోంది. ఒక్కోరోజు గడచినకొలదీ అమూల్యమైన తన జీవితంకూడా పోతోంది. కావాలనుకున్నది పొందలేకపోతున్నది. తనని అంతా దగా చేస్తున్నారు.