Previous Page Next Page 
ప్లే పేజి 6

   

    వాళ్ళిద్దరూ మరో మాట మాట్లాడకుండా, టేబుల్స్ మధ్యనుంచి నడిచి, గబగబా కౌంటర్ ను దాటి, డోర్, కాన్ఫరెన్స్ హాలు దాటి....మెట్లు దిగిపోయారు.
    
    "గురువుగారూ....ఇవాళ కొంచెం ఎక్కువైనట్టుంది..." అలా అంటున్న బేరర్ ముఖంలోకి చూసాడు జగన్నాయకులు.
    
    ఆ ముఖం మసక మసగ్గా, అలుక్కుపోయినట్లుగా కన్పిస్తోంది.    

    ఎడం చేతిలో డైరీ, కుడిచేతిలో సిగరెట్ ప్యాకెట్.... అతికష్టంమీద లేచి నిలబడ్డాడు జగన్నాయకులు.
    
    "ఆటోని పిలవమంటారా..." వినయంగా అడిగాడు బేరర్... చేతిలో చిల్లరతో.
    
    "ఐకెన్... గో... డోన్ట్ వర్రీ..." ముందుకు నెమ్మదిగా నడుస్తూ మెట్లవేపు వెళ్తున్న జగన్నాయకులు వేపు ఆశ్చర్యంగా చూసాడు బేరర్.
    
    జగన్నాయకులు అంత ఎక్కువగా తాగడం అదే మొదటిసారి.
    
    "జల్దీ... ప్లేట్స్... నికాలోభాయ్... పోదాం..." కౌంటర్ లోని వ్యక్తి అరిచాడు.
    
    టీ.విని ఆపుచేసి, ఆ పక్కన టేబిల్ మీద జగన్నాయకులు సగం తినేసి వదిలేసిన చికెన్ బిర్యానీ ప్లేటు వేపు చూసి షాక్ తిన్నాడు బేరర్.
    
    ఆ ప్లేట్లోని బిర్యాని ఎర్రగా, రక్తంలా మెరుస్తోంది.
    
    భయంగా అరిచాడు బేరర్.
    
                                                     *    *    *    *    *
    
    బషీర్ బాగ్ లిబర్టీ....
    
    ఎక్కడా ఒక్క ఆటో కూడా కన్పించడంలేదు.
    
    మంచు దట్టంగా కురుస్తోంది.
    
    నెమ్మదిగా నరాల్లో నిండిపోతున్న విషం.... నిమిషాలు గడుస్తున్న కొద్ది....ఎక్కడి రక్తం అక్కడ గడ్డకట్టుకుని పోతోంది.
    
    దారాన్ని లాగుతున్నట్టుగా, నరాల్ని లాగుతున్నట్టు....చెప్పలేని బాధ....
    
    అతికష్టం మీద-
    
    లిబర్టీని దాటి, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని దాటి.... సెక్రటేరియట్ వేపు నడుస్తున్నాడు జగన్నాయకులు.
    
    విశాలమైన రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది.
    
    ఫ్లోరో సెంట్, స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నా-
    
    జగన్నాయకులు కళ్ళముందు.... దట్టమైన చీకటి....
    
    రెండుసార్లు కళ్ళను నులుముకున్నాడు.
    
    సరిగ్గా అదే సమయంలో మెదడులోని నరాలు.... సన్నగా చిట్లడం ప్రారంభమైంది.
    
    ఒక్కసారి-
    
    విహ్వలమైన బాధతో, భయంకరంగా అరిచాడు జగన్నాయకులు.
    
    దబ్ మని, శిలా విగ్రహంలా కిందపడిపోయాడు.
    
    కిందపడి గిల, గిల కొట్టుకుంటున్నాడు జగన్నాయకులు.
    
    అతని నోట్లోంచి, సన్నగా నురగ వస్తోంది.....
    
    "రక్షించండి..... రక్షించండి.... సేవ్ మీ.... సేవ్.....మీ"
    
    నడిరోడ్లో, భీతావహంగా అరుస్తున్నాడు జగన్నాయకులు..... ఒక పక్క డైరీ, ఇంకో పక్క కళ్ళజోడు, మరొక పక్క పెన్ను, మఫ్లర్ వేరొకపక్క హవాయి చెప్పులు....
    
    గిలగిలా, రెక్కలు తెగిన పక్షిలా, నడిరోడ్డుమీద కొట్టుకుంటున్న జగన్నాయకులు ప్రాణాలు, మరో అయిదు నిమిషాల్లో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
    
    ఆ సమయంలో-
    
    జగన్నాయకులు శవం.
    
    సరిగ్గా-
    
    సెక్రటేరియట్ మెయిన్ గేటు కెదురుగా పడి ఉంది!
    
                                                   *    *    *    *    *
    
    ఆ రోడ్డుమీద హీరో హోండా, అరవై మైళ్ళ వేగంతో, చిరుత పులిలా పరుగులు తీస్తోంది.
    
    సైలెన్సర్ ఫెయిలవడం వల్ల, హీరో హోండా చప్పుడు భీకరంగా ఉంది.
    
    వెహికల్స్ మధ్యనుంచి, జనం మధ్యనుంచి, రివ్వు రివ్వుమని దూసుకునిపోతున్న హీరో హోండా స్పీడ్ ను చూసి, జనం భయంగా పక్కకు తప్పుకుంటున్నారు.
    
    నారాయణగూడా, రాంకోఠీ, తిలక్ రోడ్ దాటి, అబిడ్స్ రోడ్ లోకి అడుగుపెట్టింది హీరో హోండా.
    
    సాయంత్రం అయిదు గంటలైంది.
    
    అబిడ్స్ రోడ్స్ అన్నీ, జనంతో కిక్కిరిసి పోయున్నాయి.
    
    అబిడ్స్, ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరకొచ్చి హీరో హోండా ఆగింది.
    
    హీరో హోండా మీద కూర్చున్న వ్యక్తి చూపులు, కుడిపక్క నున్న అబిడ్స్ పోలీస్ స్టేషన్ మీదున్నాయి.
    
    పోలీస్ స్టేషన్ మెట్లమీద, చేతిలోని రైఫిల్ తో, పోలీస్ కానిస్టేబుల్ నుంచున్నాడు.
    
    ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర స్లో అయిన హీరో హోండా, మరికొద్ది నిమిషాల్లో స్టేషన్ ముందుకొచ్చి ఆగింది. ఇంజను ఆపుచేసి, వెహికల్ కి స్టాండ్ వేసి-
    
    పోలీస్ కానిస్టేబుల్ వేపు చూసాడా వ్యక్తి.
    
    "ఎవరున్నారు లోపల.... ఇన్స్ పెక్టర్.... సర్కిల్ ఇన్స్ పెక్టర్..." అలా అడుగుతున్న ఆ వ్యక్తి వేపు చిరాగ్గా చూసాడు పోలీస్ కానిస్టేబుల్.
    
    "ఏహలే....గాడీ నికాలో భాయ్...." రైఫిల్ ని పక్కన పెట్టి, తాపీగా బీడీని వెలిగించుకుంటు అన్నాడు కానిస్టేబుల్.
    
    కానిస్టేబుల్ వేపు సీరియస్ గా చూసి, చేతి వేళ్ళమధ్య కీ చెయిన్ ని తిప్పుకుంటూ, గబుక్కున మెట్లెక్కబోయాడు ఆ వ్యక్తి.
    
    "ఏయ్.... రైఠో....ముందా గాడీని తీయ్...." కోపంగా అరుస్తూ, ఎదురుగా వచ్చి నిలబడ్డాడు కానిస్టేబుల్.
    
    ముందుకెళ్ళబోతున్న ఆ వ్యక్తి ఆగిపోయాడు ఆ అరుపుకి.
    
    ఒక్క ఉదుటున, ఆ వ్యక్తికి కోపం వచ్చింది-పిడికిట్లో, కీ చెయిన్ ని నలుపుతూ అతనా కోపాన్ని నిగ్రహించుకున్నాడు.
    
    "గాడీని తియ్యను... ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో...." విసురుగా ముందుకెళ్తూ అన్నాడా వ్యక్తి-
    
    పోలీస్ కానిస్టేబుల్ వూరుకోలేదు. ముందు కెళుతున్న వ్యక్తి షర్ట్ ని చటుక్కున పట్టుకొని వెనక్కి లాగాడు బలంగా.
    
    ఆ వ్యక్తి షర్టు సర్రున చిరిగిపోవడం, అతని కళ్ళల్లోకి కోపం విద్యుత్ ప్రవాహంలా ప్రవేశించడం, ఎడం చేత్తో కానిస్టేబుల్ ని విసురుగా తోసెయ్యడం, ఆ విసురుకి, కానిస్టేబుల్ మెట్ల మీద నుంచి జారి పడి, హీరో హోండా వెహికల్ మీద  పడిపోవడం, అంతా క్షణాల్లో జరిగిపోయింది.

 Previous Page Next Page