Previous Page Next Page 
ప్లే పేజి 5


    
    మంకీ టోపీ వ్యక్తి, చేతి గడియారం వేపు చూసుకొన్నాడు.
    
    తొమ్మిది గంటలు దాటి తొమ్మిది నిమిషాలైంది.
    
    టేబిల్ మీదున్న గ్లాసుని అందుకుని, గడ గడా డ్రింకుని తాగేసి చెప్పడం ప్రారంభించాడు.
    
    "అక్రమంగా మేం భూముల్ని, కబ్జాచేసి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామని, మీరు పని చేసిన పేపర్లో, ఓ న్యూస్ ఐటెమ్ వచ్చింది. దానికి లిజాయండర్ తయారు చేసాం....మీరొక్కసారి చూస్తే..." చెప్పడం ఆపి, మంకీ టోపీ వ్యక్తి జగన్నాయకులు తెల్లటి కనుబొమల వేపు చూపాడు.
    
    "నాకూ ఆ పత్రిక్కి ఇప్పుడు సంబంధం లేదు..... చీఫ్ రిపోర్టర్ ఉంటారు-వారికివ్వండి..." ఖాళీ గ్లాసుని టేబిల్ మీద పెడుతూ అన్నాడు జగన్నాయకులు.        
    
    "చీఫ్ రిపోర్టర్ కిచ్చేముందు.... మీరొక్కసారి చూస్తే... మాకు సంతృప్తి-మీకు మేమెవరో తెలీకపోయినా...అయామ్ యువర్ ఎడ్మెరర్ సార్.....మీరా పత్రికలో పని చేస్తున్నపుడు.... బాంబుల్లా....గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద, మీరు పేల్చిన న్యూస్ ఐటమ్స్... నేను- రెగ్యులర్ గా ఫాలో అయ్యాను....సర్..."
    
    జగన్నాయకులు పెదవి మీద చిరునవ్వు కదలాడింది.
    
    జగన్నాయకులు లాంటి వాళ్ళు, ఒక పొగడ్తకి, ఒక పెగ్గుకి, లొంగిపోతారన్న అతని ధీమా వృధా కాలేదు.
    
    "మేటర్ రాసుకొచ్చావా...." ప్లేట్లోని, చికెన్ పకోడా ముక్కని అందుకుంటూ అడిగాడు జగన్నాయకులు.
    
    వెంటనే-
    
    జర్కిన్ జిప్ ని, పైనుంచి కిందకు లాగి, బనీన్ లోపలున్న బ్లాక్ కలర్, ప్లాస్టిక్ షోల్డర్ ని బయటికి తీసాడు ఆ మంకీ టోపీ వ్యక్తి - ఆ షోల్డర్ ని విప్పి-
    
    అందులోంచి కొన్ని కాగితాల్ని బయటకు తీసాడు.
    
    అదే సమయంలో-
    
    ఆ షోల్డర్ వేపు, ఆ కాగితాల వేపు సూటిగా, ఆసక్తిగా చూస్తున్న జగన్నాయకులు దృష్టి, మంకీ టోపీ వ్యక్తి, కుడిచేతి మీద పడింది. మంకీ టోపీ వ్యక్తి కుడిచేయి, నాలుగు వేళ్ళకి బ్యాండ్ ఎయిడ్స్ చుట్టిఉన్నాయి.
    
    చూపుడు వేలు మాత్రం ఎప్పటిలా కదులుతోంది.
    
    "చేతికా బ్యాండేజీ ఏంటి..." యధాలాపంగా అడిగాడు జగన్నాయకులు.
    
    "నథింగ్ టు వర్రీ సార్... షేవ్ చేసుకొంటూ ఆదమరిచి బ్లేడ్ ఉన్న రేజర్ ని, చేత్తో గట్టిగా పట్టుకున్నాను. వేళ్ళు తెగాయి..." అందుకని అతని సమాధానాన్ని నమ్మేసాడు జగన్నాయకులు.
    
    అంతేకానీ, అది తన వేలి ముద్రలు ఎక్కడా పడకుండా, ఒక ఇంటిలిజెంట్ క్రిమినల్ పన్నిన వ్యూహమని, ఊహించలేక పోయాడాయన.
    
    ఊహించడానికి కూడా అవకాశం లేదు.
    
    షోల్డర్ లోంచి తీసిన, రాసిన కాగితాల్నీ కొన్ని పేపర్ కటింగ్స్ నీ జగన్నాయకులు చేతికి అందించాడు.
    
    జగన్నాయకులు, ఆ పేపర్స్ లోని, మేటర్ ని చదవడం ప్రారంభించాడు. అందులోని మేటర్ ఆసక్తిగా ఉంది. సీరియస్ గా చదవడంలో మునిగిపోయాడు...
    
    నిమిషాలు గడుస్తున్నాయి.
    
    ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు జగన్నాయకులు.
    
    కాగితాలు మందపాటివి కావడంతో పాటూ, చలి ఎక్కువగా ఉండడంతో ఒక దానికొకటి అంటుకొని ఉన్నాయి. అంత తేలిగ్గా పేజీలు  తిరగడం లేదు.
    
    "జాగ్రత్తగా, చదవండి సర్.....మధ్యలో కొన్ని లీగల్ గొడవలున్నాయ్...." జగన్నాయకులు ముఖంలోకి చూస్తూ కావాలనే అన్నాడు మంకీ టోపీ వ్యక్తి.
    
    "గమ్మత్తుగా ఉందీ కేసు...." చేతిలోని సిగరెట్ ను యాష్ ట్రేలో పడేసి గ్లాసులోని డ్రింక్ గబగబా తాగేసి, పేజీని తిప్పబోయి ఆగిపోయాడు జగన్నాయకులు.
    
    రెండు పేజీలు  అతుక్కుపోయాయి. ఆ పేజీల్ని విడదీయడానికి, చూపుడు వేలు, నాలికతో, కాస్త తడిచేసుకుని తిప్పాడు జగన్నాయకులు. ఆ దృశ్యాన్ని ఆనందంగా చూస్తున్నాడు మంకీటోపి వ్యక్తి.
    
    మూడు... నాలుగు... ఐదు.... వరుసగా.... పదిహేను పేజీలవరకూ అలా నాలికతో, వేలిని తడిచేసుకుని తిప్పుతూ సీరియస్ గా చదువుతూనే ఉన్నాడు జగన్నాయకులు.
    
    మధ్యలో ఒకసారి తలెత్తి, ఖాళీ గ్లాసు వేపు చూశాడు.
    
    మరో రెండు నిమిషాల్లో, ఆ గ్లాసు డ్రింక్ తో నిండిపోయింది.
    
    ఆ గ్లాసుని అందుకుని సగం వరకూ డ్రింక్ ని గడ గడా తాగేసి, మళ్ళీ చదవడం ప్రారంభించాడు.
    
    నాలిక తడిచేసుకొని, పేజీలు  తిప్పుతూనే ఉన్నాడు.
    
    జగన్నాయకులుకి తెలీదు-
    
    ఆ కాగితాలకు, స్ప్రింకిల్ చేసిన భయంకరమైన లెధర్ కెమికల్ ని అనాలోచితంగా, అమాయకంగా తాను, తన వేలిద్వారా నాలికమీదకు స్వీకరిస్తూ పోయానని, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ మీద ఎటాక్ చేసే ఆ రసాయనం, మరోగంటలో తన ప్రాణాల్ని దారుణంగా బలి తీసుకుంటుందని.
    
    పావుగంట గడిచింది.
    
    "డ్రాప్టింగ్ ఓ.కే....మిస్టర్... చిన్న చిన్న మార్పులున్నాయి.... న్యూస్ డస్క్ వాళ్ళు చూసుకుంటార్లే..." ఆ పేపర్లను మంకీ టోపీ వ్యక్తికి అందిస్తూ అన్నాడు జగన్నాయకులు.
    
    "మీరు ఓ.కే... అంటే...అది చాలు సార్... అందుకే మిమ్మల్ని వెతుక్కుని వచ్చింది...." గంభీరంగా ఓ నవ్వు నవ్వి, బ్యాండ్ ఎయిడ్ చుట్టిన వేళ్ళతో జాగ్రత్తగా డెడ్లీపేపర్స్ అందుకున్నాడు. మంకీ టోపీ వ్యక్తి.
    
    అతను వచ్చిన పని విజయవంతంగా పూర్తయింది.
    
    చట్టానికి దొరక్కుండా, ఎలాంటి అధారాలూ మిగల్చకుండా, భయంకరమైన విషాన్ని, జగన్నాయకులు శరీరంలోకి ప్రవేశపెట్టగలిగాడతను.
    
    తర్వాత-
    
    పోలీసులొచ్చినా, ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటారు.... అందుకే ముందు జాగ్రత్తగా, రకరకాల డిషెస్ తెప్పించాడు కూడా.
    
    జాగ్రత్తగా, కాగితాల్ని, బ్లాక్ కవర్ ఫోల్డర్ లో పెట్టి, బనియన్ లోపల పెట్టుకుని, జర్కిన్ జిప్ ని పైకి లాక్కుని, కుర్తా, పైజామా వ్యక్తి వేపు చూసి నవ్వాడు.
    
    జగన్నాయకులు వాళ్ళిద్దరివేపూ చూడడంలేదు. ఒకపక్క గ్లాస్ లోని డ్రింక్ ని తాగుతూ, రెండోపక్క చికెన్ బిర్యానీని తింటున్నాడు....అతని మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోవడం ప్రారంభించింది.
    
    "థాంక్యూ సర్.... మళ్ళీ కలుస్తాం..." పక్కనే ఉన్న బేరర్ చేతిలో రెండువందల కాగితాల్ని పెడుతూ అన్నాడు మంకీ టోపీ వ్యక్తి.
    
    జగన్నాయకులు మంకీ టోపీవాడి ముఖంలోకి తధేకంగా చూసాడు.   

 Previous Page Next Page