Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 5


    ఆమె కొడుకుమీద ఆశలు పెట్టుకున్నమనిషి. అప్రయోజనమనేది ఒకటి భూమిపై భాసిల్లుతూ వుందని ఆమెకి స్ఫురించదు. "కోర్టులో ఎదుటివాడు ఉక్కిరిబిక్కిరి అయేటట్లు గడగడ వాదించే ప్లీడర్ అయినా బావుంటుంది" అన్నది తిరిగి.
    "నాకంత వాగ్ధాటి లేదమ్మా" అన్నాడు మృత్యుంజయరావు సిగ్గుపడుతూ.
    ఆమె వరుసగా అనేక ఉద్యోగాలగురించీ, వృత్తులగురించీ అడిగి చూసింది. ఆమె ఒక్కొక్క కోరికా ఒక్కొక్క తూణీరంలా దూసుకు వస్తున్నది. అతను లజ్జితుడవుతున్నాడు. ఆ అన్నిటికీ లేదు లేదని చెబుతున్నాడు. చివరకు ఏదో చిన్న ఉద్యోగం చేస్తానని అతను చెప్పినప్పుడు ఆమెకళ్ళు పెద్దవిచేసి అతనివంక చూస్తూ కూచున్నది. అతనికి తాను చాలా అపరాధం చేసినట్లు దుర్భరమైన బాధకలిగి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.
    అప్పట్నుంచీ ఉద్యోగంకోసం పడరాని పాట్లు పడ్డాడు. చివరికి కాకినాడలో నూటనలభయి రూపాయలమీద ఓ ఉద్యోగం దొరికింది.
    తల్లికి రాశాడు. ఇంకా ఎన్నాళ్ళు ఆ రాక్షసులమధ్య ఆ పాడుకొంపలో నివసిస్తావు అమ్మా! ఇనాళ్ళకి ఆ యింటినుండి విడివడే తరుణం ఆసన్నమయింది. ప్రస్తుతం చిన్నగదిలో వుంటున్నాననుకో. నువ్వు వచ్చేట్లయితే చిన్నయిల్లు తీసుకుంటాను. ఏమంటావు?"
    తల్లి జవాబు యిచ్చింది. "నీకు ఉద్యోగం దొరికినందుకు సంతోషం నాయనా! ఈమధ్య నా ఆరోగ్యం మరీ సన్నగిల్లింది. చూపూ సరిగ్గా ఆనటం లేదు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని నాకనిపిస్తున్నదిరా జయా! ఈ స్థితిలో నీ దగ్గరకు చేరి నిన్ను యిబ్బందిపెట్టటం నాకిష్టంలేదు. ఇక్కడ పరిస్థితి అంటావా? వీళ్ళు నాకు తమ శక్తికిమించి కీడు చేయలేరు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాధేంలేదు. కష్టాలనుంచి తప్పించుకోవాలనిగాని, సుఖాలని పొందాలనిగాని యిహ కాంక్షలేమీ లేవు. నా శేషజీవితాన్ని యీ శిథిలగృహంలోనే గడపాలని సంకల్పించుకున్నాను. ఎప్పుడైనా వీలుచూసుకుని కనిపించిపోతూ వుండు."  
    తనకి కళ్ళు చెమ్మగిల్లాయి. చొక్కా అంచుతో తుడుచుకున్నాడు. తల్లిని అంతకంటే ఎలా బలవంతం చెయ్యాలో అతనికి బోధపడలేదు. ముఖంముందు అద్దం తన అసమర్థతను అపహసించినట్లయింది.
    అప్పట్నుంచీ ఆ గదే అతని నివాసగృహం అయింది. ఆ గది నేలమీద, గోడలతో బూజులో జీవిస్తున్నాడు.
                                                  3
    వెల్తురులో గది కిటికీగుండా బయటి యింటినంతా కలయచూసింది జగతి. "ఫర్వాలేదు. పెద్దయిల్లేనే. డబ్బూ, దస్కం బాగానే వున్నట్లుంది" అంది బద్ధకంగా ఆవులిస్తూ.
    "ఉన్నవాళ్ళే"
    అరుగుమీద నిలబడి నలభైఏళ్ళ స్త్రీ పనిపిల్లలకు ఎడాపెడా పన్లు పురమాయించేస్తుంది. "ఆరుదాటిందా? యింత ఆలస్యంగా అఘోరిస్తే పనులు ఎలా తెముల్తాయనుకున్నావే పిల్లా! తెల్లారినాక అంట్లు తోముకోవటం దరిద్రంకూడానూ. దరిద్రం దరిద్రమా అని. పెరట్లోకి వెళ్లి అరిటిచెట్టుకొట్టి దూట తీసుకురా. ఇంటిమీదికి నిచ్చెనేసుకుని మామిడికాయలు కొయ్యి. ఆ మూలచూడు. చెత్తంతా యెలా పేరుకుందో? శుభ్రంగా చిమ్మెయ్యి."
    జగతి ఆవిడవంక పరిశీలనగా చూసింది. పచ్చగా, బొద్దుగా, ఆరోగ్యంగా మిసమిసలాడుతూ వున్నది. చాలా అందమైన చక్రాల్లాంటి పెద్దపెద్ద కళ్ళు, మాట్లాడుతూంటే చేతులూ, కళ్ళూ విచిత్రంగా తిప్పుతోంది.
    "మంచి అందగత్తె" అంది జగతి ఆమెవంక ఆసక్తిగా తిలకిస్తూ.
    "అవును" అన్నాడు మృత్యుంజయరావు అప్రయత్నంగా వెనకనుండి.
    జగతి చటుక్కున వెనక్కి తిరిగి పరిహాసపూర్వకంగా "యిదెప్పటినుంచీ... సౌందర్యారాధన" అంది.
    అతను అప్రతిభుడై తడుముకుంటూ "అబ్బే. అదేంలేదు. అందంగా వుంటుందన్నాను" అన్నాడు.
    ఆమె నవ్వుతూ, "ఊహూఁ, నీ గుండెల్లో ఆడవాళ్ళ అందచందాలు కూడా ప్రవేశిస్తున్నాయన్నమాట. పైకి వస్తున్నావు బాబూ!" అంది.
    అతనిముఖం కందగడ్డ అయింది. "ఆవిడ చాలా పెద్దది..." గొణిగాడు.
    "చిన్నది అయితే ఫర్వాలేదన్నమాట" అని జగతి ఫక్కున నవ్వింది.
    "నా ఉద్దేశ్యం..."
    "పెద్దది అయితే అందంగా వుండకూడదని వుందా?" అన్నదామె వొదిలిపెట్టకుండా.
    "అబ్బే, వాళ్ళు చాలా మంచివాళ్ళు."
    "మంచివాళ్ళు అందంగా వుండకూడదేమిటి?" తన విశాలనేత్రాలతో అతన్ని గుచ్చిగుచ్చి చూస్తోంది.
    ఇహ అతనికేమనటానికీ తోచక మౌనం ధరించి ప్రక్కకి చూడసాగాడు.
    జగతి యిహ అతన్ని కవ్వించటం ఆపి, మరోసారి బద్ధకంగా ఆవులించి "సరేగాని, నేను మొహం కడుక్కోవాలి. ఎటువైపు వెళ్ళాలి?" అని అడిగింది.
    మృత్యుంజయరావు గదిబయటకు వచ్చి చేత్తో దారి చూపిస్తూ "ఇలా పెరట్లోకి వెడితే లోపల బావీ, కొళాయీ వున్నాయి. కొళాయి దగ్గర వద్దుగానీ, బావిదగ్గర కడుక్కో. మా యింటివాళ్ళు కొళాయిని చాలా ప్రాణప్రదంగా చూసుకుంటారు" అన్నాడు.
    జగతి తల ఊపి, దండేనవున్న తువ్వాలు తీసుకుని భుజాన వేసుకుని, పెరటివైపు నడిచి వెళ్ళింది.
    ఆమె వెళ్ళగానే మృత్యుంజయరావు గబగబ పెట్టెలోని రెండు పాతదుప్పట్లు తీసి ఒకదానికి ఒకటి కలిపి రెండు అంచులూ ముడివేసి, గదికి మధ్యలో అడ్డంగా కట్టి గదిని రెండుభాగాలుగా చేశాడు. అక్కకి కాఫీ తెప్పించాలి. పనిపిల్లలకి యిప్పుడప్పుడే తీరికకాదు. యెలాగా అని ఆలోచిస్తూవుండగా జగతి ముఖంమీది నీటిబిందువుల్ని తుడుచుకుంటూ లోపలికి వచ్చింది.
    "మీ యింటివాళ్ళు ఎక్కడో అడవిమనుషుల్లో వున్నార్రా, పంపుకు తలుపుపెట్టి దానికి తాళం తగలేశారేమిటి? పరమలోభులా ఏమిటి? ఇంత పెద్ద మహాపట్నంలో ఈ యిల్లుతప్ప మరొకటి దొరకలేదా?" అంది అప్పుడే కామెంట్ పాస్ చేస్తూ.
    ఇలాంటిదేదో అంటుందని అతను ఊహిస్తూనే వున్నాడు. "జగడమే మయినా జరిగిందేమిటి?" అని ప్రశ్నించాడు భయపడుతూ.
    జగతి నిర్లక్ష్యంగా నవ్వుతూ, మంచంమీదకు వచ్చి కూర్చుంది. "అదేం జరగలేదులే. లోపలకు వస్తూన్న ఈ అపరిచిత యువతి యెవరా అని మొదట తెల్లబోయి చూసింది. నేను బావిదగ్గరకు పోతూంటే, 'ఎవరమ్మా నువ్వు?' అని మర్యాదగానే అడిగిందిలే. 'నేను జగతిని' అన్నాను. ఆ పళాన వివరాలూ, తబ్సీళ్ళూ అన్నీ అడిగి తెలుసుకుంది. బావిదగ్గరకు పోబోతూంటే ఆపి కొళాయి తలుపు తెరిచి అక్కడ కడుక్కోమంది. మృత్యుంజయరావు మంచివారమ్మా!" అంది. నువ్వంత మంచివాడవుట్రా తమ్ముడూ! నాకు తెలియదే. ఆవిడ పెనిమిటినిగూడా చూశాన్రోయి. రెండో పెళ్ళామేమిట్రా? యాభయ్యోపడిలో పడ్డట్టుగా వుంది. బయటకు బలంగానే వున్నాడుగాని, లోపల యేదో జబ్బుతో పీడించబడుతూన్నట్టుంది" అని ఒక్కనిముషం ఊపిరి తీసుకుంది.
    ఆమె తత్త్వమే అంత. ఇంతవరకూ ఆమె జీవితమంతా పరిసరాలని పరిశీలించటంలోనూ, వాటిల్లో విలీనమవటంలోనూ గడిచిపోయింది. పరిసరాలలో ఆమెకంటే సులభంగా యిమడగల వ్యక్తి వుండదు.
    "గదిని పార్టిషన్ చేసేశావేమిరా? ఆ చీకటిగుహలో ఊపిరి పీల్చుకుంటూ వుండాలా నేను?" అంది జగతి మళ్ళీ.
    "స్త్రీవికదా నువ్వు. అనేక సందర్భాలలో మరుగు అవసరమొస్తూ వుంటుంది" అందామనుకున్నాడు అతను. కాని "ఊరికినే" అన్నాడు.
    జగతి గదంతా ఓసారి కలయజూసి "ఆఁ , ఇప్పుడు చెప్పబ్బాయి, నా అవసరం కోసంగానీ, మరెందుకైనాగానీ నేను నీతో కనీసం కొన్నినెలలైనా కలిసివుండాలి. అన్నిరోజులూ నువ్వు నన్ను పోషించాలి. ఏం, పోషిస్తావా?"
    "ఆ విషయమంత స్పష్టంగా అడక్కపోతే ఏం?" అందామనుకున్నాడు అతను. కాని తలవూపి ఊరుకున్నాడు.
    "ఈగది బాగానేవుందిలే. మెల్లిగా గడిపేస్తాను. మరి ఒట్టినే కూచుంటే కాలక్షేపం కాదుగా, అందుకని వంట నేనే చేస్తాను. యేదో కాస్త ఉడకేయటం వచ్చులే. వంటసామానూ అవీ వున్నాయా! వుండి వుండవులే! ఎలాగో సంపాదించు. ఈ పూటకిమాత్రం కాఫీ పట్టుకురా. రేపట్నుంచీ మనమే కాచుకుందాం. ఏమిట్రా అలా చూస్తావ్! నన్ను చూస్తే ఆశ్చర్యంగా వుందా? రాత్రి అంత దెయ్యంలా కనబడటంలేదా నేను? ఊఁ, త్వరగా కాస్త కాఫీ పట్రా" అంటూ ఆమె లేచి గోడని తగిలించివున్న అద్దం దగ్గరకు వెళ్ళింది. చెరిగివున్న ముంగురులు సవరించుకోసాగింది. మృత్యంజయరావు ఫ్లాస్కు తీసుకుని రోడ్డుమీదపడ్డాడు.
    అతనికేమీ సంతోషంగాలేదు. ఓ కొత్త సమస్య ఉత్పన్నమయినట్లుగా వుంది. తను స్వయంగా ఏ సమస్యనూ స్వీకరించలేడు. వాటి గమనాన్ని అవలోకిస్తూ ఊరుకుంటాడు. అలా ఊరుకుంటే తిరిగి ప్రశాంతంగా వుండదు. గుండెల్ని పిండుతున్నట్లే వుంటుంది. అలాగే భరిస్తాడు.
                                                    4
    లాంటి మృత్యుంజయరావు చుట్టూకూడా రెండుమూడు సంవత్సరాలుగా ఒకే ఆఫీసులో పనిచేస్తూ వుండటంవల్ల ఓ స్నేహితుల పరిధి ఏర్పడింది. రోజులతరబడి ఒకరితో ఒకరు సన్నిహితంగా సంచరిస్తే యితరులకి కనిపించే లోపాలు కళ్ళకి కనబడటం మానేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ లోపాన్ని వెలికి తియ్యటానికి ప్రయత్నించరు. అసలు స్నేహంలో ఓ నిగూఢమైన రహస్యముంది. ఒకరి మనస్తత్వానికి సరిపడినా సరిపడకపోయినా తన నావరించివున్న వాతావరణం నుండే స్నేహితుల్ని ఎన్నుకోవటానికి ప్రయత్నిస్తాడు మనిషి. అనేక సందర్భాలలో ఒకరినొకరు ద్వేషించుకుంటున్నా, విసుక్కుంటున్నా స్నేహితులగానే మిగిలిపోతూ వుంటారు.
    సోమయాజులుగారు నలభయ్యేళ్ళు దాటిన మనిషి. మొదట బుద్ధిలేకా, తర్వాత బుద్ధివచ్చినా సాధ్యంగాకా ఎడాపెడా ఆరుగురు పిల్లల్ని కనేశాడు. కిడ్నీ సంబంధమైనవీ, లివర్ సంబంధమైనవీ వ్యాధులు ఆయన శరీరంలో పేరుకుపోయి వున్నాయి. ప్రపంచంలో అన్ని విషయాల గురించీ అనగా రాజకీయాలూ, సాహిత్యం, సంగీతం, హిస్టరీ, జాగ్రఫీ, సైన్సు, వేదాంతం వీటన్నిటిగురించీ అతనికి కొంచెం కొంచెం పరిజ్ఞానంవుంది. కనీసం పరిజ్ఞానం వుందన్న విశ్వాసం వుంది. పిల్లలు రాక్షసులుగా పరిణమించడం వల్లా, పెళ్ళాం అస్థిపంజరంలా మారి ఆ యింట్లో శవాలు తిరుగుతున్న వాతావరణం సృష్టించటంవల్లా ఆయనకి యిల్లు నరకప్రాయంగా మారి ఎక్కువ భాగం ఆఫీసులోనే గడుపుతూ వచ్చాడు. ఆఫీసులోమాత్రం వృధా సంభాషణలతో, కాయితాలమీద పనులతో ఎంతని కాలం గడుస్తుంది? అందుకని ఆయనకు అనేక కార్యకలాపాలు అవసరమొచ్చాయి. గుమాస్తాలందర్నీ కూడదీసి ఏమీ వ్యాపకాలులేని జీవితం దుర్భరంగా వుంటుందనీ, మానవుని మానసిక విలాసానికి ఉదాత్తమైన కార్యకలాపాలు అవసరమనీ బోధించి, ఒప్పించి తమ ఆఫీసులోని గుమాస్తాలందరిచేతా కళాసమితినొకటి స్థాపింపజేశారు. దానికి విజ్ఞాన కళాసమితి అని పేరుపెట్టారు. అంటే అందులో విజ్ఞానం పొంగిపొర్లి ప్రవహిస్తూ వుంటుందన్నమాట. సభ్యులందరూ నెలనెలా చందాలు కట్టాలి. ఊళ్ళో ఓ గది అద్దెకి తీసుకున్నారు. సభ్యులందరూ అందులో సాయంత్రంవేళ కలుసుకుంటారు. రాజకీయాలగురించీ, సాహిత్యంగురించీ చర్చలు చేస్తారు, వాదించుకుంటారు. 

 Previous Page Next Page