Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 5


    రూమ్ లో కూర్చుని కాగితం మీద అంకెలు వేశాను. 15 16 14ని 15 14 5తో గుణించినా, కూడినా క్రింది అంకె రావటం లేదు. కానీ అందులో ఏదో వుందనిపించింది. జైలు నుంచి ఎవరో ఈ రాజకీయ నాయకుడికి కోడ్ పంపించారు.
    కోడ్!!!
    ఈ ఆలోచన వచ్చేసరికి అంకెల క్రింద ఇంగ్లీషు వ్రాయటం మొదలుపెట్టాను. చాలా చౌకబారు కోడ్ ఇది. ఎనిమిదో క్లాసు చదివే అమ్మాయిలూ, అబ్బాయిలూ తల్లి తండ్రులకి తెలియకుండా వ్రాసుకునే భాష. నవ్వొచ్చింది. ఇంత సింపిల్ కోడ్ లో వర్తమానం పంపటం. పాపం ఆ ఎమ్మెల్యేగారికి ఎవరన్నా కూతురుందేమో అన్న అనుమానం కూడా వచ్చింది.
    కానీ ఆఖరి పదం పూర్తవగానే నా పెదాలమీద నవ్వు ఆగిపోయింది. టెలిగ్రాఫిక్ భాషని మామూలు భాషలోకి అనువదిస్తే వచ్చిన పదాల్తో నా వెన్ను అప్రయత్నంగా వణికింది.
    'OPERATION ON ONE COMPLETED'
    అన్న వాక్యం నన్ను పరిహసిస్తున్నట్లు ముందు కనబడతోంది.
    అంతలో చీకటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఫోన్ మ్రోగింది. రిసీవర్ ఎత్తగానే కెవ్వుమన్న కేక వినబడింది.
                        2
    రోడ్డు మీద జనసంచారం లేదు.
    సెకెండ్ షో వదలలేదు ఇంకా. మోటార్ సైకిల్ వూళ్ళోకి ప్రవేశించబోతూంది. అదే హాస్టల్ అవునో కాదో నాకు సరిగ్గా తెలీదు. అయినా రిస్క్ తీసుకోదల్చుకున్నాను.
    ఫోన్ లో అమ్మాయి గొంతులే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
    ఫోన్ ఎత్తగానే కెవ్వుమన్న కేక. "హల్లో పోలీస్ స్టేషనా?"
    "కాదు. సెంట్రల్ జైలు."
    "ఏదో ఒకటి. మీరు అర్జెంటుగా రావాలి" అమ్మాయి కంఠంలో నిస్సహాయత, భయము ,ముప్పిరిగొన్నాయి.
    "ఎవరు మీరు? ఎక్కణ్ణుంచి మాట్లాడుతున్నారు?"
    "లేడీస్ హాస్టల్ నుంచి. ఎవరో ఖైదీ తప్పించుకున్నట్టున్నాడు- మా హాస్టల్లో జొరబడ్డాడు. మైగాడ్ ...." ఫోన్ లో నిశ్శబ్దం. 
    "హల్లో ...హాల్లో..." అని అరిచాను. దూరంగా ఆర్తనాదం లాంటిది వినిపించింది.
    "మీరు తొందరగా రండి-" అభ్యర్ధన.
    "చూడండి. ఇది జైలు. పైగా వూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంది. మీరు మీరేంజి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ..."
    అట్నుంచి ఏదో డబ్బున పడ్డ చప్పుడు. ఫోన్ కట్టయింది.
    నేను నిశ్చేష్టుడినై నిలబడిపోయాను. ఏమీ తోచలేదు.
    ఏ హాస్టల్ కని వెళ్ళాలి? కానీ వెళ్ళకుండా ఎలా వుండటం?
    ఈ వూళ్ళో ఎన్ని లేడీస్ హాస్టళ్ళు వున్నాయో తెలీదు. నాకు తెలిసిందల్లా శివప్రసాద్ కాబోయే అమ్మాయి వున్న హాస్టల్. అదృష్టవశాత్తూ అది వూరి ప్రవేశంలోనే వుంది.
    దార్లో నన్ను నేను తిట్టుకున్నాను. కంగార్లో ఆలోచించలేదు గానీ, అక్కణ్ణుంచే దగ్గర పోలీసు స్టేషనుకి ఫోన్ చేసి ఈ వార్త చెప్పేసి వుంటే నా బాధ్యత తీరిపోయి వుండేది. అంతా వాళ్ళే చూసుకునే వాళ్ళు. నా మనసులోనే ఏ మూలో, అమ్మాయిల హాస్టల్ కెళ్ళి, ఓ హీరోనై పోవాలన్న కోర్కె వుందేమో....
    మోటార్ సైకిల్ హాస్టల్ సమీపించింది. గేట్లు బార్లా తీసి ఉన్నాయి. చౌకీదారు లేడు. నా అనుమానం నిజమయినట్టుంది. ఇదే హాస్టల్ గామోసు- మోటార్ సైకిల్ ఎకాయెకి లోపలికి పోనిచ్చేసేను.
    నా అనుమానం నిజమే!
    నలుగురైదుగురు అమ్మాయిలు మెట్లమీద నిలబడి ఆందోళనగా చూస్తున్నారు. నన్ను చూడగానే వాళ్ళ మొహం విప్పారింది.
    "సార్. మీరేనా సార్ పోలీస్ ఆఫీసర్?"
    "నేనే. ఎక్కడ ఆ అగంతకుడు?"
    "అదిగో, అటు వార్డెన్ గారింటివైపు వెళ్ళాడు"
    నేను అటువైపు రెండడుగులు వేసేసరికి వెనుకనుంచి 'సార్' అన్న పిలుపు వినిపించింది. ఆగాను.
    "తలుపు కొట్టకండి సార్. వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందన్న కోపంతో ఆవిడని పొడిచి పారేస్తాడేమో...."
    ఏమీ తోచనట్టు క్షణం ఆలోచించాను. ఆ అమ్మాయి అన్న మాటల్లో నిజం వుందనిపించింది.
    అంతలో పైకి గొట్టం కనిపించింది. మేడమీద కిటికీ తలుపులు తీసి ఉన్నాయి. నా అభిప్రాయం గ్రహించినట్టు "అక్కణ్ణుంచి దారి వుంది సార్" అందా అమ్మాయి.
    జాగ్రత్తగా గొట్టం ఎక్కాను. పైనంతా చీకటిగా వుంది. కిటికీలోంచి లోపలికి దిగాను. అక్కడే చిన్న పొరపాటు జరిగింది. కింద ఆన్చటానికి ఏమైనా ఆధారం వుందేమో అనుకుని కాలు పెట్టాను. అది జారిదబ్బున పడ్డాను. అయితే నేను పడింది నేలమీదకాదు. పందిరి మంచం మీద.
    పరుపుమీద కాదు.
    దానిమీద వున్న శాల్తీమీద.
    బురదలో నిద్రపోతున్న ఏనుగు క్రమక్రమంగా పైకి లేచినట్టు ఒక ఆకారం లేచింది. ఆ శాల్తీ ఒక స్త్రీదని గ్రహించాను. ఆమె వార్డెన్ అని గ్రహించటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఎందుకంటే, మామూలుగా అర్దరాత్రి లూటీ సంఘటన ఏదైనా జరిగితే సాధారణ స్త్రీలు భయంతో కెవ్వున కేకపెట్టి వుండేవారే. ఇంత ఆకస్మికమైన సంఘటనలోనూ నిబ్బరంగా నిలబడి చివాట్లు పెట్టగలిగిందీ అంటే ఆమె నిశ్చయంగా వార్డెన్ కాక మరెవరై వుంటారు? కానీ నా భయం నాది కదా!
    "మాడమ్! మిమ్మల్ని మానభంగం నుంచి..."
    "ఒరేయ్ పిచ్చివాడా. నీ జిమ్మడ! నిన్నునరికిపోగులు పెట్ట......" (ఈమె నిశ్చయంగా జూవాలజీ లెక్చరర్ అయి వుంటుంది- అనుకున్నాను) ఆమె కొనసాగిస్తూంది. "నా మానమే కావల్సి వచ్చిందారా నీకూ? ఇప్పుడు కాదురా, ఇరవై సంవత్సరాలకి ముందే వచ్చివుంటే నిన్నొక ఆట ఆడించి ఉండేదాన్ని."
    నచ్చ చెప్పబోయాను. "చూడండి ఆంటీగారూ..."
    పెట్రేగిపోయింది. "వ్హాట్? ఆంటీనా? నేను నీకంత ముసలిదానిలా కనిపిస్తున్నాన్రా?"
    "చూడండి. ఐయామ్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్."
    "ఓహో! స్టేషన్ లోనే అనుకున్నాను- బయటకొచ్చి కూడా మీరు రేప్ లు చేస్తున్నారన్నమాట.
    "సారీ మేడమ్. మీరు అనవసరంగా అపార్ధం చేసుకుంటున్నారు. మీ కోతుల్ని జాగ్రత్తగా చూసుకోండి" అని అక్కణ్ణుంచి బయటకు వచ్చేసేను.
    క్రింద అమ్మాయిలు ఇంకా అలానే నిలబడి ఉన్నారు- భయం, భక్తీ లేనట్టు.
    "ఏం సార్? వాడు మిమ్మల్ని కూడా రేప్ చేశాడా?" అందో అమ్మాయి అమాయకంగా మొహం పెట్టి.
    ఆ అమ్మాయివైపు సూటిగా చూస్తూ, నెమ్మదిగా అన్నాను. "చూడండి మేడమ్. నా డ్యూటీ కాకపోయినా ఇరవై కిలోమీటర్లు చీకట్లో వచ్చాను. కేవలం డిపార్ట్ మెంట్ మీద వున్న గౌరవంవల్ల! దీన్ని మీరిలా దుర్వినియోగం చేస్తే, 'అమ్మా - తోడేలే' కథ అవుతుంది జాగ్రత్త! మీరిలా చేయడంవల్ల నిజంగా అవసరం ఉన్న మరో పౌరుడికి అన్యాయం జరుగుతుంది."
    నా మాటలు ఆ అమ్మాయిమీద పని చేసినట్లున్నాయి. (ఏమో చెప్పలేం. ఈ కోతులు అలా నటించినా నటించగలరు) "సారీ సార్? ఈ ప్లాన్ మాదికాదు. అదిగో! రేఖది..." అంటూ చీకటిలో నిలబడి అప్పటి వరకు నవ్వుతున్న అమ్మాయిని చూపించింది.    ఆ అమ్మాయి- శివప్రసాద్ దింపటం కోసం వచ్చినప్పుడు కళ్ళతో వెక్కించిన అమ్మాయి.                      *    *    *
    ఇంటికొచ్చేసరికి పన్నెండు కావొస్తూంది. "ఇంత ఆలస్యమందేమిట్రా" అడుగుతూన్న అమ్మకి ఏదో సమాధానం చెప్పి పక్కమీద వాలేను.
    చాలాసేపటివరకూ నిద్ర పట్టలేదు. ఆట పట్టించి నవ్వుతూన్న అమ్మాయిల మొహాలే కళ్ళముందు కదలాడ సాగాయి. అయినా ఇంత తెలివి తక్కువ వెధవలా ఎలా బుట్టలో పడ్డాను. ఫోన్ రిసీవరు దగ్గిర నలుగురైదుగురు కెవ్వు కెవ్వున కేక వేయగానే 'సిరికిం చెప్పడు' లాగా ఎలా పరుగెత్తాను.
    ఒక పోలీస్ ఆఫీసర్ కి వుండవలసిన లక్షణమేనా ఇది?
    ........
    పోలీస్ ఆఫీసర్ అనగానే నాకు మళ్ళీ ఆ ఇన్విటేషన్ కాగితం గుర్తొచ్చింది. లేచి కూర్చుని నేను వ్రాసిన లెఖ్కని చూసుకున్నాను.
    "ఆపరేషన్ నెంబర్ వన్ పూర్తయింది."
    ఏమిటా ఆపరేషన్?
    ఆలోచన్లతో తల పగిలిపోసాగింది.
    ఈ రోజు ఈ కాగితం వెళ్ళింది అంటే....ఈ రోజే ఏదో జరగబోతూందన్న మాట!
    ఇప్పుడు నేను లేడీస్ హాస్టల్ గురించి ఆలోచించటం లేదు. జైలు గురించిన టెన్షన్ తో వున్నాను. మళ్ళీ ట్రెయినింగ్ లో వాక్యం గుర్తొచ్చింది. 'దేన్నీ నిర్లక్ష్యం చేయకు... దేన్నీ ఆలస్యం చేయకు...'
    గదిలోంచి బయట కొచ్చాను. అమ్మ నిద్రపోతూ వుంది. జైలు వైపు నడిచాను. నైట్ డ్యూటీ సెంట్రీ శాల్యూట్ చేశాడు. లోపల అంతా విశాలమైన ఖాళీస్థలం. నిర్మానుష్యంగా వుంది. సెర్చిలైటు వెలుగు దూరంగా అట్నుంచి ఇటు వస్తోంది.
    వరుసగా సెల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. అందరూ వున్నారు. వరండాలో తిరిగే సెంట్రీలు శాల్యూట్ చేస్తున్నారు. వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యం కొట్టిచ్చినట్లు కనబడుతూంది. బహుశా ఆకస్మిక తనిఖీ అనుకుంటున్నట్టున్నారు.
    ఎక్కడా నా కేవిధమైన పొరపాటు కనబడలేదు. అంతా సవ్యంగానే వుంది.
    బయట కొచ్చాడు.
    మనసిమ్కా పూర్తిగా సంతృప్తి చెందలేదు.
    బయట కందకంవైపు నడిచాను. అటువైపు పగలే ఎవరూ నడవరు. చిన్న చిన్న పొదలు, ముళ్ళ తీగలు - నడవటానికే కష్టంగా వుంది. అయితే ఖైదీలచేత రెండు నెలలకోసారి వాటిని కొట్టిస్తాం. మరీ దట్టంగా పెరిగితే, దాక్కోవటానికి నెలవు అవుతాయి.
    బయట వైపునుంచి జైలుచుట్టూ నడవాలంటే దాదాపు గంట పడుతుంది. ఆ సమయంలో అక్కడ నన్నెవరైనా చూస్తే పిచ్చివాడనుకుంటారు. గుర్తించకపోతే సెంట్రీలు కాల్చిపారేస్తారు. మా జైలు ప్రాంతంలో రాత్రి పదినుంచి ప్రొద్దున నాలుగు వరకూ SASFORNOR అమలులో వుంటుంది. సాస్ ఫర్ నోర్ అంటే shoot at sight for No Response.
    ఆలోచన్లతోనే మరో నాలుగు అడుగులూ వేసి అకస్మాత్తుగా ఆగిపోయాను. తుప్పల మధ్య కాస్త గడ్డి ఎండిపోయినట్టు కనిపించింది. ఏదో తవ్వినట్టు గుర్తులు కనబడ్డాయి.
    వంగి చేతుల్తో మట్టి పక్కకి తోశాను.
    శరీరం అన్ని వైపుల్నించీ గుండెల్లోకి ఒక్కసారిగా రక్తం ఇవ్వునజిమ్మిన ఫీలింగ్.
    అక్కడో చిన్న సొరంగం లాంటిది వుంది, జైలు గోడలోకి.
    అంటే లోపలికి.... మరోలా చెప్పాలంటే లోపల్నుంచి బయటకి రావటానికి.

 Previous Page Next Page