Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 5

 

  "ఇటెక్కడికి?" అని అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. జీపు ఒక పాత గోడౌన్ లోకి వెళ్ళి ఆగింది. "దిగు సుబ్బారావ్" అన్నాడు ఇన్ స్పెక్టర్.


    "ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను?"

    ఇన్ స్పెక్టర్ నవ్వుతూ కేప్ తీసేశాడు. పోలీసులు కూడా అదేపని చేశారు. మరో ఇద్దరు గూండాలు లోపల్నుంచి వచ్చి వారితో చేరారు.

    "మా మనిషిని అంజిగాడి కిళ్లీకొట్టు దగ్గిర చంపావు. పోలీసులూ, కేసులూ, వీటిమీద మాకు నమ్మకం లేదు సుబ్బారావ్! కత్తికి కత్తి- ప్రాణానికి ప్రాణం. అదే మా రూలు. ఎవడో నీ మీద కేసు పెట్టటం- కోర్టులో శిక్షపడటం- అంతవరకూ మేం వూరుకోలేం. ఊరుకుంటే మా వాడి ఆత్మ శాంతించదు" అంటూ కత్తి తీశాడు.

    అతడింకా అయోమయం నుంచి తేరుకోలేదు. ఆ అయోమయం, పోలీసుల వేషంలో వచ్చిన రౌడీల్ని చూసి కాదు. కిళ్ళీకొట్టు దగ్గిర చనిపోయిన మనిషి గురించి.

    "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధంకావటంలేదు. అదంతా షూటింగ్ లో ఒక భాగం."

    అతడి మాటలు వినిపించుకోకుండా ముందుకొచ్చాడు రౌడీ. ఆమె కెవ్వున అరిచింది. అతడు ఆగి, "ఓహో నువ్వూ వున్నావు కదూ" అని నవ్వేడు. పక్కనున్న ఇద్దరు గూండాలు వచ్చి ఆమెను పట్టుకోబోయారు. తన ముందున్న కత్తిని పట్టించుకోకుండా అతడు ముందుకు కదిలాడు. ఒకటే దెబ్బ. ఆమెని లాగబోతున్న ఒక గూండా మొహం ఆ దెబ్బకి పచ్చడయింది. రెండో గూండా గాలిలో ఎగిరి అతడిని తన్నబోయాడు.

    తను చైతన్యా? సుబ్బారావా?

    డాక్టర్ అన్నట్టు ఇదంతా భ్రాంతా?

    తను చైతన్యే అయితే డూప్ లేకుండా ఇలాంటి ఫైట్స్ చేయగలడు. తను సుబ్బారావే అయితే భయపడి లొంగిపోతాడు. "కమాన్ చైతన్యా- కమాన్. ఇది నీకో లెక్కకాదు" అంటూ అతడు తనని తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నాడు.

    తన మీదకి వస్తూన్న కాలుని అతను అలాగే గాలిలోకి పైకి ఎత్తి మెలిక తిప్పాడు. అక్కడినుంచి క్రిందపడ్డ రౌడీచేసిన ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. ఆమె అతనివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. అతనేదో అనబోతూంటే వెనుక ఎవరో కదిలినట్టయింది. అతడు చప్పున ముందుకు వంగి, వెనుకనుంచి వస్తున్న రౌడీని అలాగే లాగి, మెడమీద కొట్టాడు. ఆమె బయటకు పరుగెత్తింది.

    అక్కడొక అయిదు నిముషాలపాటు భయంకరమయిన పోరాటం జరిగింది. బ్రతుక్కీ చావుకీ మధ్య పోరాటం, బ్రతుకే గెలిచింది. అతడు వాళ్ళని కొట్టి పడెయ్యబోతుంటే బయట వ్యాన్ చప్పుడు వినిపించింది. ఆమె ఆందోళనగా లోపలికి పరుగెత్తుకు వచ్చింది. వెనుకే హాస్పిటల్ స్టాఫ్.

    తిరిగి ఆ నరకకూపానికి వెళ్ళాలి అనుకోగానే అతడు నిజంగా పిచ్చి వాడయ్యాడు. చెల్లాచెదురుగా పడివున్న శరీరాల మధ్య నుంచి అదే వూపులో బయటకు పరుగెత్తబోయాడు, ఎవరు పట్టుకున్నారో తెలీదు. ఎవరు గుచ్చారో తెలీదు. ఇంజక్షన్ సూది అతడి శరీరంలో ప్రవేశించింది.


                                        *    *    *    *


    అతడికి నెమ్మదిగా స్పృహ వచ్చింది.

    ఇదంతా కలా? నిజంగా జరుగుతూ వుందా? ఏమీ అర్ధంకావడంలేదు. అతను రెండుగా విడిపోయాడు.

    ఒకటి సుబ్బారావు భార్యా, పిల్లవాడు. తను సెక్రటేరియట్ లో పని చేస్తున్నాడు. కిళ్ళీకొట్టు దగ్గర గొడవైతే ఒక రౌడీని కొట్టాడు. తనకి తలమీద దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆ రౌడీ మరణించేసరికి పోలీసులు తనమీద కేసు పెట్టారు. ఆ రౌడీ తాలూకు మనుష్యులు వేషాలేసుకొచ్చి తన ప్రాణం తీద్దామనుకున్నారు. ఇదొక కథ.

    తను చైతన్య. ఆంధ్రుల అభిమాన నటుడు. షూటింగ్ లో ప్రమాదవశాత్తు దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేర్చారు. "నేను చైతన్యని" అన్నా ఎవరూ ఒప్పుకోవటంలేదు, ఇది రెండో కథ.

    ఈ రెండు కథలూ చెపితే- అందరూ మొదటిదానికే ఓటు వేస్తారు. ఇంతమంది చెపుతున్నా, న్యూస్ పేపర్ చూపిస్తున్నా, అది తన ఫోటో కాకపోయినా- ఇంకా తను చైతన్యననటం... నిజంగా తనకి మతిభ్రమించిందా? తన భార్యని గుర్తుపట్టలేకపోతున్నాడా?

    ఓ.కే.!

    తను నిజంగా సుబ్బారావే అయితే- ఆ రౌడీని చంపినందుకు ఆనందంగా శిక్ష అనుభవిస్తాడు కానీ దానికన్నా ముందు తనొక సారి చైతన్యని కలవాలి. తనని అంత ఫారనాయిడ్ ని చేసిన చైతన్య ఎవరో ఒకసారి చూడాలి. డాక్టర్ చెప్పినట్లు, చైతన్యని చూసిన ఉద్వేగంలో తనకి తిరిగి గతం గుర్తుకు రావచ్చు.

    అతడు దినపత్రికవైపు చూశాడు.

    "అతడే ఆమె సైన్యం".

    క్రింద చైతన్య ఫోటో-

    చాలా మామూలుగా వున్నాడు ఫోటోలో. సిగరెట్ కంపెనీకి మోడలింగ్ చేసే వ్యక్తిలా వున్నాడు. ఇతడేనా చైతన్య? ఇతడేనా అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమాన నటుడు? ఇతడికీ తనకీ పోలికలు లేనేలేవు. అతడి తల్లిని చూస్తే బావుండును.

    అతడు ఆలోచనల్లో వుండగానే ఆమె లోపలికి వచ్చింది- భోజనం ట్రేతో! అదే నవ్వు. హంస రెక్క విరుచుకున్నట్టు.

    "మీరు సినిమాలు చూడరా?" ఆమె భోజనం పెడుతుంటే అడిగాడు.

    "చూస్తాను" మెల్లిగా అంది.

    "నాకీ షాక్ ట్రీట్ మెంట్ లూ, ఇంజెక్షన్ లూ వద్దు! మీరు చెపితే నమ్ముతాను చెప్పండి. నేను చైతన్యనా? సుబ్బారావ్ నా?

    ఆమె సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. తరువాత వచ్చి టాబ్లెట్లు యిచ్చి వెళ్ళింది. టాబ్లెట్ వేసుకుని కాగితం పారేయబోతూ ఆగాడు. దానిమీద చిన్న అక్షరాల్తో వుంది. "మీరు చైతన్యే. ఈ రాత్రి పన్నెండింటికి మీరు పారిపోవటానికి ఏర్పాటు చేస్తాను. సిద్ధంగా వుండండి- అక్షౌహిణి."

    ఆ ఉత్తరం అతడి చేతిలో వణికింది! కోటి చేతులు ఒక్కసారిగా సితారులు మీటిన భావం!

    ఒక అయోమయం స్థితినుంచి బయటపడ్డట్టు వుంది. తనని ఇంతకాలం ఎందుకు సుబ్బారావని భ్రమింపచేశారో, కారణాలు వెతికే ఓపిక కూడా లేదు. ఆమెని కలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరసాగింది. అయితే ఆమె కనపడలేదు.

    టైం ఎంత నెమ్మదిగా కదుల్తుందో అతడికి మొదటిసారి తెలిసింది. షూటింగ్ లలో అయితేనేం, ఇంటిలో అయితేనేం - అతడికి టైం చూసుకునే అవసరం (అవకాశం) వుండేది కాదు. అతిథులు, అభిమానులు ఎప్పుడూ చుట్టూచేరి, అతడి సమయాన్ని తినేస్తూ వుండేవారు...

    క్రమంగా చీకటి పడింది.

    ఆమె కనపడలేదు.

    అతడికి అనుమానం వచ్చింది. ఇదికూడా ఈ నాటకంలో ఒక భాగమేమో అని!

    ఆస్పత్రి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.

    పదిన్నర... పదకొండు... పదకొండున్నర.

    అయిదు నిమిషాల తక్కువ పన్నెండు.తన మనసుని స్వాధీనంలో వుంచుకోవటానికి అతడు ప్రయత్నించసాగాడు. తను మొట్టమొదటిసారి కెమేరాముందు నిలబడటం గుర్తొచ్చింది. స్టార్ట్ ... సౌండ్... క్లాప్... యాక్షన్... తడబాటు..... ఓ.కే....

    పన్నెండు గంటలకు ఒక్క నిమిషం తక్కువగా వుందనగా తలుపు తెరుచుకుంది. ఆమె లోపలికి వచ్చింది. అతడు చప్పున ఆమె దగ్గరికి వెళ్లాడు. ఏదో అనబోతూ వుంటే ఆమె "...ష్" అని సైగ చేసింది. ఇద్దరూ నిశ్శబ్దంగా బయటకు కదిలారు.

    వరండా చివర్లో ఒక నర్సు కునికిపాట్లు పడుతూంది. తన అడుగుల చప్పుడే తనకి డ్రమ్ బీట్స్ లా వినపడుతున్నట్టు అనిపించింది. నర్సుని దాటుకుని మెట్ల దగ్గరికి వచ్చారు యిద్దరూ. అక్కడికి చలిగాలి రివ్వున వీస్తూంది.

    క్రిందికి మెట్లు దిగారు. అద్దాల అవతల చీకటి ఆ నిశ్శబ్దానికి తోడై ఎంతటి ధైర్యవంతుడినైనా భయపెడుతూంది. దానికి తోడు చలిగాలి.

    బిల్డింగ్ కి వంద గజాల దూరంలో ఎత్తయిన ప్రహరీగోడ వుంది. గేటు దగ్గర సెంట్రీలు యిద్దరున్నారు. ఆ ఆవరణ అంతా వెలుతురు నిండి వుంది. అతడి దృష్టి సెంట్రీల పక్కనున్న కుక్కలమీద పడింది.

    అంతకు ముందురోజే అతడు వాటిని చూశాడు. కానీ అవి ఎందుకో అర్ధంకాలేదు.

    ఆమె అది గమనించి అంది- "ఆస్పత్రిలో కొందరు ప్రమాదకరమైన పేషెంట్లు వున్నారు. వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళితే, మర్డర్లు, మరిన్ని నేరాలు చెయ్యవచ్చు. అందుకని ఇంత జాగ్రత్తగా కాపలా-" అర్ధమైనట్టు అతడు తలూపి మరింత నిశితంగా చూశాడు.

    ఆమె అన్నది- "నేనూ మీతో రావల్సి వుంటుంది. సాయంత్రం డ్యూటీ అయిపోయాక నేనిక్కడే వుండిపోయాను. నేను వుండిపోయినట్టు ఎవరికీ తెలీదు."

    "థాంక్స్!"

    సెంట్రీలు ప్రతీ అయిదు నిమిషాలకీ చెరోపక్కకీ వెళ్ళి రావటం అతను గమనించాడు. తిరిగి రావటానికి మరో అయిదు నిముషాలు పడుతుంది. కానీ ఆ టైంలో కుక్కలు అక్కడ కాపలా కాస్తున్నాయి.

    అతడు రెండు నిముషాలు ఆగి, సెంట్రీలు దూరంగా వెళ్ళగానే చేతిలో బ్రెడ్ కుక్కల దగ్గరికి విసిరాడు. చీకట్లోంచి వచ్చిపడిన రొట్టెముక్కల్ని ఆత్రంగా తిని- నెమ్మదిగా నడుము వాల్చాయి అవి.

    "ఏమిటది? ఎలా జరిగింది?" అని అడిగింది ఆమె.

    "ఇలాంటి అవసరం ఏదో వస్తుందని తెలుసు. సాయంత్రం మీనుంచి ఉత్తర అందేక, రొట్టె తినకుండా దాచి వుంచాను" అన్నాడు.

    "కానీ అవి తిని, ఆ కుక్కలు మత్తులోకి ఎలా జారుకున్నాయి?"

    "పెథిడ్రిన్ ఇంజెక్షన్ బాటిల్ కాజేసి దాచేసి వుంచాను. ఆ బ్రెడ్ లో అది కలిపాను."

    ఆమె కళ్ళు విప్పారితం చేసి అతనివైపు చూసింది. "ఇంత దూరదృష్టి మామూలు మనుష్యులకు వుండదు. మీరు సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోయే"

    అతనికి పొగడ్తలు అంతగా నచ్చవు. తన చుట్టూ వున్న జనం నోట ఆ పొగడ్తలు వినీ వినీ విసుగెత్తి వున్నాడు.

    "మీ పేరు బావుంది. అక్షౌహిణి. ఎవరు పెట్టారు?" అన్నాడు మాట మారుస్తూ.

    "మా నాన్నగారు మిలటరీలో కల్నల్. అక్షౌహిణి అంటే సైన్యం. అందుకే ఆ పేరు పెట్టారు."

    అతడు ఆశ్చర్యంగా "కల్నల్ కూతురైయుండి నర్సుగా చేస్తున్నారా?" అన్నాడు.

    "ఏం తప్పేముంది? అదేమీ తక్కువ ఉద్యోగం కాదే-"

    "ఐయామ్ సారీ! నా ఉద్దేశ్యం అదికాదు"

    పడిపోయిన కుక్కల సంగతి చూసుకోకుండా సెంట్రీలు మళ్ళీ రౌండ్స్ కి వెళ్ళారు.

    "క్విక్" అన్నాడు అతడు. ఇద్దరూ ద్వారం దగ్గరికి పరుగెత్తారు. గేటు పక్కనే వున్న చెట్టుకొమ్మని పట్టుకుని ఒక్క స్వింగ్ లో అతడు పైకి చేరుకున్నాడు. అంత టెన్షన్ లో కూడా ఆమె ఆ అద్భుత విన్యాసానికి నివ్వెరపోయింది. గోడమీద గాజు పెంకులున్నాయి. చెప్పులతో నిలబడితే ఫరవాలేదు కాని చెయ్యి ఆనిస్తే కష్టం. ఆమెని వదిలిపెట్టి వెళ్ళటం అతనికి ఇష్టంలేదు. తన కోసం అంత రిస్క్ తీసుకున్న ఆమెకి, తనవల్ల ఉద్యోగం పోవటం సహించలేదు. అతడు గోడ అంచుమీద వంగి, క్రిందకి చేయి సాచేడు. పూర్తిగా పడుకుంటేగానీ ఆమె చెయ్యి అందటం లేదు.

 Previous Page Next Page