Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 5

   

    "ఇంత మారణహోమం జరగబోతూంటే ఏమీ పట్టనట్టు అందరూ ఇలానే వున్నారేమిటి?"
   
    "ఎవరికీ తెలీదు భరద్వాజా! కేవలం పై స్థాయిలో వున్న కొద్దిమంది ప్రముఖులకు తెలుసు. వాళ్ళెవరూ ప్రస్తుతం రాష్ట్రంలో లేరు."
   
    భరద్వాజ కళ్ళముందు ఏదో మెరిసినట్టూ అయింది. అవును రాష్ట్ర 'వైస్ ప్రెసిడెంట్', సెనేట్ మెంబర్స్.... అందరూ ఏదో ఒక పనులు (కల్పించుకుని) ఎక్కడెక్కడో వున్నారు. చాలా రహస్యంగా, చాప క్రింద నీరులా ఈ వార్త నెమ్మదిగా పాకుతుందన్నమాట.
   
    "మరి అందరికీ చెప్పి...." అంటూ ఏదో అనబోయి మధ్యలో ఆగిపోయాడు. తన ప్రశ్న తనకే అసంబద్దంగా అనిపించింది. ఈ వార్త అందరికీ తెలిస్తే రైళ్ళు, విమానాలు, కార్లూ - అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇంత గొడవ జరిగాక ఫ్రాన్సు తన లక్ష్యాన్ని కాస్త 'పక్కకి' మార్చుకోవచ్చు కూడా అందుకే తెలిసినవాళ్ళు తెలిసినట్టు ఇక్కడ్నుంచి నిశ్శబ్దంగా తప్పుకోవటం మంచిది.
   
    "వాళ్ళు బాంబింగ్ చెయ్యవచ్చు - చెయ్యకపోవచ్చు. కానీ ఈ వార్త మీరు మాత్రం ఎక్కడా అనకండి. ఎంత దగ్గరవాళ్ళకీ చెప్పకండి. కేవలం మీరు - మీ కుటుంబం కారు వేసుకుని వెళ్ళిపొండి. ఈ ప్రామిస్ మీరు నాకు చేశారు."
   
    "అవును" అన్నాడు. భరద్వాజ. అతడి మనసెక్కడో వుంది. తనతోపాటూ ఏం తీసుకెళ్ళవచ్చు....తన కుటుంబం నలుగురూ గాక.....
   
    "ఫ్రాన్స్ బహుశా 5 మెగాటస్ బాంబ్ వేస్తుందని అనుకుంటున్నారు. అంతకన్నా తక్కువే ఉపయోగించవచ్చు కూడా. మనం ఎక్కువ ప్రమాదాన్నే శంకిస్తే మంచిది. వార్తల్లో చర్చలు ఫలించినట్టు రేడియోలో రాకపోతే వెంటనే బయల్దేరాలి. గంటకి మూడు కిలోమీటర్లు వేసుకున్నా తెల్లారేసరికి వెయ్యి కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. అది చాలనుకుంటున్నారు....."
   
    "మీ రెటువైపు వెళుతున్నారు?"
   
    "ఉత్తరం వైపు."
   
    "థాంక్యూ నాకీ విషయం చెప్పినందుకు."
   
    తన కారులో అతడు ఆఫీసు వైపు బయల్దేరాడు. అసలు కమీషనర్ చెప్పిన వార్తే ఒక పెద్ద బాంబులా వుంది. అది వినగానే మనసంతా స్తబ్దంగా అయిపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుని ఆలోచించటం మొదలు పెట్టాడు. అదృష్టవశాత్తు అతడికి స్థిరాస్తులు ఏమీలేవు. అలా వున్న వాళ్ళ బాధ అర్ధం చేసుకోగలడు.
   
    న్యూక్లియర్ బాంబ్ పేలితే ఏం జరుగుతుందో అతడికి తెలుసు. మూడో ప్రపంచ యుద్ధం కాలంనాటికి అతడు చాలా చిన్నవాడు. అయినా ఆ జ్ఞాపకాలన్నీ అతడి మనసులో సజీవ స్మృతులుగా చిత్రింపబడివున్నాయి. అతడికే కాదు. ఆ తరానికంతా అదే మర్చిపోలేని పీడకల.
   
    చికాగో నగరం మీద ప్రయోగింపబడినది 20 మెగా టన్నుల బాంబు!!!
   
    ఒక వేసవికాలపు ఉదయం వీధులన్నీ కార్లతోనూ, మిగతా వాహనాలతోనూ కిక్కిరిసి వున్నాయి. ఫుట్ పాత్ ల మీద జనం హడావుడిగా నడిచి వెళుతున్నారు. జరగబోయే ప్రమాదం ఎవరికీ తెలిసినట్టూ లేదు.

    సరిగ్గా 11 గంటల 27 నిమిషానికి ఆడమ్స్ ప్రాంతంలో 'లాసెర్లీ' దగ్గర భూమికి సరిగ్గా ఇరవై అడుగుల ఎత్తులో ఆ న్యూక్లియర్ బాంబ్ విస్ఫోటనం చెందింది. నిమిషంలో లక్షోవంతు కాలంలో అక్కడి టెంపరేచరు 150 మిలియన డిగ్రీల ఫారన్ హీటుకి పెరిగింది. (సూర్యుడి నడిబొడ్డున వుండే ఉష్ణోగ్రతకి ఇది నాలుగు రెట్లు)
   
    అది పేలిన రెండు సెకన్లకి ఆ పేలుడు తాలూకు చప్పుడుతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. కానీ దాన్ని వినటానికి అక్కడ ఎవరూ లేరు. అంతకుముందే చచ్చిపోయారు. హిరోషిమా మీద 1945లో వేసిన బాంబు కంటే ఈ బాంబు 1500 రెట్లు పెద్దది. అది పడినచోట మైలు వెడల్పూ, 600 అడుగుల లోతూ వున్న గొయ్యి ఏర్పడింది. పేలిన బాంబు భూమ్మీదకు జారుతున్నప్పుడు ఒక మండుతున్న అగ్నిగోళం దిగుతున్నట్టూ అనిపించింది. అక్కడికి వందమైళ్ళ దూరంలో వెళుతున్న విమానంలోని సిబ్బంది ఆ వెలుతుర్ని చూసి ఆ ఫ్లాష్ భరించలేక ముందు అంధులయిపోయారు. తరువాత రెండు క్షణాలకి చచ్చిపోయారు.
   
    అందరికన్నా అదృష్టవంతులు చికాగో నగరవాసులు. ఏం జరిగిందో తెలియకుండా, కనీసం ధ్వని కూడా వినిపించకముందే బూడిద కూడా మిగలకుండా నిష్క్రమించారు.
   
    వారితోపాటే రెప్పపాటుకన్నా తక్కువ కాలంలో ఆ నగరంలోని ఆకాశాన్నంటే భవనాలూ, రోడ్లూ, వంతెనలూ, ఇనుము, ఉక్కు వేల వేల టన్నుల మట్టీ అంతా అక్కడికక్కడే క్షణంలో 'ఆవిర'యిపోయాయి. కనీసం గుర్తుకూడా మిగల్లేదు.
   
    మొత్తం మరణాల సంఖ్య 160 మిలియనులు వుంటుందని అంచనా. అది అమెరికా జనాభాలో మూడోవంతు.
   
    సమయానికి యు.యన్.ఒ కలగచేసుకోకపోతే భూమ్మీద మానవ జాతి అంతరించి వుండేది.
   
    యుద్ధం ముగిసిన ముప్పై సంవత్సరాలకి అతడు ఆ వస్తువు కథాంశంగా "మూడోసారి మంటలు" అన్న నవల వ్రాశాడు. అది ఇంగ్లీషులోకి అనువదింపబడి, మిలియను కాపీలకు పైగా అమ్ముడు పోయింది. కానీ దురదృష్టవశాత్తూ అనువాదకుడితో అగ్రిమెంటులో ఏదో లోపం వుండటం వల్ల రావలసిన రాయల్టీ రాలేదు. అది వేరు సంగతి.
   
    ఇప్పుడు "నాలుగోసారి మంటలు" అన్న నవల వ్రాయటానికి తనుండదా?
   
    అంత టెన్షన్ లోనూ అతడికి నవ్వొచ్చింది.
   
    టైమ్ చూసుకున్నాడు.
   
    రెండు దాటింది.
   
    ఇంకా కొద్ది గంటల టైమ్ వుంది.
   
    సెక్యూరిటీలని డబ్బుగా మార్చుకోవాలి. తాము మొత్తం నలుగురు మనుష్యులు కాక తీసుకెళ్లవలసిన వస్తువులన్నిటినీ సర్దుకోవాలి.
   
    అతడికి పెద్ద టెన్షన్ గా ఏమీలేదు.
   
    అర్ధరాత్రిపూట కారు ఆపి ఆసిడ్ సీసా మొహంమీద పోస్తామని బెదిరించి డబ్బు గుంజేవాళ్ళూ, సర్వసాధారణమైపోయిన హైజాకింగూ, వీటితో అనుక్షణం ప్రాణభయమే. ఈ విధంగా 'వలస' వెళ్ళటం కూడా కొత్త ఏమీ కాదు..... వేరే భాష మాట్లాడేవాళ్ళు తమ రాష్ట్రంలో వుండకూడదని ఆందోళన లేవగానే రాష్ట్రం నుంచి స్వంత రాష్ట్రం వలస.....విదేశీయుల్ని తరిమికొట్టాలన్న ఉద్యమం బయల్దేరగానే దేశం నుంచి స్వంత దేశానికి వలస......క్షణాలమీద పరిస్థితుల్లో మార్పులు......ఇలాటి ఇన్ సెక్యూరిటీ లన్నిటికీ జీవితం అలవాటు పడిపోయింది. అందుకే స్థిరాస్తులని ఎవరూ పెద్దగా నిల్వ చేసుకోరు. వాటి ధర ఇటీవలి కాలంలో పడిపోవటానికి కారణం అదే. ఇప్పుడు అదే మంచి జరిగింది. అతడికి స్థిరాస్తులు లేవు.
   
    అతడు ఇంటికి వచ్చి భార్యకీ, కొడుక్కీ ఫోన్లు చేశాడు. విషయమేమిటో వివరించలేదుగానీ, వాళ్ళు ఆరింటికి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. కూతురు ఇంటిలోనే వుంది.
   
    తండ్రి మోహంలో కనబడుతూన్న అనూహ్యమైన అలజడిని కూతురు గుర్తించి "ఏమిటి నాన్నా?" అని అడగబోతుంటే ఫోన్ మ్రోగింది. అతడు రిసీవరెత్తి "హలో" అన్నాడు.
   
    "మిస్టర్ భరద్వాజా......"
   
    "మాట్లాడుతున్నాను."
   
    "మేము హోమ్ ఫర్ ది ఏజ్డ్ (ముసలివాళ్ళ వసతి గృహం) నుంచి మాట్లాడుతున్నాం. మీ తండ్రిగారు రామానంద, నెం - 64392 అరగంట క్రితం మరణించారు." భరద్వాజ స్థాణువయ్యాడు. తండ్రి మరణం షాక్ లా తగిలింది. అందులోనూ ఈ సమయంలో మరణించటం.
   
    అతడికీ, అతడి తండ్రికీ అంతగా పరిచయం లేదు. చిన్నప్పుడే అతడు మిగతా పిల్లల్లాగా బేబీ సిట్టింగ్ స్థితినుంచి కేజీలోకి వచ్చాక హాస్టల్ లో చేర్పించబడ్డాడు. కేవలం శలవుల్లో మాత్రమే ఇంటికి వచ్చేవాడు. కొంచెం వయసొచ్చి తల్లి చచ్చిపోయాక, శలవుల్లో ఏదో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూ అదికూడా రావటం మానేశాడు.
   
    తండ్రి రిటైరయ్యే సమయానికి అతడు ఇంకా రచనల్లో పూర్తిగా స్థిరపడలేదు. ఆయన వృద్దాప్యంలో మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి  చూస్తూ వుండేవాడు. అంతకన్నా పెద్దగా వాళ్ళమధ్య ఏ సంబంధ బాంధవ్యాలూ లేవు.
   
    అతడు వాచీ చూసుకున్నాడు. వార్తలు రావటానికి ఇంకా మూడు గంటలు టైమ్ వుంది.
   
    ఎలక్ట్రికల్ క్రియేషన్ (కరెంటుద్వారా శవాన్ని బూడిద చెయ్యటం) వచ్చాక అంతా అరగంటలో అయిపోతుంది.
   
    భార్యకీ, కొడుక్కీ ఫోన్ చేసి ఈ వార్త చెప్పి, వాళ్ళని అక్కడికి సరాసరి రమ్మని కూతుర్ని తీసుకుని తను బయల్దేరాడు.
   
    అది విజిటింగు అవర్స్ టైమ్. హోమ్ లో వున్నవాళ్ళని బయట వాళ్ళు వచ్చి చూడటానికి రోజుకి రెండు గంటలు కేటాయిస్తారు.
   
    ఇతడి కారు కాంపౌండ్ లో ప్రవేశించగానే మేడమీదా, బాల్కనీలోనూ కూర్చుని వున్న చాలామంది వృద్దులు గబగబా అంచువద్దకు వచ్చి వంగి చూశారు. ఒకరిద్దరు ముసలివాళ్ళు కారు చప్పుడుకి వరండాలోకి పరుగెత్తుకు వచ్చారు కూడా.
   
    వచ్చినది తమ తాలూకువాళ్ళు కాదని తెలిసి వాళ్ళ మొహాల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనబడింది. అంతమంది అలా అంచున నిలబడటం ఏటి ఒడ్డున కొంగల వరుసని గుర్తుకు తెస్తూంది. ఇది సరయిన ఉపమానం కాదు. అయినా అతడికి అదే గుర్తొచ్చింది.

 Previous Page Next Page