Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 5

            

                                                       ఇంటి పుల్లకూర
   
   
    బ్లాంకెట్ కొద్దిగా తొలగించి, ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావ్ లేచి, మంచంమీద దుప్పటి సరిగ్గా సర్దటం బెడ్ లైట్ కాంతిలో కనిపిస్తూంది.
   
    అంటే నాలుగున్నరయిందన్నమాట.
   
    డిసెంబర్ చలికి బ్లాంకెట్ లోంచి శరీరం వణుకుతూంది. డిసెంబరయినా ఏప్రిల్ అయినా రావ్ నాలుగున్నరకే లేస్తాడు.
   
    సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది.
   
    ఆమె లేచేసరికి ఆరున్నర అవుతుంది.
   
    అప్పటికి అతడు మార్నింగ్ వాక్ కి వెళ్ళి రావటం, షేవ్ చేసుకోవటం, స్నానం చెయ్యటం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అతడు టైప్ మిషన్ ముందు కూర్చుని ప్రైవేటుగా చేస్తున్న జాబ్ వర్క్ మొదలుపెడ్తాడు. లాయర్ల తాలూకు పేపర్లు టైప్ చేసినందుకు అతడికి నెలకో రెండొందల దాక వస్తూంది.
   
    తొమ్మిదింటికి అతడు సైకిల్ మీద పిల్లలిద్దర్నీ ముందూ వెనకా ఎక్కించుకొని స్కూల్లో దింపి వస్తాడు.
   
    ఎన్నో సంవత్సరాలనుంచీ జరుగుతున్న కార్యక్రమం ఇది.
   
    పెళ్ళయిన కొత్తలో భర్తమీద గౌరవంకొద్దీ తనూ లేవటానికి ప్రయత్నించింది. కుదర్లేదు తరువాత ఆర్నెల్లకి భర్తమీద కమేండ్ వచ్చి తనతోపాటూ ఆరున్నరవరకూ 'ఉంచుకోవటానికి' ప్రయత్నించింది. అధీ కుదర్లేదు.
   
    అలాగే ఎనిమిదేళ్ళు గడిచిపోయినయ్.
   
    రావ్ దంతా 'ఫిలియాస్ ఫాగ్' లాగా టైమ్ ప్రకారం నడవటం. జీవితంపట్ల సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది అతడి ప్రతి పనిలో.
   
    అదే నచ్చదు సుమిత్రకి.
   
    రావ్ తో కాపురం ప్రారంభించి ఎనిమిదేళ్ళు కావొస్తున్నా పూర్తిగా ఎడ్జెస్ట్ కాలేకపోతోంది సుమిత్ర. అయితే దానిక్కారణం అవతలి వాళ్ళదే అని ఇద్దరి అభిప్రాయం.
   
    తాను మంచి రొమాంటిక్ మూడ్ లో వుండగా లేచి మంచం దిగుతాడు.
   
    "ఏమైంది" అడుగుతుంది.
   
    "ఆ మూల చూడు, గోడకి బూజు" అంటాడు. లాగి తందామన్నంత కోపం వస్తుంది. దాన్ని అణిచి పెట్టుకొని "రేప్రొద్దున్న తీయొచ్చుగా" అంటూంది.
   
    "అసలివ్వాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్రా..... నువ్వు పగలంతా, నేను ఆఫీసు కెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు?" స్టూలు మూలకి లాగుతూ, పాతచీపురు బూజు దులపటానికి పట్టుకొని అతడు అడిగేడు.
   
    "పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను" అంది వళ్ళుమండి.
   
                                                         *    *    *

 Previous Page Next Page