Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 5


    "మీరేమీ మాట్లాడరు".

    "సారీ!"

    "మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుంది."

    మిత్రా మొహం మ్లానమైంది. మాట్లాడలేదు.

    "కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ లాంటి వాళ్ళని ఏం అనే వాళ్ళమో తెలుసా?"

    "ఏం అనేవాళ్ళు?"

    "అన్నప్పిండి"


                                                         *    *    *


    ఒంటరితనపు చీకట్ల మధ్యలో అతడు. తోడుగా సితారు. ఇరవై ఏళ్ళ ముగ్ధలా సితారు. విల్లులా వంగిన నడుముకి బిగించి కట్టిన తీగె. గమకం పలికిస్తే వణికే శరీరం. షడ్జమం దగ్గరే వేలు ఆపి, 'రిగమా'ల్ని పలికిస్తే 'మీండ్'. పెదవుల్ని స్పృశించి ఒళ్ళంతా పులకింపచేసినట్టు 'తరబ్'. తీవెల్ని అలవోకగా చిటికిన వేలితో కదిలిస్తే ముత్యాలజల్లులా కురిసిన అమ్మాయి నవ్వు. జడలాగి బుగ్గన చిటిక లేసినట్టు మధ్యవేలితో తీగమీద పలికించిన 'కృంతన్'. ఒక స్వరాన్ని మీటి ప్రక్క స్వరాన్ని తాకినట్టూ బుగ్గలాగి చెక్కిలి నొక్కితే 'కణ్'. రిషభంలోంచి గంధారంలోకి చప్పున జారిపోతే కౌగిలిలోంచి జారిపోయిన సాకీలా 'ఘసిట్'. ఎంతకీ చల్లారని ఉద్రేకం. ఏదో ఆర్తి. ధ్వని తరంగాలు.... చెలియలికట్ట దాటే ఆవేశం 'మీండ్'. ఎక్కడ చూసినా ధ్వనే. ఉచ్ఛస్వరంలో మీండ్ ధ్వని. ధ్వని ధ్వని. ఝాలా. గది గోడల్ని కదిలించే ఝాలా. వేలు తీగమీద విలయతాండవం చేస్తూంది.

    వేలునుంచి జారిన ఒక్కో రక్తపు చుక్క తెల్లటి పైజామా మీద ఎర్రగా పడుతూంది.


                               3


    అక్కడి వాతావరణం అంతా అదోలా వుంది. అసలక్కడ 'గాలే' అదోలా ఫోజు కొడ్తూంది. అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. కానీ సగంమందికి పైగా ఏ పనీ చెయ్యటం లేదు. చేస్తూన్నట్లూ కనిపిస్తున్నారు. విలన్ సోఫాలో కూర్చున్నాడు. దూరంగా పెద్ద గుహ. ముళ్ళపొదలు.... తుపాకుల్లాంటివి పట్టుకున్న అసిస్టెంటు విలన్లు. సెట్ మీదకొచ్చి స్క్రిప్టు చూచుకుంటున్న డైరెక్టర్, వూరికే హైరానా పడిపోతున్న అసోసియేట్....

    "లైట్స్ ఆన్. నెంబర్ టెన్.... నెంబర్ ఫైవ్ అప్.... ఆఫ్.... లెఫ్ట్. ఆ-ఫిక్స్. ఎవర్రా అక్కడ? ఆ గుహలో ఫ్లవర్ వేజు ఏమిటయ్యా. ఆర్టు డైరెక్టరేడీ? ఆ -ఏదమ్మా ఒక్కసారి డైలాగ్ చెప్పు 'నా హృదయంలో బాధ తప్ప ఇంకేమీ లేదు కుమార్. కావాలంటే చీల్చిచూడు."

    "నా ఉదయంలో"

    "ఉదయం కాదమ్మా, హృదయం. హృ హృ - హృదయంలో బాధ తప్ప ఇంకేమీ లేదు కుమార్. కావాలంటే చీల్చిచూడు."

    "ప్రతి రక్తపు బొట్టు 'కుమార్, కుమార్' అని ఎలా ఆక్రోశిస్తాయో చూడు. పవిత్ర భారతదేశంలో.... ఆ అది తరువాత లాంగ్ షాటులో తీసుకుందాంలే. ఏదీ చెప్పమ్మా. ఆ-కరెక్టే! గ్లిజరిన్ వేసుకో. ఫాన్స్ ఆఫ్, లైట్సు ఆన్. బోయ్ హీరో గారేరి-"

    లోపల్నుంచి అసిస్టెంటు పరుగెత్తుకొచ్చేడు. "సార్. షూటింగ్ కాన్సిల్."

    డైరెక్టర్ మూర్ఛపడబోయి తమాయించుకొని "ఏం? ఏం?" అన్నాడు.

    "హీరోగారి కొడుక్కి మనవడు పుట్టేడని ఫోనొచ్చింది. మనల్ని స్వీట్లు తినమని ఆయన పోయారు."

    తెల్లగుడ్డ దొరక్క ప్రొడ్యూసరుగారు కెమేరా మీదవేసే నల్లగుడ్డ తలమీద వేసుకున్నాడు.

    చంద్రమూ, శంభు లేచి, ఏభై అడుగుల దూరంగా కూర్చొని జరుగుతున్న దానిని తత్వవేత్తలా గమనిస్తూన్న సినీ కవిగారి దగ్గరికి వెళ్ళారు.

    "నమస్తే"

    చిద్విలాసంగా సిగరెట్టు పీలుస్తున్న కవిగారు- ధ్యానసమాధి నుంచి కదిలి "నమస్తే" అన్నారు.

    "మా స్నేహితుడు, మిత్ర - శంభుమిత్ర."

    "నమస్తే"

    "మీరిప్పటికి ఎన్ని పిక్చర్లకి మాటలు వ్రాసేరు గురూ గారూ?" చంద్రం అడిగేడు.

    "ఏభై అయిదు."

    "చిన్న అనుమానం ఒకటుంది సార్."

    "ఒకటేమిటి నాయనా పది అడుగు."

    "దాదాపు మీరిప్పటికి ఏభై అరవై పిక్చర్ల దాకా మాటలు వ్రాసేరు కదా."

    "అవును కదా!"

    "ప్రతి సినిమాలోనూ హీరో హీరోయిన్లు తప్పకుండా అపరిచితులై వుండాలి కదా!"

    "ఔను కదా."

    "రెండో రీల్లో పరిచయం ఔతుంది కదా!"

    "మరంతే కదా."

    "కష్టాలొచ్చే వరకూ వాళ్ళు సరదాగా పార్కుల్లో తోటల్లో మాట్లాడుకోవాలి కదా!"

    "మరి మాటలాడుకోవాలి గదా".

    "ఆ కష్టాలనేవి ఇంటర్వెల్ దాటితే కానీ రావు గదా"

    "అంతేగదా."

    "అయితే కవిశేఖరా! కొత్తగా కలుసుకొనే ప్రేయసీ ప్రియులు మొదటిసారి ఏం మాట్లాడుకుంటారో మీరిప్పటివరకూ ఏభై అయిదుసార్లు ఫ్రెష్ గా ఊహించి వ్రాసేరు. ఇదిగో నా మిత్రుడు మిత్ర నామధేయుడు-కేవలం థియరీ తెలుసుకోదలచిన వాడు. ఒక ఉదాహరణ ఇవ్వండి" అని తన పని ఇక అయిపోయినట్లుగా మౌనం వహించాడు చంద్రం.

    కవిగారు సిగరెట్టు పీలుస్తూ తన ప్రపంచంలోకి వెళ్ళి పోయేరు. కళ్ళు అరమోడ్పులయ్యేయి. అయిదు క్షణాలు నిశ్శబ్దం తరువాత అడిగేరు.

    "హీరో ఎవరు?"

    మిత్ర ఉలిక్కిపడి, ఏదో అనబోతూ వుండగా చంద్రం అతణ్ణి ఆపుచేసి "ఎవరైతే ఏం వుంది. స్వామీ, పెద్ద హీరోగారే అనుకోండి" అన్నాడు.

    "హీరోయిను."

    "పెద్ద హీరోయినే అనుకోండి"

    కవిగారు గుండెలమీదనుంచి పెద్ద బరువు దించేసినవాడిలా తేలిగ్గా ఊపిరి పీల్చి - "అయితే ఇక మాటలెందుకూ?" అన్నాడు.

    ముందుకు వంగి కుతూహలంగా చూస్తున్న మిత్ర ఉస్సూరుమంటూ కుర్చీ వెనక్కివాలేడు. చంద్రం మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా- "పోనీ అప్పుడే ఫీల్డులో అడుగు పెట్టిన హీరో హీరోయిన్లనుకోండి" అన్నాడు.

    కవిగారు మళ్ళీ ధ్యానముద్రలోకి వెళ్లిపోయేరు. రెండు క్షణాల తరువాత తెరవకుండానే "లోకేషనెక్కడ?" అని అడిగేడు.

    "ఊటీ అనుకోండి" అన్నాడు చంద్రం ప్రోత్సాహమిస్తూ.

    "కలర్ పిక్చరా ? బ్లాక్ అండ్ వైటా?"

    "కలర్ అనుకోండి-"

    "అయితే పాటే బావుంటుంది" మరి ఆలోచించకుండా అన్నాడాయన.

    శంభు కుర్చీలోంచి లేచి "నేను పోతున్నాను" అన్నాడు.

    చంద్రం కూడా మరి తర్కించకుండా, అతడిని అనుసరించి బైటకొస్తూ "మరీ కమర్షియల్ లా వున్నాడు గురూ" అన్నాడు.

    శంభు మాట్లాడలేదు. విషయాన్నెలాగైనా తెలుసుకోవాలన్న సీరియస్ నెస్ కనబడ్తూంది అతన్లో.


                        *    *    *


    "కె అండ్ జె" లో శంభు ఏరియా సేల్స్ మేనేజర్. చదివింది బి.టెక్ ఐనా ఈ లైన్లో చేరగానే తన సామర్ధ్యం నిరూపించుకున్నాడు. ఆఫీసు కుర్చీలో కూర్చోగానే మిగతా విషయాలు మర్చిపోవటం అతని అలవాటు.

    అందుకే వున్నది కమర్షియల్ ఆర్గనైజేషన్ లోనైనా, బాగా నెగ్గుకు రాగల్గుతున్నాడు. అయితే అది కేవలం నెగ్గుకు రావటం కాదనీ, తన పని యాజమాన్యానికి బాగా నచ్చిందనీ నిరూపించే వార్త ఆ రోజు అతనికి తెలిసింది.

    "కంగ్రాట్యులేషన్స్ మిత్రా! నిన్ను సేల్స్ చీఫ్ గా ప్రమోట్ చేస్తూ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసింది."

    ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటూ "థాంక్స్ సర్" అన్నాడు.

    "నిజానికి లిస్టులో నువ్వు నాల్గోవాడివి. కానీ నీ ఏరియా సేల్స్ ఫిగర్స్ చాలా ప్రోత్సాహకరంగా వున్నాయి. ఒక సేల్స్ ఇంజనీర్ కి కావల్సిన లక్షణాలన్నీ నీకున్నాయి. ముఖ్యంగా కస్టమర్ ని ఆకట్టుకొని మాట్లాడే ఫ్లూయన్సీ."

    ఫ్లూయన్సీ. మాటలు. ఆకట్టుకొనే మాటలు. లక్షలు లక్షలు వ్యాపారం చెయ్యడానికి తోడ్పడే మాటలు. నిజమే. ఒక వస్తువు గురించి తను మాట్లాడటం మొదలు పెడితే అవతలవాడు కన్విన్స్ అవ్వల్సిందే. మరి అవేమాటలు అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి....

    తల విదిలించేడు.

    తన ఛాంబర్ లోకి వచ్చి కూర్చున్న రెండు నిమిషాలకి రీనా వచ్చింది.

    చెంపలమీద పడే జుట్టూ, ఎప్పుడూ నవ్వుతూ వుండే కళ్ళు, పెదవులకి పల్చగా లిప్ స్టిక్.

    "కంగ్రాచ్యులేషన్స్ సర్" అంది.

    "థాంక్యూ రీనా".

    వచ్చి ఎదుటి సీట్లో కూర్చుంది.

    "ఈ రోజు డిక్టేటు చెయ్యటానికి లెటర్స్ ఏమీలేవు."

    "ఓ.కే. సర్" నవ్వింది. "చాలా అదృష్టవంతులు మీరు."

    నిజమే- ఇరవై నాలుగేళ్ళకి కె అండ్ జె సేల్స్ చీఫ్ అంటే సామాన్యం కాదు-కానీ బాధ్యత. "నేను సేల్స్ చీఫ్ నయినా-జనరల్ మేనేజర్ నయినా నా పియ్యేగా నువ్వే వుండాలి. పరాంజపేకి చెప్తాను."

    "థాంక్స్ సర్!"

    రీనా పియ్యేగా వుంటే సగం పని, సగం బాధ్యత తగ్గిపోతాయి. చాలా నెమ్మదస్తురాలైన, తన పనిలో శ్రద్ధ వున్న అమ్మాయి రీనా.

    "జేమ్స్ ఏమంటున్నాడు?"

    ఆమె బుగ్గలో ఎరుపు.

    "బావున్నాడు సర్."

    "పెళ్ళెప్పుడు?"

    "సమ్మర్ లో"

    క్షణం నిశ్శబ్దం.

 Previous Page Next Page