Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 5


    "ఇంతకు ముందు కూడా ఇతడిలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన దాఖలాలున్నాయి."

    "నా ప్రశ్న అది కాదు ఇన్ స్పెక్టర్! ఇప్పుడు నేనిక్కడకు వచ్చింది మామూలు ప్రేక్షకురాలిగానే అయినా ఒక బాధ్యతగల సిటిజన్ గా అడుగుతున్నాను. బ్రతుకు నాది కాబట్టి నన్ను నేను అంతం చేసుకోవచ్చన్న థియరీని మీ ఐ.పి.సి. 309 ఎలా అంగీకరించదో, ఇల్లు నాది కాబట్టి తగల బెట్టుకునే హక్కు నాకుంది అని ఎవరన్నా సమర్ధించుకున్నా మీ చట్టం ఎలా ఒప్పుకోదో స్నేక్ షోస్ జయప్రదంగా చేశాడు కాబట్టి ఇదీ అలాగే ముగుస్తుందని మీరన్నా నేను అంగీకరించలేను. పైగా అక్కడున్నవన్నీ అతి ప్రమాదకరమైన స్నేక్స్... నౌ ఇట్స్ క్వశ్చనాఫ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ" ఆమె అక్కడే ఆగిపోలేదు. తాను నిలదీస్తున్నది మామూలు పోలీస్ అధికారిననిపించడంతో సరాసరి వెళ్ళి పోలీస్ కమీషనర్ కే ఫోన్ చేసింది...

    అప్పటికే పాముకాటు మూలంగా ఇద్దరు ప్రమాదకర పరిస్థితిలో వుండడంతో ఆమె హెచ్చరిక ఎంత బలంగా పని చేసిందీ అంటే కమిషనర్ వెంటనే 'షో' ఆపమని ఆదేశించారు. ఇదంతా జరగడానికి పట్టింది కేవలం ఒక గంట మాత్రమే. స్నేక్ ఎగ్జిబిషన్ ఆపించడంతో బాటు హైద్రాబాద్ జూ అధికారులు ఎక్స్ పర్ట్స్ ని పంపి పాముల్ని కేజ్ లో పేక్ చేయించి కలెక్ట్ చేసుకుపోయారు.

    ఇదంతా పూర్తయ్యేదాకా శృతి అక్కడే వుంది.

    చివరగా ఆమె కారెక్కబోతుంటే వినిపించింది. "నా పేరు జయేంద్ర."

    తలతిప్పి చూసిన శృతి కొన్ని క్షణాలదాకా మాట్టాడలేకపోయింది. ఇందాక పాముల మధ్య కూర్చున్న యువకుడతను. ఆమె చేసిన నిర్వాకమే అని అప్పటికే తెలుసుకోగలిగాడు. "మీకు తెలీదు. మీరు చేసిన పొరపాటు."

    "వాట్ డూ యూ మీన్?"

    "కోరి ఓ పాము పుట్టలో వేలు పెట్టారు..." ఆమెనే ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు.

    అతడి చూపుల్ని తట్టుకోలేకపోయింది. అవి ఎక్కడో స్పృశిస్తున్నవనిపిస్తుంటే...స్థిరంగా అందామె. "నేను చేసింది మీ మంచికే!"

    "ఐసీ" నిశ్చలంగా అన్న జయేంద్ర నేత్రాల్లో ఓ కళింగనాగు కళ్ళలోని మెరుపులు ప్రతిఫలిస్తున్నాయి. "దీన్ని మీరు ఒక మంచిపనిగా డిఫ్లెన్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. గెట్ రెడీ...చాలా త్వరలో మీకూ ఇలాంటి మంచే జరగబోతోంది. యు ఇర్ గోయింగ్ టు ఎక్స్ పీరియన్సివ్ వెరీ షార్ట్ లీ"

    ఒక పాము బుసలాంటి నిట్టూర్పు వినిపించింది.

    ఇప్పుడామె అప్రతిభురాలైంది, జయేంద్ర చదువుకున్నవాడూ అని తెలిసి మాత్రమే కాదు. అంత మృదువుగా వినిపించిన అతడి హెచ్చరికలో గుండె చెదిర్చే ప్రమాదం అస్పష్టంగానైనా స్పష్టమౌతోంది.

    శృతి తేరుకొని ఏదో అనబోయింది.

    కాని, అప్పటికే అతను ఒక ఋషిలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

    స్టీరింగ్ పట్టుకొన్న శృతి చేతులు సన్నగా వణికాయి...ఇందాకటి అతడి చూపులు గుర్తురాగానే.


                       *    *    *    *


    "డేమిట్...!"

    రహస్య సమావేశాన్ని ప్రారంభించబోతున్న డిజిపి చేతిలో రిసీవర్ నేలపైకి జారింది. ఓ అరక్షణం క్రితమే ఇందాక పాము మూలంగా కాటు వేయబడ్డ ఇద్దరు కానిస్టేబుల్స్ లో ఒకరు మరణించినట్లు హాస్పిటల్ నుంచి తెలియజేయబడింది. ఆందోళనగా ఆయన్ని చేరుకున్న కమీషనర్ తో స్వప్నంలోలా చెప్పాడు.

    ప్రత్యర్ధి మొదటి గెలుపు తనపైవే సాధించాడు.

    అయిదు పదులు వయసు దాటిన డైరెక్టర్ జనరలాఫ్ పోలీస్ ఎంతగా ఆందోళన చెందుతున్నదీ ఆ సమావేశంలో అతడికభిముఖంగా కూర్చున్న పోలీసు ఉన్నతాధికారులంతా సునాయాసంగానే గ్రహించారు.

    "ఫ్రెండ్స్!" కర్చీఫ్ తో నుదురు రుద్దుకుంటూ తన సీటులో కూర్చున్నాడు డిజిపి. తేరుకోవడానికి రెండుక్షణాలు పట్టింది. "సరిగ్గాపన్నెండు గంటల క్రితం మన ఇంటలిజెన్స్ వింగ్ ఈ బ్లాక్ మాంబా ముఠా సాగించబోయే మారణహోమం గురించి సమాచారాన్ని సేకరించింది. అది చర్చించాలనే ఈ రోజు, ఇక్కడ మీ అందర్నీ సమావేశ పరుస్తుండగా ఒక సంఘటనతో మన డిపార్ట్ మెంట్ వ్యక్తినే బలి తీసుకుని బాహాటంగా తన యుద్ధాన్ని ప్రకటించింది. బ్లాక్ మాంబా ముఠా...ఈ ముఠా వెనుక వున్న వ్యక్తులెవరో, ఏం సాధించాలని ఈ టెర్రరిజానికి పూనుకున్నారో వూహకందని విషయమైనా ఒక్క విషయం మాత్రం చెప్పగలను." ఓ క్షణం ఆగాడు. "ప్రపంచ దేశాలు ఇంతవరకూ ఎదుర్కొంటున్న టెర్రరిజంలో ప్రజల్ని బలిగొన్నది మారణాయుధాలే అయితే ఈ ముఠా అతి ప్రమాదకరమైన సర్పాలతో మహాయజ్ఞాన్ని ప్రారంభించి అందులో సామాన్యుల్ని పొట్టన పెట్టుకోబోతున్నట్టు నాకు స్పష్టమౌతోంది. అదే నిజమైతే..." గగుర్పాటుతో ఆగిపోయారాయన. "జంటనగరాల ప్రజలు చాలా స్వల్పవ్యవధిలో, విషవలయంలో చిక్కుకుని ముందెన్నడూ అనుభవంకాని క్లిష్ట పరిస్థితిని చేరుకుంటున్నట్టే. ఇట్స్ ఏసెన్స్ ట్రిమిటీ ఇన్ టెర్రరిజం...ఇక్కడ ప్రత్యర్ధుల టార్గెట్ ఖచ్చితంగా ఎవరూ అన్నది నాకు బోధపడటం లేదు" నిట్టూర్చుతూ అందరివైపూ చూశారు. ఆ హాల్లో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం....

    "హత్యలూ, దోపిడీలూ వంటి నేరాల్ని పరిశోధించడం మనకి కొత్తగాదు. కొన్ని నెలల క్రితం అంతరాష్ట్రీయ దొంగల ముఠా మూలంగా జంటనగరాల చీకటి పడగానే ఎలాంటి టెన్షన్ తో అట్టుడికి పోయిందీ మన డిపార్టుమెంటుకి తెలిసిన విషయమే. ఈ సమస్య అలాంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యవసానం ఎలా వుండేదీ మనం సైతం ఊహించలేని విపత్కర స్థితి ఇది. సో..." డిజిపి చెప్పాలనుకున్నదింకా పూర్తి కాలేదు.

    ఓ సబ్ ఇన్ స్పెక్టర్ దూకుడుగా లోపలికి ప్రవేశించాడు... మామూలుగా అయితే ఎలాంటి విషయమైనా 'ఇంటర్ కం' లో డిజిపి కి తెలియపరచబడేది. అదీ కానినాడు అనుమతి కోసం పియ్యే అడిగి వుండేది.

    "సర్!" అటెన్షన్ లో నిలబడ్డ యస్.ఐ. యూనిఫారం అప్పటికే సగం చెమటతో తడిసిపోయింది. సిటీలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా సరాసరి తన నోటీస్ కి రావాలని ఓ గంటక్రితమే వైర్ లెస్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకీ ఆదేశాలు పంపబడ్డాయి.

    "రాజేంద్రనగర్ జూకి స్నేక్ షోనుంచి తరలించబడుతున్న పాముల పార్శిల్ అపహరించబడింది..."

    "వ్వాట్?" డిజిపి అలర్టయిపోయాడు విస్మయంగా.

    "యస్ సర్! ఓ గేంగ్ జూ వేన్ పై ఎటాక్ చేసి డ్రైవర్ని షూట్ చేసి చంపారు. అక్కడ ఈ లెటర్ మాత్రం..."

    ఉద్వేగంగా ఆ కాగితాన్ని అందుకున్నాడు డిజిపి.

    "డియర్ పోలీస్ డైరెక్టర్ జనరల్...మా యజ్ఞం ప్రారంభమైన గంటల వ్యవధిలో మాకు కావాల్సిన అస్త్రాల్ని ఇలా అందించినందుకు కృతజ్ఞుణ్ణి. పట్టపగలు నడిరోడ్డుమీద వేన్ పై దాడిచేసి ఈ పార్శిల్ మేం పట్టుకుపోతున్నామంటే 'బ్లాక్ మాంబా' గట్సేమిటో యిప్పటికైనా మీకు అర్ధమై ఉంటుంది. మీరెంత బలమైన పథకాలు వేసుకున్నా ఈ సంగ్రామంలో చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతారు. తప్పదు. మీ నిస్సహాయతకి జాలిపడుతూ..."బ్లాక్ మాంబా"

    "బాడ్ డే సన్నాఫె బిచ్" మరో ఛాలెంజ్ ని విసిరినా బ్లాక్ మాంబా పొగరు ఆయన్ని ఉన్మాదిగా మార్చినట్టు అసహనంగా పిడికిలితో టేబిల్ పై గుద్దాడు. కొన్ని క్షణాల క్రితం తను అన్నది నిజంగా కాబోతున్న సత్యానికి సాక్ష్యంలా వున్న ఉత్తరాన్ని చూస్తూ ఆయనెంతగా నలిగిపోయాడూ అంటే స్థిరంగా ఇక కూర్చోలేనట్టు ఆవేశంగా పైకి లేచాడు.

    శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏనాడూ విశ్రమించని ఒక పోలీస్ అధికారిగా కర్తవ్య దీక్షలో వెనుకడుగు వేయడం చాతకాని వ్యక్తిగా ఇప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

    అసాధారణమైన పోరాటం మొదలైంది. బహుశా ప్రపంచంలో ఏ మూల ఏ రక్షక దళం ఎదుర్కోని చిత్రమైన పరిస్థితులకి ఇక్కడ ఇప్పుడే అంకురార్పణ జరిగిపోయింది. అజ్ఞాతంగా వ్యవహరిస్తూ జంట నగరాలకు 'నైట్ మేర్' కాబోతున్న ఒక ముఠాని కనీసం ముఠాలో ఒకడ్ని సాధ్యమైనంత త్వరలో చేజిక్కించుకుంటే తప్ప ఈ సంగ్రామం ఆగదు. ముందు ప్రజలకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వాలి...విజిలెన్స్ ఉధృతం కావాలి. శలవుల్లో వున్న ఆఫీసర్లని వెనక్కు రప్పించి ప్రతి క్షణమూ నిర్విరామంగా పోరాడాలి. ఆ పోరాటాన్ని క్రమబద్ధంగా నడపటానికి ఓ ప్రత్యక్షమైన స్క్వాడ్ ని ఏర్పాటు చేయాలి.

    "మిస్టర్ ప్రసన్నా!" ఉద్విగ్నంగా చూశాడు ప్రసన్నవైపు. "యు ఆర్ గోయింగ్ టు హేండిల్ ది స్పెషల్ స్క్వేడ్...మన డిపార్ట్ మెంటుకి ఓ సవాల్ గా మారిన ఈ సమస్యని మీకు అప్పచెబుతున్నాను..."

    సాహసానికి మరో పేరుగా ప్రఖ్యాతి గాంచిన డిసిపి ప్రసన్న తన ఆమోదాన్ని తెలియపరుస్తూ అటెన్షన్ లో నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడు ఇంటర్ కమ్ బజర్ మోగింది.

    "సర్." ఇంటర్ కామ్ లో మార్గరెట్ కంఠం వినిపించింది. "మిస్టర్ శివానంద్ యీజిన్ లైన్ సర్"

 Previous Page Next Page