Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 5


    తల తిరిగిపోయింది భాగవతార్ కి. గొంతు ఎండుకు పోయినట్టే గటగట కాఫీ తాగబోతే నాలిక చుర్రుమని చేతిలో కప్పు కిందెత్తేసాడు.
    "ఇవాళ ప్రొద్దున్న మనింటికెవరేనా వచ్చారా?" వంటమనిషిని అడిగాడు భాగవతార్.
    వచ్చారన్నట్లు తలూపింది.
    "మగవాళ్లేనా?" మళ్ళీ అడిగాడు.
    మళ్ళీ తలూపింది ఔనన్నట్లు.
    అనుభవం మీద భాగవతార్ మాటలకి సమాధానం చెప్పడం కంటే తలూపడమే మేలని గ్రహించింది. ఎందుకంటే మాటలతో సమాధానం చెపితే తన మనసులో వున్నదానికి భిన్నంగా సమాధానం వచ్చినప్పుడు చిరాకుపడిపోయి ఏదో వంకతో నోటికొచ్చినట్లు తిట్టేస్తాడు. తలూపితే ఆ ఊపడాన్ని తన మనసులో భావానికి అనుగుణంగా అన్వయించుకొని తనే ప్రశ్నలేసుకుని - తనే సమాధానాలు చెప్పేసుకుంటాడు.
    "తెల్లగా పొడుగాటి గౌను వేసుకుంటాడు ఆ మింగియారా?"
    మళ్ళీ ఔనన్నట్లు తలూపింది.
    "తెల్లటి పాంట్ షర్టు వేసుకుంటాడు అనంగా?"
    ఔనన్నట్లు తలూపింది.
    "ఏయ్ నిజం చెప్పు. వచ్చిందెవరు? అబద్దాలాడేవంటే పోలీసుల కప్పగించి జైల్లో పెట్టిస్తాను."
    ఈ మాటలకి వంట మనిషి భయపడలేదు. ఎందుకంటే జైల్లో పెట్టిస్తాననడం అతడికో ఊతపదం లాంటి బెదిరింపు.
    పైట కొంగు నడుంలో దోపుకొని ఒక అడుగు ముందుకేసి, "ఏంటండి! మీ యింటికెవరొచ్చారో ఎవరు పోతారో నాకెలా తెలుస్తుంది. వచ్చినాళ్ళు నన్ను కాఫీ పట్రా, టీ పట్రా అంటారేగాని ఊరూ పేరూ చెప్తారా. అడిగితే మీరూరుకుంటారా? జైల్లో పెట్టిస్తారా? ఎందుకొచ్చిందిగాని మా ఇంటికి నే పోతాను. అమ్మగారొచ్చాక మీరిట్టా విసిగిస్తున్నారని చెప్పి జీతం డబ్బులు పట్టుకుపోతా! సాంబారు మరుగుతోంది తాళింపేసుకోండి. కుక్కర్లో అన్నం వుంది. ఉడగ్గానే స్టౌ ఆర్పుకోండి. నేపోతన్నా" చర చర వీధి గుమ్మం దగ్గిరకెళ్ళిపోయింది. భాగవతార్ ఖంగారుపడిపోతూ వంటమనిషి వెనకాలే వెళ్ళి తలుపు తెరవబోతున్న ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకుని, "ఉండుండు వెళ్ళకు. ఇది తీసుకో," అంటూ పదిరూపాయల నోటు, దాని చేతిలో పెట్టబోయాడు. 
    వంటమనిషికి యాభై యేళ్ళు, తల మూడువంతులు నెఱసింది, ఎత్తు పళ్ళు, మొహం మీద మశూచికం మచ్చలు.
    ఆవిడ భాగవతార్ చెయ్యి విడిపించుకుని ఎడంగా జరిగి, "ఛ. ఛ. ఇవేం బుద్దులయ్యా! ఏదో మర్యాదస్తుల యిల్లని చేరాను. ఇంట్లో భార్య లేని సమయం చూసుకుని నా చెయ్యి పట్టుకుంటావా? పైగా పది రూపాయలు చేతిలో పెడతావా? ముష్టి పదిరూపాయలు. అమ్మగారితో చెప్పి జైల్లో పెట్టిస్తాను" అని విరుచుకుపడింది
    కొయ్యబొమ్మ అయిపోయాడు భాగవతార్. అతడి ఊహకందని సంఘటన ఎదురైనప్పుడు మాట్లాడలేడు. కొన్ని నిముషాలు గడిచాక వంటమనిషి చెయ్యి జాపి "యాభై రూపాయలు యియ్యి" అంది.
    తెప్పరిల్లి ఈ లోకంలోకి వచ్చాడు భాగవతార్, ఛీదరించుకుంటూ, "పో పో!" అన్నాడు. వంటమనిషి పోకుండా, ముప్పై" అంది.
    "పోతావా మెడబెట్టి గెంటమంటావా?"
    "అమ్మగారికి వంట రాదు. నా వంట తప్ప ఆవిడ తినలేరు. మీ యిష్టం.  పొమ్మంటే పోతాను. నేనెందుకు మానేసానని అమ్మగారడుగుతే "నేను బలాత్కారం చేస్తే భరించలేక వెళ్ళిపోయింది." అని చెప్పండి. ఎందుకంటే నేనెలాగు చెప్తాను. మీరో మాట నేనో మాట చెపితే బాగుండదు కదా మరి" తెల్లబోయిన భాగవతార్ ఒక నిముషం నోరు తెరచి మళ్ళీ మూసుకుని, పది రూపాయలనోటు ఆవిడమీదికి గిరాటేసి "లోపలికి పో" అన్నాడు కంపరంగా, తిప్పుకుంటూ వంటగదిలో కెళ్ళిపోయింది వంట మనిషి.
    స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు భాగవతార్. ఆకలితో కడుపు నకనకలాడుతోంది. అంత కాండ జరిగాక వంటమనిషిని టిఫిన్ కావాలని అడగలేకపోయాడు. ఆవిడంత ఆవిడ పెడితే తినేవాడేకాని ఆవిడ భాగవతార్ మొహం చూడలేనట్లు - భాగవతార్ ఏదో మహాపరాధం చేసినట్లు అతన్ని చూడగానే మొహం తిప్పుకొంటోంది. ఆ గొడవ పడలేక ఆకలి కడుపుతోనే బయటికి నడిచాడు. ఏదేనా హోటల్ కి వెళదామనుకున్నాడు మొదట, కాని తొందరగా మృదుల యెక్కడికెళ్ళిందో తెలుసుకోవాలి. వీలైతే రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలి. ఆ రోజు డైవర్ సెలవడిగితే యిచ్చేసాడు. అందుకని కారు తనే డ్రైవ్ చేసుకుంటూ మొదట మింగియార్ ఇంటికి బయలుదేరాడు. సరూర్ నగర్ దాటాక సిటీ ఔట్ స్కర్ట్స్ లో వుంది మింగియార్ బస చేస్తున్న బంగళా. అక్కడంతకు ముందే ఎవరో సన్యాసి శిష్యులతో వుంటున్నాడట. మింగియార్ కూడా వాళ్ళతో కలిసి వుంటున్నాడు. వీళ్ళంతా కలిసి ఏవో పూజలు చేస్తారని చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పుకుంటారు. మింగియార్ ఇంటిముందు అప్పటికే ఎన్నో కార్లు, స్కూటర్లు పార్క్ చేసి వున్నాయి.
    "ఈ ఇంట్లో ఏదేనా పార్టీయా?" అనుకున్నాడు భాగవతార్. కారుని ఇంటికి కొంచెం దూరంలో పార్క్ చెయ్యవలసి వచ్చింది చోటు లేక. కాలింగ్ బెల్ నొక్కాడు. నౌకరు తలుపు తెరిచాడు. హాలు ఖాళీగా వుంది.
    "కూర్చోండి" అన్నాడు నౌకరు.
    కూర్చుని చుట్టూ చూస్తూ, "ఎవరూ లేరా?" అడిగాడు భాగవతార్. నౌకరు మాట్లాడలేదు.
    "మింగియార్ గారు లేరా?" మళ్ళీ అడిగాడు.
    నౌకరు అనుమానంగా చూస్తూ "మీరెవరు" అన్నాడు.
    "మృదుల...." అని ఆగిపోయాడు భాగవతార్.
    "మృదుల భర్తని" అని చెప్పబోయాడు. ఎందుకంటే మింగియార్ మృదుల ద్వారానే పరిచయమయ్యాడు. ఇంటికొచ్చినా మృదులతోనే ఎక్కువగా మాట్లాడేవాడు.
    తనొక పెద్ద సంగీత విద్వాంసుడు. మరొకరి భర్తగా పరిచయం చేసుకోవటం అవమానంగా తోచింది. నౌకర్లో గమ్మత్తెయిన మార్పు కనిపించింది. అతడొక్క మాట మాట్లాడకుండా ముందుకు కదిలి గోడకి అల్మారాలా కనపడుతున్న ఒక తలుపు తెరిచి లోపలికెళ్ళమని సౌంజ్ఞ చేశాడు. భాగవతార్ లోపలికడుగు పెట్టగానే తలుపు మూసుకుపోయింది. డిమ్ గా వుంది లోపల లైటు దిగువన మెట్లున్నాయి. భాగవతార్ ఆశ్చర్యపడుతూ మెట్లు దిగి కిందికెళ్ళాడు. కింద విశాలమయిన హాలు, అక్కడ ఆడ మగ చాలామంది సర్క్యులర్ గా కూర్చుని వున్నారు. ఆడవాళ్ళ ముఖాలకి మేలి ముసుగులు, మగవాళ్ళ కళ్ళమీద నల్ల గుడ్డలు వున్నాయి. ఎవరు మట్టుకువాళ్ళే తమ ముఖం ఎదుటివాళ్ళు గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లున్నారు. బిత్తరపోయి వాళ్ళందరినీ వింతగా చూడసాగాడు. కళ్ళచుట్టూ నల్లటి గుడ్డ కట్టుకున్న పొడుగాటి వ్యక్తి భాగవతార్ ముందుకొచ్చి_
    "ఎవరు మీరు? ఇక్కడికెలా వచ్చారు?" అన్నాడు కరుగ్గా.
    "ఈయన నాకు తెలుసు" అలాగే కళ్ళకి గంతలు కట్టుకున్న మరో పొడుగాటి వ్యక్తి అన్నాడు.
    "మీరు రమ్మన్నారా ఈయనని" మొదటివ్యక్తి అడిగాడు.
    "లేదు, లేదు. ఎందుకొచ్చాడో? ఎలా వచ్చాడో నాకూ అర్ధం కావడంలేదు. అయితే యివాళ నేను ఏర్పాటుచేసిన మన పాస్ వర్డ్ యీయన భార్యపేరు."
    ఉలిక్కిపడ్డాడు భాగవతార్. విదేశీయుడు_ముసుగుల్లో గుమికూడిన మనుష్యులు_ గదిలో_ బయటికి కనిపించని రహస్య ద్వారం_ పాస్ వర్డ్_ మృదుల పేరు వీళ్ళంతా ఎవరు? గూడచారులా?_ గాంగ్ స్టర్సా_ స్మగ్లర్సా_ వీళ్ళతో మృదుల ఎలా కలిసింది_ ఆ పేరునే పాస్ వర్డ్ గా ఉపయోగించేటంత ప్రాముఖ్యం యీ గ్రూప్ లో మృదులకుందా?
    "నేను మృదుల భర్తని" అని చెప్పబోయి "మృదుల...." అని ఆగిపోయాడు. అందుకే తలుపులు తెరుచుకున్నాయి. లేకపోతే ఇలాంటి రహస్య లోకం ఒకటి వుందని తనకి తెలిసేదేకాదు.  
    "వీళ్ళంతా ఎవరు?" శాసిస్తున్నట్లు అడగాలనుకున్నాడు. కాని గాంగ్ స్టర్స్ యేమోనన్న అనుమానంతో గొంతు వొణికి బెదురుతున్నట్లు వచ్చాయి మాటలు.
    రెండోసారి మాట్లాడిన పొడుగాటి వ్యక్తి ముందుకొచ్చి చనువుగా భాగవతార్ భుజంమీద చెయ్యి వేశాడు. అతని ముఖంలోకి చూడాలనుకొని నల్లని గంతలు కట్టిన కళ్ళవైపు చూడ్డానికి భయంతోచి ముఖం తిప్పుకున్నాడు.
    "వీళ్ళంతా ఎవరో నేను మీకు చెప్పలేను. మాలో మాకే ఎవరెవరో తెలియదు. ఐయామ్ సారీ!" అన్నాడు కళ్ళగంతల మనిషి.
    "ఇదంతా దేనికీ_ ఇంత రహస్యంగా సమావేశం కావలసిన అవసరమేమొచ్చింది."
    "రహస్యమని మీరే అంటున్నారుగా. అందరికీ చెప్పేదైతే రహస్యమెందుకవుతుంది?"
    "నా భార్య ఇక్కడుంది గనక, మీ అందరి వివరాలు తెలుసుకునే అధికారం నాకుంది."
    "మీ భార్యా? _ అంటే మృదులగారా? ఆవిడిక్కడున్నారని ఎవరు చెప్పారు మీకు?"
    "మీ పాస్ వర్డ్ - మృదుల...."
    "అదా_ మేమూ రోజూ ఒక కొత్త పాస్ వర్డ్ కాయిన్ చేస్తూంటాము. నిన్న సాయంత్రం మృదులగారిని హాస్పిటల్ లో చూసాను. ఆ పేరు గుర్తుండి అదే యివాళ పాస్ వర్డ్ గా చేసుకున్నాము. అంతేగాని మృదులగారికి మా సంఘానికి ఏ సంబంధం లేదు."
    "నిన్న సాయంత్రం మృదులని హాస్పిటల్ లో చూసారా? అక్కడికెందుకెళ్ళింది?"
    "సారీ! ఆవిడ వ్యక్తిగత విషయాలు నాకు తెలియవు. అడిగే అలవాటు లేదు."

 Previous Page Next Page