"నువ్వు ఈలవేయడం తప్పుకాదు. నేను నిన్ను చెప్పుతో కొట్టడం చాలా పెద్ద తప్పు" అన్నఃది కోమలి మళ్ళీ.
కొండల్రావు ఇంకా ఆమె వంకనే చూస్తున్నాడు.
"నాది కొంచెం దుడుకు స్వభావం. ఏదైనా అంటే చాలు మా అన్నయ్యనీ ఇలాగే కొట్టేస్తాను. వాడితే కోపగించుకోడు. నిన్నెప్పుడూ నీ చెల్లెలు ఇలా కొట్టలేదా? కొడితే నీకు కోపం వచ్చేదా?" అన్నది కోమలి.
కొండల్రావు చటుక్కున "నాకు చెల్లెళ్ళు లేరు" అన్నాడు.
"అయితే ఈ రోజునుండీ నేను నీ చెల్లెల్ని" అన్నది కోమలి.
కొండల్రావు కనులు చెమ్మగిల్లాయి. అతడు జేబులోంచి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. వాటం చూస్తే అతడేదో చెప్పబోయేలా ఉన్నాడు. నేనుపూర్తిగా వినే మూడ్ లో ఉన్నాను.
కొండల్రావు చెప్పింది వింటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
అతడు మమ్మల్నిద్దర్నీ ప్రేమికులమని అనుకుంటున్నాడు.
చాలామంది ప్రేమికులకు ఆలోచన ఉండదు. అనవసరపు టావేశాలకులోనై తమ జీవితాలను నాశనం చేసుకున్న వారెందరో ఉన్నారు.
తన ప్రియురాలి మీద ఓ ధూర్తుడు ఆవేశపడితే ఆ ధూర్తుడినింకా రెచ్చగొడతాడు. అందువల్ల నష్టం ఎవరికీ? ధూర్తుడు ప్రియురాలిని మరింతగా అవమానిస్తాడు. ప్రియురాలిక్షేమంకోరే ప్రియుడు ధూర్తుడిని మంచిచేసుకుంటాడు తప్పితే రెచ్చగొట్టడు. నేను నా కెదురయ్యే అవమానాలన్నింటికీ తలవంచి నా ప్రియురాలిని కాపాడాలనుకున్నాను. ఇది కొండల్రావును కదిలించింది.
ఆ తరువాత...సాధారణంగా ఆడపిల్లల్లో పిరికితనం వుంటుంది. నడిరోడ్డుమీద కొండల్రావు వంటివాణ్ణి చెప్పు దెబ్బ కొట్టగలిగిన అమ్మాయికి ఆత్మాభిమానం, అసహ్యం, అహంకారం చాలా ఎక్కువగా ఉండి ఉండాలి. అటువంటి పొగరుబోతు పిల్ల తను చేసింది తప్పు కాకపోయినా తప్పు అని ఒప్పుకుని క్షమార్పణ వేడుకున్నది. ఎందుకని? ప్రియుడిపైన ప్రేమతో...
ప్రేమ ఎంత బలమైనది....ప్రేమలో ఎంతటి విశేషమున్నది?
తానింతవరకూ ఎవరి ప్రేమకు నోచుకోనందుకు కొండల్రావు బాధపడ్డాడు. తనను చూసి రెండుమార్లు ఈలవేసిన ధూర్తుడిని ప్రియుడి తృప్తి కోసం అన్నా అని పిలువగలిగిన ఆమె ప్రేమ గొప్పతనం వర్ణనాతీతం.
...ఈ రోజునుంచీ నువ్వు నా చెల్లెలివి. నీకు నా సహాయంలభించింది. నీమీద ఈగనైనా వాలనివ్వను" అన్నాడు కొండల్రావు. "ఈరోజు నాకు సుదినం కలకాలం వుంటాను. మీవంటి ప్రేమికుల మధ్య ఎంతోసేపు వుండటం నా కిష్టం లేదు."
కొండల్రావు వెళ్ళిపోయాడు.
ఏం చేయాలో తోచలేదు. ఉన్నట్లుండి నేను మూగవాడినైపోయాను. కొండల్రావు నన్ను ప్రేమికున్ని చేసేసిఅక్కణ్నుంచి తప్పుకున్నాడు.
ఏం చేయాలో తోచక కోమలివంక చూశాను. తనకు వస్తున్న నవ్వును పళ్ళబిగువున ఆపుకుంటున్నది. ఎంత అందంగా ఉన్నదో" అనిపించింది నాకు.
ఆమెతో ఏం మాట్లాడాను?
కొండల్రావు నన్ను ప్రేమికుడ్ని చేసినా ప్రేమికుడిలా వుండే ఉదేశ్యం నాకు లేదు. నేను బీయస్సీ రెండో సంవత్సరం చదవుతున్నాను. నా చదువు పూర్తి కావడానికింకా కాలం పడుతుంది. చదువు తర్వాతనే ప్రేమ...
కోమలి కూడా ఏమీ మాట్లాడటం లేదు, మాటలలో నా కంటే ఎంతో తెలివైనది కొండల్రావుతో ఎంత చక్కగా మాట్లాడింది.
కానీ ఆమె ఆడపిల్ల...ముందుగా తనే సంభాషణ ప్రారంభిస్తుంది!
నా యింట్లోనో, వాళ్ళింట్లోనో అయితే వేరు.అక్కడ ఏ పత్రిక గురించో, వంకాయకూర గురించో సంభాషణ ప్రారంభించేయవచ్చు. ఇక్కడలా కుదరదు. ఇలా ఆమె, నేను ఒంటరిగా మయూరా గార్డెన్స్ లో కలుసుకుంటామని నేను అనుకోలేదు.
"వచ్చిన పనయింది. ఇంకా లేద్దామా?" అన్నాను ఏమనాలో తెలియక.
"ఇంట్లో ఆరున్నర దాకా రానని చెప్పాను" అన్నది కోమలి.
టైము చూశాను అయిదుంపావయింది.
కోమలి భావం నాకు అర్ధమయింది. ఆమెకు ఇంకా ఇక్కడే ఇలా కూర్చోవాలని ఉన్నది. నా మనసులో రవంత గర్వం కలుగక పోలేదు.
"అయితే ఏం చేద్దాం?" అన్నాను.
"ఏం చేస్తాం- కబుర్లు చెప్పుకుందాం!" అన్నది కోమలి.
"కొండల్రావు మనచుట్టూ చాలాకధ అల్లాడు" అన్నాను.
"ఇందులో అతడు అల్లినదేముంది? అంతా ఉన్నదే"
నేను ఆశ్చర్యంగా "నీకు మతివున్నదా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా?" అన్నాను.
"ఈ వ్యవహారంలో నీవెందుకు జోక్యం చేసుకోవాలి? నేనేమైపోతే నీకెందుకు? కొండల్రావు నన్నేంచేస్తే నీ కెందుకు? ఏ భావన నిన్ను కొండల్రావుతో మాట్లాడేలా చేసిందో దాన్నే ప్రేమ అంటారు" అన్నది కోమలి.