"మృదువుగా నవ్వింది సుధ. "మన అందంగానీ ఆరోగ్యంగానీ కాపాడుకోగలిగేది మనమే. డాక్టర్లు కాదు."
రమాదేవి ముడతలు పడ్డ నడుంవైపు పెద్ద పొట్టవైపు చూస్తూ చెప్పింది సుధ" రాత్రి నిద్రపోయేముందు ఆవనూనె పొట్టకి సున్నితంగా మర్దన చేయండి. ఆహారంలో కొవ్వు పదార్దాలు తగ్గించండి. ఆవునెయ్యి, అవుపాల తేనే, మజ్జిగ, ఉలవచారు, నిమ్మరసం, పండ్లరసాలు, పచ్చికూర గాయల రసాలు, లేక ముక్కలు ఎక్కువగా తీసుకోండి. దానితో పొట్ట తగ్గడం ఒక్కటే కాదు. బాడీ మొత్తం నాజూకుగా తయారవుతుంది."
"ఆ తర్వాత మిస్ సుధ అరవైలో కూడా ఇరవై లా వుండి సుఖ సంసారం, రతి సౌఖ్యం, పొందడానికి ఏమేం తినాలో చెబుతుంది" అంది కమలాదాసు సుధవైపు ఎగతాళిగా చూస్తూ.
సుధ పట్టించుకున్నట్లు లేదు.
"ఆయుర్వేదంలో శాశ్వత యౌవ్వనానిక్కూడా మార్గాన్ని చూపించింది కమలాదాసుగారూ..... మనల్ని నిర్దేశించేది మన తిండి" నిశ్చలంగా చెప్పుకుపోతోంది.
"ఆపిల్, అరటిపళ్లు, ద్రాక్ష, ఖర్జూర, కిస్ మిస్, కరక్కాయ, ఉసిరికాయ, తాటికాయలాంటి ఫలాలు, దానిమ్మ, రావి, మునగకాయలు సైంధవ లవణం, వెల్లుల్లి, నీరుల్లి. శొంఠి. మెంతికూర, మునగపువ్వు,మునగ ఆకు, బొబ్బట్లు, బూడిదగుమ్మడి కాయ, బెల్లం, నువ్వులు, దోసకాయ, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ చూర్ణం, అతి మధురం చూర్ణం, పాలతో తేనెతో తీసుకోవాలి."
"హమ్మయ్య" ఊపిరి పీల్చుకుంది కమలాదాసు.
"చాలా పెద్ద లిస్టు చెప్పారు మిస్ సుధా. అసలు ఆయుర్వేదంలో మీకింత పరిజ్ఞానం ఎలా అబ్బిందో చెపుతారా, ఇదంతా పత్రికల పరిజ్ఞానమేనా?"
"లేదు మేడమ్!" సుధ క్షణం ఆగి "నేను ఆయుర్వేదానికి చెందిన మెడికల్ కాలేజీలో లెక్చరర్ ని" అంది అందరికీ షాకిచ్చినట్టుగా.
మంచినీళ్ళు తాగుతూ పొలమారింది రమావేదికి.
కమలాదాసు మొహం తెల్లబోయింది. "అంటే రుత్వితో పోటీపడగల వ్యక్తి అన్నమాట"
"పెళ్ళయి పిల్లలున్న నాకు రుత్విలాంటి యువకుడితో పోటీ పడాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం నిజం" కేజువల్ గా అంది సుధ. "రుత్వి ఎడ్యుకేషన్ దృష్ట్యా కంప్యూటర్ ఇంజనీర్ అయినా ఆయుర్వేదంలో అతడికున్న తెలివి అపారం, అమోఘం."
విజూష ఉద్విగ్నంగా చూసింది.
ఒక సభ్యత, సంస్కారంగల స్త్రీ రుత్విని అభినందిస్తుంటే విజూష శబ్దం మలిచిన నిశ్శబ్దమైంది. మనసు చీకటి కాగితాన్ని మోపే కాలమై గాలికి గాలమై అనంత గళమై, అవ్యక్త యుగళమై విశ్వాసపు రాపిడిలో నలిగే కర్తవ్యమై శూన్యాన్ని సైతం చూసే నేత్రమై బ్రతుకు సంగీతం వినిపించే గాత్రమై, జంత్రమై, తంత్రమై....
"మేడమ్!"
ఎవరో పిలిచినట్టుంది.
"మీరు మిస్ విజూష కదూ?"
కారు డ్రైవర్ లా వున్నాడు.
"ఎస్!"
"మేడమ్ మీకి లెటరిమ్మన్నారు."
అర్దం కానట్టు చూసింది "మేడమ్ అంటే?"
"మిస్ సశ్య!"
ఎక్కడో ఓ విస్పోటనం.
లెటర్ విప్పింది విజూష ఆందోళనగా.
"డియర్ విజూషా!
పాపం ఫజిల్ చెప్పేసిన ఉత్సాహంతో రుత్వితో డిన్నర్ కి ప్లాన్ చేసి వచ్చావేమో కదూ! పిచ్చిపిల్ల. రుత్విని ఏదోలా నీకన్నా మొందు నా వాడ్ని చేసుకుంటాను. నీకు కాకుండా చూస్తానని చెప్పానుగా.
ఇదిగో ఇప్పుడు అదే ప్రయత్నంలో వున్నాను. మేం ఇద్దరం ఏ మూడ్ లో వున్నదీ తెలుసుకోవాలీ అంటే రా....
సశ్య.
మనసుని ప్రశ్నిస్తున్న లాఠీలు మెదడుని అగ్నిజిహ్వలతో నింపుతుంటే మరో అపరిచిత గాయాన్ని భరించే శక్తి లేనట్టు వుద్విగ్నంగా పైకి లేచింది.
చెయ్యెత్తి చందమామని అందుకునే చివరి క్షణంలో నేలకూలిన నిలువుగీతలా ఒంటిని అగ్ని మూసతో ముట్టిస్తున్న లక్షాగృహంలా కదిలింది.
పదిహేను నిముషాలు భయంకర విరామం.
కారు ప్రయాణం ముగిసిన వెంటనే గెస్ట్ హౌస్ ఆవరణలో దిగిన విజూష తడి ఇసుకలో దూరిన పాదాల్లా అడుగుల్ని బలంగా లాక్కుంటూ బడలికగా ద్వారం దాటి హాలుదాటి పడకగదిదాకా వచ్చింది. కిటికీలోంచి చూసింది.
అంతే..
అదిరిపడింది.
అక్కడ బెడ్ రూమ్ లో దిగువ రుత్వి, పైన సశ్య.
కవోష్ణ రుధిర ధారలు ఉవ్వెత్తున ఎగిసి విజూష కళ్లని గర్బస్రావమైన పడమటి సంధ్యగా మార్చాయి.
సశ్య, రుత్వి కలిసి నిద్రపోతున్నట్టుగా లేదు.....
ఎన్ని జన్మలయినా యిలాగే కలిసి బ్రతుకుదాం అని చాటిచెబుతున్నట్టుగా వుంది.
ఖగోళమంత ఎత్తుగా పేర్చుకున్న ఎవరి ఆశల్నో నేలమట్టం చేసిన సమాధిలో విశ్రమించినట్టు....
"నువ్వు మా బంగారపు యాగంలో పడియాడే సమిధవ్" అని విజూషకి ఓ కొత్త సత్యం ఎరుకపరుస్తున్నట్టు...
నదీ సముద్రం సమాగమించిన వేళని చూసి పరవశించడం తప్ప యింకా ఎడారిలో ముత్యాలు పండించాలని ప్రయత్నించకని హెచ్చరిస్తున్నట్టు..
రుత్వి గుండెలపై వాలి అలసటగా కళ్లు మూసుకున్న సశ్యని ఇంకా అలాగే చూస్తూ వుండటానికి మనస్కరించని విజూష ఆవేశంగా వెనక్కి మరలబోయేంతలో......
"అమ్మగారూ" అంటూ పిలిచారెవరో.