Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 52


    ఇంట్లో పనిమనిషిలా వుంది. ట్రేలో కూల్ డ్రింక్ తో ప్రత్యక్షమైంది.

 

    "మీరొస్తే కూర్చోమని చెప్పమన్నారు. ఈ కూల్ డ్రింకిమ్మన్నారు" అంది పనిమనిషి.

 

    "ఎవరు?"

 

    "సశ్యమ్మగోరు"

 

    అంటే...

 

    ఇది గెస్ట్ హౌస్ అన్నమాట.

 

    కేవలం తనను ఉడికించాలని ఓటమి ఎవరిదో సోదాహరణంగా నిరూపించాలని యిలా తనను ఆహ్వానించిందన్నమాట.

 

    సశ్యమీద కసో లేక తన నిస్సహాయ స్థితిపై జాలో ఆమెకే తెలియదు.


 
    విజూష కళ్ళు తడయ్యాయి.

 

    చూపులు మానసి పారిజాత సుమదశం మాటున నక్కిన చురకత్తులై  మస్తిష్కాన్ని మండిస్తుంటే పనిమనిషి ముందు పనిలేని మనిషిలా వుండలేకపోయింది.

 

    రెక్కలు తెగుతున్న కోకిల్లా కోపంగా బయటికి నడిచింది.

 
                                                      *    *    *    *


    "సారీ డాడ్"

 

    మొండిగా అరిచింది విజూష.

 

     బహుశా ఆమె పుట్టి బుద్దెరిగాక తండ్రిపై విరుచుకుపడింది యిప్పుడే.

 

    "నాకు ఆ కెనడా సంబంధం యిష్టంలేదు" తండ్రి కళ్లలోకి చూడలేనట్టు తలవంచుకుంది.

 

    ప్రసాదభూపతి నిర్విణ్ణుడవుతూ కూడా కోపాన్ని నిగ్రహించుకున్నాడు.

 

    కొన్ని సిద్దాంతాల విద్యుత్కవచంతో నిర్మించుకున్న అతడి సామ్రాజ్యంలో అతడు ప్రశ్నగా చాలాసార్లు అవతారమెత్తాడే తప్ప ఎవరికీ  తప్ప ఎవరికీ జవాబు కాలేదు. జవాబు చెప్పలేదు.

 

    అతడు తన వ్యాపార ప్రపంచంలో అయినా 'నిజం' గా నిలిచాడే  తప్ప 'నీడ' గా మారి మరెవరి  మార్గ దర్శకత్వం కోసమో అర్రులు చాచి ప్రతిబింబమనిపించుకోలేదు బింబంగా మిగిలాడే తప్ప.

 

    అహం దెబ్బతింది విజూష మాటలతో.

 

    అయినా తమాయించుకున్నాడు.

 

    రెండు శబ్దాల మధ్య అనివార్య విరామంలా ఓ రెండు నిముషాలు సాలోచనగా చూసి అన్నాడు విజూషతో.


 
    "ఎందుకని?"

 

    శాసించడమే తప్ప అర్దించడం తెలీని తండ్రి తనను విడిచిపెట్టేట్టు లేడు. "అంతే డాడ్.. నేను పెళ్లిచేసుకోను."

 

    "పెళ్లే చేసుకోవా, ఈ పెళ్లి మాత్రమే చేసుకోనా?"

 

    నిశ్చలంగా అడిగాడు కాని ఆ గొంతులో అతి ప్రమాదకరమయిన కాఠిన్యం ధ్వనించింది.

 

    "అడుగుతున్నది నిన్నే?"

 

    పగులుతున్న స్వప్న జ్వాలా శిఖరంపై నిలబడి అందని ఏ నక్షత్రాల అంచుల్నో పట్టుకోవాలని ఆరాటపడుతున్నట్టు నిస్తారణంగా తలవంచుకుంది.

 

    "ఎవరినయినా ప్రేమించావా?"

 

    నిశ్శబ్దం.

 

    "నీ మౌనం నువ్వు చెప్పని నిజాన్ని నిర్దారించడమే  అయితే ఈ మహల్లో ప్రేమనే పదం వినడాన్ని కూడా నేనిష్టపడనని నీకు తెలుసు."

 

    "కానీ డాడ్....."

 

    నచ్చచెబుతున్నట్టు ఏదో అనబోయింది.

 

    "నువ్వు దాచలేవు నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తున్నది ఎవర్నో."

 

    విజూష గుండె ఝల్లుమంది.

 

    పాషాణాల  మధ్య దాక్కున్న  పూలతీవెలా తల పైకెత్తలేక పోయింది.

 

    "నేను ఓ పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతిని మాత్రమే కాదు విజూషా......... ఓ ఆడపిల్లకి తండ్రిని. అంతమాత్రం చేత నీ గురించి నేను ఆరా తీయాలా అనకు.... నువ్వు మామూలు ఇంటిదానివి కాదు. కోట్ల ఆస్తికి వారసురాలివి. ఇదొక్కటి  చాలు ఏ మగాడయినా నిన్ను  ట్రాప్ చేయటానికి..... రుత్వి దీనికి అతీతుడు కాడు."

 

    చివాల్న పైకెత్తి చూసింది.

 

    "పేరుతోసహా వివరాలు ఎలా సేకరించానా అని ఆశ్చర్యపోతున్నావా విజూషా..... అంతకు మించిన ముఖ్యమయిన  ఆధారాలు నా దగ్గర వున్నాయి."

 

    ప్రసాదభూపతి ఓ కవరు అందించాడు.

 

    కవరు అందుకున్న విజూష అందులోని ఫోటోల్ని చూసి ముందు అవాక్కయింది.

 

    కవరు అందుకున్న విజూష  అందులోని ఫోటోల్ని చూసి ముందు అవాక్కయింది.

 

    అదికాదు.

 

    బెడ్ మీద ఒకరినొకరు పెనవేసుకుని పడుకున్న సశ్య రుత్విల ఫోటోలు కొన్ని రోజులుగా తాను కన్న కాలం ఘటిస్తున్న శ్రద్దాంజలిగా అనిపిస్తుంటే.....

 

    ఉద్విగ్నంగా కవరులో వున్న ఆరు ఫోటోలు చూసింది.

 

    అదే....

 

    ఆ రోజు తాను గెస్ట్ హౌస్ లో చూసిన బెడ్ రూం.

 

    గుండె పరీక్ష నాళిక ముక్కలై రక్తం సంక్షోభిత సాగరంలా వుబుకుతుంటే...... గళం కలమైంది కాలం కలం కంఠంలో గడ్డకట్టిన శబ్దమయింది.

 

    "ఎలా....... ఈ ఫోటోలు మీకెలా వచ్చాయి?" తలవంచుకుని అడిగింది విజూష.


 
    "నువ్వు తెలుసుకోవాల్సింది రుత్వికి చెందిన నిజం మాత్రమే తప్ప ఈ వివరాలు  నేను ఎలా సేకరించానా  అన్ననిజం కాదు విజూషా."

 

    "కాని నాకు ఆ వివరాలు కావాలి."

 

    "చెప్పటానికి నేను సిద్దంగా లేను" కంచులా మొగింది ప్రసాద  భూపతి కంఠం.

 Previous Page Next Page