Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 50


     సరిగ్గా అదే సమయంలో....

 

    రుత్వి కోసం హోటల్ కి వచ్చింది విజూష.

 

    అధునాతమైన ఫైవ్ స్టార్ కల్చర్ తో హోటల్ సందడిగా వుంది. మార్బుల్ ఫ్లోరింగ్. సుతిమెత్తగా  నడుస్తూ కాన్ఫరెన్స్ హాలు నుంచి రెస్టారెంటుదాకా గాలించింది.

 

     రుత్వి లేడు.

 

    ఏమయ్యాడు?

 

    తను వస్తానని చెప్పిందే.

 

    సరైన జవాబు చెబితే రాత్రికి తనతో తప్పకుండా డిన్నర్ కి వస్తానంటే ఆలోచించి అతని ఫజిల్ కి సమాధానం చెప్పి ఒప్పించింది.

 

    రిస్ట్ వాచ్ చూసుకుంది.

 

    సాయంకాలం అయిదు గంటలు కావస్తోంది.

 

    ఎంక్వయిరీలో కాన్ఫరెన్స్ అరగంట క్రితమే  ముగిసినట్లు తెలిసింది.


 
    ఎక్కడికి వెళ్లాడు?

 

    సశ్య తనపై గెలుపు సాధించి రుత్విని శాశ్వతంగా తనకి దూరం చేస్తుందని చాలా ప్రగాఢంగా నమ్ముతూంది సబ్ కాన్షస్ గా అయినాయిగానీ.....

 

    ఒకవేళ....

 

    అదే జరిగితే....

 

    "నో"

 

    ఎవరి గొంతో వినిపించింది.

 

    తేరుకున్న విజూష రెస్టారెంట్  లో ఓ టేబుల్ ముందు కూచున్న స్త్రీల గుంపుని చూసింది.  అందులో చాలా ఎమోషన్ ల్ గా మాటాడుతున్న  కమాలాదాసు  కొన్నినిముషాల క్రితం ముగిసిన  కాన్ఫరెన్స్  వచ్చిన స్త్రీగా విజూషకి తెలియదు.
 


    కానీ ఆసక్తిగా చూసింది. అందంగా అలంకరించుకున్న  మధ్య వయసులో స్త్రీలనందర్నీ.

 

    అదికాదు.

 

    వారి చర్చలో రుత్వి పేరు వినిపించింది.

 

    అందుకే రుత్వి తిరిగి అక్కడికి వస్తాడన్న నమ్మకమో లేక రుత్వి గురించి వారు చర్చించడం ఆసక్తి కలిగించడంతోనో ఆమెకి తెలీదు.

 

    విజూష మరో టేబుల్ ముందు కూచుంది సాలోచనగా అందర్నీ చూస్తూ.

 

    "అవును జిన్నీ! ఇందాక 'పో' అని అరిచిన కమలాదాసు మిగతా మహిళా సంఘం సభ్యులనుద్దేశించి అంది ఉద్విగ్నంగా "నేను ఇప్పుడు చెప్పింది నేను సృష్టించింది కాదు.  నాకు రుత్వి చెప్పింది. యు నో రుత్వి - అంటే ఆయుర్వేదంలో ఓ డిక్షనరీ"

 

    "అంటే తల్లి పాలు పిల్ల చెబుతుందనే థియరీ నమ్మమంటావ్."

 

    "నమ్మాలి మిసెస్ రుక్కీ..... తల్లిపాలతో పెరిగిబిడ్డకి, పోత పాలు తాగే పిల్లలు బలంగా, దృఢంగా  వుంటారు."

 

    "కానీ నాకు తెలిసీ పోతపాలు తాగిన అబ్బాయిలూ దృఢంగానే వున్నారు."

 

    "ఊబ శరీరం చూసి అది దృఢత్వం అనుకోకు. పైగా పోతపాలు తాగిన పిల్లలకి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ. అందుకే మాటి మాటికీ ఏవో జబ్బులొచ్చి ఇబ్బంది పెడుతుంటాయి."

 

    "తల్లిపాలు అందించే దృఢత్వం గురించి చాలా చెప్పావ్ కమలా" రుక్మిణి పైట సర్దుకుంటూ  అంది రహస్యంగా. "నీకు తెలుసా. అలా పాలిచ్చుకుంటూ పోతేస్తనాల అందం తగ్గిపోతుంది."

 

    "అదంతా అపోహ అంటాడు రుత్వి. మళ్లీ కమలాదాస్ అందుకుంది" బిడ్డలకి పాలివ్వని చాలామంది తల్లుల స్తన సౌందర్యం మాట అటుంచితే స్తనాలలో పాలు గడ్డ కట్టడం లాంటి వ్యాధులు సోకే అవకాశముందట.  మరో అతి ముఖ్యమైన రహస్యం విను. పిల్లలకి పాలివ్వని స్త్రీతో భర్త శారీరకమైన సంపర్కం పదిమందిని కన్నపిల్లల తల్లితో జరుపుతున్నట్టుగా అంతా వ్యాకోచం  చెంది చెండాలంగా వుంటుందట. అంటే స్త్రీ అందం బిగుతుగా, దృఢంగా వుండేది పుట్టిన పిల్లలకి పాలిచ్చినప్పుడే...."

 

     అప్పటిదాకా  ఓ మూల నిశ్శబ్దంగా కూర్చున్న ఓ స్త్రీ అమాంతం రియాక్టయింది. "బిగుతుగా లేకపోవడం పిల్లలకి తల్లి పాలివ్వకపోవడం మాలంగానే  అంటున్నావ్ గానీ నేను మాత్రం  మా ఇద్దరబ్బాయిలకి నా పాలిచ్చి పెంచాను. మరి నా పరిస్థితి ఎందుకిలా అయింది?" తన భారీ కాయాన్ని చూసుకుంటూ అంది "నీతో నాకు సుఖం లేదు అంటూ మా వారు గత పదేళ్లుగా విసుక్కోని రోజులేదు."

 

    జవాబేం చెప్పాలో పాలుపోక కమలాదాసు దిక్కులు చూస్తుంటే అందరిలోనూ సాంప్రదాయకంగా పద్దతిగా అచ్చు తెలుగు ఆడపడుచులా వున్న ఓ యువతి అంది నెమ్మదిగా "దీనికి కారణం మనం చాలా ఆధునికంగా ఆలోచించేవాళ్లమని మనల్ని మనం మోసం చేసుకోవడం రమాదేవిగారూ."

 

    స్థూలకాయురాలు ప్రశ్నార్దకంగా చూసింది ఆమె చెబుతున్నదేమిటో అర్దంగాక.

 

    "ఆధునిక సమాజంలో స్త్రీ ప్రసవం తర్వాత నడికట్టు కట్టడం మానేవారు, ప్రసవానంతరం పాటించాల్సిన ఆహార నియమాల గురించి, అవసరమైన వ్యాయామం గురించి ఆలోచించడం మానేశారు. అందుకే లావెక్కడం, పొట్ట పెరగడం అన్నీ కలబడిపోవడం జరుగుతూంది తప్ప దీని కంతటికీ కారణం తల్లి పిల్లలకి పాలివ్వడమూ ఇవ్వకపోవడమూ కాదన్నది నా అభిప్రాయం."

 

    క్షణం రమాదేవి కేసి చూసి మళ్ళీ చెప్పడం కొనసాగించింది "నిజమే.  పిల్లకిగానీ, తల్లికిగాని ఆరోగ్యకరమైన అలవాటు తల్లి పాలివ్వడమే. ఇది తిరుగులేని సత్యం. ఆయుర్వేదం మాత్రమేకాక ఆధునిక వైద్యమూ చెప్పేది ఇదే."

 

    "చాలా మంచి మాట చెప్పావ్ అమ్మడూ!" రమాదేవి ఫిలాసాఫికల్ గా  చూసింది. "మన మధ్యనే వుంటూ కూడా నీకింత మేధస్సు వుందని ఇంతకాలమూ తెలియనిచ్చావ్ కావు."

 

    రమాదేవి అలా అన్నది నొచ్చుకుంటూనో, లేక ఒళ్ళు మండో అర్దంకాలేదు కమలాదాసుకి.

 

    అది కాదు..

 

    తనకన్నా వయసులో కనీసం పదేళ్ళు చిన్నదైన ఓ ఆడపిల్ల రుత్విలాగా ఆయుర్వేదం గురించి  అనర్గళంగా మాట్లాడటం నచ్చలేదు.

 

    "మీ పేరు సుధ కదూ." అంది కమలాదాసు ఇందాక మాట్లాడిన  సుధని చూస్తూ. అర్జెంటుగా సుధ నోరు మూయించాలనుకోవడంతో తన ప్రసక్తిని కంటిన్యూ చేసింది. "చూడండి సుధా! మీరీ మధ్యన  నా సంఘ సభ్యులయ్యారు కాబట్టి మీ గురించి అంతగా తెలుసుకోలేకపోయాను. సరే  రమాదేవికి చాలా  వివరంగా అంతా బోధించారుగా. మరి వాళ్లాయన రమాదేవిని చూసి ముచ్చటపడేట్లుగా ఎలా మారాలో కూడా చెబితే ఓ పని అయినట్టుంటాది."

 Previous Page Next Page