చేతులు జోడించింది."ఇంక నీ ఆయుర్వేద ప్రావీణ్యం గురించి బాదడం ఆపెయ్"
"అదికాదు సశ్యా" మరేదో చెప్పబోయాడు కానీ ఎవరో పిలిచారు.
"సర్" స్టీవార్ట్ నిలబడి వున్నాడు.
"యూ ఆర్ మిస్టర్ రుత్వీ."
అవునన్నట్లుగా తల వూపాడు రుత్వి.
"మీకు ఫోన్ సర్. మిస్ విజూష లైన్లో వున్నారు" అంటూ కౌంటర్ వేపు చూపించాడు.
సశ్యకు చురుక్కుమంది.
మరో అవాంతరం. రుత్వి నడిచాడు టేబుల్ దగ్గర నుంచి.
"హలో" పలకరించాడు రుత్వి.
"కాన్ఫరెన్స్ కి వెళ్లారని తెలిసింది. పూర్తయితే మీతో కలిసి డిన్నర్ చేద్దామని"
విజూష గొంతులో సంశయాన్ని గమనించిన రుత్వి నవ్వేశాడు.
"నేను డిన్నర్ కి రావాలీ అంటే మీరు మన ఒప్పందం ప్రకారం నేనిచ్చే పజిల్ కి జవాబులు చెప్పాలి"
"సశ్యతో కాక నాకు విడిగా యివ్వండి."
క్షణం సాలోచనగా వుండిపోయాడు.
"మీరు నేనిప్పుడు అడిగిన ప్రశ్నకి జవాబు చెబితే రాత్రికి మీతో డిన్నర్ కి రెడీ. ఓకే! ప్రశ్న అడగనా?"
"ఎస్"
"మీ నాన్నగారి ఖచ్చితమైన వయస్సు ఎంతో చెప్పాలి"
రుత్వికి సమీపంలో నిలబడ్డ సశ్య దవడ కండరాలు బిగుసుకున్నాయి.
విజూషతో కలిసి డిన్నర్ చేయాలనే ఆలోచనతో ఓ సిల్లీ ఫజిల్ ఇచ్చినట్టు అనిపించింది.
రోషం, ఆవేశం ఎక్కువవుతుంటే చాలా బలంగా నిభాయించుకుంది.
ఏం జవాబు విన్నాడో ఏమో "గుడ్" అన్నాడు.
"మీతో ఈ రాత్రికి డిన్నర్ కి రెడీ."
ఉత్సాహంగా ఫోన్ క్రెడిల్ చేసిన రుత్వి ఆ తర్వాత సరాసరి తన సీటు దగ్గరికి వెళ్లి టేబుల్ ముందు కూచున్నాడు.
సశ్యలేదు.
ఉండదని తెలుసు. తన వెనక నిలబడి వుందని తెలుసు.
దూరంగా కౌంటర్ దగ్గర నిలబడ్డ సశ్య ఫోన్లో మాటాడుతోంది ఎవరితోనో.
అర నిముషం తర్వాత టేబుల్ దగ్గరికి వచ్చింది. బడలికగా నిట్టూర్చుతూ " మొత్తానికి ఈ రాత్రి విజూషతో డిన్నర్ కి వెళుతున్నావన్నమాట" అంది నిస్సత్తువగా.
"అవును" సశ్య ముఖాన్ని చూస్తూ అన్నాడు "నీతో కూడా డిన్నర్ చేశానుగా."
"ఎప్పుడు?" ఖంగుమంది సశ్య గొంతు.
"ఫజిల్ కి జవాబు చెప్పినప్పుడు."
"ఇప్పుడు విజూష కూడా జవాబు చెప్పింది."
"అసలు అదో ఫజిలా" ఉక్రోషంగా అంది. "వాళ్ల నాన్నగారి వయసు అడిగావ్. అంతేగా.... అది చెప్పడం ఓ పెద్ద పనా."
"అయితే మీ నాన్నగారి వయసు నువ్వు చెప్పు."
"నాకు డాడీ లేడు."
రుత్వి నిశ్చలంగా చూశాడు సశ్యని.
కోపంలో శిరస్సు కదిపే అగ్నిశిఖలా కనిపించే సస్యకి తెలీదు ఆమె తండ్రి బ్రితికే వున్నాడని.... ఆయన ఎవరో కాదు ప్రసాదభూపతని.. తెలిసే అవసరం లేకుండా పెంచింది ఆమె తల్లి.
కాలం పిడికిట బంధించిన సౌరభంలాంటి ఒక సత్యం సశ్యకి తెలవాల్సింది సరైన అదనులో అనుకుంటూ "ఒకవేళ నీకు తండ్రి వుంటే ఆయన వయసు సుమారు ఎంత వుండేదో చెప్పగలవా?" అడిగాడు నిశ్చలంగా.
"నలభైరెండు, నలభై అయిదేళ్లు"
"నేను అడిగింది తండ్రి వయసు."
అర్దం కానట్టు చూసింది సశ్య.
"ఇదే ప్రశ్నకి విజూష ఇరవై ఒక్క సంత్సరాలంది సశ్యా. అందుకే విజూషకి ఓకే చెప్పాను."
"తండ్రి వయసా?" విస్మయంగా ఒత్తి పలికింది "ట్వంటీ వన్ అంటే ఓకే అన్నావా?"
"ఆవేశపడకు సశ్యా" నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు "మగాడు మందు ఓ స్త్రీకి భర్తవుతాడు. తరువాత ఓ బిడ్డకి తండ్రవుతాడు. విజూష చెప్పింది ఆమె తండ్రి "తండ్రి" అనిపించుకున్న పీరియడ్ గురించి.. నేను అడిగిందీ అదే."
నిశ్లేషణ నచ్చినా ఓకే అనలేకపోయింది సశ్య.
అసలి విజూషతో డిన్నర్ కి వెళుతున్నాడన్న ఊహే ఆమెని చాలా అశాంతికి గురి చేసింది. "వీల్లేదు రుత్వీ! విజూష పూర్తిగా నిన్ను అదుపు చేయకముందే నా స్థానాన్ని నేను పదిలపరుచుకోవాలి."
"ఎలా" అని అతడు అడగబోయేంతలో రుత్విని సమీపించాడో వ్యక్తి. "నేను విజూషగారి కారు డ్రయివర్ని సార్! మేడమ్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు."
సశ్య వేపు చూశాడు రుత్వి. ఆమెలో చలనం లేదు. రుత్విని గెలుచుకోవడం తనకి మాత్రమే సాధ్యమైనట్టు చూస్తోంది పర్సనల్ గా రావాల్సిన విజూష కారు పంపడమేమిటని రుత్వి ఆలోచించలేదు. హోటల్ బయటకి నడిచి కారెక్కుతుంటే సశ్య కూడా అతనితోపాటు కూర్చుంది అతడూహించని రీతిలో.
"నీ కారు" ఏదో అనబోతూ ఆగిపోయి పోనివ్వమన్నట్లు డ్రైవర్ కేసి చూశాడు రుత్వి.
సరిగ్గా పదిహేను నిముషాలలో కారు సిటీ పొలిమేరల్లో వున్న ఓ గెస్ట్ హౌస్ కి చేరుకుంది.
విజూష ఎదురు కాలేదు.
సోఫాలో కూర్చున్న ఇద్దరి దగ్గరికీ ముందో సర్వెంట్ వచ్చింది.
గ్లాసుల్లో కూల్ డ్రింక్స్ యిచ్చింది.
రుత్వి తాగేశాడు బాగా దాహంగా వుండటంతో. ఏదో మైకంలా వినిపిస్తూంటే తల పట్టుకున్నాడు. మూడు నిముషాల్లో సోఫాలో వాలిపోయాడు.
* * * *