Previous Page Next Page 
ఇది ఒక కుక్క కథ పేజి 4

    స్వామికూడా అటు చూశాడు. కుక్క అతని వంక చూస్తోంది. ఆ చూపుల్లోనే ఏదో హెచ్చరిక ఉన్నట్లు అతనికి తోచింది. అప్పుడు అతనికి తన పరిస్థితి గుర్తుకు వచ్చింది.
    ప్రిన్సిపాలు గారింట్లో ఉన్నప్పుడే తను మీనాక్షికి ప్రయివేటు చెబుతాడు. తామిద్దరకూ కుక్క కాపలా. అది మొరిగిందంటే ఆయన వస్తాడు. కుక్క మొరగడం తనకు అవమానం. తన ప్రవర్తనకు పరీక్ష అది!
    మీనాక్షి తెలివైనదే కాని, కాస్త అమాయకత్వం కూడా ఉందామెలో. స్వామి అంటే ఆమెకు అభిమానం కలిగింది. అతను ఎన్ని విధాల చెప్పినా ఆమె చదువు మీదకు దృష్టి పోనివ్వదు. కానీ అతనికి చెడ్డపెటు వస్తుందన్న మాట విన్నప్పుడు ఆమె క్షణంలో అన్నీ అర్ధం చేసుకుంటుంది.
    "మీరు చదువు మీద దృష్టి పోనివ్వడంలేదు. ఇది మీకు అర్ధం కాలేదంటే ఆ తప్పు మీది కాదు. అర్ధమయేలా చెప్పలేకపోయిన నాది" అని స్వామి అన్నప్పుడల్లా ఆమె చదువు మీద శ్రద్ధ చూపించేది.
    "మేష్టారూ! మీకు చెడ్డపేరు రానివ్వను. ఎప్పుడైనా నా ప్రవర్తనలో లోపముంటే చెప్పండి- వెంటనే సరిదిద్దుకుంటాను" అనేది మీనాక్షి.
    ఆమె అభిమానం స్వామిని కరిగించేది. కాని కరిగిపోయేవాడు కాదు. ఆ అభిమానాన్నామెకు దారిలో పెట్టడానికి ఉపయోగించుకునేవాడు.
    ఒక రోజు మీనాక్షి చిరాగ్గా__"మేష్టారూ! క్లాసులో మేష్టార్ని చూస్తే చాలా బోరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా?" అంది
    "చదువంటే ఆసక్తిలేకయుంటుంది."
    "కాదు_-ఆ మేష్టార్ని చూస్తే చదువు తప్ప మరోటి గుర్తురాదు. మేష్టారంటే చదువొక్కటే చెబితే బోరు. సీరియస్ పిక్చర్లో కూడా హాస్యం ఉంటుంది. దేవుడి కథలు చెప్పే హరికథల్లో కూడా పిట్టకథలుంటాయి. మనిద్దరం కూర్చుంటే మాత్రం.... ...." అని ఎలా ఉంటుందో మాటల్లో చెప్పకుండా ముఖంలో ప్రకటించింది మీనాక్షి.
    ఆమె ముఖం చూస్తూంటే స్వామికి నవ్వు వచ్చింది-"అయితే నా పాఠం హరికథలాగుండాలంటారు?" అన్నాడు.
    "మీ ముఖం చూడగానే నాకు బోరనిపించకుండా ఉండాలంటే....?"
    "సరే-పిట్టకథలు నాకు రావు. మీరు చెప్పండి వింటాను" అన్నాడు స్వామి.
    "అది కాదండీ! మనిద్దరం స్టూడెంట్సుమే__ చిన్న వాళ్ళమే__సరదాగా కాసేపు సినిమా కబుర్లూ అవీ చెప్పుకుని, తర్వాత పాఠం చెప్పుకుంటే...."
    "సినిమాకబుర్లు నాకు తెలియవు. నేను సినిమాలు ఎప్పుడో కాని చూడను."
    "ఎందుకని? సినిమాలు చూస్తే చెడిపోతారా?" అంది మీనాక్షి.
    "అదేంకాదు- మీరు సరదాగా ఓసారి చూసే సినిమాతో నాకో పూట టిఫెనూ, భోజనమూ వస్తాయి. చూస్తూ చూస్తూ క్రింద క్లాసులకి వెళ్ళలేను." స్వామి బాధగా అన్నాడు.
    "అంటే సినిమాలు చూడలేకపోతున్నందుకు మీరు బాధ పడుతున్నారా?"
    "లేదు" అన్నాడు స్వామి. అతని కళ్ళు వెలిగాయి. "మీ వంటి వారి సాయంతో నేను గొప్పవాడి నౌతానన్న నమ్మకం నాకుంది. సరదాలన్నీ అప్పటికి వాయిదా వేశాను."
    మీనాక్షి స్వరం తగ్గించి__"నేనూ నా సరదాలను వాయిదా వేశాను. అది మీకు తెలుసా?" అంది.
    "తెలియదు" అన్నాడు ఆశ్చర్యంగా.
    "నాకూ చాలా సరదాలున్నాయి. అవన్నీ ఇప్పుడు తీరడంలేదు. నా అదృష్టం మీద నాకు నమ్మకముంది. నాకు మంచి...." అని ఆగింది మీనాక్షి.
    "ఆగిపోయారేం__పూర్తి చేయండి?" అన్నాడు స్వామి.
    "అటు చూడండి _ అదెంత భయంకరంగా చూస్తోందో!" అంది మీనాక్షి. స్వామి అటు చూశాడు- కుక్క తీక్షణంగా అతనివంకే చూస్తోంది!
    నెలలు గడుస్తున్నాయి. స్వామి బియస్సీ ఫస్టుక్లాసులో పాసవడమేకాక కాలేజీకి ఫస్టుగా వచ్చాడు. యూనివర్సిటీలో అతను ఎమ్మెస్సీ టెక్నాలజీలో జియోఫిజిక్స్ కోర్సులో చేరాడు. అటు అతని చదువూ, ఇటు మీనాక్షికి ప్రయివేటూ రెండూ బాగానే నడిపించుకు వస్తున్నాడతను.
    అతని మకాం ప్రిన్సిపాలుగారింట్లోనే. ఆ ఇంట్లో అతనికి మంచి ఆదరణ లభిస్తోంది. అతను మీనాక్షితో గడిపేది ప్రయివేటు సమయంలోనే. అదీ సుమారు గంటన్నర. రాజుకున్న ఇరవై నాలుగుగంటల్లో ఒకటిన్నర గంటలు మాత్రం అతను మీనాక్షితో గడుపుతున్నాడు. ఆ సమయంలో అతనికీ ఆమెకూ కాపలాగా కుక్క ఉంటుంది. గంటన్నరలో కనీసం గంటయినా అతనామెకు చెబుతాడు. ఆ మిగిలిన కొలది వ్యవధిలో ఏం మాట్లాడుకుంటారో ఏమో__అతనికి ప్రపంచంలో అందరికన్నా మీనాక్షి ముఖ్యమైనదని అనిపిస్తూంటుంది. ఆ గంటన్నర కోసమే రోజంతా ఎదురుచూస్తూంటాడు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నా అతనికి మీనాక్షి గుర్తుకు వస్తుంది. ఆమె సమక్షం తనకు శాశ్వతం కాదనీ, దేవుడు తనకిచ్చిన తాత్కాలిక వరమనీ అనిపించినప్పుడల్లా, అతనికి చాలా బాధగా ఉంటుంది. తనకు పేదరికమిచ్చిన భగవంతుణ్ణి తరచు నిందించుకుంటూండేవాడు. ఆ సమయంలోనే అతనికి ఇందిర గుర్తుకు వచ్చేది.
    'ఒకప్పుడు ఇందిర లేకపోతే బ్రతకలేనని తను అనుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని తను నమ్మాడు. ఆమె హెచ్చరించేవరకూ తన ఆలోచనల్లోని పసితనం తెలియదు. ఇప్పుడు మీనాక్షి విషయంలోనూ అంతేనా?'
    తన ఆలోచనల్లో ఇంకా పసితనం ఛాయలు బాగా ఉండి ఉండాలి. ఇందిరనెంతో గాఢంగా ప్రేమించానని అనుకున్న తను, అప్పుడే ఆమెను మరిచిపోవడమేకాక మీనాక్షి గురించి ఆలోచించటమేమిటి? మీనాక్షి తనకు దూరమయ్యేక మళ్ళీ ఇంకో వనజ గురించి ఆలోచించనని నమ్మకమేమిటి?
    అయితే స్వామికి తెలుసు __ ఇందిరకూ మీనాక్షికీ భేదమున్నదని!
    ఇందిరను స్వామి ప్రేమించాడు. ఆమె అతన్ని ప్రేమించలేదు. మీనాక్షి స్వామిని ప్రేమిస్తోంది. స్వామి ఆమె గురించి ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
    వారి పరిచయానికి ఆరునెలలు వచ్చేక మీనాక్షి ఒకరోజు స్వామితో సూటిగా అన్నట్లే అంది "మేష్టారూ! మీరు చాలా మంచి వారండి! మంచి వాళ్ళంటె నాకెంతో ఇష్టం."
    "ఉన్నట్లుండి ఈ విషయం చెప్పారేమిటి?"
    "చెప్పకపోతే తెలియదని."
    "తెలియకపోతే నష్టమేం లేదుగదా?"
    "నష్టమేకదండీ!" అంది మీనాక్షి నవ్వి.
    "ఎందుకని?"
    "నేను నా గురించి చెప్పినప్పుడు__మీరు మీ గురించి చెబుతారు."
    స్వామి ఉలిక్కిపడి కుక్క వంక చూశాడు. అది అతనివంక చూడడం లేదు.
    "మేష్టారూ! మిమ్మల్ని చూస్తూంటే పాఠం చెప్పించుకోవాలనుండదు. మీతో సరదాగా కబుర్లు చెప్పాలనుంటుంది. రోజూ ఓ పావు గంటయినా మీతో కబుర్లు నడుస్తున్నాయి కాబట్టే, ఈ ప్రయివేటు భరించగలుగుతున్నాను" అంది మీనాక్షి.
    "అలాగంటే ఎలా? మీరు బాగా కష్టపడి చదువుకుని...."
    "చదువుకుని.... ఊఁ చెప్పండి__ఏం చేయాలి?" అంది మీనాక్షి.
    "పరీక్ష ప్యాసవ్వాలి" అన్నాడు ఏమనాలో తెలియక స్వామి.
    "ప్యాసయ్యాక__ఆ తర్వాత?"
    "మళ్ళీ కష్టపడి చదువుకొని పరీక్ష ప్యాసవ్వాలి."
    "ఆ తర్వాత?__"
    "మళ్ళీ కష్టపడి చదువుకుని...."
    "అలా ఎన్నాళ్ళు?"
    "పెళ్ళయ్యేదాకా" అని నాలుక్కరుచుకున్నాడు స్వామి. వాళ్ళిద్దరి సంభాషణల్లోనూ పెళ్ళి ప్రసక్తి రావడం అదే ప్రథమం. అతను కంగారుగా కుక్కవైపు చూశాడు. అది అతనివంక చూడడంలేదు. మీనాక్షి ముఖం ఎర్రబడింది. స్వరం తగ్గించి నెమ్మదిగా__ "ఆ పెళ్ళోదో తొందరగా చేసుకుంటే చదువూ ఉండదు, పరీక్షలూ ఉండవు" అంది.
    ఆమె అలాగంటుందని స్వామి ఊహించలేదు__"పాఠం మొదలుపెడ్తాను" అన్నాడు ముక్తసరిగా.
    "బాగుందండీ? నేను పరీక్షలుండవని అనగానే మీరు పాఠం ప్రసక్తి తీసుకువచ్చారు" అంది మీనాక్షి.
    "అది నా బాధ్యత" అన్నాడు స్వామి.
    "బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తారు మీరు. ఏ ఆడపిల్ల చేసుకుంటుందో కాని బాగా సుఖపడుతుంది" అంది మీనాక్షి.
    ఆడ, మగ ఇద్దరూ కలసినప్పుడు, అక్కడ ఆ ఇద్దరే ఉన్నపుడు-ఇద్దరిలో ఒకరు చనువు తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరూ చనువు తీసుకోకుండా ఉండడం కొన్ని రోజులు మాత్రమే సాధ్యపడుతుంది. ఎప్పటికైనా ఇద్దరిలో ఎవరో ఒకరు ముందడుగు వేయక తప్పదు. అందుకు నాంది అన్నట్లు ధ్వనించాయి మీనాక్షి మాటలు.
    అరిటాకు, ముల్లు సామెతలా మీ ఇద్దరిలో తప్పు ఎవరు చేసినా నష్టపోయేది మాత్రం నువ్వే' అన్న ప్రిన్సిపాలు మాటలు స్వామి చెవుల్లో గింగురుమన్నాయి. అతను మరోసారి కుక్కవంక చూశాడు. అది అతనివంక చూస్తోంది. దానికళ్ళలో కుతూహలమున్నట్లు అతనికి తోచింది.
    "ఆ బాధ్యత వేరు- ఈ బాధ్యత వేరు. ఆ బాధ్యతలు నిర్వహించే శక్తి కోసమే ఇప్పుడు కృషి చేస్తున్నాను" అన్నాడు స్వామి.
    "అరే__నేను గుర్తించనేలేదు. ఇప్పట్నించీ నేను మీకు బాధ్యతగా మారిపోయను" అంది చటుక్కున మీనాక్షి.
    స్వామికి ఏం మాట్లాడాలో తోచలేదు. అతనికి తెలిసిన ఏకైక ఉపాయం-"పాఠం" అన్నాడు.
    "కాస్సేపాగుదురూ__ నేను చెప్పదల్చుకుంది చెప్పేస్తాను. చాలా రోజుల్నుంచి చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాను. మీరు సినిమా లాట్టే చూడరు కాబట్టి, నేను సినిమా డైలాగులు చెప్పినా స్వంతమే అనుకుంటారు- వినండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే బ్రతకలేను" అంది మీనాక్షి.
    ఆమెకు అంతదైర్యం ఎక్కణ్ణుంచి వచ్చిందో స్వామికి అర్ధంకాలేదు. అతనికి అన్ని భావాలనూ అధిగమించి భయంకలిగింది. ప్రిన్సిపాలు హెచ్చరిక అతని చెవుల్లో గింగురుమంది.
    మీనాక్షి మళ్ళీ అందుకుంది- "నేను చాలా గారాబంగా పెరిగాను. కోరుకున్నవి సాధించగల శక్తి నాకుంది. ఈ ఇంట్లో నా మాటకు తిరుగులేదు. మీరు కాదంటే నాకు అవమానం. అవునంటే ఆనందం. మనసులోని మాట పైకి అనేయడం నా అలవాటు. నా వల్ల తప్పుంటే చెప్పండి- నే నన్న మాటల్లో తప్పుంటే చెప్పండి- దిద్దుకుంటాను."
    స్వామి తమాయించుకున్నాడు- "చూడండి - మీరు చిన్నవారు, నేను చిన్నవాణ్ణి. ఒకళ్ళ తప్పులు ఒకరికి తెలియవు. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే తల్లీ దండ్రీ మీకున్నారు. మీకు ఏది మంచిదో, ఏది కాదో వారికి బాగా తెలుస్తుంది. అందువల్ల మీ భవిష్యత్తు గురించి మీరాట్టే ఆలోచించనవసరం లేదు. నా సంగతంటారా - నాకు చాలా బాధ్యతలున్నాయి. పెళ్ళి గురించీ, సరదాల గురించీ ఆలోచించే అవకాశం నాకు ప్రస్తుతం లేదు. నా చదువు, నా కృషి- ప్రస్తుతం వీటిగురించే నేనాలోచించాలి. మీరు చదువుతున్న దింకా చిన్న క్లాసు. ఇప్పట్నించీ మీరు ప్రేమ గురించి ఆలోచించకూడదు. ఆలోచించవలసిన అవసరం కూడా మీకు లేదు. అదలాగుంచి నాదో చిన్న మనవి- మీరు నన్ను ప్రేమించినట్లు మీ నాన్నగారికి చెప్పవద్దు. మీ ఇంట్లో కూడా అనవద్దు. నిజానికి మీకు నాపైన గానీ నాకు మీపైనగానీ ప్రేమ లేదు. మనం దగ్గరగా ఉంటున్న కారణంగా పరస్పరం ఈ భావం కలిగింది. లేకపోతే నాలో ఏం విశేషముందని మీరు నన్ను ప్రేమించారు? రూపంలో, గుణంలో, సంపదలో - అన్నింటిలో సామాన్యుణ్ణి నేను! మనం దూరమైతే మళ్ళీ మనం ఒకరినొకరు మరిచిపోతాం. ఎప్పుడో వివాహమై జీవితంలో స్థిరపడితే - ఒకప్పుడిలా మరో వ్యక్తిని ప్రేమించిన విషయం కూడా స్పురణకు రాదు. ఎందుకంటే ఈ అనుభూతి అంత తాత్కాలికమైనది."
    మీనాక్షి ఆశ్చర్యంగా అతను చెప్పింది విని- "మీరు చాలా తెలివైన వారు. మీ మాటలన్నీ నాకెలాగూ అర్ధంకావు. కాని ఒక్క సందేహం- తాత్కాలికంగానైనా ఒక అనుభూతి కలిగి, అది నిజజీవితంలో సాధించుకోగల శక్తి ఉంటే- అలా ఎందుకు చేయకూడదు?" అంది. స్వామి ఏదో అనబోతుండగా ఆమె అందుకుని, "అయిదు నిమిషాల పెళ్ళి చూపులలో వరుణ్ణి నిశ్చయించడంలో లేనితప్పు - ఆరు నెల్ల పరిచయంతో నిర్ణయిస్తే వస్తుందా?" అంది.   

 Previous Page Next Page