కృష్ణ నవ్వాడు. "భలేవాడివిరా! గుర్తుకు రాకపోతే నీకెందుకిస్తాను ! డబ్బు విషయంలో నీకంటే మొండివాడినికదా ! అయిదు వందలు మా శేషావతారం దగ్గర తీసుకున్నానని నాకు గుర్తుంది. అందుకనే ఇంతసేపూ వాదించాను. ఇప్పుడు గుర్తొచ్చింది. వాడిదగ్గర తీసుకుందామనుకుని మర్చిపోయి నీ దగ్గరకొచ్చాను."
సుధాకర్ డబ్బు తీసుకున్నాడు. "ఇకనుంచీ నేను నీ దగ్గర తీసుకున్నా, నువ్వు నా దగ్గర తీసుకున్నా కాగితంమీద రాసి సంతకం తీసుకోవాల్రా ! లేకపోతే నీ జ్ఞాపకశక్తితో చాలా గొడవగా ఉంది..." నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడతను.
అతను వెళ్ళిపోగానే కృష్ణ మొహం మీద నవ్వు మాయమైంది.
అంతలో గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. ఆలోచనల్లో నుంచి తేరుకుని ఆ వీధి చివరున్న మంగలిషాపుకి బయలుదేరాడు. రోజూ నిద్ర లేవగానే ఆ షాపుకి వెళ్ళి గడ్డం చేయించుకోవడం అలవాటు, హాస్టల్ వాళ్ళందరికీ. స్వంతంగా గీసుకోవటం బద్ధకం. ఇవాళ సుధాకర్ గాడితో పేచీ పడటంతో గంట లేటయిపోయింది. షాప్ లో కుర్చీ ఖాళీగానే ఉంది. వెళ్ళి అందులో కూర్చుని "త్వరగా కానీ !" అన్నాడు మంగలితో.
"ఏమిటి సార్ ?" ఆశ్చర్యంగా అడిగాడు మంగలి.
"ఏమిటేమిటి కొత్తగా. గడ్డం చెయ్ త్వరగా !" పత్రికలో సినిమా బొమ్మలు చూస్తూ అన్నాడు విసుగ్గా.
"ఇందాక వచ్చి వెళ్ళిన విషయం మర్చిపోయారా సార్ ?" నవ్వుతూ అడిగాడు మంగలి. కృష్ణ విశాలంగా నవ్వేడు.
"నీకో విషయం చెప్తాను, కంగారుపడకు ! అచ్చం నాలాగే ఉండేవాడొకడు ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాడులే. కావాలని నేనొచ్చే టైమ్ లోనే వచ్చి నిన్ను మోసం చేసి ఫ్రీగా షేవింగ్ చేసుకుని వెళ్ళిపోయినట్లున్నాడు - అదే అరువుపెట్టి... నేను మాత్రం ఆ డబ్బు చచ్చినా ఇవ్వను."
మంగలి బిగ్గరగా నవ్వాడు. "అదేదో సినిమాలో కథ సార్ మీరు చెప్పేది."
"అయితే అయి వుండవచ్చు. కాని నాలాంటి వాడొకడు - అందర్నీ మోసం చేస్తూ తిరుగుతున్నట్లు మాత్రం నాకు తెలుసు. పొద్దున్న నీ దగ్గరకొచ్చి గెడ్డం చేయించుకెళ్ళింది వాడే."
మంగళి మురళి గెడ్డం మీద చేయివేసి ఎగిరి గంతేశాడు. భూకంపం వచ్చిన వాడిలా అదిరిపోయాడు. పక్కనున్న కస్టమరు - ఆయన పేరు నరసింహం - ఇదంతా విచిత్రంగా చూస్తున్నాడు.
దెయ్యాన్ని చూస్తున్నట్టు కళ్ళప్పగించి మురళి కేసి చూస్తూ చివరి కెలాగో నోరు విప్పి అన్నాడు.
"సా...ర్ ! నేను ... నేనే గీశాను గెడ్డం. నా ఇన్నేళ్ళ ఎక్స్ పీరియన్స్ లో అరగంటలో గెడ్డం తిరిగి మొలవటం ఇదే మొదటిసారి నేను చూట్టం"
మురళి విసుగ్గా "చెప్పటం లేదూ నాలాగే ఇంకెవరో వున్నారని -" అన్నాడు.
"సార్ ! మంగలనే వాడు మొహానికి దగ్గిరగా వచ్చే మొట్టమొదటి వ్యక్తి నా చేతుల్లో నేను చేశాను సార్ షేవ్ ! ఇదే షేపు ! - ఇదే క్రాఫు - వాచీ స్ట్రాపుతో సహా అచ్చంగా ఇదే సార్ !"
"ఎగ్జెటయిపోకు అసలా డూప్లికేటు గాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్ధంకావటం లేదు. నీకయితే నా పేరు మీద అరువు పెట్టలేదు కదా."
"లేదు సార్! పైగా అయిదు రూపాయలు బక్షీసు కూడా ఇచ్చాడు."
"అయితే ఇదేదో పెద్ద వ్యవహారమే అయ్యుంటుంది. డబ్బు కోసం కాదు. చూస్తాను" అంటూ లేచాడు.
"... సార్ గెడ్డం"
"ఈ రోజు నుంచీ గెడ్డం పెంచుతాను. ఆడినా డిఫరెన్స్ వుండనీ" అని వెళ్ళిపోయాడు.
"చాలా చిత్రంగా వుందే" అన్నాడు నరసింహం.
"చిత్ర మేమిటి సార్ ... మీరు నమ్మరు ... అచ్చుగుద్దినట్టు ఒకే పోలిక"
"సర్లే సర్లే షేవింగ్ క్రీమ్ ఎండిపోతోంది. ముందు దీని సంగతి చూడు" అన్నాడు నరసింహం.
2
పోలీస్ స్టేషన్ గోడలు పోలీసుల్లాగే నిస్తేజంగా వున్నాయి. టేబిల్ ముందు రైటరు ప్రతిరోజూలాగే నిద్ర పోతున్నాడు.
"సార్."
"......."
"హలో !"
"హ ... ల్లో" గట్టిగా అరిచాడు మురళి.
రైటర్ ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు. ఎదురుగా వున్న స్టూడెంట్ లాంటి కుర్రాణ్ని చూసి విసుగ్గా, "ఏం కావాలి?" అన్నాడు.
మురళి ఒక కాగితం అతడి ముందుకు తోసి, "కేసొకటి రిజస్టర్ చేసుకోవాలి" అన్నాడు.