Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 4

    "అయితే మీరూ చూశారన్నమాట. నేనే ఫోన్ చేసి చెబ్దామనుకున్నాను" వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.

    "వీళ్ళకీవార్త  ఎలా అంది వుంటుంది? తన డిపార్టుమెంటులో  తప్ప వేరే వాళ్ళకు తెల్సే ఆవకాశం లేదే?" అడిగింది.

    "ఏముంది ప్రతిదానికీ ఒక ధర వుంటుంది. ఈ రోజుల్లో డబ్బుకు అమ్ముడుపోని  వస్తువు లేదు మార్కెట్ లో. అన్నింటికన్నా త్వరగా అమ్ముడు పోయేది మనిషే."

    "రిపోర్టు ఏమైనా  వచ్చిందా?"

    "ఆ, ఆ సమయాలలో  చుట్టుపక్కల  ప్రయాణం  చేసిన నౌకల గురించి విచారిస్తే ఒకే ఒక నౌక ఆ ప్రాంతములో  కనిపించినట్లు  జపాన్ దేశ విమాన  పైలెట్ చెప్పాడు. కాని దాని మీద  ఎలాంటి పేరూ  కనిపించలేదట."

    "అంటే....అది....?" ప్రశ్నార్ధకంగా  ఆపేసింది పద్మజ.

    "అయి ఉండవచ్చు. నౌకలో  సరుకు గురించి చాలా రహస్యంగా ఉంచపడింది. అయినా  అది తెలుసుకుని  ప్రయత్నము  చేయగలిగారంటే  అది మామూలు మనుషుల పనికాదు. పెద్ద ముఠాయే అయి వుండాలి. ఇంకో రకంగా  చూస్తే  ఓడ ప్రమాదవశాత్తూ మునిగిపోయి  వుండడానికి  ఆవకాశం వుంది."

    "ఎస్. ఓ. ఎస్. అయినా  ఇవ్వకుండానే  అలా జరిగి వుంటుందా అని ?"

    "ఉండవచ్చు" జేబులోంచి  కాగీతం తీసి చదివాడు సోమశేఖరం.

    "1913 లో  మహాజగమిత్ర అనే నౌక, 1975 లో  ఆకాశ్  మారు-2 అనే నౌక  బంగాళాఖాతంలో  అదృశ్యమైపోయాయి. 1977లో చంద్రగుప్త  అనే నౌక  పసిఫిక్ మహాసముద్రంలో అలాగే మాయమయింది. 1979లో  గోవా నుంచి జర్మనీకి  యినుప  ఖనిజం  తీసుకెళుతున్న కైరళి అనే నౌక  అరేబియా సముద్రంలో ఏ విధమైన సూచనా ఇవ్వకుండా  మాయమయింది. ఈ మధ్యకాలంలో  చాలా నౌకలు యిలాగే మాయమయ్యాయని రిపోర్టు వచ్చింది. కాని యిప్పుడు  మన డిపార్టుమెంటుకి  సంబంధించినది కాబట్టి  మనదాకా వచ్చింది.  కారణాలు విచారిస్తే, ఒకటి హైజాకింగ్ అయివుండాలి. రెండు- ప్రమాదవశాత్తూ  అంటే ఏదో ఒక సబ్ మెరీన్ చూడకుండా  గుద్దేయడం కావచ్చు. బాయిలర్ ఒక్కసారిగా పగిలిపోవడం వల్ల కావచ్చు- దేనివల్లనయినా  అయివుండాలి."

    "ఇన్ని నౌకలు  ఇలా మాయమవుతున్నాయంటే  ఎవరూ పరిష్కారం కనుక్కోలేదా ?"

    ఉంది. DPIRB (Emergency position Indicating Radio Reacon/Buoy) పద్ధతి ఒకటే దీనికి పరిష్కారం. దీన్ని డెక్ మీద అమరుస్తారు. పడవ కేదైనా ప్రమాదం జరిగితే ఇది ఆటోమేటిక్ గా సిగ్నల్ పంపుతుంది. నీళ్ళమీద తేలుతూ నౌక ఎక్కడ మునిగిందో తెలియజేస్తుంది. బహుశ మనదేశంలో 1990 కల్లా యిది అమలులోకి రావచ్చు" రిపోర్టు మూసేస్తూ అన్నాడు సోమశేఖరం.

    "ఇంకా  అన్నేళ్ళా? ఎన్ని అనర్ధాలు జరుగుతాయో?" బాధగా అంది పద్మజ. "అయినా శేఖరం, కేవలం డబ్బుకోసం ప్రాణాలతో ఆడుకోగలిగే మనుషులు మన ప్రజల్లో ఉన్నారంటే ఆశ్చర్యం కదూ ?"

    "ఇంతకీ యిప్పటి ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు.

    "చేసేదేముంది? ముందుగా ఒక పత్రికా ప్రకటన యివ్వడం  ఆ నౌకలో  ఆయుధాలున్నాయన్న  వార్తను ఖండిస్తూ...లేకపోతే  రేపు పార్లమెంటులో  అపోజిషన్ దాడి! తర్వాత  మనమీద పై వాళ్ళ దాడి మొదలవుతుంది. ఇక పరిశోధన విషయానికొస్తే  ముందుగా  గోవా, బాంబేల నుంచి మొదలుపెడితే బాగుంటుంది" టక టకా ప్లాన్ గురించి వివరించింది పద్మజ.

    "అయితే  నేను వెళ్ళి పత్రికా  ప్రకటన  పంపిస్తాను" లేచాడు సోమశేఖరం.

    "అన్నట్లు  యివ్వాళ  సాయంత్రం  ప్రకాశరావుగారింట్లో  పార్టీకి వస్తున్నారా" అడిగింది.

    "లేదు. ఇవ్వాళ సాయంత్రం యింట్లోనే ఉంటానని  అమ్మకు ప్రామిస్ చేశాను."

    "ఆవిడ ఆరోగ్యం ఎలా వుందిప్పుడు ?"

    "ఫరవాలేదు చెప్పినమాట  వినదుగా. కాస్త బాగుండగానే  లేచి యింటి పనంతా చేస్తుంటుంది."

    "పోనీ పెళ్ళి చేసుకోరాదూ? ఆవిడా సంతోషిస్తుంది-మీకూ భారం తగ్గుతుంది."

    "భలేవారే! అప్పుడు  ఉద్యోగం  మానేయాల్సొస్తుంది."

    "దేనికి ?"

    "మరి యిద్దరి కోరికలు  తీరుస్తుండాలి గదా."

    పద్మజ నవ్వేసింది. అతడు ఆగి, ఏదో చెప్పబోయి, మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు.

    ఒక పని చేయటానికి ఒక క్షణం తటపటాయిస్తే __జీవితంలో  ప్రతిక్షణమూ  ఒకోసారి విచారించవలసివస్తుంది.


                               2

    "రామయ్యా!"

    "అమ్మా!"

    "హిమజ వస్తే చెప్పు - నేను ప్రకాశరావుగారింటికి  పార్టీకి  వెళ్ళాననీ, వస్తానంటే రమ్మను. ఇద్దరం  కలిసి తిరిగివస్తాం" అంది హిమజ ఆమె చెల్లెలు.

    "అలాగేనమ్మా."

    సాయంత్రం ఏడు దాటింది,

    'ఇప్పటికే ఆలస్యమయిపోయింది.' అనుకుంటూ బయలుదేరింది పద్మజ.

 Previous Page Next Page