అతడి గురించిన నిజాలు నా ప్రేమను వెక్కిరించిన మాట నిజం. పరాయి సొమ్మును ప్రేమించడంగాని, ఆశించడం గాని పాపమనిపించింది. నెమ్మది నెమ్మదిగా ఆ సుడిగుండం నుండి బయటపడ్డాను!" అని ముగించింది బిందు.
"నీ కథ బాగుంది బిందూ! నేను కథ వ్రాసుకోవడానికి పర్మిషన్ ఇస్తావా?"
"ఊహలకి రెక్కలొచ్చే వయసది. పక్షిపిల్లకి రెక్కలొచ్చి ఎగరడం నేర్చుకొంటున్నప్పుడు ఏ ముళ్ళకంపలో పడుతుందో, ఏ పూల వనంలో పడుతుందో తెలియదు. వ్రాయండి మేడమ్! ప్రతి కన్నెపిల్ల గుండెనీ ఎవరో ఒకరు ఒకరు గిలిగింతలు పెడతారు. కొందరు గుట్చుగా వుండిపోతే కొందరు మాత్రమే బహిర్గతమౌతారు" అంది బిందు.
"మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. పిల్లలూ కేవలం సినిమాలు, షికార్లు....... ఏదో అమ్మా నాన్న చదివిస్తున్నారు కదాని డిగ్రీలను అలంకార ప్రాయంగా చదివే ఆడపిల్లలు........వీళ్ళ శాతమే ఎక్కువగా చూశాను. సామాజిక చైతన్యం , సమస్యల పట్ల అవగాహన....... ఇప్పుడు మీలో చూస్తున్నాను. మీలాంటివారే కావాలి మహిళా చైతన్యం వెల్లివిరియడానికి! మీలాంటి వారే కావాలి మహిళల ఆత్మగౌరవం నిలబెట్టడానికి" సుభాషిణి మనస్పూర్తిగా అభినందించింది.
"మీరిప్పుడు ఏం కథ వ్రాస్తున్నారు మేడమ్?" విశిష్ట కుతూహలంతో ప్రశ్నించింది.
"అతివలమీద జరిగే అత్యాచారాలను సబ్జెక్ట్ గా తీసుకొని వ్రాస్తున్నాను. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, మోతుబరుల ఇళ్ళలో.... ఆడవాళ్ళమీద అత్యాచారం జరగడం సహజమే అయినా ఇప్పుడు ఆఫీసుల్లో, పరమ పవిత్రమైన విద్యాలయాల్లోకి కూడా ప్రవేశించాయి. అందమైన స్టూడెంట్ కనిపిస్తే లెక్చరర్ నడత పక్కదారి పడుతోంది. వాళ్ళకి ట్యూషన్లు చెప్పే నెపంతో ఇంటికి పిలిచి పాడుచేసిన సంఘటనలున్నాయి. ప్రొఫెసర్ల దయాభిక్షమీద ఆధారపడే లేడీ రీసెర్చి స్కాలర్లు కొందరు ప్రొఫెసర్ల కామదాహానికి బలి అయిన సంఘటనలు కొన్ని నా దృష్టిలోకి వచ్చాయి. జరిగిన కొన్ని సంఘటనల ఆదారంగా వ్రాస్తున్నాను నవల"
"మేం ఇంటర్ మీడియట్ లోకి వచ్చినప్పటినుండి పత్రికలూ, నవలలూ చదవడం అలవాటైంది మేడమ్! ముఖ్యంగా మీ రచనలంటే మాకిష్టం. ఏదో కాలక్షేపం కథలు కాక ఆలోచనాత్మకంగా వుంటాయి మీ రచనలు. 'సాంధ్యశ్రీ' అన్న కలం పేరుతో వ్రాస్తున్నది మీరని తెలిశాక ఇప్పుడు మరింత ఇంట్రెస్ట్ పెరిగింది మీ రచనలపట్ల" ఆరాధనా పూర్వకంగా అంది బిందు.
"నాకింత గొప్ప పాఠకాభిమానులున్నారని నాకీనాడే తెలిసిందర్రా. నా పాఠకులు చాలా తెలివైన వాళ్ళని తెలిశాక రచనలు మరింత బాధ్యతా యుతంగా చేయకపోతే వీపుమీద తాషామార్చా మ్రోగిస్తారని తెలిసింది"
సుభాషిణి విసిరిన ఛలోక్తికి నలుగురూ ఫక్కున నవ్వారు.
* * *
విశిష్టకి జ్వరం రావడంవల్ల రెండు రోజులు కాలేజీకి వెళ్ళలేదు. ఆ రెండురోజులు నడిచిన పాఠాలు తెలుసుకొని నోట్స్ తీసుకొంది కరుణ దగ్గరనుండి.
ఇంటికి వచ్చి నోట్స్ తెరిచిన విశిష్టకు నోట్స్ లో అక్కడక్కడా ఏవో సినిమాపాటలు కనిపించాయి. "దీనికి ఈ సినిమాపాటల పిచ్చేమిటో" అనుకుంటూ పేజీలు తిప్పసాగింది. ఒకచోట 'కరుణా పృధ్వీ' అని వ్రాసింది. మామూలుగా వ్రాసినట్లుగా కాదు. ఏదో శిలమీద ఉలితో చెక్కినట్లుగా వున్నాయి ఆ అక్షరాలు ఒకచోట కాదు, నాలుగైదు పేజీల్లో! ఆ పేరు వ్రాసినచోటల్లా ఆకుతో వున్న గులాబీపువ్వు వేసింది.
కరుణకి బొమ్మలు వేయడంలో చిన్నప్పటినుండి ఆసక్తి వుంది. చిత్రలేఖనం కాంపిటీషన్స్ లో రెండు మూడుసార్లు బహుమతులు గెలుచుకొంది కూడా.
తన పేరుతో కలిసి అతడి పేరు వ్రాసుకొందంటే ఖచ్చితంగా ఇది ఏదో ప్రేమ వ్యవహారమే వుంటుందనిపించింది. పృధ్వి పేరుతో ఎవరైనా స్టూడెంటున్నాడా, లేక ప్రొఫెసర్ పృధ్వీకుమారా?
చిన్నప్పటినుండి ఏ అరమరికల్లేకుండా పెరిగిన తమమధ్య ఈ దాపరికం ఎలా చోటు చేసుకుంది?
మరునాడు నోట్స్ కరుణకి ఇచ్చివేస్తూ "నువ్వు చాలా మారిపోయావు కరుణా!" అంది నిష్టూరంగా.
"మారిపోయానా? ఏం చూసి అంటున్నావు ఆ మాట?" ఆశ్చర్యపోయింది కరుణ.
"చిన్నప్పటి నుండి మనం స్నేహితులం. నీకు నాకూ మధ్య ఏ దాపరికాలు లేవు. ఇప్పుడొచ్చాయంటే మారిపోయినట్టే కదా?"
"ఇప్పుడు నేనేం దాచాను నీ నుండి?"
"దాచావు. గుర్తు తెచ్చుకో?"
"అబ్బే! నేనేం దాచిన గుర్తులేదు"
"అవును! నోట్లో వేలు పెడితే కొరకలేవుగాని నీ పేరుతో కలిపి అతడి పేరు వ్రాసుకొంటావు"
"అతడి పేరా? అతడెవరు?"
"ఇంకా నటించావంటే తంతాను"
"అడిగేదేదో సూటిగా అడగొచ్చుగా?"
"పృధ్వీ ఎవరు?"
"పృధ్వీ తెలియదా? పృధ్వీకుమార్. మన ఇంగ్లీష్ ప్రొఫెసర్"
"అతడితో నీకెప్పుడు పెళ్ళయింది?" వ్యంగ్యంగా అడిగింది.
"పెళ్ళయిందని ఎవరు చెప్పారు?" ఆశ్చర్యపోవడం కరుణ వంతు అయింది.
"ఈ రాతలకి అర్దం ఏమిటి?" ఆమె చేతిలోంచి చివాలున నోట్సు లాక్కొని గబగబా పేజీలుతిప్పి 'కరుణా పృధ్వీ' అని వ్రాసి వున్నచోటు చూపింది విశిష్ట.
"ఇదా? ఇది........ఇది.." నీళ్ళు నమిలింది కరుణ.
"చెప్పు! దీనికి అర్ధం ఏమిటి? నీ పేరుకు అతడి పేరు తగిలించుకొన్నావంటే అతడు నీ మగడనే కదా అర్ధం?"
"మగడే! నా మనసు వరించి వరమాల వేసినవాడు. మగడుకాక ఏమౌతాడు? అందుకే వ్రాసుకొన్నాను. అతడి పేరు నా పేరుతో కలిపి!" అంది తెగించినట్టుగా.