"నిజమే చెబుతున్నాను. నిధి రహస్యం అంటూ నాకెవరూ ఏమీ చెప్పలేదు. నాకేమీ తెలియదు."
"జనవాడుక తెలిసిందన్నావుకదా. మరి నిధి కోసం ప్రయత్నించలేదా?"
"జనంలో ప్రచారంలో వున్న కథలు పట్టుకుని నిధికోసం కోటను త్రవ్విస్తూ కూర్చునే తెలివితక్కువ వాడినికాదు. పాతకోటలో నిధి వుందని నేను నమ్మలేను"
"నీకు అడుగు దూరంలో మృత్యువు నిలబడి వుందని నమ్ముతావా?"
"అది నువ్వే అయితే నన్ను చంపడం నిష్కారణమంటాను"
"నిష్కారణం కాదు. నిధి రహస్యం బయటపెడితే నీకు మృత్యుదండన తప్పుతుందని మరోసారి చెబుతున్నాను"
"నాకు తెలియదని చెబుతున్నాను కదా"
"అపారమైన నిధిని భూస్థాపితం చేసి ఆ రహస్యం తన వారసులకు చెప్పకుండానే చచ్చాడా మీ ముత్తాత"
"నేను పుట్టకముందే ఎప్పుడో ఎన్నేళ్లక్రితమో చనిపోయిన మా ముత్తాత గురించి నేనేం చెప్పగలను?"
"ఆయన దొంగలతో చేతులు కలిపి అపారమైన సంపద కూడబెట్టారన్న సంగతైనా విన్నావాలేదా?"
"జనం వాడుకగా విన్నాను"
"అది ఎక్కడో నిక్షిప్తం చేసి వుంటాడనీ, దానికోసం ప్రయత్నించాలనీ అనుకోలేదా?"
"చెప్పానుకదా. నాకు పందికొక్కు బుద్దులులేవని."
"అంటే నన్ను పందికొక్కునని తిట్టడమా?"
"నేను నిన్ను తిట్టలేదు. నా మానాన నన్ను వదిలేస్తే వెళ్లిపోతాను. అనవసరంగా తెచ్చి నన్ను బంధించారు. నిధి రహస్యమంటూ వేధించి చంపుతున్నారు. నన్ను బంధించారు సరే నా భార్యనెందుకు బంధించారు?"
"ఇరవయ్యేళ్లు కలిసి సుఖదుఃఖాలు పంచుకున్నారు. ఈ చివరిక్షణాలలో ఎడబాపిన పాపం మాకెందుకని నాయక్! వీడు ఊరికే అయితే చెప్పేట్టులేడు. మర్యాద చేయాల్సిందే ఇక. ఏదీ కొరడా?"
రంజిత్ ఆదేశంతో ఒకడు కొరడా తెచ్చాడు.
అది అతి నిర్దాక్షిణ్యంగా మోహనవంశీ మీద నర్తించడం మొదలుపెట్టింది.
"మీ పాతకోటలో మీ పూర్వీకులు దాచిన నిధి రహస్యం కావాలి మాకు. అది మోహనవంశీ ముత్తాతగారు భూస్థాపితం చేసినది!" అంటూ ఆ విషయం చెప్పాడు రంజిత్.
"మోహన్! నీకు గుర్తుందా? చాలా ఏళ్ళక్రితం........మనం ఒకసారి పాతకోటలో తిరగడానికి వెళ్ళాం. భవనానికి ఈశాన్యంలో ఒక చిన్నగుడి వుంది. అది ఆంజనేయస్వామివారి గుడి అని, పూజలూ పునస్కారాలు లేక పాడు పెట్టబడిందని చెప్పావు. గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభపు కట్టకు ఒక నల్లరాతి ఫలకం ప్రత్యేకంగా ఉండడం చూసి చెప్పావు!"