"కృతజ్ఞుడ్ని విషాచి నువ్వు నాకు నేర్పిన ఈ మహావిద్యలకి నేను నీకు సదా కృతజ్ఞుడ్ని అయివుంటాను. నీ కోర్కె తీరుస్తాను. కాద్రాని చంపిన ముగ్గురు వ్యక్తుల్నీచంపుతాను. వాళ్ళని మామూలుగా చంపను విషాచీ - ఒకర్ని మానసికంగా చంపుతాను. ఇంకొకర్ని మంత్రం శక్తితో దగ్దం చేస్తాను. మరొకర్ని స్వయంగా ఈ చేతుల్తో హత్యచేస్తాను......."
విషాచి కళ్ళెత్తి దార్కావైపు చూసేడు. దార్కాలో ఆవేశంలేదు. వుద్వేగం లేదు. అతడి కళ్లు నిస్తేజంగా వున్నాయి. కుందేలు మీదకి పంజా విసరబోయే పులిలా వున్నాడు. అతడి నిశ్చలత చూసి ఆ క్షణం విషాచికి ఒళ్లు గగుర్పొడిచింది. ఎన్నో మరణాల్ని చూసిన వృద్దుడు కూడా ఆ క్షణం భయంతో వణికేడు. నెమ్మదిగా అన్నాడు.
"ఎక్కడని వెతుకుతావు దార్కా వాళ్ళని? అర్ధరాత్రి వచ్చారు. అప్పుడే వెళ్ళిపోయారు."
దార్కా చెయ్యి బిగుసుకుంది. "వెతుకుతాను - భూమ్మీద - నీళ్ళలో - అగ్నిలో- గాలిలో. ఎక్కడున్నాసరే వాళ్ళని పట్టుకుంటాను -నా మాట నమ్ము విషాచీ."
ఇద్దరూ దార్కా గుడిసె చేరుకున్నారు.
విషాచి నడుము గుడ్డలోంచి బొమ్మ ఒకటి తీసేడు. దానికి కాళ్ళూ చేతులూ లేవు.
"దీనిమీదే దార్కా - కాష్మోరాని ప్రయోగించింది. ఆఖరి క్షణంలో ఇది అగ్నిలో పడబోయేముందు వాళ్ళు వచ్చి, మంత్రాన్ని రాకుండా చేసేరు. కాద్రాని పైశాచిక గణాలకి బలిచేశారు. ఈ బొమ్మ తప్ప మనకిక ఏ ఆధారమూ లేదు" అంటూ అందించేడు.
దార్కా బొమ్మిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం నూట ఎనిమిది ముళ్ళు గుచ్చబడిన బొమ్మ! గుడ్డలు శిధిలమైపోయి వున్నాయి. కర్మ సగంలో ఆగిపోయిన బొమ్మ. అతడి వేళ్ళు నెమ్మదిగా బొమ్మని తడుముతున్నాయి.
అప్పుడు దొరికింది -
నడుము ప్రాంతములో
ముడివేయబడిన వెంట్రుక.
శిథిలమవకుండా యధాతథంగా.
అతడు సాలోచనగా విషాచివేపు చూసేడు.
ఈ ఒక్క వెంట్రుక సాయంతో ఎలా - ఎలా కనుక్కోవటం? ఈ వెంట్రుక ఎవరిమీద ప్రయోగింపబడిందో తెలుసుకుంటే - వాళ్ళ తాలుకా ఎవరోచ్చారో కనుక్కోవడం -ఆ తరువాత సులభం. కానీ అసలీ వెంట్రుక ఎవరిదో తెలుసుకోవడం ఎలా?
అతడు దాని గురించి మరి ఆలోచించకుండా లోపల పెట్టుకున్నాడు - విషాచి వెళ్ళడానికి సిద్ధపడి మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు
"దార్కా - కాద్రా మరణించిన రోజు రాత్రి నేను అతడి ఇంటికి వెళ్ళి శోధించాను మూల మూలలా వెతికాను, ఎవరిమీద అతడు ప్రయోగము చేశాడో వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనని కాని ఏమీ దొరకలేదు."
దార్కా మాట్లాడలేదు.
"వెళ్ళొస్తాను" అన్నాడు విషాచి
"మంచిది"
విషాచి చీకట్లో కలిసిపోయాడు. దార్కా అక్కడే అలాగే కొద్దిసేపు నిలబడి లోపలికెళ్ళాడు.
బాగా చీకటి పడింది.
అతడు వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు.
ఈ వెంట్రుక సాయంతో చేతబడి కుదరదు. అయినా తను చేయవలసింది - కాద్రా ఎవరిమీద చేతబడిచేసి కృతార్ధుడు కాలేకపోయాడో వాళ్ళని చంపడం కాదు. వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళెవరు? అది కనుక్కోవాలి. ఎలా - ఎలా?
విషాచి. కాద్రా ఇల్లంతా వెతికానని అన్నాడు. ఏమీ దొరకలేదా?
మంత్రగాడు చనిపోతే ఆ ఇల్లుపాడు పెడ్తాడు. ఇంకెవరూ చేరరు ఖాళీగా వుండాల్సిందే.
ఒక్కసారి వెళ్లి వెతికితే......
అర్ధరాత్రి కావొస్తోంది.
తనపాక తలుపు దగ్గరకు వేసి, బయటకి నడిచేడు.
బిస్తా గ్రామం నిద్రపోతోంది. బయట వారు ఆ గ్రామాన్ని ఆ నిశిరాత్రి చూస్తే అమాయకంగా తల్లి ఒడిలో నిద్రిస్తున్న పాప గుర్తువస్తుంది. కానీ అమాయకంగా కనబడే ప్రతి పాకలోనూ మూసిన తలుపులు వెనుక ఏదో ఒక రైటువల్ ఎప్పుడూ జరుగుతూనే వుంటుందన్న విషయం చాలా కొద్దిమంది బయటవాళ్ళకు తెలుసు.
దార్కా దేన్నీ పట్టించుకోకుండా నడుస్తున్నాడు. కుక్కలు కూడా మొరగడం లేదు. ఆ గ్రామంలో అర్దరాత్రి నడిచే నిశాచరులు వాటికి కొత్త కాదు, పగలు నడిస్తేనే విచిత్రం.
ఐదు నిమిషాల్లో అతడు కాద్రా పాక చేరుకున్నాడు. మిగతావాటికి దూరంగా. తన ప్రత్యేకత నిలుపుకుంటున్నట్టుగా వుంది. ఒకప్పటి వైభవాన్ని కోల్పోయిన కోట, గతస్మృతుల్ని తల్చుకుంటూ శిధిలమైనట్టుగా వుంది.
అతడు ఒక్క క్షణం నిలబడి ఆ ఇంటివైపు చూసేడు.
కదిలిన తలుపు కుదుపుకు పై నుంచి ఒక చెద రాలి టప్ న నేలమీద పడింది - అంతే ఆ తరువాత గాడమైన నిశ్శబ్దం. అతడు అడుగు ముందుకు వేశాడు. కాళ్ళ మధ్యనుంచి ఒక ఎలుక బెదురుతూ పరుగెత్తింది.
తనని రెండు కళ్ళు నిశితంగా గమనిస్తున్నాయని అతడికి తెలీదు.
పాక మధ్యలో నిలబడి అతడు అగ్గిపుల్ల వెలిగించాడు.
ఆ తర్వాత నెమ్మదిగా వెతకడం మొదలు పెట్టాడు. వెతకడానికి ఏమీలేదు. శిధిలమైన పాత గుడ్డలూ ఒకప్పుడు మహా అద్భుతాల్ని సృష్టించిన ఎముకలూ, పాత ట్రంకు పెట్టె - ముట్టుకోగానే పూడిపోయింది దండెం.
అంతలో అగ్గిపుల్ల ఆరిపోయింది.
పాత తలుపు కొద్దిగా కదిలిన చప్పుడు, చల్లటిగాలి లోపలికి రివ్వున వీస్తూంది. అతడు రెండు చేతులూ అడ్డుపెట్టి మరో అగ్గిపుల్ల వెలిగించాడు.