పైన మూడు రకాల చేతివ్రాతలను గమనిస్తే, చేతివ్రాతలని మూడు రకాలుగా విడగొట్టవచ్చని అర్దమౌతుంది. ఈ మూడింట్లో మీరు ఏ రకానికి చెందుతారో నిర్ణయించుకోండి. ఆ తర్వాత ఈ క్రింది విశ్లేషణని చదవండి.
పెద్ద అక్షరాలు:
పెద్ద అక్షరాలు వ్రాసేవారు సాధారణంగా ఎక్కువ కోర్కెలు కలిగిన భోళామనుషులై వుంటారు. వీళ్లు జీవితంలో గెలుపుని చవిచూస్తారు. చాలామంది సినిమా ఏక్టర్లు, రాజకీయ నాయకుల దస్తూరి ఈ విధంగా వుంటుంది. ఒక్క మహాత్మా గాంధీ తప్ప చాలా మంది ప్రముఖులు వ్రాసే అక్షరాలు పెద్దవే. గమనించి చూడండి.
ఇలా పెద్దక్షరాలు వ్రాసేవారిలో చాలామంది సాధారణంగా ఆబ్జెక్టివ్ కన్నా ఎక్కువ సబ్జెక్టివ్ గా వుంటారు.
వీళ్లలో ఒక ఛాలెంజ్ ని ఎదుర్కోవాలనే తపన ఎక్కువగా వుంటుంది.
జీవితంలో గుర్తింపుని ఎక్కువగా కోరుకుంటారు. తనమీద తమకి ఎక్కువ నమ్మకం వుంటుంది.
కాసింత గర్వం కూడా వుంటుంది.
వీళ్లు సాధారణంగా ఆశావాదులై వుంటారు.
కొంచెం దానగుణం కూడా కలిగివుంటారు.
ప్రతీ విషయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడ గలిగి వుంటారు.
అసరమైనదాని కన్నా ఎక్కువగా డబ్బు ఖర్చుచేస్తారు.
ఆధునికంగా, విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.
వీళ్లలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా లేకపోలేదు.
వీళ్లలో అబ్జెక్టివిటీ ఎక్కువగా వుంటుంది. అలాగే క్రమశిక్షణని ఎక్కువ ఇష్టపడినా వీళ్ళు మాత్రం క్రమశిక్షణతో మెలగరు.
ఒక విధమైన నిర్లక్ష్య భావంతో జీవితాన్ని గడుపుతారు.
స్వార్దం పాలు కూడా ఎక్కువగానే వుంటుంది.
జ్ఞాపకశక్తిపట్ల నిర్లక్ష్యంగా వుంటారు. అంటే, విషయాలని గుర్తుపెట్టుకొనేశక్తి వీళ్లల్లో వున్నప్పటికీ,ఎందుకు గుర్తుంచుకో వాలి అదే ధోరణి వుంటుంది.
అలాగే వీళ్లకి ఎక్కువగా 'ట్యాక్ట్' తెలీదు. అవతలివాళ్లని బుట్టలో వేసుకొనే విధానం అసలు తెలీదన్నా , అందులో ఆశ్చర్యం ఏమీలేదు.
డబ్బు విషయంలో నిర్లక్ష్య మెక్కువ. చాలా విషయాల్లో ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం వుండదు. తమకున్న అభిప్రాయమే చాలా కరక్టనుకుంటారు .ఎదుటి వాళ్లని గుర్తించడానికి వీళ్ళు ఇష్టపడరు.
వీరి విషయంలో ఒకోసారి నిజమనిపించింది కలగాను, కలగా అనిపించింది నిజమని అనిపిస్తూవుంటుంది. వీళ్లెప్పుడూ స్థిరంగా వుండటానికి ఇష్టపడరు. ఉద్యోగాలు, ఇళ్లూ తరచూ మార్చినట్లుగానే ప్రేమ వ్యవహారాలు కూడా మారిపోతూవుంటాయి.
వీరి స్వభావాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే పుస్తకంలోని చివరి పేజీలని ముందుగా చదివే స్వభావం అనొచ్చు.
చెప్పినదాన్ని, విన్నదాన్ని త్వరగా అర్దం చేసుకొని అన్వయింపజేసుకొనే శక్తి వీళ్లకుంది.
ఇతరుల పట్ల స్నేహభావాన్ని చూపించి, త్వరగా జాలిపడ్డావారు అర్హులు కారు అని తెలిసిన వెంటనే దూరంగా వెళ్లిపోతారు.
వీరు చేసినంత త్వరగా, సమర్దవంతంగా ఇతరులు పనిచేయలేరు. అనటంలో అతిశయోక్తిలేదు. చాలామంది కంటే అసలుసిసలైన తెలివితేటలు వీరికుంటాయి.
వ్యంగ్యంగా మాట్లాడటం అన్నా, అల్లరి చేయటం అన్నా వీరికి చాలా ఇష్టం.
ఒకేసారి నాలుగైదు పనులు చెయ్యటంలో నైపుణ్యాన్ని ప్రదర్శించి, చూసే వాళ్లని ఆశ్చర్య చకితుల్ని చేస్తారు.
ఎవరి మెచ్చుకోలు కోసమో కాకుండా, తమకోసమే తమ జీవిత విధానాన్ని నిర్ణయించుకుంటారు.
ఒకే చోట కదలకుండా కూర్చోవటమన్నా యాంత్రికమైన పనులు చెయ్యటమన్నా వీళ్ళు చాలా అయిష్టత చూపుతారు.
సాహిత్యంలో వుత్సాహం వున్నవాళ్లైతే తెలివిగా పదాలను కూర్చి సందోర్బోచితంగా వాక్యాల్ని నిర్మిస్తారు.
వీరు కళ్ళల్లోనూ, సాహిత్యంలోనూ, మిగిలిన 'ఆర్ట్' సంబంధమైన విషయాల్లో బాగా పైకొస్తారు.
క్షణక్షణానికి వీరి అభిప్రాయాలు మారుతూ వుంటాయి. వీరి మనస్సు వీళ్లకి తెలిసినట్లుగా ఇతరులకు తెలిసే అవకాశం లేదు. వీరు తమను తాము ఒక పుస్తకంలా చదవటానికి ఎదుటివారికి ఇవ్వరు.
తమని తాము రక్షించుకోటానికి వీళ్లు ఇతరుల సలహాలను పాటించరు. వాళ్ల జాగ్రత్తలోనే వాళ్లుంటారు.
వాదనల్లోగానీ, మాటలలోగానీ వీళ్లదే పైచేయి.
ఒక భాషకంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి వీళ్లలో వుంటుంది.
వీరిలో వున్న అధ్బుతమైన కళ ఏంటంటే, ఎస్కిమోలకు కూడా కిలో రెండ్రూపాయల చొప్పున ఐస్ ని అమ్మగలరు. అలాగే నిరాశావాదులకు అందమైన కలలను కేజీలచొప్పున అమ్మగల సమర్దులు వీరు.
వీరు ఇతరులకి ఎంతో బద్దకస్తులుగా కనిపించినా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా త్వరితగతిన పనులు చేయగలరు.
వీరితో వచ్చే పెద్ద చిక్కేమిటంటే, క్షణక్షణానికి మారే వీరి అభిప్రాయాలని చూసి ఇతరులు వీళ్ళని అబద్దాలకోరు అనుకొనే ప్రమాదం వుంది. వీరు నిజంగా అబద్దాలాడరు. మారే అభిప్రాయాలే వీళ్లనావిదంగా ఎదుటివారి ముందు నిలబెడతాయి.