మీరు ఊహించని సమయంలో అకస్మాత్తుగా మీ రూపాన్ని పట్టి బంధించినట్టే నిర్లక్ష్యంగా వ్రాసిన మీ దస్తూరి మీ ప్రవర్తన గురించి కరెక్టుగా చెబుతుంది. అందువల్లే మీరు ఎప్పుడో వ్రాసిన స్క్రిప్ట్ తీసుకోమన్నది! దీని కోసం ప్రత్యేకంగా రాయొద్దు.
చేతివ్రాతను బట్టి మనస్తత్వాన్ని కనుక్కోవటాన్ని పన్నెండు రకాలుగా విభజింపవచ్చు. అవి.
1. అక్షరాల సైజు
2. అక్షరాల వంకర
3. అక్షరాల పొడవు
4. వెడల్పు
5. ఒద్దిక
6. కూర్పు
7. కలం వత్తిడి
8. వాక్యాల గమనం
9. అక్షరాల వత్యాసం
10. మార్జిన్
ఇవిగాక ఇంకా అడ్రసులు వ్రాయడం, సంతకాలు పెట్టడం వీటన్నింటి గురించి కూడా ఈ పుస్తకంలో వివరణ ఇవ్వబడింది.
మరో ముఖ్యమైన విషయం!
ఈ విశ్లేషణలో గమనించవలసిన ముఖ్య అంశం మరొకటి వుంది. లోపలిపేజీల్లో వివిధ రకాల విశ్లేషణల్లో, చాలా రకాలుగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి "కుడివైపుకి వంచి అక్షరాలు వ్రాసేవారు అవతలి వాళ్లని సులభంగా ఆకర్షించే నైపుణ్యం కలిగి వుంటారు" అని మీరు లోపలి పేజీల్లో చూడవచ్చు. అప్పుడు మీకో అనుమానం రావచ్చు - "చేతివ్రాతకీ, దీనికీ ఏమిటి సంబంధం?" అని.
ఈ సైన్సులో "ఒక వ్యక్తి చేతివ్రాత కుడివైపు వంగి వుంటే మనిషి ఎట్రాక్టివ్" అని వుంది. తెలుగు పాఠకులకి మరింత ఇంటరెస్టింగ్ గా వుండేటందుకు, కొంత స్వంత వివరణ కలపటం జరిగింది. లిండా గుడ్ మన్ రాసి ఫలాల విశ్లేషణని ఈ సందర్బంలో బేస్ గా చేసుకోవటం జరిగింది. చాలా వుదాహరణలు అక్కడి నుంచి తీసుకున్నవే. పరిశోధకుడు ఒక్కపదం ఇస్తే - దాన్ని తెలుగు పాఠకుల కోసం మరింత సోదాహరణంగా వివరించటం జరిగింది .
నిజానికి గ్రాఫాలజీ పుస్తకాల్లో ఇంత వివరణ కానీ ఉదాహరణలు కానీ,విశ్లేషణ కానీ లేవు. కేవలం గుణగణాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి "అక్షరాలు పెద్దగా వ్రాసేవారు 1. గుర్తింపు. 2. విలాసవంతమైన జీవితం, 3. ఆత్మ విశ్వాసం కలిగి వుంటారు." అని సింపిల్ గా వ్రాయబడింది. ఇలాంటి గ్రాఫాలజీ పుస్తకాలు నాలుగయిదు చదివి, అన్నింటినీ క్రోడీకరించి స్వంత విశ్లేషణ చేర్చటం జరిగింది. మనిషఇ గుణగణాలు పాయింట్ టు పాయింట్ కాకుండా దానికి వీలైనన్ని ఉదాహరణలు చేర్చటం ఆసక్తిరేకెత్తిస్తుందని భావించి, ఈ విధంగా వ్రాయటం జరిగింది.
మొదట, పైన చెప్పిన పది అంశాలని ఒకటి తరువాత ఒకటి పరిశీలిద్దాం.
1. అక్షరాల సైజు:
ఇవి మూడు రకాలు. పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు. మీడియం సైజు అక్షరాలు.