Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 4

     పులి చర్మంమీద కూర్చుని వున్నారు ఆత్మనందులు.

     కాషాయాంబరాలు, గుబురు గడ్డం, జడలు కట్టిన జుట్టు, మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలు వున్న మాల, కనుబొమల మధ్య ఎర్రటి కుంకుమ బొట్టు.

     సదా ప్రసన్న దరహాసం.

     ఆ ముఖంలో ఏదో అలౌకికమైన వెలుగు.

     వినయంగా చేతులు జోడించాడు సూర్య.

     ఆత్మానందులు ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యెత్తి --" ఇలా వచ్చి కూర్చో సూర్యా!"అన్నారు.

     సూర్య విభ్రాంతి పొందాడు.

     "నా పేరు....."

    "పేరేనా? అన్నీ తెలుసు నాకు."

    సూర్య ఆయన దగ్గరగా వెళ్లడానికి దారి వదులుతూ జరిగాడు ప్రక్కకి. వెళ్లి ఆయనకి సమీపంగా కూర్చున్నాడు సూర్య.

     "పాపం! కర్మ పీడితుడివి. చాలా బాధపడుతున్నావు సుమా! నిన్ను చూస్తే జాలి వేస్తున్నది. నీకేదయినా సాయం చేయాలనిపిస్తోంది"అన్నారు ఆత్మానందులు.
 
     "మీవంటి సాధు పుంగవుల కృపకు పాత్రుడివి  కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామీ!"

    "కర్మ పీడితుడివి. కర్మ తొలగించగలను. కానీ అది ఈ జన్మకే. మళ్లీ జన్మ ఎత్తి అది అనుభవించక తప్పదు. చెప్పు ఈ జన్మలోనే అనుభవిస్తావా? అది అనుభవించడానికి మళ్లీ జన్మ ఎత్తుతావా?'

    'కర్మ  అనుభవించడానేకి అయితే మళ్లీ జన్మ ఎత్తలేను స్వామీ! ఈ జన్మలోనే అనుభవిస్తాను.'

    "మంచి నిర్ణయమే. చాలా ఉత్తముడివి. దానధర్మాలు దండిగా చేశావు. పెళ్లిళ్లు చేశావు. పేరుకు పులుగులా ఒకటే చెడుబుద్ది. అది స్త్రీ వాంఛ. స్త్రీ వాంఛ చెడగొట్టింది నిన్ను. అదే స్త్రీ వాంఛకదా స్వర్ణలంకను దహించింది?

    అందుకే పెద్దలు చెబుతారు నాయనా మంచి బుద్దులు కలిగుండాలని, మంచిపనులు చేయాలని. మంచి పనులు చెయ్యడమంటే, మన తోటలో మంచి విత్తనాలు నాటుకోవడం అన్నమాట.

    మంచి విత్తనాలు నాటితే, మంచి ఫలాలు తినవచ్చు. విషపు విత్తనాలు నాటితే, విషఫలాలు తినక తప్పదు కదా! వెనుకటికో బాపడు దొడ్లో కాసిన పొట్లకాయలు దానం చేసి చేసి మరుసటి జన్మలో మహారాజై పుట్టాడు. మంచికి అంత మంచి ఫలితమన్నమాట. అలాగే చెడుకీ' చెప్పారు ఆత్మానందులు.

     "కానీ స్వామీ! ఎంతో చంచలమైనది కదా  ఈ మనసు? అన్నీ మంచి తలంపులే రావాలంటే అదేలా సాధ్యం? అనుకోకుండానే చెడు ఆలోచినలు వస్తాయి" అన్నారు ఒక జిజ్ఞాసువు.

     "మనసు ఎటు పరుగు తీస్తుందో, ఎందుకు పరుగుతీస్తుందో, ఎప్పటి కప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండాలి నాయనా! తప్పుచేసిన ప్రతిసారీ ఇది మంచి ఆలోచనకాదు అంటూ కొరడా  చురకలు పడుతుండాలి. అప్పుడు చెడు ఆలోచనలు రావడం వాటంతట అవే మానేస్తాయి. సాధన, శిక్షణ మనసుకు ముఖ్యమైనవి."

    "ఈ జన్మకిక ఇంతేనా స్వామీ? ఆ దెయ్యం చేత  పీడించబడక తప్పదా?" సూర్య దిగులుపడ్తూ అడిగాడు.

     "ఆమె దెయ్యం ఎందుకైంది? నీవల్లేకదా? నీ వాంఛకు బలి అయ్యి నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుని దెయ్యమైంది. అంతులేని అశాంతితో అలమటిస్తూ తిరుగుతోంది.  పాపం చంద్రరేఖ.... దురదృష్టకరం ప్రాణి పూర్వజన్మలో  కూడా ఆమె ఇలాగే అకాలమరణం చెందింది.  పూర్వ జన్మలో ఆమె.....'అంటూ చెబుతున్నవాడల్లా ఆగి ఎదురుగా వున్న కిటికీ వైపు చూసి "కిటికీ చాటున దాగి ఏం చూస్తావు చంద్రరేఖా? రా! వచ్చి కూర్చో. నీ కథే చెబుతున్నాను!" అన్నాడు మందహాసంతో.

     అందరూ భయభ్రాంతులయ్యారు. బిత్తరపోయి కిటికీవైపు చూశారు. అక్కడ శూన్యం తప్ప ఏం కనిపించలేదు.  దెయ్యమంటే అందరికీ భయమే!

    "కిటికీలో కూర్చున్నావా? సరే కూర్చో. నీ ఇష్టం! ఎక్కడ బాగుంటే అక్కడే కూర్చో. ఆ .... ఏం చెబుతున్నానూ? చంద్రరేఖ పూర్వకేతకి అంటే అర్దం తెలుసా? మొగలిపువ్వన్నమాట. సువాసన ఎంత బాగుంటుందో, ముళ్లూ అంతే వాడిగా వుంటాయి దానికి."
   
    వింటున్నారేగానీ భక్త జనులకు భయంతో ఒళ్ళంతా ముళ్లు మొలుస్తున్నాయి.

     "ఆమె శరీరం మొగలిరేకంత అందంగా వుండేది. ఆమె స్వభావం మొగలిపువ్వంత కరుగ్గా వుండేది.  పదహారేళ్ల ప్రాయానికే ఆమెలో యవ్వనం పూర్ణ చంద్రోదయంలా వెల్లివిరిసింది.  మగవాడు ఓరచూపుతో  చూస్తే, ఆమె కోరచూపుతో బుసకొట్టేది. శీలం విషయంలో ఆమె నిప్పులా జ్వలించేది. ఎంతోమంది కోడేకారు యువకులు, ఆమె పాణిగ్రహణంకోసం ఉవ్విళ్లూరుతూ, ఆమెను గెలుచుకోవడానికి  ప్రయత్నిస్తుంటే,  ఆమె ఒక  తాంత్రికుడిమీద మరులుకొంది. అతి చిన్న వయసులోనే మంత్రశాస్త్రంలో వున్న అతి కఠిణమయిన విషయాలెన్నిటినో సాధనచేసి, స్వాధీనంలోకి తెచ్చుకున్నవాడు ఆ తాంత్రికుడు.
 
     ఆ రోజుల్లో ఒక రాజావారు అనేకానేక  దేశాలమీద దండయాత్రలు చేసి గెలిచి, కొల్లగొట్టి తెచ్చిన అపారమయిన ధనరాశి, మణిమాణిక్యాలు, బంగారం, చిట్టడివిలో ఓ గుహలో  నిక్షిప్తంచేస్తూ, ఈ తాంత్రికుడి సాయం కోరాడు. ఆ తాంత్రికుడు  తన వెంటపడిన కేతకిని అపారమైన ఆ ధన రాశికి బలిహారంగా సమర్పించి, ఆమె ఆత్మను ఆ ధనరాశికి కాపలాగా వుంచాడు. కేతకి బొమ్మను ఇప్పటికీ ఆ గుహకున్న  తలుపుమీద చూడవచ్చును. ధనరాశికి కపలాగావున్న కేతకి ఆ చుట్టుప్రక్కలకి ఎవరినీ రానిచ్చేదికాదు. చివరికి పశువుల కాపర్లను  కూడా  రానిచ్చేదికాదు. గడ్డి మేస్తూ పశువులు ఆ ప్రాంతానికి వస్తే, దడుసుకున్నట్లుగా  పరుగులు తీసేవి. అది మనుషులూ, పశువులూ తిరగని చిట్టడవిలా మారిపోయింది."

    ఊపిరి బిగపట్టుకుని వింటున్నారు శ్రోతలు.

     "ఒకనాడు ఒక సన్యాసిగారు ఆ ప్రాంతానికి వచ్చారు. సెలయేళ్లు, పచ్చని ప్రకృతి, పక్షుల కిలకిలరావాలు చూసి ముగ్దులయ్యారు. అక్కడ కొంతకాలంపాటు వుండి తపస్సుకు స్థావరంగా ఎంచుకున్నారు. సామాన్యులకూ ఆ కొండ గుహ తలుపు ఒక బండరాయిగా కన్పిస్తుంది. అక్కడ ఒక గుహ వుందని, ఆ గుహకి తలుపుందని చాలామందికి తెలియదు. మన సన్యాసిగారు త్రికాలజ్ఞానులు. ఆయన సెలయేట్లో శుచిగా స్నాన  సంధ్యలాచరించి, కొండ గుహద్వారాన్ని తమ యోగశక్తితో తొలగించి లోపలకు వెళ్లబోయారు.

    "ఇక్కడ ఎవరినీ, అడుగు పెట్టనీయకూడదని మా యజమాని ఆజ్ఞ" అంటూ అడ్డుపడింది కేతకి. మామూలు మానవుడైతే రక్తం కక్కుకుని ఎప్పుడో చచ్చేవాడు.  యోగశక్తి ఆయన చుట్టూ సుదర్శనచక్రంవలె పరిభ్రమిస్తుండడంవల్ల, ఆయన్ని తాకలేక ఆయన ఎదుటపడింది.

      "మంత్రబద్దురాలవు. ఇంతకంటే ఏం చెయ్యగలవు? నిన్నూ చూస్తే నాకు జాలి వేస్తున్నది. ఎన్నాళ్లు ఇక్కడ ఒక క్షుద్రశక్తిగా సంచరిస్తావు? నీది కాని ధనరాశికి నువ్వెందుకు కాపలా కాస్తావు?  ఇటు మానవ జీవితానికీ చెందక, అటు ఊర్ద్వలోకాలకీ పోక ప్రేతాత్మగా ఈ వెట్టిచాకిరీ ఎంత కాలమని చేస్తావు?  నాకుతెలుసు. నువ్వు మంత్రబద్దురాలివి.  నీ బంధనాలను నేను తొలగిస్తున్నాను.  ఇకనుండి నువ్వు స్వేచ్చాజీవివి...." అంటూ కేతకిని బంధవిముక్తి గావించారు సన్యాసిగారు.

    'సన్యాసిగారి దయవల్ల  ప్రేతాత్మనుండి విముక్తి పొందిన కేతకి చంద్రరేఖగా జన్మించింది. కర్మానుసారం మరికొంతకాలం ప్రేతరూపంలో  వుండవలసిన ఆమె గడువుకు ముందే  విముక్తి పొందడంవల్ల చంద్రరేఖగా జన్మించినా తప్పించుకోలేక పోయింది అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ శిక్షను. అందుకే దొరవారి చేతిలో ఆమె అకాలమరణం.  కేతకిగా ఎవరి కౌగిట కోసం  తపించిందో, అతడి కౌగిటిలోనే ఆమె మృత్యువు పాలయింది.

     అంటే, ఆ తాంత్రికుడే ఈ దొరవారిగా పుట్టాడన్నమాట. పూర్వ జన్మలో స్త్రీ హత్య, ఈ జన్మలో స్త్రీ మానభంగం. రెండు జన్మలలోనూ  ఆ స్త్రీ ఒక్కరే కావడం ఇక్కడ విశేషం. మనిషికి పూర్వజన్మ స్మృతి లేకపోవడం ఒక వరమయితే కావచ్చుగానీ, తను చేసిన మంచి చెడులను బేరీజు వేసుకునే అవకాశం పోతుంది. ఈ జన్మలో అనుభవించే కష్టాలకి  కారణం తెలియక, జుట్టు పీక్కుంటాడు. నాకెందుకిన్ని కష్టాలని బాధపడి పోతాడు.'

    ఇదంతా బాగుంది- - ఒక రసవత్తరమైన కథ వింటున్నట్లుగా.

    కానీ, ఇది ఇలాగే జరిగిందా? సూర్య మనసులో సందేహం.

    "అపారమైన ఆ ధనరాశి వున్న ఆ గుహను మీరు చూశారా స్వామీ?" మునిరాజు కుతూహలం ఆపుకోలేకపోయాడు.

     "చంద్రరేక వచ్చాక ఇప్పుడేకదా చూస్తున్నది."

    "అంటే ఆ గుహని, అందులో వున్న ధన నిక్షేపాల్ని ఇక్కడ నుండే చూస్తున్నారా స్వామీ? అదెలా సాధ్యం సామీ?"

    "అనేక సంవత్సరాల కఠిన తపస్సుకు ఫలంగా తెరుచుకున్న మనోనేత్రానికి కనిపించనిదంటూ  ఏమీ వుండదు నాయనా! జరిగినదీ, జరుగబోయేదీ, జరుగుతున్నదీ అంతా చూస్తుంది. నీ వెలుపల ఏమున్నదో చూస్తుంది, ప్రతి ఒక్కరిలోనూ ఈ మనోనేత్రం పుట్టుకతోనే వుంటుంది.  కానీ మూసుకుని వుంటుంది. నేత్రం వుండి కూడా మనసు ఏవీ చూడలేనిదవుతుంది. దాన్నే జ్ఞానచక్షువు అంటారు యోగులు. ఆ  జ్ఞానచక్షువు తెరుచుకోవాలంటే జ్ఞాన, భక్తి మార్గాలలో ఏదో ఒకదాన్ని ఆలంబనగా చేసుకుని సాధన చేయాలి. సాధన చేసివారికి అసాధ్యమన్నది లేనేలేదు. అణిమాది అష్టసిద్దులు కైవసమవుతాయి."

    "ఇప్పుడు నా మనసులో ఏమున్నదీ చెప్పగలరా స్వామీ?" జంకుతూనే అడిగాడు మారుతి.

     "అపారమైన ధనరాశిని నిక్షిప్తంచేసిన ఆ గుహ నీ మనసులో మెదులుతోంది. అక్కడ కేతకి కాపలాగా లే-దుకదా. వెళ్ళి సంచులకు  ఎత్తుకుని రావచ్చుకదా  అన్న ఆశ మెదులుతోంది నీ మనసులో."

    మారుతి ముఖం పాలిపోయినట్టుగా అయింది. చెంపలు వాయించుకుని సాష్టాంగపడ్డాడు.  "మిమ్మల్ని శంకించినందుకు నాకు వున్న కళ్లు పోతాయి!" మీరు త్రికాలజ్ఞానులు! మహా మహన్వితులు స్వామీ."

 Previous Page Next Page