Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 4


    "మంచి డాషింగ్ కూడా!"
    "కాస్తా కూస్తానా? దున్నేస్తున్నాడు."
    "పైగా చదువుంది."
    "ఎస్! అదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్"
    "అదీకాక చాలా మంచి హృదయం కూడా వుంది డాడీ!"
    "సూపర్బ్ హార్ట్" అనేసి ఠక్కున కోలుకుని ఆశ్చర్యంగా ప్రతిమ వైపు చూశాడతను.
    "అవునూ! ఆ విషయం నువ్వెలా చెప్పగలవు?"
    ప్రతిమ చిరునవ్వు నవ్వింది "చెప్పగలను డాడీ!"
    "అదే ఎలా? అని అడుగుతున్నాను?" మార్కండేయులు డిటెక్టివ్ లా ఆమెవైపు చూశాడు.
    "అంటే అతను నీకు ముందే తెలుసా?"
    ఆమె కొంచెం సిగ్గుపడింది. "తెలుసు డాడీ! నిజం చెప్పాలంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం కూడా! మీక్కూడా నచ్చితే పెళ్ళి చేసుకోవాలనీ..."
    మార్కండేయులు ఠక్కున ఆగిపోయాడు. అతని గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్న ఫీలింగ్ కలుగుతోంది. ముప్పయ్ ఏళ్లక్రితం తన చెల్లెలు స్వప్న కూడా ఇలాంటి కోరికే కోరింది. "అన్నయ్యా! మనోజ్, నేనూ ప్రేమించుకున్నామన్నయ్యా! అతనికి బిజినెస్ వుంది కనుక ఉద్యోగం అవసరం లేదు! అందుకని" అంటూ అడిగిందామె.
    కాదనలేక తను ఒప్పుకున్నాడు. కాని జరిగిందేమిటి?
    మనోజ్ కి వ్యాపారంతో పాటు వ్యాపారాన్నంతా గుటక మింగేసే ఏడు అలవాట్లున్నాయి. వాటికి బానిసయి వ్యాపారం అమ్మేసి, ఆస్తి అమ్మేసి, తర్వాత ఆఖర్లో అమ్మటానికేమీలేక స్వప్నను కూడా అమ్మబోయేసరికి స్వప్న ఆత్మహత్య చేసుకుంది ఉరేసుకుని.
    అప్పటినుంచీ ఈ లవ్ ఎఫైర్స్ అంటే తనకు పరమ చిరాకు.
    "నో!" అంటూ ఘర్జించాడు మార్కండేయులు.
    ప్రతిమ తెల్లబోయింది.
    మార్కండేయులు ఆమె తెల్లబోవటం చూసి కొంచెం తగ్గాడు. "చూడు ప్రతిమా! అతని సామర్థ్యం నేను పరీక్షించాల్సి వుంది. అన్నివిధాలా నచ్చితేనే ఒప్పుకుంటాను. లేకపోతే నాకు నచ్చినతనిని తీసుకొచ్చి చేసేస్తాను, ఆ!"
    ప్రతిమకు పోయిన ధైర్యం తిరిగి వచ్చేసింది. ఆ మాట చాలు! భవానీశంకర్ తన తండ్రి పెట్టే పరీక్షలన్నిటిలో నెగ్గేస్తాడన్న ధైర్యం తనకుంది. "ఓ.కె. డాడీ! అతను అన్నివిధాలా తప్పకుండా నచ్చుతాడు నీకు. నాకా నమ్మకం వుంది" అందామె.
    "చూస్తాగా!" అంటూ అతను ఎకౌంట్స్ సెక్షన్ సెటిల్ అయిపోయేసరికి ప్రతిమ వెనక్కు తిరిగింది.
    త్వరత్వరగా ఆఫీస్ నుంచి బయటపడి కార్లో ఆ ప్రక్కనే వున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేరుకుంది.
    భవానీశంకర్ ఖాళీగా వున్న టేబుల్ దగ్గర కూర్చుని బేరర్ కి చేయి చూసి జ్యోతిష్యం చెప్తున్నాడు. "సరిగ్గా రెండేళ్ళ ఎనిమిది రోజులు! అంతే స్టార్ థిరిగిపొథున్ది౧ కోటీశ్వరుడివయిపోతావు" అన్నాడతను.
    బేరర్ ముఖంలో విపరీతమయిన ఆనందం కనిపించింది. కాని దాని వెనుకే నిరాశ. "కాని ఇంకా రెండేళ్ళు గడవాలా? ఈ లోపల ఇంకేమీ ఛాన్స్ లేదా?" ధీనంగా అడిగాడు.
    "ఏమాత్రం లేదు! అట్టే మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితి కంటే దరిద్రపు స్థితిలో పడిపోతావు."
    వాడు అదిరిపోయాడు. "ఇంతకంటే ఇంకా దరిద్రం ఏముంటుంది సార్ మీరు మరీనూ."
    "క్లీనర్ వయిపోవటం"
    "నిజంగానా?" భయంగా అడిగాడు.
    "అంటే మరీ నిజం అని కాదు! జాగ్రత్తగా వుండకపోతే అలా అయ్యేందుకు ఛాన్సుంది."
    "నేను జాగ్రత్తగానే వుంటాన్లెండి! అయినా రెండేళ్ళు కదా! ఓపిక పడతాను."
    సరిగ్గా అప్పుడే ప్రతిమ వచ్చి భవానీశంకర్ దగ్గర కూర్చుంది "సూపర్ పెర్ ఫార్మెన్స్! కంగ్రాచ్యులేషన్స్" అందామె.
    "ఆ జగన్నాథంగాడి డల్ హెడెడ్ నెస్ గురించి నువ్వు ముందే 'క్లూ' ఇవ్వటం వల్ల ఉతికేశాను వాడ్ని" ఆనందంగా అన్నాడు భవానీశంకర్.
    "డాడీ చాలా ఇంప్రెస్ అయిపోయారు తెలుసా?" ఎగ్జయిట్ మెంట్ తో అందామె.
    "అంటే మన పెళ్ళికి ఒప్పుకున్నట్లేనా?"
    "లేదు!"
    "అదేమిటి? నా ఇంటెలిజెన్స్ చూసి అసలు తనే 'కమాన్ టేక్ దిస్ గాళ్' అంటారనుకున్నానే!"
    "డాడీ అలా అనేరకం కాదు"
    "వెరీ బాడ్! ఆయనకింకేం కావాలిట తనక్కాబోయే అల్లుడిలో?"
    "ఈ ఉద్యోగంలో నీ సమర్థత పరీక్షిస్తారట"
    అతనికి చిరాకేసుకొచ్చింది "ఈ డబ్బున్న కోటీశ్వరులకు బ్రెయిన్ మోకాల్లో వుంటుందనుకుంటాను. వట్టి వాయుదూత్ సర్వీస్ గాళ్ళు."
    ప్రతిమకు కోపం వచ్చింది.
    "డాడీ వాయుదూత్ సర్వీస్ కాదు!"
    "ఖచ్చితంగా వాయుదూత్ సర్వీసే! గుడ్లగూబ కళ్ళూ, ఆ పొట్టా, బాలెన్స్ లేని నడకా చూస్తే ఎప్పటికప్పుడు క్రాష్ అయిపోతాడేమోనని ఆశ కలుగుతుంది చూసేవారెవరికయినా."
    "భవానీ! ప్లీజ్! డాడీ గురించి అలా మాట్లాడటం నాకిష్టం లేదు" కోపంగా అందామె.
    "ఆల్ రైట్! మానేద్దాం! వాట్ నెక్ట్స్?"
    "ఇవాళొక్కరోజేగా నువ్వు ఖాళీ! రాత్రివరకూ తిరుగుదాం! రేపట్నుంచీ వుద్యోగంలో బిజీ అయిపోతావ్ కదా!"
    "అప్ కోర్స్-యూ ఆర్ కరెక్ట్! ముందు అద్భుతమయిన లంచ్ తీసుకోవాల్సి వుంది మనం! కమాన్ మై డియర్ బేరర్. హరీ అప్."
    బేరర్ కి లంచ్ ఆర్డర్ చేసేశాడతను.
    "నిజంగా ఇదంతా ఇంత త్వరగా ఇలా జరిగిందంటే నాకు నమ్మకం కలగటంలేదు" అంది ప్రతిమ.

 Previous Page Next Page