Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 4


    "లేకపోతే చూడండి స్కూలుకి వెళ్ళమని పంపితే స్కూలు ఎగ్గొట్టింది కాకుండా సినిమా హాల్ దగ్గర బ్లాకులో టికెట్లమ్ముతున్నారు."
    "అందులో తప్పేముంది లేవయ్యా! నువ్ చేస్తున్నపనే వాళ్ళూ చేస్తున్నారు" అన్నాడొకతను.
    చిరంజీవి చటుక్కున ఆ మాటన్న వ్యక్తివేపు చూశాడు కోపంగా.
    కానిస్టేబుల్ కనకారావ్ చిరంజీవిని చూసి నవ్వాడు.
    అయిందేదో అయిపోయింది ఇంక వదిలేసెయ్. నువ్ వెదవ పన్లు చేస్తే వాళ్ళూ చేస్తారు. పెద్దోళ్ళకే బుద్ధిలేనప్పుడు పిల్లలకెలా బుద్దొస్తుంది.
    అందరూ ఘొల్లుమన్నారు.
    చిరంజీవి ముఖం అవమానంతో ఎర్రబడింది. నిజంగా తన ప్రభావమే పిల్లలమీద పడుతోందా?
    "ఇంకెప్పుడూ చేయను మావయ్యా. నన్ను కొట్టకు మావయ్యా" ఏడుస్తోంది రజని.
    "పద ఇంటికి పద" అన్నాడు బెల్టు నడుముకి పెట్టుకుంటూ.
    ఆమె లేచి పుస్తకాలన్నీ ఏరుకుని ఇంటివేపు నడవసాగింది. ఆమెను అనుసరించాడు చిరంజీవి. అతని మనసంతా గందరగోళంగా తయారయింది.
    కానిస్టేబుల్ కనకారావ్ అన్నమాటలు గుండెల్ని సూదుల్లా తాకుతున్నాయ్.
    తను నిజంగా తప్పు చేశాడు. ఈపాడు తాగుడుకి అలవాటు పడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అయినా తాగుడు మానలేక దానికోసం బ్లాకులో టిక్కెట్లమ్మి దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి మరీ తాగుతున్నాడు.
    ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. శీను, భాను ఓ మూల కూర్చుని పాఠం పుస్తకాలు గడగడ చదువుతున్నారు.
    "భారతదేశము బంగారు దేశము. ఇది ఎవరో మహానుభావులు జన్మించిన పుణ్యభూమి. పాడి పంటలతో కలకలలాడే సస్యశ్యామల దేశమిది. ఇచ్చటి ప్రజల సంస్కృతి మహోన్నతమయినది. అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులతో విలసిల్లుతున్నా ఇచ్చటి ప్రజలు మిక్కిలి ఐకమత్యముతో మెలుగుదురు."
    చిరంజీవి చూడటంతోనే వారు చదవటం ఆపేసి అతనివేపు భయంగా చూడసాగారు.
    చిరంజీవి మంచం మీద కూలబడ్డాడు నీరసంగా.
    అంతా నిశ్శబ్దం.
    రజని ఒక్కతే వెక్కి వెక్కి ఏడుస్తోన్న శబ్దం మాత్రం వినబడుతూ వుంది.
    చిరంజీవికి వాళ్ళను చూస్తే జాలివేసింది.
    తను అక్కయ్యకు ఏం చెప్పాడు?
    "నీ పిల్లలకేం భయంలేదక్కా! వాళ్లను ప్రాణప్రదంగా చూస్కుంటాను. మంచి చదువులు చెప్పించి గొప్పవాళ్ళను చేస్తాను."
    అప్పుడు అక్కయ్య ఏం చెప్పాడు?
    "నీ పిల్లలకేం భయంలేదక్కా! వాళ్లను ప్రాణప్రదంగా చూస్కుంటాను. మంచి చదువులు చెప్పించి గొప్పవాళ్ళను చేస్తాను."
    "అప్పుడు అక్కయ్య కళ్ళల్లో ఆనందం మెరిసింది తృటికాలం.
    ఆ తర్వాత సంతృప్తిగా కళ్ళు మూసిందామె శాశ్వతంగా!
    కానీ తనిప్పుడు చేస్తోందేమిటి?
    వాళ్ళను గవర్నమెంట్ స్కూల్లో పడేయటం తప్పితే వాళ్ళ గురించి ఏమయినా పట్టించుకుంటున్నాడా? వేళకు తిండి పెట్టగలుగుతున్నాడా? వాళ్ళక్కావలసిన పుస్తకాలూ, బట్టలూ ఇతర కనీసావసరాలూ చూడగలుగుతున్నాడా?
    "ఒరేయ్! అందరూ ఇలా రండ్రా?"
    అందరూ భయంగాలేచి నెమ్మదిగా, అతనికి సమీపంగా వచ్చి నిలబడ్డారు.
    "ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు? నేను మిమ్మల్ని కొట్టను, నిజం చెప్పండి"
    "మాకు రెండురోజుల్నుంచీ సరిగ్గా భోజనం లేదుకదా...అందుకని వాళ్ళు ఆకలని గోల చేస్తుంటే నేనే వాళ్ళకేమయినా తినడానికి కొనిపెడదామని టిక్కెట్లు అమ్మబోయాను." అప్పుడు గానీ తను వాళ్లకు తిండి సరిగ్గా పెట్టటంలేదన్న విషయం గుర్తురాలేదు.
    చిరంజీవి అందరినీ రెండు చేతులతో చుట్టి దగ్గరకు తీసుకున్నాడు.
    "ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి! సరేనా?"
    "సరే మావయ్యా"
    "ఆకలేస్తే నన్ను అడగండి! అంతేగానీ అలాంటి పనులు చేయకూడదు."
    "కానీ నువ్వెప్పుడూ తాగి పడుకుంటావ్ కదా? నిన్నెలా అడగటం?"
    "సరేరా! నేను కూడా తాగుడు తగ్గించేస్తాను. రేపట్నుంచి నేను మళ్ళీ ఉద్యోగంలోకెళతాను. మీకింకెప్పుడూ ఎలాంటి లోటు రాకుండా చూస్తాను. సరేనా?"
    ఎవ్వరూ మాట్లాడలేదు. అతని గుండెలమీద వాలిపోయారందరూ.
    "ఆల్ రైట్ పదండి! ఇవాళ బ్రహ్మాండమయిన వంట చేస్తాను. అందరం కలసి భోజనం చేద్దాం. ఒరేయ్ రాజూ నువ్వెళ్ళి బియ్యం, పప్పులూ, నూనె అన్నీ తీసుకురా!" అంటూ తన జేబులో చేయి పెట్టాడతను.
    అయిదు నోటు బయటకు వచ్చింది.
    ఆత్రుతగా యాభయ్ నోటు కోసం ప్యాంటు జేబులు కూడా వెతికాడు.
    జేబులు ఖాళీ!
    "దొంగ రాస్కెల్స్! యాభయ్ నోటు కొట్టేశారు" అన్నాడతను.
    "ఎవరు మావయ్యా!"
    "తెలీదు. సారా దుకాణంలో ఎవడయినా అయుండవచ్చు. "సరే ఓ పనిచెయ్ రాజూ. మంగప్ప దుకాణం కెళ్ళి నేనిమ్మన్నానని చెప్పి సరుకులు తీసుకురా! డబ్బు రేపిస్తానని చెప్పు! రజనీ వాడికి సంచులూ, నూనె సీసా అన్నీ ఇవ్వు. నేనీలోగా వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను."
    "సరే మావయ్యా"
    వాడు వెళ్ళగానే తనూ సైకిల్ తీసుకుని మెయిన్ రోడ్ మీదున్న కూరగాయల దుకాణానికి వెళ్ళాడు.
    "నమస్తే అన్నయ్య" చిరునవ్వుతో పలుకరించాడు దుకాణం అతను.
    "నమస్తే తమ్ముడూ"
    "ఏమిటన్నయ్యా! చాలారోజులకు మళ్ళీ కూరగాయల మీదకు మనసు పోయింది?"  
    చిరంజీవి సిగ్గుపడ్డాడు.
    "ఈ మధ్యన ఇన్నిరోజులు రాక్షసుడి వేషం వేశాన్లే. ఇప్పుడు మళ్ళీ మనిషి రూపం వచ్చేసింది."
    వాడు పగలబడి నవ్వాడు.
    "ఏం కూరగాయలు తింటావన్నయ్యా?"
    "నా దగ్గర అయిదు రూపాయలుంది. దీనికి ఎన్నిరకాలు వస్తే అన్నిరకాలు ఇవ్వు."
    వాడు అయిదు నోటు తీసుకుని కొన్ని కూరగాయలు సంచిలో వేసి ఇచ్చాడు.
    చిరంజీవి ఇంటికి చేరుకునేసరికి రాజు ఖాళీ సంచులతో ఇంటిముందు నిలబడి ఉన్నాడు.
    "ఏమిట్రా? ఏమయింది?"
    "మంగప్ప అప్పు ఇవ్వనన్నాడు మావయ్యా! ఇదివరకే నువ్వు రెండొందల రూపాయలివ్వాలంట."
    "అలాగా! అంతదూరం వచ్చిందా వ్యవహారం? పద..సైకిల్ ఎక్కు?"

 Previous Page Next Page