Previous Page Next Page 
జయ - విజయ పేజి 4


    "అయ్యో! ఇంత బెదిరిపోతే ఎలా? జీవితం అనేది అనుభవించడానికి గాని బెదిరిపోవడానికి కాదు." నవ్వుతూ అన్నాడతను.
    "సరే..." కొద్దిసేపు ఆలోచించి అంది జయ. అతని మాట కాదనాలనిపించట్లేదు ఆమెకి.
    "థాంక్యూ!" ఆనందంగా అన్నాడతను.
    సినిమా ముగిసింది.
    ఇద్దరూ లేచి బయటికొచ్చారు.
    "రేపు ఎక్కడ కలుసుకోమంటారు?" అడిగాడతను.
    "ఏమో! మీరే చెప్పండి!"
    "బస్ స్టాప్ దగ్గర కలుసుకుంటారా?"
    "సరే!"
    "ఎన్ని గంటలకు?"
    "తొమ్మిదిన్నర!"
    "ఓకే..."
    "స్వీట్ డ్రీమ్స్..."
    జయ నవ్వుకుంటూ బస్ స్టాప్ దగ్గరకు నడిచింది. ఆ రాత్రంతా ఆమెకు నిద్రపట్టలేదు. కంటి మీద కునుకు పడుతూనే కిషోర్ కలలోకి రావడం, తనను కౌగిలించుకోవడం అంతటితో తనకు మెలకువ రావడం జరుగుతోంది.
    మర్నాడు ఉదయమే లేచి రెడీ అయి తొమ్మిదిన్నరకల్లా బస్ స్టాప్ కి చేరుకుందామె.
    ఇదే మొదటిసారి కాలేజీకని చెప్పి ఇంట్లో బయల్దేరి_ కాలేజీకి వెళ్ళకుండా ఉండటం!
    అతనంటే తనెందుకింత పిచ్చిదయిపోతోందో తనకే తెలీటంలేదు. అతని నవ్వులో ఏదో విపరీతమయిన ఆకర్షణ వుంది. తనా ఆకర్షణకు పూర్తిగా లొంగిపోయింది.
    తనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వారం రోజులక్రితం అతనిని తను చూడ్నేలేదు. అసలతనెవరో కూడా తెలీదు. బాంబే నుంచి కొత్తగా వచ్చి తన క్లాసులో చేరిన సరితకూ తనకూ కొద్దిరోజుల్లోనే మంచి స్నేహం కలిసిపోయింది.
    "మా ఇంటికి పోదాం రాకూడదూ?" అంది సరిత ఓసారి.
    తను వెళ్ళింది.
    అప్పుడు కిషోర్ కనిపించాడక్కడ.
    "మీట్ మై బ్రదర్ కిషోర్! ఈమె జయ. నా క్లాస్ మేట్" అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది సరిత.
    ఇద్దరూ నమస్కరించుకున్నారు.
    అప్పుడే అతని ప్రభావంలో పడిపోయింది తను.
    వాళ్ళ ఇంట్లో వున్న గంటసేపట్లోనూ అతను రెండు మూడుసార్లు కల్పించుకుని మాట్లాడాడు.
    తనూ కావాలనే చొరవగా మాట్లాడిందతనితో.
    రెండవసారి తమ కాలేజీ దగ్గర కనిపించాడతను.
    "హలో" అంటూ పలుకరించాడు చిరునవ్వుతో.
    ఇద్దరూ రోడ్డు పక్కనే నిలబడి రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు.
    "మళ్ళీ మా యింటికి రానేలేదు మీరు" అన్నాడతను నవ్వుతూ.
    తను నవ్వి వూరుకుంది.
    "రోజూ మీరొస్తారేమో అని ఎదుర్చూస్తున్నాను.." అన్నాడు తమాషాగా తన కళ్ళల్లోకి చూస్తూ.
    ఆ చూపులో ఎన్నో భావాలు కనిపించాయ్.
    "రేపు వస్తాన్లెండి." అంది అంగీకరిస్తూ.
    "ఓకే-సీయూ టుమారో దెన్" అనేసి వెళ్ళిపోయాడతను.
    మర్నాడు సరితతోపాటు ఆమె ఇంటికి వెళ్ళింది తను. అతను తనను చూడగానే ఆనందంతో పొంగిపోయాడు.
    "థాంక్యూ వెరీమచ్." అన్నాడు ఏకాంతంగా ఉన్నప్పుడు.
    "ఎందుకూ?"
    "అన్నమాట నిలబెట్టుకున్నందుకు."
    తనేమీ మాట్లాడలేదు.
    "ఓ ప్రార్థన"
    "ఏమిటది?"
    "మీరేమీ అనుకోనంటే..."
    తన గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.
    "ఫర్వాలేదు చెప్పండి."
    "రేపు పార్క్ కి రాగలరా. మీతో కొంచెం...మాట్లాడాలి"
    తను ఖంగారు పడింది. అతనిమాటలెవరయినా వింటున్నారేమోనని.
    అతనికి జవాబివ్వడానికి సిగ్గుపడిపోయింది.

 Previous Page Next Page