Read more!
 Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 4

                                 


    "నా పేరు జర్నలిస్టండి! ఇంటి పేరు ఎల్లోవారు. అంటే వెరసి "ఎల్లో జర్నలిస్టు " అన్నాడతను వినయంగా.
    "ఇంకేవీ అక్కర్లేదండీ! ఇదిగో ఇలాంటి వార్తల కోసమే మా ఎడిటరు గారు రాయలసీమలో వర్షం కోసం ఎదుర్చూసే రైతులా ఎదుర్చుస్తున్నారండీ! వస్తానండీ చాలా థాంక్సండీ' అనేసి చక చక వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఆ ఎడిటరు తాలూకు పత్రికలో ఆవార్తని తాటికాయంత అక్షరాలతో పతాక శీర్షికగా ప్రచురించేశాడు.
    "కొడైకెనాల్లో అర్ధరాత్రి ప్రముఖ తమిళనటి పాపకు, తెలుగు కుర్ర నటుడికి మధ్య ప్రేమ కలాపాలు". అది చూసి ఆమె అభిమాను లందరూ ఆమెని నిద్రపోనీకుండా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేయడం ప్రారంభించారు. ఆమె సెక్రటరీ పరుగుతో వచ్చి వెంటనే ఆ ఎల్లో పత్రిక మీద యాక్షన్ తీసుకోకపోతే ఆవిడ పరువు కావేరి నదిలో కలిసి పోవడం తధ్యమనీ  అసలు మూడొంతులు ఎప్పుడో కలిసిపోయిందని వార్నింగిచ్చాడు.
    హీరోయిన్ చేసేది లేక అప్పటికప్పుడు తన లాయర్ని పిలిపించి తనకు మిగిలిన ఆ నాలుగోవంతు పరువుని కావేరిలో కలవకుండా చూడమనీ, ఒకవేళ అతనా పని చేయలేకపోతే తను అతనికది వరకు ఇవ్వాల్సిన - బిల్లంతా కూడా అదే నదిలో కలుపుతానని బెదిరించింది.
    లాయరు వెంటనే ఓ నోటీసు తీసుకెళ్ళి ఆ ఎడిటరు కిచ్చాడు. అదంతా రెండ్రోజులు చదివి "ఇప్పుడెం చేయమంటావ్" అనడిగాడు. "మనం రాజీకోద్దాం!" అన్నాడు లాయరు. "సరే" అన్నాడు ఎడిటరు రాజీ వేపు నడుస్తూ.
    ఆ తరువాతి సంచికలో ఎడిటరు మరో పతాక శీర్షిక ప్రచురించాడు - "మేము ప్రచురించినట్లు ప్రముఖ తమిళనటి పాపకూ, తెలుగు కుర్ర నటుడికీ మధ్య ఏమీ లేదు ."
    "ఏమీ లేందే ఇది రాయల్సిన అవసరం ఏమిటి?" అంటూ జనమంతా మళ్ళీ రెండ్రోజులూ  పాటు నవ్వుకున్నారు. నవ్వుకోడమే కాకుండా ఆమెకు అయిదు నిమిషాల కోసారి ఫోన్జేసి నవ్వి రిసీవర్ పెట్టేస్తున్నారు.
    ఒళ్ళు మండి మళ్ళీ లాయర్ కి ఫోన్ చేసింది పాప.
    "వెళ్ళండి! వెళ్ళి ఆ ఎడిటర్ తో చెప్పండి! ఇలా రాస్తే చాలదూ - ప్రజలు ఇంకా అపార్ధం చేసుకోడానికి వీలుందిట. కనుక ఇంకా స్పష్టంగా క్లియర్ గా రాయమని చెప్పండి. లేకపోతే మీ బిల్లు...."
    లాయర్ ధన్ మని ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎడిటర్ దగ్గరకు ఇంకో నోటీస్ పట్టుకెళ్ళాడు.
    "మళ్ళీ నోటీసా? మీది నోటీసుల దుకాణమా? అసలింకేన్ని నోటీసులున్నాయ్ మీ దగ్గర" అనడిగాడు ఎడిటర్ అసహనంగా.
    "ఇదొక్కటే - ఇదే లాస్ట్ ది " అన్నాడు లాయరు.
    ఇద్దరూ మళ్ళీ రాజీ కొచ్చారు.
    ఈసారి ఆ వార్తను ఆ హీరోయిన్ కోరినట్లుగా వివరంగా ప్రచురించాడు ఎడిటర్.
    "మేము ప్రముఖ తమిళ నటి పాపకూ, తెలుగు కుర్ర నటుడికీ మధ్య కొడైకెనాల్లో ఆ రాత్రి ప్ర్రేమ కలాపాలు జరిగినట్లు ప్రచురించాము. నిజానికి ఆ రాత్రి వారిద్దరి మధ్య ఏమీ లేదు. ఆఖరికి ఒక్క నూలుపోగు కూడా!"
    అది సెక్రటరీ తో చదివించుకుని పాప సంతృప్తి చెందింది. కానీ జనం మాత్రం మళ్ళీ విరగబడి నవ్వుకున్నారు."
    ఇంతవరకూ చెప్పి బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది "రాజా! ఆ పేపర్లలో అంత స్పష్టంగా రాసినా జనం మళ్ళీ విరగబడి ఎందుకు నవ్వారు? ఒకవేళ అది స్పష్టంగా లేకపోతె ఆ హీరోయిన్ ఎడిటర్ కు మళ్ళీ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?" ఈ ప్రశ్నలకు జవాబు తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి వ్రక్కలవుతుంది."
    నిర్మాత బుర్ర గోక్కుని 'ఆ హీరోయిన్ కి తెలుగు రాకపోవడం వచ్చిందహ ఈ గొడవంతా! సినిమాల్లో కొచ్చాక నాలుగు భాషలయినా తెలుసుకోవాలి అందుకే!" అన్నాడు.
    ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే ఫిలిమ్ బాక్స్ తో సహా సెన్సార్ మాయమయి సెన్సార్ ఆఫీస్ వేపు ఎగిరిపోయింది .

                                        ***
                                          

 Previous Page Next Page