"ఏమయింది మోహన్రావ్ డిప్యూటీ రింగ్ మీద రింగ్ ఇచ్చి పరేషాన్జేస్తున్నాడు ఇవ్వాల్టినుంచి పంక్చువాలిటీ వీక్ జరుగుతోంది కదా" మోహన్రావ్ తో అన్నాడతను.
"ఇంకో రెండునిమిషాల్లో వ్యాక్యూమ్ వచ్చేస్తుంది బ్రదర్. ఫోర్ మినిట్స్ లేట్ స్టార్ట్ చూపిద్దాం" అన్నాడతను బతిమాలుతున్న ధోరణిలో.
జార్జ్ నవ్వాడు.
"అంటే అరగంట లేట్ స్టార్టయినా నాలుగు నిమిషాలేనా" అంటూ వెళ్ళిపోయాడు.
ఖాసిమ్ గార్డు బ్రేక్ కి. దాని ముందున్న కోచ్ కి మధ్యకొచ్చి నిలబడ్డాడు.
అక్కడ కూడా వ్యాక్యూమ్ తక్కువ ప్రెజర్ తో ఉన్నట్లు తెలుస్తూనే వుంది. బ్రేక్ వెనుక హోస్ పైప్ చేస్తే ఆ ప్రెజర్ అసలు కనిపించటంలేదు.
ఎస్.ఎల్.ఆర్.కీ, ఆఖరి ఎక్ స్ట్రా కోచ్ కి మధ్య హోస్ పైప్ ని పక్కకి తిప్పి సుత్తితోబలంగా ఊడగొట్టాడతను. ఆఖరి పైప్ లో గాలిని అతి బలహీనంగాలాగుతోంది అస్పెల్రార్ పైప్. మళ్ళీ రెండింటిని కనెక్టు చేశాడతను.
మరో పది నిమిషాలు గడిచిపోయింది.
మోహన్రావ్ కి టెన్షన్ పెరిగిపోతోంది.
ఖాసిమ్, రాజు నెమ్మదిగా కోచి కిందనుంచి బయటకు జరిగారు.
"సార్ ఈ కోచ్ పైప్ లోనే డిఫెక్టు వుంది సార్. దీన్నిడమ్మీ చేసేయనా" రహస్యంగా అడిగాడు రాజు.
మోహన్రావ్ వులిక్కిపడ్డాడు.
"ఏయ్ మీకేం మతిపోయిందా పాసింజెర్సు ఉన్న ట్రెయిన్స్ లో రిస్క్ తీసుకుంటే ఉద్యోగాలు పోతాయ్".
ఖాసిమ్ కి తెలుస్తూనే వుంది.
హోస్ పైప్స్ లో ఏదో అడ్డం పడుతోంది. అందుకే చాలా నెమ్మదిగా క్రియేటవుతోంది వ్యాక్యూమ్.
సాధారణంగా వాషింగ్ సైడింగ్ లో ఓ మూలగా పడి ఉన్న స్లీపర్ కోచీల హోస్ పైప్స్ లోకి కప్పలుగాని, పాములుగాని దూరటం జరుగుతూంటుంది. ఆ కోచీలు అలాగే ఏదయినారైలుకి తగిలించినప్పుడు ఒక్కసారిగా వ్యాక్యూమ్ ఏర్పడేసరికి అక్కడే ఛస్తూంటాయ్.
దాంతో వ్యాక్యూమ్ ప్రాబ్లమ్ వస్తూంటుంది.
మోహన్రావ్ మళ్ళీ గార్డు బ్రేక్ లో వ్యాక్యూమ్ గేజ్ చూశాడు. నీడిల్ నెమ్మదిగా ముఫ్ఫయ్ మీద కొస్తోంది.
"ఫర్లేదులే, వచ్చేస్తుంది లే" అన్నాడు గార్డు ద్వారకానాథ్.
"మా వాడు డ్రైవర్ సంతకం తీసుకునేసరికి పూర్తిగా వచ్చేస్తుంది" అన్నాడు మోహన్రావ్.
రాజు వ్యాక్యూమ్ సర్టిఫికెట్ బుక్ తీసుకుని డ్రైవర్ దగ్గరకు పరుగెత్తాడు.
డ్రైవర్ గురుమూర్తిమరోసారి గేజ్ వేపు చూశాడు. నీడిల్ ఇప్పుడు యాభై అయిదు దగ్గరుంది.
ఇంకా ముందుకి కదులుతూనే వుంది.
సంతకం చేయబోతుండగా హఠాత్తుగా నీడిల్ కిందకు జారి పోయింది మళ్ళీ గురుమూర్తి అదిరిపడ్డాడు ఏమిటయ్యాయిది! ఇలా సంతకం తీసుకొని నా కొంపమీదకు తేకండి. ఆలస్యమయితే అయిందిగానీ సరిగ్గా చెక్ చేయండి" అంటూ పుస్తకం విసిరేశాడతను.
రాజు కూడా గేజ్ వంక చూసి నిరాశపడిపోయాడు. పుస్తకం అందుకుని మళ్ళీ వెనక్కు నడవసాగాడు.
మరో గంట సేపు గడిచిపోయింది.
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ రామకృష్ణ ఆయాసంతోవగురుస్తూ వచ్చాడు ఫ్లాట్ ఫారం మీదకు.
ఆ రోజు అతనికి రెస్ట్ డే. ఆ ఒక్కరోజే అతను సాయంత్రం సమయాల్లో ఇంటి దగ్గరుంటాడు. మిగతా అన్ని రోజులూ రాత్రి పదిగంటలవరకూ ఫ్లాట్ ఫారం మీదే వుండి అన్ని ఎక్స్ ప్రెస్ లూ సక్రమంగా సకాలానికి బయల్దేరేట్లుచూసి అప్పుడు ఇంటికివెళ్తాడు.
కానీ ఆ ఒక్కరోజూ తనుమనశ్శాంతిగా ఇంట్లోగడపకుండా ఇలా ఏదొక అడ్డంకివస్తూనే వుంటుంది.
"ఏమయింది?" అడిగాడతను మోహన్రావ్ దగ్గరకు వస్తూనే.
"అదే అర్ధం కావటంలేద్సార్! ఇంజన్ లోనూ, గార్డు బ్రేక్ లోనూ కూడా వ్యాక్యూమ్ సరిగ్గారావటం లేదు. వచ్చినా కూడా స్టెబిలైజ్ అవటం లేదు."
రామకృష్ణ వడివడిగా నడుస్తూ హౌస్ పైప్ లన్నీ చెక్ చేయటంమొదలుపెట్టాడు.
ఇంజన్ వరకూ వచ్చేశాడు గానీ తనకూ డిఫెక్ట్ ఏమీ కనిపించటం లేదు.
"మోహన్రావ్!" పిలిచాడతను.
"యస్సార్!"
"హోస్ పైప్స్ కి చిల్లులుపడి లీక్ అవుతుందేమోనని అనుమానంగా వుంది."
"అలా అయితే వ్యాక్యూమ్ అసలు రాకూడదు కదా"
"అవున్సార్"
"ఇంకోసారి హోస్ పైప్స్ చెక్ చేయించు!"
ఈ ఆలోచన బాగానే ఉందనిపించిందతనికి. మొత్తం హోస్ పైప్స్ అన్నీ మరోసారి చెక్ చేయడానికి గంటన్నర పట్టింది. అయినా ఉపయోగం లేకపోయింది. స్పీకర్ లో ఎనౌన్స్ మెంట్ వినబడుతోంది" దయచేసి కొన్ని సాంకేతిక లోపాలవల్ల గోదావరి ఎక్స్ ప్రెస్ బయల్దేరుటలో ఆలస్యమగుచున్నది. ప్రయాణీకులకుకలుగుతోన్న అసౌకర్యానికి చింతిస్తున్నాము!!"
* * *
సీనియర్ డి,ఎమ్.ఇ. దత్తాతన పక్కనే మరోసోఫాలో కూర్చుని టి.వి చూస్తోన్న రూపాదేవి వైపు చూశాడు. ఆమె తదేకంగా టి.వి. వంకే చూస్తూ అందులో వస్తోన్న హిందీ సీరియల్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు అర్ధమయిందతనికి. ఒక్కసారిగా అతనిలో ఆమెమీద ద్వేషం ప్రజ్వరిల్లింది ఆమె ఆనందాన్ని చిన్నాభిన్నం చెయ్యకపోతేతన శరీరంలోని రక్తనాళాలన్నీ తెగిపోతాయేమో అన్నంత ద్వేషం! అలా ఎందుకనిపిస్తుందో తనకేతెలీదు.
"ఏమిటలా చూస్తున్నావ్? అందులోని హీరోని కాలేజ్ మేట్ శ్రీవాత్సవ్ లాగున్నాడా?" వ్యంగ్యంగా అడిగాడతను హిందీలో.
రూపాదేవి వులిక్కిపడిందతని మాటలకు.
తలతిప్పి అతనివేపు చూసింది.
అతని మొహంచూస్తూనే ఆమెకు అర్ధమయింది తనని హిసించడానికి మొదటి సోపానంఅది.
పెళ్ళయిన గత ఆరేళ్ళనించి గమనిస్తూనే వుంది. పొరపాటుపడే అవకాశమే లేదు. "ఏం, మాట్లాడవేం? అంత ఇష్టంగా వుంటే వాడి దగ్గరకే వెళ్ళు-ఫో-"అతను కోపంగా ఊగిపోతూలేచి నించున్నాడు.
అలాంటి సమయాల్లో సాధారణంగా తను అతనికి సమాధానం ఇవ్వదు. ఇస్తే అతను మరింత రెచ్చిపోయి చేయి చేసుకుంటాడు.
రూపాదేవి లేచి నెమ్మదిగా అక్కడినుంచి గదిలోకి నడిచింది. అతని ఆవేశం ఆగలేదు. ఆమెవెనకే నడిచి ఆమె జుట్టు పట్టుకున్నాడు.
"సమాధానం కూడా చెప్పనంత పొగరెక్కిపోయిందన్న మాట నీ పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు" అంటూ ఆమెను తనవేపుతిప్పుకుని చెంపమీద బలంగా కొట్టాడు
రూప కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయ్. మౌనంగా చేతుల్లో మొఖం దాచుకుని ఏడవసాగింది.
అతను ఆమెను మొరటుగా మంచంవేపు ఒక్కతోపుతోసి తను బయటకునడిచాడు. అప్పుడు మనశ్శాంతి కలిగిందతనికి.
నెత్తిమీద నుంచి బరువు దించినట్లయింది. లోలోపల ఎక్కడో ఆనందం అప్పుడే మోగింది రైల్వే ఆటో ఫోన్.
"హలో!" అన్నాడతను. "దత్తాహియర్"
"సీనియర్ డి.ఓ.యస్ దిస్ సైడ్"
"యస్, వాడ్డూయూ వాంట్?" అంతలోనే మళ్ళీ అతనిలోని వింత తత్వం మేల్కొంది.
ద్వేషం!
దెబ్బకొట్టాలన్నతపన!