Previous Page Next Page 
ప్రతీకారం పేజి 5


    "పొద్దు పోయిందండీ! నాన్నగారు గాభరా పడుతూ వుంటారు. మరోసారి వస్తాను" అంటూ ట్యూబులైటు వెలుతుర్లో గడపమీద రాధకేసి చూశాను.
    "తప్పక వస్తారుగదూ?" ఆమె అడగలేదు నోరు తెరిచి. కాని ఆమె కళ్ళు ఆత్రంగా అడిగాయి.
    ఉత్సాహంగా జీపు స్టార్టు చేస్తూ, చెయ్యి ఊపాను. ఆమె కళ్ళు మెరిసినట్టు నాకు అనిపించింది.
    "తప్పక వస్తావు గదూ! మీ నాన్నగార్ని కూడా తీసుకురా!" అన్నాడు రఘురామయ్య.
    "ఆఁ అలాగేనండీ" జవాబిచ్చింది ఆయనకే కాని నేను చూస్తున్నది రాధ ముఖంలోకి.
    ఆ విధంగా అనుకోకుండా అయిన పరిచయం మా రెండు కుటుంబాల మధ్య గాఢానుబంధంగా మారింది. రఘురామయ్యగారు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి నాన్నగారితో గంటలకొద్దీ బాతాఖానీ వేసేవారు. నాన్నగారూ, నేనూ, వర్కు పూర్తి చేసుకొని తిరిగొస్తూ, తరచుగా వారింటికి వెళ్ళాం. రాధా, నేనూ ముఖాముఖీ ఎక్కువగా మాట్లాడుకోలేదు. మా మనసులు మూగ భాషలో ఎన్నో ఊసులు చెప్పుకున్నాయి. నాకు ఏ పని చేస్తున్నా రాధ రూపమే కళ్ళలో కన్పించేది. నేను పరధ్యానంగా వుండటం నాన్న గమనించారు. రాధ గురించి నా అభిప్రాయం అడిగారు.
    నేను పెదవి కదపకుండానే అంగీకారాన్ని తెలియజేశాను. నాన్నగారు ఆ విషయం రఘురామయ్యగారితో చెప్పారు. రఘురామయ్యగారు సంతోషంగా మా వివాహానికి అంగీకరించారు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారు."
    అంతవరకూ చెప్పి జగన్నాథం ఆగి దీర్ఘంగా నిట్టూర్పు విడిచారు. మూర్తి కుతూహలంగా జగన్నాథం ముఖంలోకి చూశాడు.
    "ఆఁ. ఆ తర్వాత ఏమయింది?"
    కొత్త బట్టలూ, నగలూ తీసుకొని, నాన్నా నేనూ బయలుదేరాం! అమ్మ గుర్తొచ్చి నాన్న కొంచెం బాధపడ్డారు. నాకు కళ్ళలో నీరు తిరిగింది.
    మేము చేరేటప్పటికి రఘురామయ్యగారింట్లో వారి దగ్గర బంధువులు, ఊళ్ళో కొందరు పెద్దలూ కూర్చుని వున్నారు.
    అంతలో హడావుడిగా మా నాన్నగారికి తెలిసిన ప్లీడరు గుమాస్తా ఒకతను వచ్చాడు.
    "ఇతను మా బావమర్ది!" అంటూ రఘురామయ్య ఆ ప్లీడరు గుమాస్తాను నాన్నగారికి పరిచయం చేశాడు.
    "రాఘవరావుగారు మీ బావమర్దా? నాకు తెలుసు ఆయన" అన్నారు నాన్నగారు.
    "అవును! జగన్నాథంగారు నాకు తెలుసు. ఆయన తెలుసు. ఆయన కేసు మా ప్లీడరుగారేగా తీసుకున్నారు! పాపం మొన్ననే దావా ఓడిపోయారు. ఆస్తంతా దాదాపు పోయినట్టే! ఈ విషయం నీకు తెలుసా?" అని రఘురామయ్యను ప్రశ్నించాడు.
    రఘురామయ్య తెల్లబోయి మా నాన్నగారి ముఖంలోకి చూశాడు. రఘురామయ్యకు ఆ విషయం తెలియదని నాకు తెలియదు.
    "అవును. కాని హైకోర్టుకు అప్పీలు చేస్తున్నాను. నేను తప్పక గెలుస్తాను మాకు బాగా నమ్మకం వుంది!"
    "ఈ నిశ్చితార్థం జరగటానికి వీల్లేదు" దాదాపు అరిచినట్టే అన్నాడు రఘురామయ్య.
    నాన్న ఆశ్చర్యంగా రఘురామయ్య ముఖంలోకి చూశాడు. ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. కాని రఘురామయ్య వినిపించుకోలేదు. విషయాన్ని దాచిపెట్టి నాన్న తనను మోసం చేశాడని నిందించాడు.
    "నీ ఆస్థి పోయింది. నాకు ఆస్థి వుంది. ఒక్క కూతురే అని తెలుసు. అందుకే ఈ వివాహం జరిపించడానికి ఇంత తొందర పడ్డావు ఇంత దగా చేస్తావనుకోలేదు" ఆవేశంగా ఎన్నో మాటలు అని నాన్నని అవమానించాడు.
    నాన్న గారికి కూడా కోపం వచ్చింది. ఇద్దరు ఘర్షణ పడ్డారు. నేను దిగులుగా కూర్చున్నాను. రాధ ఎంత బాధ పడుతుందో నాకు తెలియదు ఆమె లోపలే ఉంది.
    "దావా గెల్చిన తరువాతే నిశ్చితార్థం పెట్టుకుందాం" అంటూ రఘురామయ్యగారు నగలూ, బట్టలూ నాన్న ముందు పడేశారు. వచ్చిన పెద్దలంతా చూస్తూ వుండిపోయారు.
    నాన్నగారు అవమానంతో, కోపంతో గబగబా వెళ్ళి కార్లో కూర్చున్నారు. నేనూ వెళ్ళాను యాంత్రికంగా నాన్నతో పాటు. రఘురామయ్య పాలేరు మేము నిశ్చితార్థం కోసం తెచ్చిన నగలూ, బట్టలూ తెచ్చి కారులో పెట్టాడు.
    అంతవరకూ చెప్పి జగన్నాథం సిగరెట్ వెలిగించాడు. మూర్తి "తర్వాత?" కుతూహలంగా ప్రశ్నించాడు.
    జగన్నాథం అదోలా నవ్వుతూ "కథ చాలా ఇంటరెస్టింగుగా వుంది కదూ?" అన్నాడు.
    మూర్తి గతుక్కుమన్నాడు. సమాధానం చెప్పలేకపోయాడు.
    "కొందరి జీవితాలు కథలకంటే, సినిమాలకంటే కూడా ఇంటరెస్టింగుగా ఉంటాయి వినడానికి. రాధమీద నాకు నమ్మకం ఉంది. ఆమెను ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. రఘురామయ్యగారు లేని సమయంలో వాళ్ళింటికి వెళ్ళాను. నాన్నకు ఆ విషయం తెలియదు. తెలిస్తే వెళ్ళనివ్వరని నాకు తెలుసు. ఇంటిముందు జీపు ఆగగానే రాధ బయటకు వచ్చింది. నన్ను చూసి బెదిరిపోయింది.
    "ఏమిటి రాధా! అంత భయపడుతున్నావు?" అన్నాను.
    "అబ్బో! భయం దేనికి? లోనికి రండి!" అంటూ ఆహ్వానించింది రాధ.
    "అలా బయటికి వెళదాం వస్తావా? నీతో మాట్లాడాలి" అన్నాను.
    "బయటికా? వద్దు! నాన్నకు తెలిస్తే చంపేస్తారు, రండి లోపలకు. ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడండి!" అన్నది లోపలకు దారి తీస్తూ.

 Previous Page Next Page