Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 4


    "హలో...వచ్చేశారా! మీకోసమే చూస్తున్నా అన్నాడు" ఉత్సాహంగా.
    "ఎందుకు?"
    "రవీంద్రభారతిలో మంచి ప్రోగ్రామ్ వుంది. మీరు వస్తారేమోనని కాంప్లిమెంటరీస్ మనిద్దరికోసం నానా తంటాలు పడి సంపాదించాను..."
    "నేను రావటం లేదు."
    "ఎందుకని?"
    సావిత్రి జవాబు చెప్పకుండా అతనివంకోసారి సీరియస్ గా చూసి ఊరుకుంది.
    "మీరు వస్తే బావుంటుంది. మీతో మాట్లాడవలసిన విషయాలు కూడా చాలా వున్నాయ్."
    "అదేదో యిక్కడే మాట్లాడండి__"
    అతనికేం చేయాలో తెలీలేదు.
    "సరే__తప్పదంటే మాట్లాడతాను..."
    కూర్చుంటూ అన్నాడు.
    అతనేం మాట్లాడతాడో సావిత్రికి తెలుసు. తనను ప్రేమించానంటాడు. పెళ్ళిచేసుకుందామంటాడు.
    అందుకే ఎప్పటికప్పుడు ఆ టాపిక్ రాకుండా జాగ్రత్తపడుతోంది.
    ఇంకా కొద్దిరోజులు యిలా గడిపేస్తే తరువాత వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో తనకు ఎకామడేషన్ దొరుకుతుంది...
    అప్పుడు వీళ్ళకు గుడ్ బై చెప్పవచ్చు.
    "మీకు తెలిసే వుంటుంది. మా వాళ్ళు నాకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తున్నారు."
    "నాకు తెలీదు..."
    "మీతో సరోజ చెప్పలేదూ?"
    "ఏమో గుర్తులేదు__"
    "నేను ఏ సంబంధమూ ఒప్పుకోవటం లేదు. ఎందుకో తెలుసా?"
    "నాకనవసరమయిన విషయాల గురించి తెలుసుకోవటం నాకిష్టంలేదు."
    "ఎంతోమంది అడిగినంత కట్నమివ్వడానికి సిద్ధంగా వున్నారు. అయినా నాకు కట్నాలమీద ఆశలేదు. వర్కింగ్ గాళ్ అయితే బాగుంటుందని..."
    సావిత్రి తను ఆఫీసు నుంచి తెచ్చుకున్న ఇలూస్ట్రేటెడ్ వీక్లీ తీసి చూడసాగింది.
    టాపిక్ డెడ్ ఎండ్ కొచ్చేసింది.
    ఇంక అతను అసలు విషయంలోకొచ్చేస్తాడు.
    "అదీగాక మీరంటే నాకు చాలా ఇష్టం...అమ్మా నాన్నలు కూడా..."
    సావిత్రి కింక గత్యంతరం లేకపోయింది.
    "చూడండి! నేను ఇప్పట్లో వివాహం చేసుకోదల్చుకోలేదు...అంచేత ఇంకోసారి మీ విషయం నాదగ్గర చెప్పకండి!"
    మోహన్రావ్ మొఖంలో రంగులు మారినయ్.
    "ఇంకెవరినయినా ప్రేమించారు కాబోలు..."
    "ఆ విషయాలు మీకనవసరం అనుకుంటాను."
    మోహన్రావ్ అక్కడనుంచి వెళ్ళిపోయాడు విసురుగా...ఎంతోకాలం ఈ పరిస్థితి రాకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడిక తప్పదు. అతనీ విషయం మావయ్యతోనూ, అత్తయ్యతోనూ చెప్తాడు. వాళ్ళే ఇదంతా వెనుక ఉండి ఆడిస్తున్న నాటకం కనుక రియాక్షన్ చాలా త్వరగా వస్తుంది.
    అసలు తనేనాడో హాస్టల్లో చేరేది.
    కానీ తన తల్లిదండ్రులు వాళ్ళింట్లో ఉండమని కోరటం వల్ల దిగిందా ఇంట్లో.
    నెలరోజుల్లోనే తనకు అర్ధమయిపోయింది వాళ్ళ మనస్తత్వం! తను ప్రతినెలా తన ఖర్చుకోసం ఇచ్చే రెండొందల మీద ఆధారపడుతున్నట్లు కనిపించింది.
    వాళ్ళ పెద్దకొడుకులిద్దరూ వేరుపడిపోయారు... మోహన్రావ్ మూడోవాడు, ఇంటర్ చదివాడు. ఆ తరువాత తాగుడు, పేకాట_అన్నీ అడ్డుపడి చదువు ఆపేసినయ్. దొరికిన ఒకటి రెండు ఉద్యోగాల్లో నుంచి ఎంచేతో డిస్మిస్ చేయబడ్డాడు.
    అనుకున్నట్లే రాత్రి మావయ్య ప్రస్తావన లేవదీశాడు.
    "నువ్వు మా ఇంటి కోడలివయితే బాగుంటుందని నేనూ మీ అత్తయ్యా అనుకున్నాం...! ఈ విషయం మీ వాళ్ళతో కూడా మాట్లాడ్డానికి వచ్చేవారం వెళ్తున్నాను."
    "దానికోసమే మా వాళ్ళ దగ్గర కెళుతున్నట్లయితే అనవసరమండీ! నేను మోహన్రావ్ ని చేసుకోను..." ఖచ్చితంగా చెప్పేసింది.
    అతను నిర్ఘాంత పోయాడు.
    ఆమె ఇంత ఖండితంగా చెపుతుందని ఊహించలేదు. ఇన్ని రోజులూ ఎంత అమాయకంగా, మర్యాదగా, గౌరవంగా మెలిసిన సావిత్రేనా ఇలా మాట్లాడుతుంది?
    "సరే...సరేనమ్మా! నీ ఇష్టం..."
    ఆ రాత్రి చాలాసేపు సావిత్రికి నిద్రపట్టలేదు.
    తనకూ...వాళ్ళకూ మధ్య గ్యాప్ వచ్చేసిందిప్పుడు. అంచేత వీలయినంత త్వరగా బయటపడాలి...! అబిడ్స్ లో ఓ హాస్టల్ ఉందట! దాని విషయం కూడా కనుక్కోవాలి.
    మర్నాడు భోజనం చేస్తుంటే భాగ్యం మాటల్లో చెప్పేసింది.
    "ఇల్లు చాలా ఇరుగ్గా ఉందమ్మాయ్__అబ్బాయికి వచ్చే నెల్లోనే పెళ్ళి చేసేస్తున్నాం..."
    "వారం రోజుల్లో నేనే హాస్టల్ కెళ్తున్నానత్తయ్యా" ఛటుక్కున అనేసిందామె.
    భాగ్యం ఇంకేమీ మాట్లాడలేక పోయింది.

 Previous Page Next Page