మరో క్రొత్త కథ
ఆరోజు ఆదివారం.
ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు సెలవురోజు. వారం రోజులూ ఎదురుచూసే రోజు.
ఆరోజు ఉద్యోగాలుచేసే మొగవాళ్ళకు చాలా మంచిరోజు. పొద్దెక్కి లేవచ్చు - ఆఫీస్ కాగితాలు అవీ చూసుకోనక్కర్లేదు. వేళకు స్నానం చెయ్యక్కర్లేదు, వేళకు భోజనం చెయ్యక్కర్లేదు. వేళకు ఏది చెయ్యక్కర్లేదు. బోలెడు తీరుబడి. స్నేహితులతో పేకాటకూడా వేసుకోవచ్చు. ఊళ్ళో స్కాండల్స్ అన్నీ చెప్పుకోవచ్చు.
ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకు మాత్రం ఆ ఆదివారం మరింత హడావుడిరోజు. ఆ రోజే ఇళ్ళన్నీ బూజులు దులిపి ఊడిపించుకోవాలి! సామానులన్నీ సర్దుకుని ఏం ఉన్నాయో, లేవో చూసుకోవాలి! పిల్లలకు తలంటుపొయ్యాలి. ఏదైనా స్పెషల్ టిఫిన్ చెయ్యాలి. ఇవన్నీ కాక 'ఆదివారం' కదా అని వచ్చే పోయే బంధువులకు, స్నేహితులకు కాఫీ, టీలు అందించాలి.
ఆ ఆదివారం లలిత గదులు సర్దుతు బీరువా కూడా దులపటం మొదలుపెట్టింది- సేఫ్ లోంచి బేంక్ బుక్ క్రిందకు జారిపడింది-యధాలాపంగా తెరిచింది. గుండె జల్లుమంది. పొరపడుతున్నానేమోనని మరోసారి శ్రద్ధగా చూసింది. నిజమే? సందేహంలేదు. అయిదువేలు ఒకసారిగా డ్రా చేసాడు గోపాల్! ఎందుకు? అంత అవసరం ఏం వచ్చింది? వచ్చినా తనకు చెప్పకుండా ఎందుకు డ్రా చేసాడు?
ఎక్కడి పనులక్కడ వదిలేసి చేతిలో బేంక్ బుక్ అలాగే పట్టుకొని గోపాల్ దగ్గరికి వచ్చింది.
"అయిదువేలు ఒకసారిగా ఎందుకు డ్రా చేసారు" అని అడిగింది.
వాలు కుర్చీలో సగం పడుకుని వేడి వేడి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తు పేపర్ చదువుకుంటున్న గోపాల్ ఈ ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు. అతని చేతిలో పేపర్ జారిపోయింది. ముఖం పాలిపోయింది. కాఫీ గ్లాస్ పట్టుకున్న చెయ్యి వణికి కాఫీబొట్లు షర్ట్ మీద, లుంగీమీద పడ్డాయి.
అప్పటివరకు అటూ ఇటుగ ఉన్న లలిత మనసు ఈ వాలకం చూడగానే అనుమానాలతో నిండిపోయింది.
"అయిదువేలు ఎందుకు డ్రా చేసారంటే మాట్లాడరేం?" అంది మళ్ళీ గద్దిస్తున్నట్లు.
గోపాలం ముఖం చిట్లించుకుని "ఎవరో స్నేహితుడు కావాలంటే అప్పిచ్చాను. మళ్ళీ ఇస్తాడులే!" అన్నాడు.
లలితలో అసహనం మరింత పెరిగింది.
"ఎవరా స్నేహితుడు? ఎంత స్నేహితుడయినా ఒక్కసారిగా నోటిమాటమీద అయిదువేలు ఎలా ఇచ్చారు? నాతో మాట మాత్రంగానయినా ఎందుకు చెప్పలేదు."
గోపాలం చిరాగ్గా పేపర్ బల్లమీద వేసి కొట్టాడు.
"అన్నీ నీకు చెప్పి, నీ అనుమతి తీసుకుని చెయ్యాలా?" అన్నాడు.
నిర్ఘాంతపోయింది లలిత. తెల్లవారింది మొదలు బూట్లు వేసుకోనా! చెప్పులా? అంటూ తన ప్రాణాలు తోడే వ్యక్తా ఇలా మాట్లాడుతున్నాడు!
అతి ప్రయత్నంమీద కోపాన్ని నిగ్రహించుకుని "ఇప్పుడైనా చెప్పండి ఎవరా స్నేహితుడు? అంత డబ్బు ఎందుకవసరమైంది? మళ్ళీ ఎప్పుడిస్తాడు?" అంది ...
గోపాలం చిరాకు ఎక్కువైంది.
"నాకు స్నేహితుడు లక్షమంది ఉన్నారు. వాళ్ళందరు నీకు తెలుసా? ఏం చెపితే అర్ధమవుతుంది? ఏదో అవసరానికి ఆదుకున్నాను. వాడికి అనుకూలం కాగానే తీరుస్తాడు."
"ఆహా! ఎంత నిశ్చితంగా చెపుతున్నారు? అవసరానికి ఆదుకున్నారట! దానకర్ణులు బయలుదేరారు. ఇప్పుడు నాకు అవసరం! ఏదీ రెండువేలు, పోనీ ఒక్క వెయ్యి పుట్టించండి చూద్దాం!"
"సరేలే! ఏదో జరిగింది ఊరుకోరాదు!" విసుగ్గా అన్నాడు గోపాలం.
"బాగుంది, వేదాంతం. చేతులారా చేసుకొని ఏదో జరిగిందని ఊరుకోనా? ఇంతకూ ఎవరా స్నేహితుడంటే చెప్పరేం?"
కస్సుమని లేచాడు గోపాలం "ఏమిటి ఆరాలు. అంత నమ్మకంలేదా ? ఛ! ఛ! ఒక్కరోజు సెలవు కదా అని సుఖంగా విశ్రాంతి తీసుకుందామంటే ఈ పాడుకొంపలో ప్రాప్తంలేదు."
చిరాకుపడుతూ చెప్పులేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు గోపాలం.
తల గిర్రున తిరిగింది లలితకు. ఇది మామూలు విషయం కాదు. ఇందులో ఏదో కుంభకోణం ఉంది లేకపోతే గోపాలం అంత కంగారు పడడు. ఇలా దాచిపెట్టాలని చూడడు.
గోపాలం ఆప్తమిత్రుడు. శ్రీనివాసరావు భార్య రాజేశ్వరితో కలిసి వచ్చాడు. ఉదయమే ఇంట్లోంచి వెళ్ళిపోయిన గోపాలం అప్పటివరకు రాలేదు. లలిత వాళ్ళను ఆహ్వానించి కూచోబెట్టి కాఫీలిచ్చి అన్యమనస్కంగా వాళ్ళు అడిగినదానికి సమాధానాలిస్తోంది.
"అలా ఉన్నారేం?" అన్నాడు శ్రీనివాసరావు.
"ఏం లేదు-బడలిక!" అంది లలిత నవ్వడానికి ప్రయత్నిస్తూ. రాజేశ్వరి లలితను పరిశీలనగా చూస్తూ "కాదు ఏదో ఉంది. నిజం చెప్పండి. మీకు తెలిసిపోయిందా" అంది.
శ్రీనివాసరావు కోపంగా రాజేశ్వరివైపు చూసాడు. రాజేశ్వరి నాలుక కరుచుకుంది. ఇదంతా గమనించిన లలిత భయంగా...
"ఏమిటి తెలియుట ?" అంది.
శ్రీనివాసరావు నవ్వి "ఏం లేదండీ! మన గోపాలం ట్రాన్స్ ఫర్ అవుతుందేమోనని భయపడుతున్నాడు. అది మీకు తెలిసిందేమోనని అనుకుంటోంది." అన్నాడు.
శ్రీనివాసరావు మాట మారుస్తున్నాడని అర్ధమైంది లలితకు. ఏమిటి ఇవాళ లేచిన దగ్గరనుండి అన్నీ గందరగోళాలుగానే తయారవుతున్నాయి. గోపాలం శ్రీనివాసరావు ఎంతో దగ్గిర స్నేహితుడు. సాధారణంగా ఒకళ్ళ విషయాలు మరొకరికి తెలియకుండా ఉండవు. ఆ అయిదువేల గురించి అడిగితే?
కొంచెం సంకోచించిన సంగతి తెలుసుకోవాలనే ఆరాటాన్ని అణచుకోలేక అడిగేసింది.
"ఈయన ఈ మధ్యనే అయిదువేలు డ్రా చేసారు, ఎందుకంటే ఎవరో స్నేహితుడికోసమన్నారు. మీకేమైనా తెలుసునా?" శ్రీనివాసరావు కూడా అచ్చు గోపాలం లాగానే కంగారు పడ్డాడు. అనవసరంగా కంఠం వణుకుతుండగా "ఏమి! నాకేం తెలియదే!" అన్నాడు.
రాజేశ్వరి జాలిగా లలితవైపు చూసి నవ్వింది.
అక్కడితో ఏదో ఉందని రూఢి అయిపోయింది లలితకు-రాజేశ్వరికి తెలిస్తే తనకు చెప్పకుండా ఉండదు. ఎక్కువసేపు ఏ విషయాన్నీ దాచుకోలేదు ఆవిడ.
"మా పసుపచ్చ గులాబి మొగ్గతొడిగింది. చూద్దురుగాని రండి" అంది. లలిత లేచి రాజేశ్వరిని పెరట్లోకి ఆహ్వానించింది. ఆ అవకాశం కోసమే చూస్తున్నదానిలా గబుక్కున లేచింది. రాజేశ్వరి-శ్రీనివాసరావు రాజేశ్వరి వైపు భావగర్భితంగా చూసాడు. ఆ చూపులు లక్ష్యం చెయ్యనట్లే లలితను అనుసరించింది రాజేశ్వరి.