"మనం కిందకు వెళ్దాం" లేస్తూ అన్నాడు విష్ణువర్ధన్. అతడికి కూడా తను ధనికుడనే అహంకారం ఉంది. తనను దేవనారాయణ్ తగినంతగా గౌరవించటం లేదని కష్టంగా ఉంది.
అయినా ఏం చెయ్యగలడు? "తమ తమ నెలవులు తప్పిన..." అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి.
ఆ సమయంలో త్రిసికి మళ్ళీ అంది వెనుకటి మాటలు....
ఆశ్చర్యంగా విన్నాడు దేవనారాయణ్.
"ఈవిడ ఏ భాష మాట్లాడుతోంది మీకు అర్థమవుతోందా? ఇక్కడ అందరూ ఈవిడ ద్వారా దేవతలు మాట్లాడతారని అంటారు."
"స్పష్టంగా తెలియటంలేదు. బహుశః ఏదో ప్రాకృత భాషాభేదం కావచ్చు. రిఫర్ చేసి తెలుసుకుంటాను."
"చిత్రం, చదువూ సంస్కారం లేని అడవి పిల్ల? ప్రాకృతం ఎలా మాట్లాడగలదు?"
ఈ ప్రశ్నకు ఎవరిదగ్గిరా సమాధానం లేదు. ఎవరి ఆలోచనలు వారికున్నాయ్.
ఉన్నట్టుండి విరుచుకుపడిపోయింది త్రిసికి. కంగారుగా సమీపించబోయాడు డాక్టర్ రవి.
"వద్దు-వద్దు ఆమెని ముట్టుకోకండి. దేవతలు ఆమెని వదిలి వెళ్ళగానే అలా పడిపోతుంది. కొద్దిసేపట్లో తనే తేరుకుంటుంది. ఇది మాకందరికీ అలవాటే" ఆ మాటల్లో నమ్మకం ఉన్నా లేకపోయినా అతని మీద గౌరవంతో ఆగిపోయాడు రవి.
కొంచెం సేపట్లోనే త్రిసికి లేచింది. వెనుకటి దర్జా, ఠీవి ఏంలేవు. భావరహితమైన, అనాగరికమైన ముఖ భంగిమ.
ఎవరితోనూ మాట్లాడకుండా చరచర కిందకి దిగిపోయింది.
విష్ణువర్ధన్ లేచి మెట్ల దగ్గిరకి వచ్చాడు. మిగిలినవాళ్ళూ లేచారు. అనిల తనతో ఏమీ చెప్పకుండా జెన్నిఫర్ తోపాటు కిందకు దిగిపోవటం నచ్చలేదు దేవనారాయణ్ కి. కనీసం తనపక్క నడవవలసింది.
కింద కూలీలంతా కాచుకుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయేవారు. కానీ కూలి డబ్బుల కోసం ఆగారు.
అవి అందుకుని తిన్నగా కల్లు పాకాల దగ్గిరకి వెళ్ళాలి. అది వాళ్ళ నిత్య కార్యక్రమం. కల్లు పాకల దగ్గిరకి సాధారణంగా ఆడవాళ్ళు వెళ్ళరు. మొగవాళ్ళు ఎక్కువ కూలి సంపాదిస్తారు. తక్కువ డబ్బులు ఇంట్లో ఇస్తారు. వాళ్ళ సంపాదనలో సగానికి పైగా తాగుడు కిందే ఖర్చవుతుంది.
ఇల్లు నడిచేది ప్రధానంగా ఆడవాళ్ళ కూలితోనే. విష్ణువర్ధన్ ఎవరి కూలి వాళ్ళకిచ్చాడు.
"అనిలా మన ఇంటికి వచ్చేయ్?" చివరి ప్రయత్నంగా అన్నాడు దేవనారాయణ్.
"రానని చెప్పానుగా"
మండిపోయింది అతనికి.
"సరే, డేరాలలోనే ఉండు. నీకే తెలిసొస్తుంది. అప్పుడు నువ్వే వస్తావు మా ఇంటికి?" అనేశాడు.
అనిల స్వభావం ఏమాత్రం తెలిసి ఉన్నా అతడీమాటలు అని ఉండేవాడు కాదు. ఒకసారి అతడిలా మాట్లాడాక, నిజంగా ప్రాణాలే పోయే ఆపద ఎదురయినా అనిల అతడింట్లో అడుగుపెట్టదు.
ఆ ప్రదేశమంతా గుట్టలతో, మిట్టలతో, గుంటలతో చాలా ఎగుడు దిగుడుగా ఉంది. అలవాటు పడిన కూలీలు చకచక నడిచినట్లుగా రవి గ్రూప్ నడవలేకపోతోంది. విపరీతంగా అలిసిపోయిన అందరికీ ఎప్పుడు డేరాలలో వచ్చి పడదామా అని ఉంది.
డేరాల చుట్టూ లోతుగా స్నేక్ పిట్స్ తవ్వారు. ఒకచోట మాత్రం దరిలాగ బల్ల చెక్క పరిచారు. దానిమీదగా డేరాలలోకి చేరుకున్నారు.
డ్రాఫ్ట్ మన్ ప్రకాశం తన పనిలో లీనమయి ఉన్నాడు. అతడి చుట్టూ బాగా నల్లగా ఉన్నవీ వంకరలు తిరిగినవీ లోహపు ముక్కలూ సగం, సగం కాలినవీ, చిరినవీ గుడ్డ పీలికలూ నగిషీ పనులున్న కర్ర ముక్కలూ, చిల్పం చెక్కి ఉన్న రాతిముక్కలూ మొదలైనవి ఉన్నాయి.
ఆ పక్కనేటేబిల్ ఉంది.అది అందరికీ కామన్ టేబుల్. కొంచెం పెద్దది. దానిమీద డ్రాయింగ్ పేడ్స్, పెన్స్, పెన్సిల్స్, ప్రొటెక్టర్, రూలర్స్, డ్రాప్ట్ మన్స్ ట్రై ఏంగిల్స్, మేగ్నిఫయింగ్ గ్లాస్ మైక్రోస్కోప్,లాంగ్ బుక్ మొదలైనవి ఉన్నాయి.
కామన్ కిచెన్ లోంచి అందరికీ భోజనాలు వచ్చాయి. కిచెన్ అంటే వంటకోసం ప్రత్యేకంగా వేసిన డేరా. వంట బాధ్యత ప్రధానంగా త్రిసికిడి. ఆమెని మొరటు పనులు చెయ్యటానికి వినియోగించరు. అంచేత వంట పని అప్పగించారు. ఆమె క్రింద సహాయం చెయ్యటానికి మరో ఆడమనిషి కూడా ఉంది.
రాత్రి ఎనిమిదయినా విపరీతంగా ఉబ్బరిస్తోంది. అందరికీ స్నానం చెయ్యాలని ఉంది. కానీ చెరువు చాలా దూరం.
"ఎవరూ బట్టలు తడపకండి. తీసి వేరుగా ఉంచండి. రేపు టౌన్ లో టెస్ట్ కి పంపిద్దాం? ఆ మరకలేమితో తెలుస్తుంది" అన్నాడు రవి.
భోజనాలయ్యాక ఎవరి డేరాలలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అనిల, జెన్నిఫర్ ఒక డేరాలో, రవి, విష్ణువర్ధన్ లు ఒక డేరాలో. డ్రాఫ్ట్ మన్ ప్రకాశం, మరో ఇద్దరి టెక్నీషియన్ లు మరో డేరాలో.
మంచాల మీద పడుకుని కళ్ళు మూసుకున్నా ఎవరికీ నిద్ర రాలేదు. అంత శ్రమపడ్డ విష్ణువర్ధన్ కూడా కునుకు తీయలేకపోయాడు. మనసులలో ఏదో అవ్యక్తమైన భయం, దానికితోడు ఉబ్బరింపు.
ఏదో శబ్దం వినిపిస్తోంది. ఆ నిశ్శబ్దంలో ఎవరో ఏడుస్తున్నట్లుగా ఉంది. దూరం నుంచి సన్నగా వినిపిస్తోంది. అది ఇప్పుడే వినిపిస్తోందో? లేక ఎప్పుడూ వినిపిస్తూ ఈ నిశ్శబ్దంలో మరింత స్పష్టంగా ఉందో నిర్ణయించుకోలేకపోయాడు విష్ణువర్ధన్. ఉక్కపోతకో లేక భయానికో వంటినిండా చమటలు పడుతున్నాయి. ఇంక బింకంగా ఉండలేకపోయాడు.
"డాక్టర్ రవీ?" అన్నాడు నెమ్మదిగా.
"యస్" పడుకునే బదులు పలికాడు రవి.
తను అంత నెమ్మదిగా పిలిచినా రవికి వినిపించిందంటే అతడూ నిద్రపోవటం లేదన్నమాట.
ధైర్యం వచ్చింది విష్ణువర్ధన్ కి.
"ఆ శబ్దం విన్నారా?"
"ఏ శబ్దం? ఊరికి ఇంత దూరంలో చుట్టూ అరణ్యాలుండగా రాత్రివేళ ఎన్ని శబ్దాలైనా వినిపిస్తాయి. మీరింతకు ముందు 'ఎక్స్ కవేషన్స్ కి' వెళ్ళలేదా?"
"వెళ్లాను ఈ శబ్దం చాలా గమ్మత్తుగా ఉంది. ఎవరో ఏడుస్తున్నట్లు. ఈ స్థలాన్ని పిశాచాలు కాపలా కాస్తున్నాయని అందరూ అంటున్నారు. ఇక్కడ అందరు వద్దంటున్నా మనం గుహలోకి వెళ్ళాం. మన బట్టల పైన రక్తం మరకలు, ఇప్పుడిలా ఏడుస్తున్నట్లుగా ఉన్న ధ్వని ఇదంతా..."