ఓ గంటసేపు అస్థిమితంగా గడిచాక క్రమంగా నిద్రపట్టింది.
* * * *
రాత్రి పదకొండు గంటలవేళ అక్కడికి కొంచెం దూరంలో ఉన్న మరో గదిలో నరసింహంగారి కొడుకు సుదర్శనం చేతిలో ఆనాటి దినపత్రిక పట్టుకుని ఫేము కుర్చీలో కూచుని చదువుకుంటున్నాడు.
అతనికి యాభై ఏళ్ళుంటాయి. అతను తండ్రి అంత దృఢంగా వుండదు. జుట్టు ముందుభాగమంతా నెరిసిపోయింది.
సుదర్శనం ఎలక్ట్రిసిటీ డిపార్టమెంట్ లో ఎకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. మధ్యలో ట్రాన్స్ ఫర్ మీద ఎన్నో ఊళ్ళు తిరిగాడు. తిరిగి ఏడాది క్రితమే చిన్న ప్రమోషన్ మీద విజయవాడ చేరాడు.
ఉద్యోగంలో చేరిన కొత్తలో అతనికి జీవితం మీద అనేక ఆశలుండేవి. బాగా డబ్బు సంపాదించాలనీ, కుటుంబానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనీ కలలు కనేవాడు. రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసేవాడు. కాని తన కష్టానికి తగిన ప్రతిఫలం వుండటం లేదనీ, కేవలం సూటిగా కష్టపడడంచేత జీవితంతో పైకి రాలేదనీ, దానికి కొన్ని ప్రత్యేకమైన తెలివితేటలూ, విభిన్నమైన మార్గాలూ వుండాలని చాలా ఆలస్యంగా గుర్తించాడు. ఆ తెలివితేటలూ మార్గాలూ తెలుసుకోవాలనీ, అనుసరించాలనీ మధ్య మధ్య ప్రయత్నించాడు. కాని అన్నిసార్లూ ఘోరంగా దెబ్బతిన్నాడు.
అతను మొదట్నుంచీ చాలా అమాయకుడు. ఎవరేమి చెబితే అది వెంటనే నమ్మేస్తూ వుండేవాడు.
అసలు అతనిది విచిత్రమైన జాతకం అతనిదగ్గర ఎవరైనా అయిదూ, పదీ అప్పు తీసుకుంటే తిరిగి ఇచ్చేవారు కాదు. అతను వాళ్ళకు గుర్తు చెయ్యటానికూడా మొహమాటపడుతూ ఉండేవాడు. ఒకవేళ ఎప్పుడైనా ధైర్యంచేసి పెదవివిప్పి అడిగినా, అప్పు తీసుకున్నవాడు అతన్నో నేరస్థుడిలా వికృతమైన చూపుచూసి "మా పరిస్థితి తెలిసే అడుగుతున్నావా?" అనేవారు. సుదర్శనం తప్పు చేసినట్లు తలవంచుకొని ప్రక్కకి వెళ్ళిపోయేవాడు. పైగా పశ్చాత్తాపంతో ఆరోజంతా మధనపడేవాడు.
అతనేపనయినా చేద్దామనుకుంటే అది వెంటనే నెరవేరేదికాదు. ఇతరులకి చిటికలో అయ్యే పని అతనికి కొన్ని గంటలు, లేకపోతే కొన్ని రోజులు పట్టేది. ఒక్కోసారి అసలు నెరవేరేది కావు. ఎప్పుడైనా ఊరికి వెడదామని స్టేషనుకి వెడితే ఆరోజు తప్పనిసరిగా రైలు ఆలస్యంగా వచ్చేది. ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగి పురోహితుడ్ని పిల్చుకురమ్మని తండ్రి పంపిస్తే ఆ పురోహితుడు ఊళ్ళో లేకపోవటం ఊరామతా కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరిగినా మరో పురోహితుడు దొరక్కపోవడం జరిగేది. అతనందరితో ప్రేమతో ఆప్యాయంతో ప్రవర్తించడానికి ప్రయత్నించేవాడుగాని ఎవరూ అతనికి స్నేహితునిగా మిగిలేవారుకాదు. పై పెచ్చు ఈసడింపుగా, ఎగతాళిగా చూసేవారు.
అతను ఏనాడూ తండ్రికి ఎదురు చెప్పలేదు. అయినా తండ్రిచేత ఎప్పుడూ చివాట్లు తింటూనే ఉండేవాడు.
అలా తండ్రి తిట్టినందుకు కోపం రాకపోగా తనేదో తప్పు చేసేనానుకుని కుమిలిపోతూ వుండేవాడు.
ఉద్యోగంలో చేరి పది పదిహేనేళ్ళయాక ఇహ తన జీవితాల్లో అద్భుతాలు జరగవనీ, అతి సామాన్యంగా జరిగిపోతుందని గ్రహించాడు. తను అసలు సిసలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. ఈ వాతావరణమూ సామాన్యమైన కోరిక తీర్చుకోవడానిక్కూడా విపరీతమైన యిబ్బంది పడుతూ వుండాలి. కొన్నాళ్ళకు సామాన్యమైన కోరికలు తీరవని కూడా అసమాన్యమైన సంగతులుగా పరిణమించాయి. దాంతో అతని జీవితంలో ఒక నిర్లిప్తత ఏర్పడిపోయింది. ఏదో సాధించాలి. అన్న తపనపోయి రోజులెలాగడుస్తున్నాయి అన్న మీమాంసే అతన్ని అనుక్షణం వేధించివేస్తూ వుంటుంది.
నరసింహంగారికి అతనొక్కడే కొడుకు. అప్పచెల్లెళ్ళు మాత్రం అయిదుగురున్నారు. ముగ్గురు అతనికంటే పెద్ద, ఇద్దరు చిన్న. అందరూ ఎక్కడో ఓ చోట ఏదోరకంగా సంసారాలు చేసుకుంటున్నారు.