Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 4


    "అందాకా ఎందుకు? మా శాంతమ్మత్త కూతురిని నెలలు నిండాక డాక్టర్ దగ్గరకు చెకప్ కి తీసుకెళ్తూంటే ట్రాఫిక్ జామ్ లో మూడురోజులు గడపాల్సి వచ్చింది. అక్కడే నొప్పులు రావటం వల్ల ఖాళీగా ఉన్న లారీలో పురుడు పోసేశారు-" చెప్పింది సావిత్రమ్మ.

 

    "మన కాలనీ వెనుక వేపున్న శీనుగాడిలాగేగా లక్షాధికారి అయింది? ట్రాఫిక్ జామ్ లోకి దూసుకెళ్ళిపోయి ఎనిమిది గంటలపాటు వీడియో సినిమాలు వేసి టికెట్ పెట్టాడంట-"

 

    అందరం మాట్లాడుకుంటూండగానే తెల్లారిపోయింది. అయితే ఆ సాయంత్రం వరకూ కూడ సంధ్యారాణి కనిపించకపోయే సరికి మళ్ళీ ఆమె తల్లిదండ్రులు ఏడుపు మొదలెట్టారు-

 

    మేమంతా మళ్ళీ వాళ్ళ దగ్గరకెళ్ళాం.

 

    "ఆమె క్షేమంగా ఉందని తెలిసింది కదా! మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు? అడిగాడు శాయిరామ్.

 

    "అమ్మాయి నిజంగా ట్రాఫిక్ జామ్ లో ఉందోలేదో-"

 

    "అదేమిటి? ఆ వెంకటేశం గాడు కనిపించిందని చెప్పాడు కదా!"

 

    "వాడసలే తాగుబోతు! తాగిన నిషాలో- ఎవర్ని చూసి ఎవరనుకున్నాడో ఏమో-"

 

    వెంటనే వెంకటేశాన్ని పిలిపించాము.

 

    "ఏంటి గురూ?" కళ్ళు నులుముకుంటూ తూలుతూ వచ్చాడతను.

 

    "నిన్న రాత్రి నువ్ మాకు లకడీకాపూల్ ట్రాఫిక్ జామ్ లో కలిసినప్పుడు నీకు సంధ్యారాణి ఓ హోటల్లో కనిపించిందని చెప్పావ్ కదూ?"

 

    "నిన్న రాత్రా?"

 

    "అవును"

 

    "మీక్కనిపించానా?"

 

    అందరికీ కోపం ముంచుకొచ్చింది.

 

    "అంటే- అప్పుడే మర్చిపోయావా?"

 

    "అరెరె! కోపమెందుకన్నా! కనిపిస్తే కనిపించి ఉండొచ్చు! దానికింత కిరికిరెందుకు?"

 

    "అప్పుడు నీకు సంధ్యారాణి ఓ హోటల్లో కనిపించిందని చెప్పావా లేదా?"

 

    "సంధ్యారాణా?"

 

    "అవునయ్యా! ఇదిగో ఈ రామచంద్రమూర్తిగారమ్మాయ్ సంధ్యారాణి-"

 

    "ఓహో ఆ అమ్మాయా?"

 

    "అవును! ఆ అమ్మాయే!"

 

    "ఆ అమ్మాయికి నేను కనిపించానని చెప్పిందా?"

 

    "కాదు. నువ్వే ఆ అమ్మాయి కనిపించిందని చెప్పావ్"

 

    "ఎక్కడ?"

 

    "హోటల్లో"

 

    "ఏ హోటల్లో"

 

    "ఇరానీ హోటల్లో"

 

    అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు.

 

    "ఎవరా అమ్మాయ్?"

 

    "మాకు ఇంక కోపం ఆగలేదు.

 

    "సంధ్యారాణి-" పళ్ళు బిగపట్టి అరచాడు రంగారెడ్డి.

 

    "నేను చెప్పలేదు- అసలు నేను నిన్నరాత్రి లకడీకఫూలే వెళ్ళలేదు-"

 

    "అదేమిటోయ్- నువ్ ఆ ట్రాఫిక్ జామ్ లోనుంచి నీ సైకిల్ నెత్తిన పెట్టుకుని ఆరుగంటల పాటు జనాన్ని ఈదుకుంటూ బయటికొచ్చానని మాతో చెప్పలేదూ?"

 

    "మీతోనా?"

 

    "అవును."

 

    "నిన్న రాత్రా?"

 

    "అవును-"

 

    "అసలు మిమ్మల్ని నేను చూసి నెలరోజులయింది. ఆడెవడో మన కాలనీ రైటర్ నవలొకటి పబ్లిష్ చేస్తున్నాం చందాలివ్వమని అడగటానికి వచ్చినప్పుడు కలుసుకున్నాను-"

 

    యాదగిరి ఇంక సహించలేక అతనిని గట్టిగా ఒక్కతోపు తోశాడు. అతను కింద పడుతూనే గురక పెట్టి నిద్రపోసాగాడు.

 

    "పదండి- మళ్లా వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్ లోనే వెదుకుదాం" అన్నాడు రంగారెడ్డి.

 

    అందరం మళ్ళీ బయల్దేరాం.

 

    కోఠీవరకూ వెళ్ళామో లేదో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు సరదాగా అరగంటకోసారి విజిల్స్ ఊదుతూ మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ నిలబడి ఉన్నారు.

 

    మేమంతా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరకు నడిచాము.

 

    "ఇవాళ కొంచెం ఎక్కువగా జామ్ అయినట్లుంది కదండీ! కానిస్టేబుల్ గారూ?" అడిగాను నేను.


    
    "అవ్" అన్నాడు కానిస్టేబుల్.

 

    "కానీ రోజూ సాయంత్రం అయిదుగంటలకు ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయేది కదా! ఇవాళ మూడింటికే జామయిపోయిందే?" అడిగాడు గోపాల్రావ్.

 

    "ఇది ఈవాల్టిది కాదుయ్యా! నిన్నటి ట్రాఫిక్ జామే. ఇంకా క్లియర్ కాలేదు. ఇవాళ్టిది ఇంకాసేపట్లో మొదలవుతుంది" వివరంగా చెప్పాడతను.

 

    "అసలు ఈ ట్రాఫిక్ జామ్ ళు మీరివాళ ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్లు?" ఆ పక్కనే ఉన్న ఇన్ స్పెక్టర్ దగ్గరకెళ్ళి అడిగాడు గోపాల్రావ్.

 

    ఇన్ స్పెక్టర్ కి కోపం ముంచుకొచ్చింది.

 

    "ఎవర్నువ్వు? నీ నెత్తిమీద హెల్మెట్ ఏదీ? వందరూపాయలు ఫైన్ కట్టు-"

 

    గోపాల్రావ్ క్కూడా కోపం వచ్చేసింది.

 

    "ప్రెస్" అన్నాడు అయిడెంటిఫికేషన్ చూపిస్తూ!

 

    "ఓ! అలాగా! ట్రాఫిక్ జామ్ లు ఎందుకు ఏర్పాటు చేశారని అడిగింది మీరే కదూ?"

 

    "అవును-"

 

    "ఎందుకేమిటయ్యా! ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారొస్తున్నది ఎల్లుండేకదా? మీ పేపర్లో చదవలేదా?"

 

    "కానీ ఎల్లుండి వస్తూంటే ఇవాళే ట్రాఫిక్ జామ్ ఎందుకు ఏర్పాటు చేశారు?" అడిగాడు శాయిరామ్.

 

    "మీకేం మతుందా లేదా? అప్పటికప్పుడు సడెన్ గా ట్రాఫిక్ జామ్ ళు ఏర్పాటు చేసుకోవాలంటే మాటలేమిటి? కనీసం రెండు రోజుల ముందునుంచే ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే తీరా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ట్రాఫిక్ అంతా స్మూత్ గా వెళ్ళిపోతే బాధ్యత ఎవరిది? మీదా? మాదా? న్యూస్ పేపర్లన్నీ దుమ్మెత్తిపోస్తాయ్- మా డిపార్ట్ మెంట్ మీద ప్రెసిడెంట్ అంతటివాడు హైదరాబాద్ వస్తే ఒక్కచోట కూడా ట్రాఫిక్ జామ్స్ లేవని! అవునా కాదా?"

 

    "అవునవును" అన్నాడు జనార్ధన్.

 

    "మరో రెండు గంటలు మేము ఆ ట్రాఫిక్ జామ్ లో నుంచి ముందుకెళ్ళటానికి ప్రయత్నించి, చేతకాక చివరకు వెనక్కు తిరిగాము. అయితే అప్పటికే మా వెనుక కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల మరో రెండుగంటలు తన్నుకుని ఎలాగయితేనేం రాత్రికి మళ్ళీ కాలనీకి చేరుకున్నాం. అప్పటికే సంధ్యారాణి తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఏడవటం మానేశారు. లకడీకఫూల్ వెళ్ళటానికి రింగ్ రోడ్డు ఉప్పల్ మీదుగా మరోదారి ఉందన్న విషయం తెలిసి అప్పటికప్పుడే రెడీ అయ్యాము గానీ తీరా ఆఖరి క్షణంలో శాయిరామ్ అడ్డుపడ్డారు.

 

    "ట్రాఫిక్ జామ్స్ ప్రతి ఏరియాలోనూ ఒకో టైమింగ్స్ ని బట్టి ఏర్పాటు చేస్తుంటారు పోలీసులు. కనుక ఈ దారిలో ట్రాఫిక్ జామ్స్ ఏయే టైమింగ్ లో మెయింటెయిన్ చేస్తూంటారో పోలీస్ స్టేషన్స్ కి ఫోన్ చేసి కనుక్కుని దాని ప్రకారం మనం వెళ్ళటం మంచిది" అన్నాడతను.

 Previous Page Next Page