Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 4


    అతను చెప్పింది నిజమే అయింది. తండ్రి ఎదుటపడి ఏమీ అనకపోయినా రామం మనిషి కఠినుడు కాసాగాడు. ఇంట్లో అన్నం తినడం మానేశాడు. ఎవ్వరితోనూ అసలు మాట్లాడేవాడు కాదు. ఇట్లా కొన్నిరోజులు జరిగితే అసలు యింట్లోంచి పారిపోతాడేమోనన్న భయం కలిగింది తల్లిదండ్రులిద్దరికి.

 

    చివరికి రామం కోరిక నెరవేరింది.

 

    తండ్రిని ఎంతో పీడించి, ఆయన యిష్టానికి వ్యతిరేకంగా తానీ డబ్బు సాధించాలని రామం మరిచిపోలేదు. తన బాధ్యత అతనిముందు హిమాలయ పర్వతమంత యెత్తున కనబడుతోంది. అందుకని సోమయాజులగారితో తమ పథకమంతా క్షుణ్ణంగా నిర్ణయించుకుని అప్పుడు రంగంలోకి దిగాడు.

 

    తమ పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరౌతుందా లేక మంచి ఫలితం వస్తుందా అని అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. కాని సోమయాజులు గారు మంచి అనుభవజ్ఞులు. మొదటి ప్రయత్నంగా ఆయన వాళ్ళంతా బట్టలు వుతుక్కునే సోప్ ప్లేక్స్ తయారుచేశారు. చూసినవాళ్ళంతా మంచి క్వాలిటీ అన్నారు. ఇహ బాగా ప్రచారం చేసుకోవటంలోనూ, పలుకుబడి ఉపయోగించుకోవటంలోనూ వుంది వ్యవహారం. ఈ బాధ్యత రామం తీసుకున్నాడు. పత్రికల్లో, విపరీతంగా ప్రకటనలు చేయించాడు. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన వూళ్ళన్నీ ఒక్కసారి తిరిగి ఫలితం విజయవంతం చేస్తున్నాడు.

 

    వాళ్ల సరుకుకి మార్కెట్ పెరిగింది. నలుమూలలనుండి ఆర్డర్లు రాసాగినై.

 

    క్రమంగా వాళ్ళు అన్ని రకాల సబ్బులూ తయారు చెయ్యసాగారు. వాళ్ళ కంపెనీ సిబ్బంది హెచ్చించి, అమ్మకం పెరిగి లాభాలు రాసాగినై.

 

    కొంతకాలం అయినాక రామం ఓ బరువైన కవరు తెచ్చి తండ్రి ఎదుట నిలబడి, ఎంతో ధైర్యం తెచ్చుకుని "మన పెట్టుబడి నాన్నగారూ! వుంచండి. నేనిప్పుడు నా కాళ్ళమీద నిలబడగలిగాను" అన్నాడు వినయంగా.

 

    విశ్వనాథంగారికి హృదయం ఆర్ధ్రమైంది. కన్నులు చెమర్చినై. కుమారుడ్ని మనసులో ఆశీర్వదించాడు.


                                    *  *  *


    ఈ సమయమంతా రామం మనోరమని మరిచిపోలేదు. ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నాడు. ప్రేమిస్తూనే వున్నాడు. ఆమెను తనదానిని చేసుకుందామని ఉవ్విళ్ళూరుతూనే వున్నాడు. ఆమె యిప్పుడు బి.ఎ.లోకి వచ్చింది.

 

    ఈనాటికి అతనికి సమయం వచ్చింది.

 

    "ఇక్కడ వుండి ట్రాన్స్ ఫరై వెళ్ళిన రమణారావుగారు లేరూ? వాళ్ళమ్మాయి మనోరమ అని వుంది. ఆమెని... నేను పెళ్ళి చేసుకుందామనుకుంటున్నా నమ్మా" అని ఒకనాడు తల్లి ముందు మనసు వెలిబుచ్చాడు.

 

    "ఆ అమ్మాయిని నేను చూశానమ్మా! చాలా అందంగా వుంటుంది" అన్నది అక్కడే వున్న ఆశ ఉత్సాహంగా.

 

    లలితమ్మగారు మాత్రం మనసులో సంతోషించినా బయటకు "మరి వాళ్ళ కులం, గోత్రం?" అన్నది గంభీరంగా.

 

    "మనకు సరిపోయేవే అమ్మా!"

 

    చాలా స్వల్పమైన వ్యవధిలో వ్యవహారం పరిష్కారమైన మనోరమ ఆ యింటికి కోడలుగా వచ్చింది.

 

    లలితమ్మగారు కోడల్ని చూసి మురిసిపోయింది.

 

    రామానికి యిహ జీవితం స్వర్గం అనిపించింది. తాను జీవితంలో వాంఛించినవన్నీ లభించాయి. మనసు యిచ్చిన మగువ, ప్రపంచంలో స్థానం. రాసుల రాసుల డబ్బు గడించకపోయినా జీవితాన్ని సునాయాసంగా నెట్టి వేయగలిగే వ్యాపారం.

 

    పెళ్ళికాకముందు అవకాశం వచ్చినప్పుడల్లా అతను అనేక వ్యవహారాలు నడిపాడు. ఇప్పుడవన్నీ తలుచుకుంటే అతనికి సిగ్గుగా, బాధగా వుంది. ఏ పరిస్థితుల్లోనూ అతను మనోరమకు అన్యాయం చేయదలచుకోలేదు. ఆమెని తన ప్రాణంగా చూసుకోసాగాడు.

 

    కాని ఆమెకు ఎడంగా వున్న యీమధ్యకాలంలో ఆమె వ్యక్తిత్వం ఎంత పెరిగిందో అతను వూహించలేకపోయాడు. ఆమె స్వేచ్చాప్రియ. ఆమెకు ఎన్నో అభిరుచులున్నాయి. ఒక్కక్షణం సోమరిగా, ముభావంగా ఆమె కూర్చోలేదు. రామంలోని ఆకర్షణలు చూసి ఆనాడు ప్రేమించింది, అందుకనే పెళ్ళి చేసుకుంది. ఆమె ప్రేమకీనాడు లోపంలేదు. అత్తగార్ని గౌరవిస్తుంది. మామగార్ని మర్యాద చేస్తుంది. ఇదే జీవిత పరమార్థమని నమ్మటానికి నిత్యమూ ప్రయత్నిస్తూనే వుంది. కాని ఆమె మనస్సు అంగీకరించటంలేదు. ఇదికాదు జీవితం- మరేదో వున్నదని ఉద్భోధిస్తోంది. నూతనత్వం వెదుక్కోమని ప్రబోధిస్తోందది. ఆమెకు యీ ఆనందం చాలేదికాదు. ఈ జీవితం యిరుకనిపిస్తోంది. అంతులేని విశాలత్వాన్ని వాంఛిస్తోంది. రోజూ ఏదో ఒక కొత్త సంఘటన జరగాలని వెర్రివ్యామోహంగా వుండేది.    

 

    మనోరమ ఎంతో మధురంగా పాడుతుంది. ఆమె తన సన్నని చిత్రమైన కంఠంతో పాడుతుంటే ఆ శబ్దతరంగాలు వాతావరణాన్ని మధురపరుస్తాయి. ఎదుటివార్ని కవ్విస్తాయి. ఆమె తన తియ్యని గొంతుతో మాట్లాడుతూంటే అస్పష్టమైన వేదన, హృదయంలోతూ పొడగట్టుతూ పుస్తకంలోని పాత్ర పలుకుతున్నట్లు వుండేది. సరిహద్దులూ ఎల్లలూ చికాకు. ఆమెకు ఎవరితోనైనా హాయిగా సంభాషిస్తుంటే ప్రాణం లేచివస్తుంది. ఆమె సౌందర్యోపాసి. సూర్యోదయం, అస్తమయ దృశ్యాలూ అవి ప్రకృతిని ప్రభావింపజేసే సహజ లాలిత్వం పరికిస్తూ మైమరిచిపోతూండేది. ఎక్కడో ప్రకృతిలో అజ్ఞాతసీమల్లో దేన్నో అన్వేషిస్తూ ఒంటరిగా తిరుగాడుతున్నట్లు కలలుగనేది.

 

    ఆమె డ్యాన్స్ అంటే ప్రాణం యిస్తుంది. చిన్నతనం నుండి డ్యాన్స్ నేర్చుకుంటూనే వుంది. కాలేజీలో ఎన్నో ప్రదర్శనాలు ఇచ్చింది.

 

    నటన అంటే చెవి కోసుకుంటుంది.

 

    ఆమె రామాన్ని మనస్పూర్తిగా ప్రేమిస్తూనే వుంది. అతన్ని ఎన్నో చిలిపి మాటలంటుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ అతని జుత్తు చిందరవందర చేసేస్తుంది. "ఒక్కసారి వెక్కిరించరూ!" అని అడుగుతుంది. "నాకు కన్ను కొట్టరూ?" అని మారాము చేస్తుంది.

 

    కాని రాను రాను రామానికి సహనశక్తి సన్నగిల్లిపోసాగింది. మనిషి తన స్నేహితురాలిలో హర్షించేది ప్రేయసితో హర్షించలేడు. ప్రేయసితో హర్షించేది యింటి యిల్లాలితో హర్షించలేడు. ఆమె డ్యాన్సు యింకా నేర్చుకుంటా నంటుంది. ఏదో క్లబ్బులో వార్షికోత్సవం. అక్కడ ప్రదర్శనమిస్తానంటుంది. నెలకూ, రెండునెల్లకూ విజయవాడ రేడియో స్టేషన్ కి వెళ్లి పాడి వస్తూంటుంది. "నటించడంలోనే జీవితం సార్థకమౌతుంది. నేను యాక్ట్ చేస్తాను" అంటుంది.

 Previous Page Next Page