రెండో వ్యక్తి వెంటనే ఏం మాట్లాడలేదు.
హాస్పిటల్ కేసి చూస్తున్నాడు.
ఆ టెర్రస్ క్రింద ఉన్న అపార్టుమెంట్స్ లో నివసిస్తున్న కుటుంబాలకు తమ కప్పు మీద మారణాయుధాల్లాంటి మహా ప్రమాదకరమయిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని మట్టు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలీదు. తెలిస్తే అలా ఆదమరిచి నిద్రపోలేరు.
చల్లటి ఈదురుగాలి అరేబియా సముద్రంమీంచి వీస్తోంది. నిశి నిశ్శబ్దంలో ముడుచుకున్న కొండ చిలువలా ఉన్న ఆ వీధిలో మరికొద్ది నిముషాల్లో ఓ విస్ఫోటనం జరగబోతున్నట్లు కేవలం ముగ్గురు వ్యక్తులకే తెలుసు.
కాలం భారంగా కదులుతోంది.
* * * * *
డాక్టర్ పరబ్రహ్మం మెల్లగా ఇరుకైన మెట్లమీంచి దిగుతూ వారికి దారి చూపించసాగాడు.
పదహారవ అంతస్థు నుంచి క్రమంగా దిగుతూ ఐదవ అంతస్తుకి చేరుకున్నారు.
"ఇక్కడి నుంచి క్రిందకు వెళ్ళే మెట్లు ఆగిపోతాయి. ఇకపై క్రిందకు వెళ్ళాలంటే లిఫ్టు ప్రక్కనున్న స్టెయిర్ కేసే దారి తీయాలి. ఏం చేద్దామంటారు....?" పరబ్రహ్మం మెల్లగా ప్రశ్నించాడు.
ఆ యువకుడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు.
"ఓ పని చేయండి. నాకో రోప్ సప్లయ్ చేయండి. మీరు లిఫ్ట్ గుండా క్రిందకు వెళ్ళి వ్యాన్ ఎక్కి మరోక్షణం ఆలస్యం చేయకుండా ముందుకు సాగిపోండి."
అదంతా ఎందుకో పరబ్రహ్మానికి అర్ధం కాకపోయినా, ఆ నడివయస్కుడికి అర్ధమయి ముందుకు సాగాడు.
"జస్ట్ ఏ మినిట్" అన్నాడా యువకుడు.
నడి వయస్కుడు ఆగిపోయి ఏమిటన్నట్లు చూశాడు.
"కెమేరా ఇలా ఇచ్చి వెళ్ళండి" అన్నాడు.
నడివయస్కుడు మినీ కెమేరాని కోటు జేబులోంచి తీసి ఆ యువకుడికి అందించాడు.
ఆలోపు పరబ్రహ్మం లోపలకు వెళ్ళి ఓ ప్లాస్టిక్ రోప్ తో వచ్చాడు.
ఆ పైన వాళ్ళు చీలిపోయారు.
ఆ యువకుడు ఐదవ అంతస్తు కిటికీ దగ్గరకు వెళ్ళి గ్లాస్ డోర్ తెరిచి బయటకు చూశాడు.
ఆ మరుక్షణం ఆ రోప్ ని విండోకి కట్టి దాని రెండో చివరను బయటకు విసిరాడు.
డాక్టర్ పరబ్రహ్మం, నడివయస్కుడు లిఫ్టులోకి వెళ్ళగానే డోర్స్ మూసుకున్నాయి.
తన అరచేతిలో ఉన్న బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలని పరబ్రహ్మానికి మహా ఉత్సాహంగా ఉంది.
మరికొద్ది క్షణాలకి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోరుని చేరుకుంది.
ఆ యువకుడు తన రెండు చేతులకు గ్లౌస్ వేసుకొని కిటికీ ఎక్కి మరోసారి క్రిందకు చూశాడు. డాక్టరు పరబ్రహ్మం లిఫ్ట్ లోంచి బయటకు వచ్చాడు. ఆ వెనుకే వచ్చిన నడివయస్కుడు వ్యాన్ వేపు నడిచాడు.
మరో నిమిషానికి ఆ ఇద్దర్ని ఎక్కించుకున్న వ్యాన్ హాస్పిటల్ ఆవరణ దాటి రోడ్డెక్కింది.
ఆ యువకుడు ఎంతో నేర్పున్నవాడిలా ప్లాస్టిక్ రోప్ ని బలంగా పట్టుకొని కొద్ది క్షణాల్లోనే క్రిందకు జారిపోయాడు.
వ్యాన్ రోడ్డెక్కి వేగం పుంజుకుంది.
ఆ యువకుడు హాస్పిటల్ లో ప్రహరీ గోడను ఎక్కి బీచ్ వేపుకు దూకి సన్నటి రహదారి వెంట మెయిన్ రోడ్ మీదకు వచ్చి, అప్పుడే అటుగా వెళుతున్న ఆటోని ఆపి ఎక్కాడు.
మరికొద్ది క్షణాలకు ఆటోలో వెళుతున్న యువకుడికి దూరంగా వెళ్తున్న తన వ్యాన్ కనిపించింది.
మరికొద్ది క్షణాలకు....
ఆ నిశీధి నిశ్శబ్ధాన్ని బ్రద్దలు చేస్తూ భయంకరమైన విస్ఫోటనం జరిగింది.
ఆ వ్యాన్ కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా చిన్న చిన్న ముక్కలు క్రింద బ్రద్దలయి పోయింది.
"సాక్ష్యాలుండటం నా వృత్తి కంత మంచిదికాదు మిత్రుల్లారా" అని అనుకున్నాడా యువకుడు తనలోతానే.
* * * * *
మిల్లర్... జాన్ మిల్లర్.... ఒకప్పటి డేంజరస్ కిల్లర్... సన్నగా.... ఆరోగ్యంగా, బలిష్టంగా కనిపించే నలభై ఐదేండ్ల మిల్లర్... జాతిరీత్యా నీగ్రో....నల్లగా....నల్లత్రాచులా నిగనిగలాడే కింగ్ కోబ్రాలాంటి ప్రమాదకరమైన మనిషి.
ఇప్పుడు బొంబాయి కొలాబా ప్రాంతంలో ఉన్న ఒక పురాతనమైన పార్సీ బంగ్లాలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సౌండ్ ఫ్రూఫ్ హాల్లో నెమ్మదిగా పచార్లు చేస్తున్నాడు.
అతనికి ఎదురుగా నలుగురు యువకులు పోలీసు జాగిలాల్లా మిల్లర్ చెప్పబోయే దానికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
"మీ నలుగురి శక్తి సామర్ద్యాలపై నాకు పూర్తి విశ్వాసముంది. కాని... మీ శక్తి సామర్ధ్యాల కన్నా పొంచి ఉన్న ప్రమాదాలు చాలా పెద్దవి దొంగతనం చేసిన దొంగ ఎన్ని మార్గాల నుంచైనా తప్పించుకోవచ్చు. బట్.... అతన్ని పట్టుకోవలసిన పోలీసు ఆఫీసర్ కి మాత్రం ఒక్కటే మార్గం వుంటుంది. అది....ఆ దొంగ పారిపోయిన మార్గం.....సో.... క్రిమినల్స్ కి ఒక క్రమ పద్దతి లేదు. ఎప్పుడయినా, ఎక్కడయినా, ఎలాగయినా ఎంటర్ అవ్వగలరు. ఏదో విధంగా తప్పించుకోనూ గలరు.
మీ విశ్వాసంపై కూడా నాకు నమ్మకం ఉంది. అయినా డబ్బు మహత్యాన్ని విస్మరించలేను.
ఏది ఏమైనా మాస్టర్ లైఫ్ మనకు చాలా విలువైనది. ఈ మహానగరంలో నలుగురు సీనియర్ ప్రొఫెషనల్ కిల్లర్స్ మన మాస్టర్ ప్రాణాల్ని తీసుకొనేందుకు పొంచి ఉన్నారు. ఒక్కొక్కరికి సుమారు యాభై లస్ఖలు ఆఫర్ చేయబడ్డాయి...." మిల్లర్ చెప్పటం ఆపి సిగార్ లో పొడిని దట్టించే ప్రయత్నంలో పడ్డాడు.