వాళ్ళిద్దరికీ త్వరలో వివాహం జరగబోతూ వుంది. ఆంధ్రప్రదేశ్ అత్యంత సంతోషకరమైన సంసారాల్లో వాళ్ళది ఒకటి అవుతుందన్నది నిర్వివాదాంశం! భార్యాభర్తలిద్దరూ సమానస్థాయి తెలివితేటల్తో వైబ్రేట్ అవటం అన్నది సాధారణంగా ఎక్కడోగానీ జరగదు.
నేను వాళ్ళ దగ్గిరకి వెళ్ళేసరికి శివప్రసాద్ సూపర్నెంటెండెంట్ కి ఏదో వివరణలు ఇస్తూ ఒక సెల్లూ చూపిస్తున్నాడు. దూరంనుంచి అతడు చేతులు వూపే విధానం చూస్తూంటే, మాటలు వినిపించక, కథాకళీ చేస్తున్నట్టు వుంది.
"అతనే సార్- భీమరాజు అనే నొటోరియస్ క్రిమినల్"
"పేరు విన్నాను. అతనే కదూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సంబంధమున్న దాదా"
"అవును సార్. వీడికే వేలూ లక్షలూ సొమ్మిచ్చి ఎంతోమంది రాజకీయమైన హత్యలకీ, గూడుపుఠాణీలకీ ఉపయోగించుకుంటున్నారు. జాలీ దయా దాక్షిణ్యం మాత్రం లేని కర్కోటకుడు సార్ వాడు."
"వీడిక్కడ వుండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడిపోతున్నారో."
"అందుకే ననుకుంటా సార్. తిండి తినేటప్పుడు తరచు వీడికి పొలమారుతూ వుంటుంది. బహుశా ఆ నాయకులు తలచుకుంటూ ఉంటారేమో."
సూపర్నెంటెండెంట్ ఆ మాటలకి పగలబడి నవ్వాడు. నాకెందుకో ఆయనలా నవ్వటం అంతగా నచ్చలేదు. ఉన్నత స్థానంలోవున్న ఆఫీసర్లు, ముఖ్యంగా ఇలాటి పోలీస్ డిపార్టుమెంట్ లో ఉన్నతాధికారులు అలా నవ్వకూడదు. ట్రెయినింగ్ లో ఒక అనుభవజ్ఞుడైన ఆఫీసరు మాకు లెక్చర్ యిస్తూ చెప్పాడు- "ఈ డ్రెస్ లో మీరంటే చూసేవారికి గౌరవం ఏర్పడాలి. మీ సంతోషం, విచారం, నవ్వు అన్నీ మీరు ఒంటరిగా గానీ, స్నేహితుల్తో బయట ఉన్నప్పుడుగానీ ప్రకటింప బడాలి తప్ప - డ్రెస్ లో ఉన్నప్పుడు కాదు."
ఈ వాక్యం నాకు బాగా జ్ఞాపకం వుంది.
సూపర్నెంటెండెంట్ ఈ జైలుకి కొత్తగా వచ్చాడు. అంతకు ముందు మరో డిపార్టుమెంట్ లో ఉన్నతమైన స్థానంలో ఉండేవాడట. మరి అంత మంచి పొజిషన్ వదులుకుని ఎందుకు వచ్చాడో తెలియదు. జైలుకి, ముఖ్యంగా భారతదేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాకరమైన ఈ జైలుకి అధికారిగా రావటం అంటే కత్తిమీద సామే! ఆయన కొత్తపోస్టులో జాయినయిన రోజే మేమిచ్చిన తేనీటి విందులో ఎవరో ఈ ప్రశ్నే అడిగితే ఆయన నవ్వేడు. "నాకు అడ్వెంచర్ ఇష్టం. ఇంత ప్రతిష్టాకరమైన జైలుకి సర్వాధికారిగా వుండటం థ్రిల్."
నాకెందుకో ఆ మాటల్లో నూటికి నూరుపాళ్ళూ నిజం వుందని పించలేదు. కొండ చిలువల కన్నా ప్రమాదకరమైన ఈ కిరాతకులు, ఏ క్షణం ఏ వైపునుంచి వస్తుందో తెలియని ప్రమాదం- వీటిమధ్య బ్రతకటం ఆయనన్నట్టు థ్రిల్లే అయితే కావచ్చుగానీ- అన్ని పత్రికా విలేఖర్ల కళ్ళూ ఇటే ఉన్న స్థితిలో, ప్రిజ్నర్స్ కౌన్సిల్ నుంచీ రోజూ తాఖీదులు అందుకుంటూ, మరోవైపు సుప్రీంకోర్టునుంచి మొట్టికాయలు తింటూ ఉండటం అంత ఆనందకరమైన విషయం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఏ మాత్రం అజాగ్రత్తగా వుండి, ఏ ఒక్క ఖైదీ తప్పించుకుపోవటానికి ఆస్కారం కల్పించినా, బ్రిటీషర్ల కాలంనుంచీ యెంతో ప్రతిష్ఠాకరంగా వున్న ఈ జైలు పరపతిని తన హయంలో పోగొట్టటానికి ఏ ఉన్నతాధికారీ సంసిద్ధుడు కాడు. అందుకే ఎంతోమంది సూపర్నెంటెండెంట్ లు ఈ జైలు నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకోవటానికి నానా కష్టాలు పడటం నేను ఎరుగుదును. అయినా ఏమో, నా వూహ తప్పే కావొచ్చు. ఆయన పైకి యింత నెమ్మదస్తుడిలా కనబడుతున్నా లోలోపల నిజంగానే అడ్వెంచర్ అంటే ఇష్టం ఉన్న వ్యక్తి కావొచ్చు.
ఆయనకి సెల్యూట్ చేసి వాళ్ళతోపాటూ నడవసాగాను.
శివప్రసాద్ యధావిధిగా లోగడలాగా మాట్లాడుతున్నాడు. కొత్త అధికారి అన్ని సెల్స్ చూసి వెనక్కి వెళ్లిపోయాడు. ఆయనతోపాటూ శివప్రసాద్ కూడా వెళ్ళాడు. వచ్చేనెల అతడి పెళ్లి. కనీసం రెండు నెలలయినా శలవు సంపాదించాలని శతవిధాల కాకా పడుతున్నాడు. కానీ అది అసంభవం. గురుడికి వారం దొరుకుతే గొప్పే.
కొందరు ఖైదీలు తోటపని చేస్తున్నారు. దూరంగా వంటింటినుంచి సాంబారు వాసన వస్తూంది. నెత్తిమీద ఎండ మాడ్చేస్తుంది.
మధ్యలో సబ్ -జైలరు కార్యాలయం వుంది. చుట్టూ విశాలమైన ఖాళీస్థలం. దానిని ఆనుకుని వృత్తాకారంలో సెల్స్. వాటి వెనుకవైపున చిన్న తోట. అది దాటితే మళ్ళీ ఖాళీస్థలం. దానిని ఆనుకుని ప్రహరీగోడ. ఇరవైగజాలకొక స్థూపం, దానిమీద జవాన్లు. రాత్రిపూట సెర్చిలైటు నిర్విరామంగా తిరుగుతూ వుంటుంది. గోడమీద, ముందు చెప్పినట్లు మనిషిని క్షణాల్లో మసిచేసే అత్యంత శక్తివంతమైన కరెంటు, అది దాటితే అవతలివైపు కందకం.
అందుకే ఈ జైలుకి ఇంత పేరొచ్చింది.
తోట పనిచేసే ఖైదీల నుంచి సబ్ -జైలరు గదివైపు నడుస్తూ ఉండగా అప్రయత్నంగా నా దృష్టి ఒక ప్లాస్టిక్ కాగితం మీద పడింది.
నిజానికి దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు. కానీ జైలు కాంపౌండ్ లో ప్లాస్టిక్ కాగితం, అదీ ఖైదీలు మాత్రమే తిరిగేచోట ఎలా ఉంటుంది? వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. అప్పటివరకూ దేన్నోచుట్టి వున్నట్టు మడతలుగా వుంది. విప్పితే అరచేతుల వెడల్పు అయింది.
కొద్ది నిముషాల క్రితమే ఖైదీలు అక్కడ అటెండెన్సు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళలో ఎవరైనా పడేశారా?
ఇంత ఆలోచించనవసరంలేదు.
అవి ఏ రొట్టె (బ్రెడ్)కో చుట్టి వున్న కాగితం అయి ఉండవచ్చు. అందులోనూ ఆ రోజు శుక్రవారం (శుక్రవారం క్యాంటీన్ డే) కానీ.... కానీ....
ట్రెయినింగ్ లో అనుభవజ్ఞుడైన ఆఫీసరు మాకు లెక్చర్ ఇస్తూ చెప్పాడు... "గ్రేట్ ఎస్కేప్ సినిమా నిరంతరం గుర్తుంచుకోండి. భోజనం తినే దొప్పల్తో మూడువందల గజాల సొరంగం రెండు నెలలపాటు తవ్వి బయటపడ్డారు. ఖైదీలు. కేవలం ఒక ఆఫీసరు తన కళ్ళముందున్న గుంటని అనుమానాస్పదంగా గుర్తించకపోవటం వల్ల...."
ఈ వాక్యం నాకు బాగా గుర్తుంది.
* * *
"సాయంత్రం ఊళ్ళోకి వెళ్తున్నావా?" సూపర్నెంటెండెంట్ అడిగాడు. సాధారణంగా ఏదో పని పడితే తప్ప జైలునుంచి ఇరవై కిలోమీటర్ల దూరంగా వున్న ఊళ్ళోకి వెళ్ళం. తలూపాను.
ఒక ఇన్విటేషన్ ఇచ్చి, "ధర్మారావుగారికి అందజెయ్యి" అన్నాడు. మాజైలు వార్షికోత్సవం తాలూకు ఇన్విటేషన్ అది.
ధర్మారావు మాజీ ఎమ్మెల్యే. మంత్రిగా చేసినట్టు కూడా గుర్తు. రాజకీయాలు నాకంతగా తెలియవు. తలూపి అది తీసుకొని బయల్దేరాను. శివప్రసాద్ కూడా నాతో బయల్దేరాడు. పెళ్ళయ్యే లోపులో వీలైనన్ని ఎక్కువసార్లు తన జీవిత (కాబోయే) భాగస్వామిని కలుసుకోవాలని మనవాడి తాపత్రయం. ఇంకో పదిరోజుల్లో ఆ అమ్మాయి పరీక్షలు. పాసవుతుందని నాకేం నమ్మకం లేదు. ఇప్పటినుంచీ కాపీ స్లిప్పులు మాత్రం ప్రిపేరు చేసుకుంటూ ఉందనటానికి గుర్తుగా మాత్రం, మనవాడికి వ్రాసిన కవర్లో ఉత్తరానికి బదులుగా పొరపాటున ఒక స్లిప్పు పెట్టి పంపింది.
శివప్రసాద్ ని లేడీస్ హాస్టలు దగ్గిర దింపి నేను ధర్మారావు దగ్గిరకు బయల్దేరాను. మంగతాయారు గేటు దగ్గరే నిలబడి ఉంది. అంత వేడైన పరీక్షల వాతావరణంలో కూడా కొన్ని జంటలు గేటు కివతల నిలబడి లోకాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటున్నాయి.
శివప్రసాద్ ని దింపి మోటార్ సైకిల్ వెనక్కి తిప్పుతూ వుండగా రెండు అందమైన కళ్ళు సున్నితంగా నన్ను పరిశీలిస్తున్నాయన్న విషయం నేను గమనించాను. మంగతాయారు పక్కనే నిల్చుని వుంది ఆ అమ్మాయి. సన్నగా, పొడుగ్గా వుంది. గాలికి ఆ అమ్మాయి పైట రెపరెప లాడుతూ వుంది. ఎందుకో తెలీదు గాని పేదాలు బిగించి నవ్వు ఆపుకుంటూంది. ఇంతకుముందు శివప్రసాద్ ని దింపటానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూసినట్లు గుర్తు. అప్పుడూ ఇలాగే నవ్వు ఆపుకొన్నట్లు తోచింది. పోలీస్ డిపార్ట్ మెంట్ అని బహుశా మనవాడు చెప్పి ఉంటాడా?
వెళ్తూ వెళ్తూ మోటార్ సైకిల్ మీదనుంచి తలతిప్పి మళ్ళీ ఒకసారి చూశాను. అప్పటివరకూ నావైపే చూస్తున్నామె కాస్తా నేను అంత సడన్ గా తలతిప్పేసరికి కంగారుపడి కళ్ళు మరల్చుకుంది.
నవ్వొచ్చింది నాకు.
మొగవాళ్ళలాగా, అందమైనవి అనుకున్న వాటిని సూటిగా చూసే ధైర్యం ఈ అమ్మాయిలకి ఎప్పుడొస్తుందో....
మోటార్ సైకిల్ వేగంగా వెళుతూ వుంటే చల్లటి గాలి రివ్వున వీస్తూంది. గాలి తాకినప్పుడల్లా ఆ ఎగిరే పైటే గుర్తొస్తూంది.
'నీ జడ ముడివిడితే - మేఘానికి చెమట పడుతుంది.
నువ్వెదురుగా నిలబడితే సముద్రానికి దాహం వేస్తుంది'
అనుకున్నాను మనసులో. నా ఆలోచన్లకి నాకే ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి- మొన్న మొన్నటివరకూ తల్లి చాటున పెరిగిన వాడిని. మొన్నటి నుంచి కర్కశమైన పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న వాడిని- నాలో మేఘాలూ సముద్రాలూ కదుల్తున్నాయి. కొంపదీసి ఆ అమ్మాయిని గానీ ప్రేమిస్తున్నానా?
నవ్వొచ్చింది.
మా మనసులు ఏ స్థాయిలో వైబ్రేట్ అవుతాయో? నేనెవర్నన్నా ప్రేమించటం అంటూ జరిగితే-
....
"చెక్కట్ట్రీ! ఈ తాపీ పన్లూ, కత్తెర పనులు నేను సేయలేనయ్యా ఇక."
"అబ్బే, అలా అనకూడదు సార్, శంఖుస్థాపన్లూ, రిబ్బను కత్తిరింపులూ - ఇవే మనని న్యూస్ లో ఎల్లప్పుడూ నిలబెట్టేవి. అందులోనూ ఎలక్షన్లు ఎన్నో రోజులు లేవు. ఈ స్థితిలో శ్మశానానికి శంఖుస్థాపన చెయ్యమని అడిగినా కాదనకూడదు" లోపల్నుంచి పియ్యే కంఠం వినపడుతూంది.
అంతలో లోపల్నుంచి ధర్మారావు హడావుడిగా బయటకొచ్చాడు. సూపర్నెంటెండెంట్ గారిచ్చిన కవరు ఇచ్చి, నేనెవర్నో చెప్పాను.
'కూసో, కూసో' అంటూ కవరు చింపేడు. అతడి మొహంలో చిరాకు కనిపించింది. "ఈడ్ని పనిమీద పంపితే ఆడ్నుంచి శుభలేఖలు పంపుతాడేమిటి? ఇంకేం పని లేనట్టు" అని దాన్ని బల్లమీద విసిరేసి, "నేనర్జెంటు పనిమీద ఎల్తన్న, నువ్ మాత్రం కాఫీ తాక్కుండా ఎల్లమాకు..." అని ఆర్డరేసి, అంతే హడావుడిగా వెళ్ళిపోయాడు. నాపై ఆఫీసర్ని ఈడు అన్నందుకు బాధేసింది. ఇన్విటేషన్ కీ, శుభలేఖకీ తేడా తెలియని మన మంత్రుల్ని చూస్తే జాలేసింది. ఎలక్షన్లోస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతివాడికీ కాఫీ ఇవ్వటం చూస్తే నవ్వొచ్చింది.
ఇంతలో నా దృష్టి తెరచి వున్న ఆ ఇన్విటేషన్ మీద పడింది. చింపిన కవరు లోపల ఏవో కూడికలు కనిపించాయి. అటువంటి స్థలంలో లెక్కలు, ముఖ్యంగా కొత్త కవరు లోపలి భాగాన వుండటం ఆశ్చర్యం అనిపించింది.
15 16 14
15 14 5
_______________________________
3 15 13 16 12-4
______________________________________
అని వుంది. దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అంతలోనే లోపల్నుంచి హడావుడిగా పియ్యే వచ్చాడు. "ఏదీ, ఏదో కవరు తెచ్చారట" అని అన్నాడు. అతడిలో తొందరపాటు కనిపిస్తూంది.
కవరు అందిస్తూ యధాలాపంగా లోపలివైపు మరికసారి చూశాను.
ఫోటోగ్రాఫిక్ మెమరీ నాది! మెదడులో ఆ అంకెలు ముద్రపడి పోయాయి. ఇక చెరగవు.
సినిమాహాలు కెళ్ళి, శివప్రసాద్ జంటని బలవంతంగా విడగొట్టి, వాడిని తీసుకుని ఇంటి కొచ్చేసరికి రాత్రి పదిన్నర అయ్యింది.