ఇద్దరూ కారిడార్లో వెళుతూ వుండగా డాక్టర్ అన్నాడు- "అరవింద్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ అనుకుంటాను! నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంతగా తెలీదు."
అతను ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. దూరంగా ఒక యువకుడు ఆయనకి పండ్లు యిస్తున్నాడు.
"అతను అరవింద్ కాదు."
ఈసారి డాక్టర్ నిరాకరించలేదు. "అవును- కాదు" తాపీగా అన్నాడు. "ఇక వెనక్కి వెళదామా?"
ఇద్దరూ గదికి చేరుకున్నాక డాక్టర్ అన్నాడు- "నీ దగ్గర కొచ్చినాయన పేరు రామస్వామి. చిన్నప్పట్నుంచి ఆయన పేరనాయిడ్! ఆడవాళ్ళలాగా జుట్టు పెంచుకోవటం, దుస్తులు వేసుకోవటం చేసేవాడట. మళ్ళీ ఈ ముసలి వయసులో ఆ వ్యాధి తిరగబెట్టింది. కుటుంబంలో ఏవో గొడవలొచ్చాయి. మీకన్నా తీవ్రమైన కేసు. కొడుకుని చూడకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనన్నాడు. ఈ ఆస్పత్రిలోనే పనిచేసే ఒక డాక్టరుని అరవింద్ లా వారానికొకసారి పంపిస్తూ వుంటాం."
డాక్టర్ ఆగి, తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. "మీకన్నా తీవ్రమైన కేస్ ఇది. మిస్టర్ సుబ్బారావ్! కనీసం మీ ఫోటోని మీరు గుర్తుపట్టగలిగారు. ఆయన రామలింగయ్య ఫోటోని చూపించి అది తనే అంటాడు. 'లూనసీ' లో అది పరాకాష్ట."
అతని మొహం కోపంతో ఎర్రబడింది. డాక్టర్ దాన్ని పట్టించుకోకుండా అన్నాడు- "ఆ ముసలాయన్ని నేనే మీ గదికి ఏదో వంకపెట్టి పంపించాను! సుబ్బారావ్... మీరు పరిస్థితి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీది కేవలం ఆక్సిడెంట్ మాత్రమే. మీరు కూడా మాతో సహకరిస్తే- నేనే చైతన్యని అన్న హెలూసినేషన్- అంటే భ్రాంతి నుంచి త్వరగా బయటకొస్తారు."
అతను జవాబు చెప్పలేదు. న్యూస్ పేపర్ ఆఖరి పేజీ గాలికి రెపరెపలాడుతోంది. కళ్ళముందు ముసలాయన కదలాడుతున్నాడు. అతడికి మొదటిసారి తను సుబ్బారావ్ నేమో అన్న అనుమానం వచ్చింది.
* * * *
"మీ కోసం ఇన్ స్పెక్టర్ గారొచ్చారు."
అతడు చటుక్కున లేచి నిలబడ్డాడు. ఇన్ స్పెక్టర్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. వార్డ్ బోయ్ బయటికి వెళ్ళాక ఇన్ స్పెక్టర్ అతనివైపు తేరిపార చూస్తూ "మీరు చైతన్యననీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ నని చెప్పుకుంటున్నారనీ ఈ హాస్పిటల్ సూపర్నెండెంట్ చెప్పారు. నిజమేనా?" అన్నాడు.
అతను సమాధానం చెప్పలేదు. ఒకే జవాబు చాలామందికి చెప్పీ చెప్పీ అతడు మానసికంగా అలసిపోయి వున్నాడు.
"మీరు చైతన్య అని ఋజువులు ఏమయినా వున్నాయా?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
అతని మొహంలో ఒక్కసారిగా కళ వచ్చింది. "థాంక్స్ ఇన్ స్పెక్టర్. మీరొక్కరడిగారు ఈ ప్రశ్న. సినిమా ప్రపంచానికి సంబంధించిన ఒక ప్రముఖుడి నెవర్నయినా పిలిపించండి చాలు. అతను కాదంటే నేను మీరేం చెబితే దానికి ఒప్పుకుంటాను."
"మీరేం చదివారు?"
"గ్రాడ్యుయేట్ ని ఇన్ స్పెక్టర్."
"కాదు, నువ్వొక డబుల్ గ్రాడ్యుయేట్ వి" ఇన్ స్పెక్టర్ అతనివైపు సూటిగా చూస్తూ నవ్వేడు.
"చాలా గొప్ప ప్లాన్ వేశావు మిస్టర్ సుబ్బారావ్! హాట్స్ ఆఫ్ టు యూ" అంటూ ఫైల్ లోంచి కాగితాలు బయటకు తీసి, అతడి ముందుకు తోశాడు.
ఆంధ్రా యూనివర్సిటీ సర్టిఫికేట్ అది. సుబ్బారావు ఏడు సంవత్సరాల క్రితం లా డిగ్రీ పొందినట్లు సర్టిఫికేట్. అతడు దానివైపు అయోమయంగా చూశాడు.
"నీ భార్య యిచ్చింది మీ ఇంట్లో వెతికి-" అని ఇన్ స్పెక్టర్ చెప్పడం ప్రారంభించాడు. "మంచి తెలివితేటలు నీవి. ఈ విధంగా పిచ్చి ఎక్కినట్టు నాటకమాడితే నీ మీదకు ఏ నేరమూ రాదని ఈ ఎత్తు వేశావు కదూ?"
"నేరం ఏంటి? నేనే నేరం చేశాను?"
"మూడు రోజుల క్రితం నీ చేతిలో దెబ్బతిన్న రౌడీల్లో ఒకడు మొన్న ఆస్పత్రిలో మరణించాడు. అదీ నేరం."
"నాన్సెన్స్" కాలితో నేలని గట్టిగా కొడుతూ అతను అన్నాడు. "అదంతా షూటింగ్. ఆవిడ నా భార్య కాదు. ఎగస్ట్రా ఆర్టిస్టు. కొత్త పిక్చర్ లో నా పాత్ర పేరు సుబ్బారావు. సీను షూట్ చేస్తూ వుండగా, ఆ ఫైటర్ నిజంగానే నా తలమీద కొట్టాడు. నాకు స్పృహ తప్పింది."
అతడి అరుపుల్ని ఇన్ స్పెక్టర్ పట్టించుకోలేదు.
"ఇండియన్ పీనల్ కోడ్ లో ఒక సెక్షన్ వుంది సుబ్బారావ్. దాని ప్రకారం పిచ్చి తగ్గేవరకు నేరస్తుల్ని శిక్షించకూడదు. లా గ్రాడ్యూయేట్ వైన నీకు ఆ విషయం తెలుసు. అందువల్లే ఇంత నాటకం అడుతున్నావని నాకు తెలుసు" ఇన్ స్పెక్టర్ లేచాడు. "ఓ.కే.! నిన్ను ఎలా దారికి తీసుకురావాలో మాకు తెలుసు. నీకు షాక్ ల మీద షాక్ లు యిస్తారిక్కడ. దీనికన్నా కోర్టులో అసలు విషయం ఒప్పుకోవడమే మంచిదనిపించే స్టేజికి నిన్ను తీసుకొస్తాను. అప్పటివరకూ నేను విశ్రమించను. గుడ్ బై-" అంటూ వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళిన పది నిముషాలకి డాక్టర్ వచ్చాడు. అతడిలో ఇదివరకంతటి సౌమ్యత కనపడలేదు. బహుశా ఇన్ స్పెక్టర్ విషయమంతా చెప్పివుంటాడు.
"మొత్తం మమ్మల్నందనీ ఫూల్స్ ని చేశావు సుబ్బారావ్. చైతన్య అనే నటుడి మీద వున్న విపరీతమయిన అభిమానంతో నువ్విలా మారావని జాలిపడ్డామే తప్ప, న్యాయస్థానాన్ని అధిగమించటానికి పిచ్చాసుపత్రిని ఆయుధంగా వాడుకున్నావని అనుకోలేదు" అన్నాడు.
ఆ క్షణంనుంచీ అతడికి నరకం ప్రారంభమయింది. షాక్ ట్రీట్ మెంట్ పేరుతో అతడిని హింసించడం మొదలుపెట్టారు. వార్డ్ బోయ్ తో సహా అతడిని అందరూ ఒక హంతకుడిగా చూసేవారు. రెండురోజుల్లో అతడి చర్మం కమిలిపోయింది. సూదులు గుచ్చీ గుచ్చీ జబ్బలు రాటుదేలిపోయాయి. రోజుకి ఒకపూటే తిండి. ముందున్న గదిలోంచి ఒక చీకటి గదిలోకి మార్చబడ్డాడు. ఎలుకలతో కలిసి దుర్భర జీవితం. ప్రొద్దున్నే ట్రీట్ మెంట్ మొదలయ్యేది. భయంకరమైన ట్రీట్ మెంట్.
దాని గమ్యం ఒక్కటే.
"నువ్వు సుబ్బారావ్ వని వప్పుకో...."
* * * *
"నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది" అన్నాడు హాస్పిటల్ సూపర్నెండెంట్. "విదేశీ గూఢచార్లని హింసించే లెవల్లో నిన్ను బాధలు పెట్టాం. అయినా నిన్ను మానసికంగా 'బ్రేక్' చేయలేకపోయాం. నీతో నిజం చెప్పించలేకపోయాం! నీకు నిజంగా పిచ్చెక్కి వుంటే మా షాక్స్ కి అది వదిలిపోయి వుండాలి. నీవుగానీ నాటకం ఆడుతూ వుండి వుంటే ఈపాటికి నిజం చెప్పేసి వుండాలి. రెండూ జరగలేదు. ఎందుకో మాకు అర్ధంకావటంలేదు!"
"కారణం నేను నిజంగా చైతన్యని కాబట్టి" అన్నాడతను. "ఒకసారి నేను నమ్మిన విషయాన్ని బ్రహ్మరుద్రులు వచ్చినా మార్చలేరు. శరీరాన్ని అదుపులో వుంచుకోకపోతే నటుడు ప్రేక్షకుల్ని అలరించలేడు. మనసుని కంట్రోల్ లో వుంచుకోలేకపోతే నటుడిగా రాణించలేదు. శరీరమూ మనసూ చెప్పినట్టు వుండకపోతే ఫీల్డులో నెంబర్ వన్ అవలేడు."
"నువ్వు సెక్రట్రియేట్ లో గుమాస్తాగా కన్నా, యుద్ధంలో కమేండర్ గా బాగా పనిచేస్తావు. శత్రువుల చేతికి చిక్కినా, నీ నుంచి ఒక్క రహస్యం బయటికి పొక్కదు."
వీరి సంభాషణ జరుగుతూ వుండగా ఆమె వచ్చింది. అదే వెలుగు. గదంతా ఒక మెరుపు తీగె నిండినట్టు.
ఆమె... అక్షౌహిణి. లోపలికి వచ్చి "సర్, గాంధీనగర్ ఏరియా ఇన్ స్పెక్టరు వచ్చారు" అంది.
అతని బాధంతా ఒక్కసారిగా ఎవరో చేత్తో తీసేసినట్టు పోయింది. గాంధీనగర్ అంటే తన ఏరియా. తన ఇల్లు వుండే ప్రదేశం. ఒక హీరో ఇల్లు వుండే ప్రదేశపు ఇన్ స్పెక్టర్ కీ- అతనికీ చాలా దగ్గిర సంబంధాలుంటాయి. అభిమానుల్ని కంట్రోల్ చేసే విషయంలోనూ, లా అండ్ ఆర్డర్ విషయంలోనూ పోలీస్ అవసరం చాలా వుంటుంది.
అతడు ఆత్రంగా చూస్తూ వుండగా ఇన్ స్పెక్టర్ లోపలికి వచ్చాడు. "గుడ్ మార్నింగ్ డాక్టర్!" అన్నాడు.
"ఇదిగో ఇతనే 'చైతన్య'నని చెప్పుకునే సుబ్బారావు" అన్నాడు డాక్టర్.
అప్పటివరకూ మౌనంగా వున్న 'అతను' కదిలి, "వెంకట్రావ్ ఏమయ్యాడు" అన్నాడు.
"వెంకట్రావ్ నీకు తెలుసా?" ఇన్ స్పెక్టర్ తిరుగుప్రశ్న వేశాడు.
"వెంకట్రావ్, గాంధీనగర్ ఏరియా ఇన్ స్పెక్టర్. చైతన్య అభిమాని. ఎన్నిసార్లు డబ్బిచ్చినా పుచ్చుకునేవాడు కాదు. చైతన్యని ప్రొటెక్షన్ ఇవ్వటం తన అదృష్టంగా భావించేవాడు."
"వెంకట్రావుకి ట్రాన్స్ ఫరయింది. అతని స్థానంలోకి నేనొచ్చాను" ఇన్ స్పెక్టర్ సమాధానమిచ్చాడు.
"ఆయన్నొకసారి రమ్మనండి. ఈ మిస్టరీ విడిపోతుంది."
"అవసరం లేదు. నేనే నిన్ను చైతన్య ఇంటికి తీసుకువెళతాను." అతడికి రిలీఫ్ గా అనిపించింది. ముందు తన తల్లిని చూడాలి. సుబ్బరాజు తనతో అలా ఎందుకు మాట్లాడాడో కనుక్కోవాలి. అతడు లేచి, "థాంక్స్, వెంటనే వెళదాం పదండి" అన్నాడు.
"నే నొప్పుకోను" అన్నాడు డాక్టరు. అతడు చప్పున డాక్టర్ వైపు చూసి "ఏం?" అన్నాడు.
డాక్టర్ అతడి ప్రశ్నని పట్టించుకోకుండా ఇన్ స్పెక్టర్ వైపు తిరిగి, "ఇతను మా పేషెంట్. మా అనుమతి లేకుండా తీసుకువెళ్ళడానికి వీల్లేదు" అన్నాడు.
"ఇతను మీ పేషెంట్ కాదు. ఒక క్రిమినల్. పిచ్చివాడిలా నటిస్తున్నాడు. ఇతనిమీద కేసు వుంది. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత మా డిపార్ట్ మెంటుది. చైతన్య ఇంటికి ఇతడిని తీసుకెళ్ళి, ఇతడి రియాక్షన్ గమనించటం మా ఎంక్వయిరీలో ఒక భాగం. దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా?"
డాక్టర్ మరేమీ మాట్లాడలేకపోయాడు.
అతనయితే అసలు ఈ సంభాషణే వినడంలేదు. ఎప్పుడు వెళదామా అని మనసు తహతహలాడుతోంది.
అందరూ లేచారు.
అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న ఆమె, "సర్! నేను వీళ్ళతో వెళతాను" అంది. అందరూ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశారు.
"చైతన్యగారిని ఈయన చూసినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక ఏమైనా రియాక్షన్స్ వస్తే, పక్కన నర్సుగా నేనుండటం మంచిదనుకుంటాను."
అతడామె వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు. తన గురించి ఆలోచించేందుకు ఎవరో ఒకరు వుండటం ఎంతో సంతోషంగా అనిపించింది. తను చైతన్య అవనీ, సుబ్బారావు అవనీ- అది వేరే సంగతి.
ఆమెనీ, అతడినీ తీసుకుని ఇన్ స్పెక్టర్ జీపులో బయలుదేరాడు. పక్కనే నలుగురు పోలీసులు వున్నారు.
"థాంక్స్" అన్నాడు ఆమెకి మాత్రమే వినిపించేటట్టు. ఆమె నవ్వి వూరుకుంది. ఇంద్రధనుస్సు మీద తెల్లమేఘం బంగారపుటంచు అద్దినట్టు ఆ నవ్వు. ఎందరు స్త్రీలతో సాన్నిహిత్యం వున్నా, ఈ పరిమళాన్ని అతడు అంతకుముందు అనుభవించలేదు.
రెండు నిమిషాల తర్వాత గమనించాడు అతడు జీపు గాంధీనగరం వైపు వెళ్ళటం లేదని.