"ఆస్పత్రినుంచి ఫాదర్! ఎన్ కౌంటర్ లో కాలికి బుల్లెట్ తగిలింది. ఆహా! నువ్వేమీ కంగారుపడనవసరంలేదు. బుల్లెట్ లోపల లేదు. చిన్న బ్యాండేజీ వేశారు. నాల్గయిదు గంటలు రెస్టు తీసుకుని వెళ్ళిపోవచ్చునంట. అమ్మక్కూడా చెప్పకు. స్టేషన్ లో కాస్త పనుంది. అది చూసుకుని రాత్రికి మామూలుగా ఇంటికి వచ్చేస్తాను. పోతే....ఫాదర్.... ఇప్పుడే పోలీసు కమీషనర్....."
ఆ కుర్రవాడు ఇంకా మాట్లాడుతూ వుండగానే, కొడుకు చెప్పిన వార్త తాలూకు షాక్ నుంచి అప్పటికి తేరుకున్న భరద్వాజ "నువ్వింకేమీ చెప్పొద్దు. నేను వస్తున్నాను" అన్నాడు.
"నువ్విలా కంగారుపడతావని నేనే స్వయంగా ఫోన్ చేశాను. ప్రమాదమేమీ లేదు. ఇంకో రెండు గంటల్లో ఇక్కడ్నుంచి బయల్దేరి పోతాను కూడా."
"నేను ఇప్పుడు నిన్ను చూడటానికి వస్తున్నది నీకు ప్రమాదం జరిగిందని కాదు. ఈ వంకనన్నా నీతో ఒకటి రెండు గంటలు గడపవచ్చునని. యూ నో మై బోయ్? మనిద్దరం ఒకర్నొకరు చూసుకుని పదిహేను రోజులు పైగా అయింది" అని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు.
* * * *
అతడు వెళ్ళేసరికి ఆస్పత్రి బెడ్ మీద వున్నాడు కొడుకు. అతడు చెప్పినట్టు గాయం పెద్దది కాదు.
కుర్చీ లాక్కుని సరిగ్గా కూర్చుంటూ కొడుకు వైపు పరీక్షగా చూశాడు భరద్వాజ. తన రచనా వ్యాసంగానికి అతడు పూర్తిగా ఆఫీసునే వినియోగించడం మొదలుపెట్టాక, రాత్రిళ్ళు అక్కడే ఆలస్యం అవుతూంది. ప్రొద్దున్నపూట అతడు లేచేసరికి, కొడుకు బయలుదేరి వెళ్ళిపోతాడు. వర్తమాన ప్రపంచంలో ఒకర్నొకరు చూసుకోని కుటుంబ సభ్యులు, చాలా దగ్గిరవాళ్ళూ - చాలామంది వున్నారు. అతడు ఒక విధంగా అదృష్టవంతుడు. కనీసం కొడుకు అతడితో 'కలిసి' వుంటున్నాడు.
"అసలెలా జరిగింది?'
కొడుకు ఏదో చెప్పబోతూ వుంటే బయట అలికిడి వినిపించింది. బూట్ల చప్పుడు.......
కమీషనర్ ఆఫ్ పోలీస్ హడావుడిగా లోపలికి వచ్చాడు. ఆరడుగుల ఎత్తు, గుబురు మీసాలూ......అచ్చు పోలీసాఫీసర్ లాగానే వున్నాడు.
డిపార్టుమెంటు తాలూకు అత్యంత ఉన్నతస్థాయి అధికారి తనని చూడటానికి స్వయంగా రావటం వల్ల కలిగే సంతోషంతో కొడుకు మొహం వెలిగిపోవటాన్ని భరద్వాజ గుర్తించాడు.
"బాగా పట్టుకున్నావోయ్ వాళ్ళని. కంగ్రాట్స్"
"థాంక్యూ...థాంక్యూ సర్."
పక్కమీద నుంచి లేవబోతూన్న అతడిని "కూర్చో - కూర్చో" అంటూ వారించాడు కమీషనరు.
"మా ఫాదర్" అని పరిచయం చేశాడు కొడుకు. కమీషనర్ చాలా క్యాజువల్ గా భరద్వాజ వైపు తిరిగాడు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.
"అసలేం జరిగింది?" భరద్వాజ అడిగాడు.
"మామూలుగానే స్టూడెంట్స్ ని ఒక్కొక్కర్నీ పరీక్షించి లోపలికి పంపుతున్నాను. ఒకడి జేబులో 'డ్రగ్' దొరికింది. అయినా చూడనట్టు లోపలికి పంపి, సాయంత్రం కాలేజీ వదిలాక అతడిని వెంబడించాను. పెద్దగా అనుభవం లేకపోవటంతో సులభంగా వివరాలు యిచ్చేశాడు. ఒక రిద్దర్ని షూట్ చేసేసరికి మిగతావాళ్ళు లొంగిపోయారు."
"మార్వలెస్" అన్నాడు కమీషనర్. అతడు చాలా అల్పసంతోషిలా కనిపించాడు భరద్వాజకి. పోలీస్ డిపార్టుమెంట్ లో అలా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా వుండేవాళ్ళు కనిపించటం అరుదు.
"వాళ్ళు నీమీద ఏమీ కసి పెట్టుకోరుగా?" అని అడిగాడు కొడుకుని భరద్వాజ.
"వాళ్ళా....?" బిగ్గరగా నవ్వాడు కమీషనర్. "కేవలం పులివన్నె మేకలు, జేబులో కత్తులూ, పిస్తోళ్ళూ వుంటాయిగానీ కాస్త గొడవయితే పరుగెడతారు."
"చదువుకొనే స్టూడెంట్స్ కి అసలీ కత్తులూ, కబుర్లూ ఎందుకు?" భరద్వాజ స్వగతంగా అన్నాడు. "దానికోసం ప్రతి కాలేజీ దగ్గరా ఒక ఇన్స్ పెక్టర్ వుండటం! ఎలక్ట్రానిక్ కంప్యూటర్ తో ప్రతివాడిని పరీక్షించటం!! మనం చాలా సిగ్గుపడాలి......"
"కాలేజీలన్నిటినీ ఊరి చివర దూరంగా పెట్టేసి, కుర్రాళ్ళని హాస్టల్స్ లో వుంచటం కంపల్సరీ చేసి, స్టూడెంట్స్ కీ మిగతా ప్రపంచానికీ లింకు తెగ్గొట్టేస్తే గానీ లాభంలేదు."
కమీషనరు కల్పించుకుని "అప్పటి ప్రెసిడెంటు వరుణ్ గాంధీ సూచించినట్టు పదహారో ఏడు నుంచి పద్దెనిమిదో ఏడు వరకు మిలటరీలో పనిచేయడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేసినా బావుండేది. మిలటరీ జీవితం మనిషిని రాటుదేల్చి ఎన్నో బ్రాంతుల్ని పోగొడుతుంది. ఈ ఫాషన్సూ, సూడో రౌడీ చేష్టలూ, ప్రాంతీయతత్వం ఇవన్నీ పోయి విశాల దృక్పథం అలవాటు అవుతుంది. నిజమైన కష్టమంటే ఏమిటో తెలియక పోవటంచేత విద్యార్ధులు ఇలా తయారవుతున్నారని నా ఉద్దేశ్యం" అన్నాడు ఆవేశంగా.
అంతలో కొడుకు అతడివైపు తిరిగి "అన్నట్టు ఫాదర్! ఇదంతా తీసుకుని నువ్వొక రచన ఎందుకు చేయకూడదూ?" అన్నాడు.
భరద్వాజ ఏదో సమాధానం చెప్పబోయేటంతలో "మీరు రచయితా?" అని అడిగాడు కమీషనర్.
"అవును సార్! నాన్న పేరు మీరు వినే వుంటారు...భరద్వాజ."
అతడి మొహంలో ఆకస్మికంగా మార్పు వచ్చింది. ఆశ్చర్యం, ఆనందం నిండిన కంఠంతో "వాట్?!" అని అరిచాడు.
పోలీస్ కమీషనర్ కి సాహిత్యాభిలాష వుండటం ఆశ్చర్యకరమే అయినా 'పులివన్నె మేక...ప్రాంతీయతత్వం' లాంటి పదాలు ఉపయోగించడంతో అతడికి తెలుగు బాగా వచ్చని ఇప్పుడు అర్ధమయింది.
అతడిది మామూలు మెప్పుకోలు కాదనీ, నిజంగానే చాలా ఇంటరెస్టుతో తన రచనలు చదివేడనీ మాటల సందర్భంలో తెలిసింది.
మొత్తంమీద అది చాలా గొప్ప అనుభవం.
కొంచెం సేపు మాట్లాడేక కమీషనర్ లేచాడు. భరద్వాజ కూడా కొడుక్కు చెప్పి, తనూ లేచాడు.
"మీరు ఎటు?"
భరద్వాజ చెప్పాడు.
"నేనూ అటే! రండి నా కారులో వెళదాం. మీది నా డ్రైవర్ తీసుకొస్తాడు."
భరద్వాజ ఆశ్చర్యపోయినా పైకి ప్రకటించకుండా తలూపాడు.
ఇద్దరూ కార్లో బయలుదేరారు.
"మిస్టర్ భరద్వాజా! మిమ్మల్ని యిలా నాతో తీసుకురావటంలో ఒక ముఖ్యోద్దేశ్యం వుంది. మీరీపాటికి గ్రహించే వుంటారు" డ్రైవ్ చేస్తూ అన్నాడు కమీషనర్. అతడు మాట్లాడలేదు.
"మీకు నేనో విషయం చెప్తాను, మీరు దాన్ని రహస్యంగా వుంచాలి."
భరద్వాజ విస్మయంగా అతడివైపు చూసి "తప్పకుండా" అన్నాడు.
"ప్రామిస్!"
అంత ప్రామిస్ తీసుకుని మరీ చెప్పే విషయం ఏమిటా అనుకుంటూ భరద్వాజ తలూపాడు. కమీషనర్ కొంచెంసేపు నిశ్శబ్దంగా వూరుకుని నెమ్మదిగా అన్నాడు. "ఫ్రాన్స్ కీ, రష్యాకీ మధ్య చర్చలు జరుగుతున్నట్టూ మీకు తెలుసుకదా?"
"పొద్దున్నే వార్తల్లో చూశాను. ఫెయిల్ అయ్యాయటగా....."
"అవును. అవి ఒక కొలిక్కిరావటంలేదు. దానికి కారణం మన దేశమే. ముఖ్యంగా శ్రీలంక విషయంలో...."
భరద్వాజ మాట్లాడలేదు.
"భారతదేశపు సంయుక్త రాష్ట్రాలన్నిటికీ యురేనియం సరఫరా చేసే ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలా అని పాతికేళ్ళ క్రితం 2010లో చర్చ వచ్చినప్పుడు మన రాష్ట్రంలోనే దాన్ని స్థాపించాలని అనుకున్నారు."
"అవును దేశం నడిబొడ్డులో వుంటుంది. సముద్రానికి దూరంగా శత్రుభయం లేకుండా వుంటుంది కాబట్టి...." అని అతను ఆగాడు. కమీషనర్ ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్ధం కాలేదు. రష్యా, ఫ్రాన్స్ ల మధ్య చర్చలకీ భారతదేశపు అత్యంత ప్రతిష్టాకరమైన యురేనియం ఫ్యాక్టరీకి సంబంధం ఏమిటో అతడికి తెలియలేదు. అతడి మనసులో భావం అర్ధం చేసుకున్నట్టుగా కమీషనర్ అన్నాడు "అదే ఈ రోజు మన ఉనికికి ప్రమాదం రాబోతోంది భరద్వాజా. శ్రీలంక విషయంలో మన దేశపు పట్టుదలని కొద్దిగా సడలించటం కోసం ఫ్రాన్స్ మన దేశాన్ని కాస్త బెదిరించదల్చుకుంది. డానికి రంగస్థలంగా దేశపు నడిబొడ్డు అయిన మన రాష్ట్రాన్ని ఎన్నుకుంది. మన యురేనియం ఫ్యాక్టరీమీద రేపే న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించబోతూంది. వెళ్ళిపోండి భరద్వాజా ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళిపోండి."
వెన్ను ఒక్కసారిగా జలదరించి భరద్వాజ నిటారుగా అయ్యాడు. చప్పున తలెత్తి కమీషనర్ వైపు చూశాడు. ఎయిర్ కండిషన్డ్ కారులో కూడా అతడి నుదుటిమీద నుంచి చెమట పాయలా కారుతూంది.
"ఇది.....ఇదంతా నిజమేనా?" అని అడిగాడు తడారిన గొంతుతో.
"రష్యా - ఫ్రాన్స్ చర్చలు భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి రెండు మూడు గంటలకి మధ్య ముగుస్తాయి. ఫ్రాన్స్ విమానాలు ఆ తరువాత ఒక గంటలో బయలుదేరతాయి. రేప్రొద్దున్న ఉషోదయాన్ని చూడటానికి రాష్ట్రంలో ఎవరూ మిగలరు."