ఆమె చలనం లేకుండా అలానే వుండిపోయింది. ఆమె మోహంలో విషాదం కూడా కనబడటంలేదు. 'షాకే వేదనకన్నా భయంకరమైనది' అని ఆ సైకాలజిస్టు అనుకున్నాడు.
ఇప్పుడామెని ఆ షాక్ నుంచి బయటికి తీసుకురావలసిన బాధ్యత తనమీదే వుంది. మనస్తత్వ శాస్త్రంలో తను ఇన్నాళ్ళూ జరిపిన పరిశోధనా సారాన్ని వుపయోగించి ఆమెని ఇప్పుడు మామూలు మనిషిని చెయ్యాలి.
గౌరీనాథ్ ఆలోచనల్లో వుండగానే ఆమె కొద్దిగా తేరుకొని, "మీకా పుస్తకం ఎక్కడ దొరికింది?" అని అడిగింది.
"విధి ఎంత చిత్రంగా ఉంటుందో చూడండీ. మా తమ్ముడి కోసం సెకండ్ హాండ్ షాపులో కొన్నాన్నేను. ప్రతి విషయాన్నీ సున్నితంగా అబ్జర్వ్ చెయ్యటం మా సైకాలజిస్ట్ లకి వెన్నతో పెట్టిన విద్య దానికి నిదర్శనంగా - దాదాపు అయిదు సంవత్సరాలు చీకట్లో వున్న ఉత్తరం ఇలా బయటపడింది."
ఒక్క క్షణం నెమ్మదిగా గడిచింది. బాగా చీకట్లు అలుముకున్నాయి. వరండాలో వున్నాలైటు కాంతి చెట్లమీద ప్రతిబింబిస్తూంది. సన్నగా వీచేగాలికి నేలమీద చెట్లనీడలు కదులుతున్నాయి. దూరంగా ఎవరో కుర్రాడు గొంతెత్తి 'చందమామా, నిజం చూడకూ......' అని పాడుకుంటూ పోతున్నాడు.
ఆ నిమేషమాత్రపు నిశ్శబ్దాన్ని కూడా గౌరీనాథ్ భరించలేక పోయేడు. అనునయిస్తున్నట్టు "చూడండి సుప్రియాదేవీ, విధిచేతిలో మనం కీలుబొమ్మలం మీరు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడుచేసుకోకండి.... ముఖ్యంగా ఆ రావ్ గురించి" అంటూ ఏదో చెప్పబోతున్న గౌరీనాథ్ ని మధ్యలో ఆపుచేస్తూ "అబ్బే, నేను ఆలోచిస్తున్నది అదికాదు. ఆ ఉత్తరం గురించి" అని క్షణం ఆగి, ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్టు తనలో తనే, "ఫెయిర్ వ్రాసేక ఆ చిత్తు కాపీని చింపేసినట్టు నాకు బాగా గుర్తే" అంది.
గౌరీనాథ్ కళ్ళముందు ఏదో మెరిసినట్టయింది. చుట్టూ వున్న వస్తువులు గిర్రున తిరగనారంభించేయి. ఎదురుగా వున్న అమ్మాయి పదిమంది సుప్రియలుగా కనిపించసాగేరు. మొహం తెల్లగా పాలిపోయింది. అస్పష్టంగా 'ఏమిటీ' అంటూ గొణిగేడు.
ఈ లోపులో సుప్రియ బాగా రిలాక్సయింది. చిరునవ్వుతో "పాపం ఆ ఉత్తరం మిమ్మల్ని చాలా బాధపెట్టినట్టు వుందే" అంది.
గౌరీనాథ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోనట్టు ఏమీ మాట్లాడలేదు. అంతలో మాధవ్ అక్కడి కొచ్చేడు.
సుప్రియ కవ్విస్తూన్నట్టు "ఇప్పుడు చెప్పు, రావ్, ఏమిటి మెడికోల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్?" అంది.
భార్యవైపు విచిత్రంగా చూసి, గౌరీనాథ్ వైపు తిరుగుతూ "ఏమిటి గురూగారూ - తన సైకాలజీ మీద ఏమైనా ప్రయోగం చేసేరేమిటి? ఇన్నాళ్ళకి పేరు పెట్టి పిలుస్తూంది" అన్నాడు మాధవరావు.
--* * * *--