Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 4


    ఆమె అర్ధం కాలేదన్నట్టు తల అడ్డంగా వూపింది.

    "ఇలా చేస్తే అర్ధం కాదు. కళ్ళు మూసుకో, సరిగ్గా అయిదు సెకన్ల తరువాత కళ్ళు తెరవాలి. అంటే నువ్వు కళ్ళు తెరిచేసరికి సెకన్ల ముల్లు సరీగ్గా అయిదుమీద వుండాలన్నమాట."

    "అయిదు సెకన్లేనా?"

    "ఆఁ. ముందు అయిదు సెకన్లు చాలు" అని మెడచుట్టూ చేతులు వేసేడు. ఆమెను ముద్దుపెట్టుకుంటూ - "కళ్ళు మూసుకోమరి" అన్నాడు.

    ఆమె కళ్ళు మూసుకొని కొంచెంసేపయ్యాక తెరచి 'చూడు' అంది.

    సెకన్ల ముల్లు అయిదు మీదుంది. ఆమె కళ్ళు మెరిసినయ్.

    "రియల్లీ గ్రేట్" అన్నాడు ఆరెస్బా. "ఇంత గాఢమైన ఏకాగ్రత చాలా తక్కువ మందికుంటుంది."

    "నిజంగానా?"

    "నిజం ఏమిటి? ఒట్టు. జవహర్ లాల్ నెహ్రూ, థామస్ మూర్ లాటి ప్రముఖులు గంట టైమ్ ని కూడా సరిగ్గా చెప్పగలిగేవారట. నువ్వు అఫ్ కోర్స్ ఐదు సెకన్లు కరెక్టుగా చెప్పగలిగేవనుకో, కానీ నిముషం అయితే"

    "నేను నిముషాల్ని కూడా కనుక్కోగల్ను".

    "రియల్లీ!"

    "చూడు" అని కళ్ళు మూసుకుంది. అతను మామూలుగానే ముద్దుపెట్టుకొని అలాగే వుండిపోయేడుత.

    అయిదు పది- ఇర-వై నలభై.

    కళ్ళు తెరిచి "చూడు" అంది.

    సెకన్ల ముల్లు తొమ్మిదిమీదుంది.

    "అంటే నలభై అయిదు సెకన్లే అయింది. ఇంకోసారి ట్రై చేయి" అన్నాడు.

    ఆమె మళ్లీ కళ్ళు మూసుకుంది.

    ఈసారి అయిదు సెకన్లు ఎక్కువైంది.

    నాలుగోసారి యాభై సెకన్లూ, అయిదోసారి అరవై అయిదు సెకన్లూ.

    పదహారోసారి యాభై ఎనిమిది. పదిహేడోసారి అరవై రెండూ.

    దాదాపు పదిన్నర అవుతూ వుండగా ఆమె గెల్చింది.

    "మొత్తానికి సాధించావు" అన్నాడు నవ్వుతూ.

    గర్వంగా తలెగరేసి "మరి!" అంది. "మంగ అంటే ఏమనుకున్నావు?"

    "రెండు గంటల తర్వాత అంటే దాదాపు నూట పది నిమిషాల తర్వాత."

    ఆమె వాచీ చూసి, "బాబోయ్ పదిన్నర! ఇంట్లో చంపేస్తారు. వెళ్ళాలి" అని హాండ్ బ్యాగ్ తీసుకుంటూ "ఈ ఆటలోపడి టైమ్ గుర్తించలేదు" అంది కంగారుగా పరుగెత్తబోతూ.

    "నువ్వింకోటి కూడా గుర్తించలేదు" అన్నాడు.

    "ఏమిటి" అంది వెళ్ళబోయేదల్లా ఆగి.

    "ముద్దంటే నీకున్న భయం పోవటాన్ని."   


                       *    *    *   


    "మీరూ మీరూ" అన్నాడు శంభుమిత్ర తడబడుతూ.

    ఆ పరికిణి అమ్మాయి చప్పున తిరిగి, అతణ్ణి చూసి లేచి నిలబడింది. "నమస్తే, నా పేరు కమల" అంది.

    అతడు మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తోచనివాడిలా అలాగే నిలబడిపోయాడు. అతని స్థితి గమనించినట్టు చేతిని కుడి వైపుగా చూపిస్తూ, "ఆ ప్రక్క రెండిళ్ళ తర్వాత పచ్చమేడ లేదూ, ఆ ఇల్లు మాదే. మా నాన్న హెడ్మాష్టరు. వాళ్ళ అమ్మాయిని" అంది అప్పుడే కథలు రాయటం మొదలుపెట్టిన రచయిత వాక్య నిర్మాణంతో.

    తన ఇంటికి రెండిళ్ళ తర్వాత ఒక పచ్చమేడ వున్నట్లు గానీ, సదరు ఇంట్లో ఒక హెడ్మాష్టరుగారు వున్నట్లుగానీ మిత్రకి తెలియదు. అసలామాటకొస్తే అతడి మనస్సు దేన్నీ ఆలోచించే స్థితిలోలేదు. చప్పున అతనికి స్పృహ వచ్చినట్లయి "హార్లిక్స్ తాగుతారా" అన్నాడు.

    అడిగిన తరవాత గానీ అతనెంత అసందర్భమైన ప్రేలాపన చేసేడో అర్ధం కాలేదు. తనని తానే తిట్టుకుంటూ "కూర్చోండి" అన్నాడు.

    "నేను కూర్చొనే వున్నాను. మీరు కూర్చోండి" అంది.

    కూర్చొన్నాడు.

    "నేను మేడమీద నుంచి వింటుంటాను. చాలా బాగా వాయిస్తారు మీరు.... సితారు. ఎంతోకాలం నుంచి కలుసుకోవాలని ప్రయత్నం. మళ్లీ మీరేం అనుకుంటారో అని భయం" అంది.

    ఏమన్నా అనుకోవడం అన్న ప్రసక్తి ఎందుకొస్తుందో అతడికి అర్ధం కాలేదు. గిల్టీకాన్షస్ గురించి తెలిసేటంతగా అతని మనసు కరప్ట్ అవలేదు. తన సితారు ఒకరికి ఆనందం కలిగించిందన్న కళాకారుడి సహజమైన ఆనందంతో "థాంక్స్" అని ఆగి, "మీరేదైనా ఇన్ స్ట్రుమెంటువాయిస్తారా" అన్నాడు.

    అవునూ కాదూల మధ్య తలూపింది.

    ఈ లోపులో హరిదా కప్పుతో కాఫీ తెచ్చి పెట్టాడు. "మీరు...." అంది.

    "నేను కాఫీ తాగను" అన్నాడు అబద్ధం ఆడుతూ. నిజానికి అతడు అన్నీ టైం ప్రకారం చేస్తాడు.

    కొంచెం నిశ్శబ్దం.

    గడియారం టిక్కు టిక్కు మనటం తప్ప ఇంకేం వినిపించటం లేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "హిందూస్తానీ వోకల్ మీ కిష్టమా" అన్నాడు.

    "హిందూస్తానీ లోకలా?"

    "లోకల్ కాదు వోకల్...."

    "ఏమో బాబూ! అవేమీ నాకు తెలియదు" అంది మొహం చిట్లించి.

    "పోనీ శంకర్.... రవిశంకర్...."

    "అంటే - శంకర్ జైకిషన్ లలో ఒకాయనేనా?"

    శంభుమిత్రకి తనమీద తనకే జాలేసింది. "కాదులెండి, ఆయన తమ్ముడు" అన్నాడు.

    మళ్లీ నిశ్శబ్దం.

    "మీరెందులో పనిచేస్తూ వుంటారు."

    చెప్పాడు.

    "జీతం ఎంతొస్తుంది?"

    చెప్పాడు.

    "ఇంత ఇంట్లో మీరొక్కరే వుంటున్నారా?"

    అవునన్నాడు.

    అతనికి తాను చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నట్టూ అనిపించింది. ఆమె పుస్తకాల రాక్ వైపు చూసి "మీరు చాలా పుస్తకాలు చదువుతార్లా వుందే" అంది.

    అతనికేం మాట్లాడాలో తోచలేదు.

    "సాయంత్రంపూట ఇంకెక్కడికీ వెళ్ళకుండా ఇంటికే వచ్చేస్తారనుకుంటాను."

    అవును అన్నట్టు తలూపాడు.

    "మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలు సుమా" అంది.

    విస్తుబోయి, "అదేమిటి" అన్నాడు.

    "మంచి ఉద్యోగం, ఇల్లూ ఆఫీసూ తప్ప ఇంకో వ్యాపకం లేకపోవటం" నవ్వింది.

    శంభుమిత్రకి దాహం వేసింది. ఆ అమ్మాయిని వదిలి లోపలికి వెళితే ఏం అనుకుంటుందో అని మానేశాడు.

    "ఏదన్నా చెప్పండి" అందామె.

    "ఏం చెప్పను" అన్నాడు.

    మళ్లీ నిశ్శబ్దం.

    నుదుటిమీద చెమట పడుతూంది. ఒకసారి అద్దంలో చూసుకొని క్రాపు సవరించుకోవాలనే కోర్కె, ఎడమకాలు బొటనవేలు పైన గోరుదగ్గిర దురద పెడుతూంది.

    గడియారం టిక్కుటిక్కుమంటూనే వుంది. కుర్చీలో కొద్దిగా కదిలి కుడికాలి వేళ్ళతో కాజువల్ గా ఎడమకాలి బొటన వ్రేలిని నొక్కుకుని సర్దుకుని కూర్చున్నాడు. ఈసారి కుడికాలి మోకాలి దగ్గర దురద పెట్టడం మొదలు పెట్టింది.

    "ఏదన్నా మాట్లాడండీ" అంది.

    "ఏం మాట్లాడను?"

    మళ్ళీ నిశ్శబ్దం.... పాంటు మడత సవరించుకుంటున్నట్టు మోకాలు సరిచేసుకున్నాడు. చెంపమీద దోమ వాలిందన్న అనుమానం కొద్దిగా దగ్గు రాబోయింది. దాన్ని గొంతు సవరించుకోవడం అనే ప్రక్రియ ద్వారా ఆపుచేసి క్రాఫు సవరించుకున్నాడు.

    "ఉఁ ఇంకేమిటి విశేషాలు?" అన్నాడు.

    "ఏమున్నాయి?" అంది.

    మళ్ళీ నిశ్శబ్దం.

    ఈ నిశ్శబ్దం అనేది మాటిమాటికీ తనని ఎందుకు ఆశ్రయిస్తుందో అతడికి అర్ధంకాలేదు. రేడియో పెడదామా అన్న ఒక అసందర్భపుటాలోచన. ఏదో మూసివేసినట్లూ, ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లూ, ఇంకోలా చెప్పాలంటే ఒంటరిగా కూర్చొని సితారు వాయించుకుంటే బావుణ్ణు అన్న భావన. కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు. తల పైకెత్తి కప్పుకేసి చూశాడు. అప్పటివరకూ అతణ్ణి చూస్తున్న బల్లి నాలుక బయటపెట్టి వెక్కిరించి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. గుమ్మానికి కట్టిన మామిడాకు గాలికి వూగుతూంది. తాగేసిన కాఫీ కప్పు విషాదంగా చూస్తోంది.

    "మాట్లాడండీ."

    అవును, మాట్లాడాలి. ఇలా మౌనంగా వుండటం ఎదుటి వారిని అవమానం చేసినట్టే! మాట్లాడాలి. కానీ దేని గురించి?

    కాడ్లీవరాయిలూ- జేమ్స్ హాడ్లీ ఛేజూ - యాడ్లీ ఫాస్టు బౌలింగూ - శబరిమలైలో భక్తి - జూలై ఇరవై అయిదున టెస్టుట్యూబ్ బేబీ- అయినెస్కో అబ్సర్డు ధియేటర్ - మృణాల్ సేన్ సినిమా- అస్సాం 'మణిపుర' నుంచి ఆంధ్ర కూచిపూడి మీదుగా కేరళ కథకళి- ఆనందభైరవి నుంచి మల్హార్ వరకూ, కీట్స్ నిశ్శబ్దం. ఈట్స్ తత్వజిజ్ఞాసాత్మకపు శూన్యత. విస్కీతో బీరు కలిపితే శాండీ. బ్రాందీ శాండిలో కలిపితే కాక్టెయిలూ. దేని గురించైనా మాట్లాడవచ్చు. మార్క్స్ గురువు పూధాన్ నుంచి గాంధీ గురువు ధారో వరకు, శారదనీరదేందు ఘనసారపటిరమన్నపోతన్న నుంచి, జయగాయక వైతాళిక కళవిశాల పథ విహరణ మన్న కృష్ణశాస్త్రి వరకూ.... షోడశ కర్మల నుంచి షడ్విధ సమాధుల వరకూ ఏది మాట్లాడాలి? ఏ టాపిక్ ఇంపార్టెంట్? ఏం మాట్లాడినా ఇంకో విషయానికి అన్యాయం జరుగుతుందే. అయినా ఈ ప్రపంచంలో మరీ ఇన్ని విషయాలున్నాయేమిటి మాట్లాడుకోవటానికి? ఏది మొదలుపెట్టాలి.

    "నేవెళ్ళొస్తాను" అందా అమ్మాయి అకస్మాత్తుగా లేచి.

    "వెళ్ళొస్తారా"

    "మరి....వద్దా"

    "అబ్బే, అది కాదు నా ఉద్దేశ్యం" కంగారుపడ్డాడు.

 Previous Page Next Page