Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 4


    ఓ మూల మార్గరెట్ ప్రకంపించిపోతూ, ఏడ్చేస్తూంది.

    ప్రసన్న నెమ్మదిగా బాక్స్ ని చేరి పరిశీలనగా చూసారు... అందులో యింకేమీ లేదు ఓ కాగితం తప్ప.

    ఉత్కంఠ ఉద్రేకం అధికమౌతుంటే అందుకున్నాడు. అది మామూలు కాగితం కాదు. డిజిపికి ఎడ్రస్ చేస్తూ రాయబడిన ఓ ఉత్తరం...

    "డియర్ డైరెక్టర్ జనరలాఫ్ పోలీస్...పాపం చాలా హడావుడి పడిపోయావు కదూ...సరిగ్గా టైమ్ అంచనా వేసి పాముకి ఇంటాక్సికేషన్ కోసం ఓ ఇంజక్షనిచ్చాం... ఎందుకంటే ఈలోగా మీరు జాగ్రత్త పడిపోకూడదు కాబట్టి. మాగురించి మీరు వేట ఉధృతం చేశారని తెలిసి ఇలా సేంపిల్ గా ఓ డోస్ ఇచ్చాం...అన్నట్టు యిది అంతంకాదు... ఆరంభం మాత్రమే... మీరు నాకు చేసిన ద్రోహానికి ఇంతటితో ఆగని నేను జంటనగరాలలో ఈ క్షణంనుంచీ ఎలాంటి మారణహోమం సృష్టిస్తానూ అంటే ఇక మీకు నిద్రలుండవు. ఎటు చూసినా ఆర్తనాదాలు... ఆక్రందనలు... దమ్ముంటే నీ డిపార్ట్ మెంట్ కాని ప్రభుత్వంకాని ఇది ఆపే ప్రయత్నం చేయండి... నేనెవరో తెలుసు కదూ... 'బ్లాక్ మాంబా'

    డిజిపి నుదుట చెమట పట్టేసింది. నిజానికి ఆ రోజు ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో చర్చించే ముఖ్యాంశం బ్లాక్ మాంబా గురించే...

    "బాస్టర్డ్" డిజిపి పిడికిళ్ళు బిగుసుకున్నాయి...ఆ క్షణంలో డిజిపి ముందుగా తలతిప్పి చూసింది తక్కిన పోలీసాఫీసర్లని కాదు... క్రమశిక్షణ సాహసాల్లో అందరికన్నా మిన్న అనిపించిన ఓ ఐపిఎస్ పోలీసాఫీసర్ని.

    అతడే డిసిపి ప్రసన్న...


                                                             *    *    *    *


    మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. జరగబోయే మారణహోమాన్ని ఉద్విగ్నంగా చూడాలనుకున్నట్టు సూర్యుడు పైనుంచి నిప్పులు కక్కుతున్నాడు...

    ఓ అరగంట క్రితం జరిగిన సంఘటన పత్రికలకన్నా ముందు ప్రజల్ని చేరుకుంది. అది క్రమంగా దావానలమై జంటనగరాల్ని వ్యాపించి అందర్నీ భయభ్రాంతుల్ని చేస్తుంది.

    ఇదింకా తెలీని డాక్టర్ శృతి యూనివర్సిటీ కేంపస్ నుంచి కారులో తన ప్లాట్ కు తిరిగి వస్తూంది.

    ఆమె మనసు ఎంత ఉల్లాసంగా వుందీ అంటే తన ఆనందాన్ని గురువూ తండ్రీ అన్నీ అయిన డాక్టర్ సంఘమిత్రతో మాత్రమే పంచుకోవాలని వుంది.

    డాక్టర్ మిత్ర ప్రయోగం ఫలించిందన్న విషయాన్ని ఇందాక వెళ్ళిన జూవాలజీ ప్రొఫెసర్ తో సైతం చర్చించలేదు...

    అసలు ఆయన దగ్గరకు వెళ్ళింది తెల్లవారుజామున ఇల్లు విడిచి వెళ్ళిన డాక్టర్ మిత్ర అక్కడ వున్నాడేమో తెలుసుకోవాలని... రెండు మూడుసార్లు అంకుల్ వెళ్ళింది ఆయన దగ్గరికే. రాలేదని తెలిసింది... దానికీ ఆమె దిగులు పడలేదు.

    ఒకసారి అర్ధరాత్రి ఇల్లు వదిలిన డాక్టర్ మిత్ర సరాసరి బాంబే హాఫ్ కిన్ ఇన్ స్టిట్యూట్ కు వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగొచ్చాడు. ఇప్పుడూ అలానే అనుకుంది తప్ప ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో అతి ప్రమాదకరమైన ముఠా ఆధీనంలోవున్న విషయం వూహించలేకపోయింది.

    ఆలోచిస్తూ నడుపుతున్న శృతి కారు తార్నాక దాటుతుండగా కీచుమంటూ ఆగిపోయింది.

    రైల్వే సిగ్నలింగ్ కాలేజికి సమీపంలోని ఖాళీస్థలంలో జనం గుమిగూడివున్నారు... వారికి అభిముఖంగా ఎత్తుగా నిలబడి వున్న తడికలు... పసిపిల్లలతోబాటు రైలింగ్ లా అమర్చబడిన వుడెన్ స్టంప్స్ మధ్య నడుస్తున్న స్త్రీ పురుషుల్ని చూసి ముందు ఎవరన్నా స్వామీజీని దర్శనం చేసుకుంటున్నారేమో అనుకుంటూ కారు దిగి సమీపంలో వెళ్తున్న ఓ యువకుడ్ని అడిగింది.

    "స్నేక్ షో...పాతికేళ్ళుదాటని ఓ యువకుడు అతి ప్రమాదకరమైన పాములమధ్య నూట ఇరవై గంటలు కూర్చుంటున్నాడు... ఉదయమే మొదలైంది కాబట్టి మరో అయిదు రోజులూ ఈ ప్రదర్శన వుంటుంది" బహుశా ఆ రద్దీలో ఒక అందమైన అమ్మాయి చూసే అవకాశం కోసం ఇబ్బంది పడుతుందేమో అని సలహా ఇచ్చి ముందుకెళ్ళాడు.

    శృతి వెనుతిరగలేదు.

    ఓ గంటసేపు క్యూలో నిలబడింది. తడికలు దాటితే లోపల చదునైన ప్రదేశం చుట్టూ పిచ్ తవ్వబడివుంది. పాములు బయటికి రాకుండా...ప్రేక్షకులకు సరిహద్దులా సరుగుడుదుంగల్ని చుట్టూ అమర్చారు...

    లోపలికి అడుగుపెట్టిన శృతి రెప్ప వేయలేకపోయింది కొన్ని క్షణాలపాటు...

    మండపంలా ఏర్పాటు చేయబడిన బెంచీపై కూర్చున్నాడు యువకుడు. కేవలం లాల్చీ పైజామాల్లో పసిమిఛాయలో మెరిసిపోతున్న అతని ఫాలభాగంపై గల సన్నటి విభూతి రేఖల్ని చూస్తూంటే వేషం మర్చివచ్చిన మహాశివుడిలా కనిపిస్తున్నాడు. అదికూడా కాదు ఆమెను అంతగా కదిలించింది.

    ఒఫీడియా ఉపక్రమానికి చెందిన సర్పాలలో అతి ప్రమాదకరమైన నాగు, మిన్నాగు, పొడపాములు అతడి ఒంటిపై ప్రాకుతుంటే చాలా మామూలుగా కూర్చుని వున్నాడు.

    ఒడిలో ఒకదానికొకటి చుట్టుకుని కొన్ని సర్పాలు ఎంతటి గగుర్పాటుని కలిగిస్తున్నాయీ అంటే ఏ క్షణంలో అయినా అతడికి ప్రమాదం ముంచుకొచ్చేంటుంది.

    ఆమె తన పరిశోధనలో చాలా పాముల్ని చూసింది. విషాన్ని తీసింది పరిశోధించింది. ఇలాంటి 'షోస్' గురించి వినటం తప్ప చూడటం ఇదే తొలిసారి.

    వాటికి కోరలువున్నాయో లేదా అని కూడా ఆమె ఆలోచించడం లేదు. సర్పాలతో చెలిమి చేస్తున్నట్టు అంత ప్రశాంతంగా వుండగలగడం ఆమెను ఆశ్చర్యచకితురాల్ని చేస్తూంది.

    ఆమె ఎంతసేపలా నిలబడిందో గుర్తులేదు.

    ఎందుకో ఒకచోట కాలుని కొద్దిగా కదిపాడు. బహుశా చాలాసేపటినుంచి అలా కూర్చోవడంతో నొప్పిగా అనిపించి జరిపాడేమో. అసంకల్పితంగా పాదం ఓ నాగుపై పడింది.

    అంతే...

    అందరూ చూస్తుండగానే బుస్ మంటూ పైకి లేచింది.

    కసిగా తెరుచుకున్న నాగునోట స్పష్టంగా కనిపిస్తున్న కోరల్ని సునాయాసంగానే చూడగలిగింది శృతి.

    అతడింకా తేరుకోలేదు...

    ఒక విషతరంగంలా పైకి లేచిన పడగ అరక్షణంలో అతడి చెంపని చేరుకుంది...

    శృతి భయంగా కళ్ళు మూసుకోబోతూ చూసింది.

    రెప్పపాటులో ఒడుపుగా పాము నోటిని అందుకున్నాడు. ఆవేశాన్ని అదుపు చేసుకోలేని నాగు అతడి చేతిని చుట్టేసింది.

    ఇట్సే సూసైడల్. క్షణక్షణమూ ప్రమాదంలోకి నెట్టే యీ పాముల ప్రదర్శనకి అనుమతెవరిచ్చారు. ఆమె వెనుదిరగబోతూ ఆగింది. అక్కడ పాముని విడిచిపెట్టిన యువకుడి పెదవులు ముందు నెమ్మదిగా కదిలాయి. మరుక్షణం స్వరం బయటికే వినిపించింది. ఆ స్వరం భాస్వర జ్వాలా హేలలా ఉచ్చరిస్తూ ఆమెను కట్రాటగా మార్చింది.

    "సర్పోప సర్ప భద్రంతే..."

    ఇప్పుడు గోధుమ రంగులో వున్న నాగు నాగ స్వరం వింటున్నట్టు అతడి ముందు నిలబడి పడగ విప్పి అతడ్నే పరికిస్తూంది.

    "సర్పదూరగచ్చ మహావిష జనమేజయస్య యజ్ఞంతే..."

    ముందుకీ వెనక్కీ కదులుతున్న పడగ ఒకచోట స్థిరంగా నిలబడిపోయింది.

    "ఆస్తీకం వచనం స్మర..."

    అతడి చేయి తాకగానే నాగు పడగని విడిచి చెప్పిన మాట వినే పసికందులా అతడి ఒడిని చేరి నిశ్శబ్దంగా ఉండిపోయింది.

    అంతవరకూ నిశ్చేష్టులైన అందరూ చప్పట్లు కొట్టారు.

    నమ్మలేకపోయింది శృతి. సరీసృపాల (రెస్టయిల్స్) గురించి వాటి ప్రవర్తన గురించి శాస్త్రీయమైన విజ్ఞానం గల శృతి కిదంతా అగమ్యంగా ఉంది...

    ఒక శ్లోకంతోనో, ఒక మంత్రంతోనో పాముల్ని నియంత్రించగలమనే మూఢవిశ్వాసాల్ని గాని, ఆత్మశక్తితో ఏదన్నా అదుపుచేయచ్చనే హేతువాదానికందని విషయాల్నిగాని నమ్మని ఒక డాక్టరుగా అక్కడ సైన్స్ కందని ఓ విచిత్రాన్ని చూసినా నిశ్శబ్దంగా ఊరుకోలేదు.

    బయటికి నడిచి అక్కడ నిలబడ్డ ఓ ఎస్సైని అడిగింది. "ఇది ఎలా అనుమతించారు?"

    ముందు ఎస్సైకీ ప్రశ్న అర్ధంకాలేదు. అభినందించడానికి బదులు ఇలాంటి ప్రశ్న అడగటం సమంజసంగానూ కనిపించలేదు.

    "నే టాక్సికాలజీలో పరిచయం గల డాక్టరుగా అడుగుతున్నాను. ఇటువంటి స్నేక్ షోస్ ని మీ డిపార్ట్ మెంట్ ఎలా అనుమతించింది...?"

 Previous Page Next Page