"మా యింట్లో జుట్టు పీక్కోకు. వెంట్రుకలు ఎక్కడ అంటే అక్కడ పడితే ఆరోగ్యానికి మంచిదికాదు". గిరుక్కున తిరిగి యింటికొచ్చేసాడు. అప్పటికీ యింటికి తాళం వేసే వుంది. రగిలిపోతోంది మనసు. తాళం తీసి బట్టలేనా మార్చుకోకుండా గుమ్మం దగ్గర కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
"ఎంత రాత్రయినా రానీ. ఈ దారినుంచేగా లోపలికెళ్ళాలి. లోపలికి అడుగు పెడుతున్నప్పుడే రెడ్ హేండ్ గా పట్టుకోవాలి.
పాటకచ్చేరీ కోసం అంతకు ముందు రెండు రోజులుగా చేసుకున్న ప్రాక్టీసు మూడు గంటలసేపు ఆగకుండా సాగిన పాటకచ్చేరీ - ఎలాగైనా ఏండెటోని త్వరగా అందుకోవాలని చేసిన ప్రయత్నం వీటన్నింటితో విపరీతంగా అలసిపోయాడు. అప్పటివరకూ టెన్ షన్ లో తెలియకపోయినా కుర్చీలో కూలబడ్డాక ఒక్కసారిగా నిద్ర కూరుకొచ్చింది కళ్ళ మీదకి. కుర్చీలోనే నిద్రలోకి జారిపోయాడు.
ఎక్కడి నుంచో దూరంగా వినిపిస్తోన్న పాప్ మ్యూజిక్ సవ్వడికి మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. బాలసూర్యుడి లేత కిరణాలు చురుక్కున పొడిచాయి కళ్ళని.
"అప్పుడే తెల్లారిపోయిందా! ఇంకా రాలేదా మృదుల? అక్కడే వుండిపోలేదు కదా!" గాభరా, భయం, కోపం, ఉడుకుమోత్తనం, కసి. పాప్ మ్యూజిక్ మరి కాస్త బిగ్గరగా వినిపిస్తోంది. అది పైన మృదుల బెడ్ రూమ్ లోంచి ఆ పాట అంత క్రితం రాత్రి ఏండెటో ఇంట్లో విన్నదే.
"యు టాట్ మి హౌ టు లవ్.
వాట్ ఎజాయ్. వాట్ ఎ జాయ్
యు నెవర్ సెడ్ టూ మచ్
బట్ స్టిల్ యు షోడ్ ది వే."
రేగిన పుండు మీద కారం పూసినట్లయింది ఎప్పుడొచ్చింది ఇంట్లోకి. ఎప్పుడు పైకి వెళ్ళింది? సిగ్గులేకుండా అదేపాట ఎలా పాడుకుంటూందో. ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి వీధి తలుపు ధభాల్న మూసేసి తనని నిద్రలోకి జార్చినందుకు కుర్చీని ఒక్క తాపు తన్ని రెండేసి మెట్లు గెంతుకుంటూ మృదుల బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. బాత్రూమ్ లో స్నానం చేస్తోంది. బాత్రూమ్ డోర్ కి పైభాగాన వున్న అద్దంలో నుంచి మృదుల నగ్న సౌందర్యం మసకగా కదులుతోంది. షవర్ కింద స్నానం చేస్తోంది. ఆ జల్లుల మధ్య జలదేవతలా స్వచ్చంగా_ దివ్యంగా అమాయకంగా వుంది. ఇంకా పాట హమ్ చేస్తూనే వుంది. స్నానం చేస్తోంటే అటూ యిటూ స్టెప్స్ కూడా వేస్తోంది.
"స్టాపిట్" అని అరుస్తూ బాత్రూమ్ డోర్ ని ఒక్క తోపు తోసాడు. అటాచ్ డ్ బాత్రూమ్ కావడం వల్ల ఎవరూ రారనే ధైర్యంతో బోల్టు పెట్టుకోలేదు. డోర్ తెరుచుకుంది. షవర్ మధ్యవున్న మృదుల మొదట చిన్న కేక పెట్టింది భయంతో. తరువాత "యూ నాటి," అంటూ తడి వొంటితో అతణ్ణి అల్లుకుపోయింది.
"ఉండుండు. బట్టలు పాడైపోతాయి" అని ఖంగారుపడిపోయాడు భాగవతార్. అతడు పాటకచ్చేరీలకి ప్రత్యేకించి జరీ అంచు పట్టుపంచె, సిల్కు లాల్చీ వేసుకుంటాడు. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు.
"నువ్వు నీ బట్టలు.... ఇలా నా యెదురుగా కనపడితే నాకు సిగ్గెయ్యదూ." తన శరీరం అతనికి కనబడకుండా మరింతగా హత్తుకుపోతూ అతని ముఖం మీద షవర్ జల్లులతో చిరుదెబ్బలు కొట్టసాగింది.
"ఉండుండు ఒదులొదులు" అంటున్నాడేకాని అతనికీ అనుభూతి హాయిగా వుంది. మృదులమీద కోపం - రాత్రంతా తనుపడ్డ అవస్థ - తను అపురూపంగా దాచుకునే బట్టలు - అన్నీ మర్చిపోతున్నాడు. ఊహకందని ఏ లోకాల్లోకో తేలిపోతున్నాడు.
కాలింగ్ బెల్ చప్పుడు వినిపించింది. ఉలిక్కిపడ్డారు యిద్దరూ. భాగవతార్ ని బాత్రూమ్ లోంచి బయటికి నెట్టి "నిముషంలో వచ్చేస్తా" అని తలుపు బోల్డ్ పెట్టేసుకుంది. ఒంటిమీద తలమీదపడ్డ చన్నీళ్ళు భాగవతార్ ని చాలావరకు చల్లార్చినా, మృదుల చేతుల్లోంచి బయటపడగానే అరగంట కింద వదిలేసిన ఆలోచనలన్నీ ఈగల్లా ముసురుకున్నాయి వచ్చి. తల తుడుచుకుని బట్టలు మార్చుకుని వీధి తలుపు తెరిచాడు. ఎదురుగా టాక్సీ డ్రైవర్. చేతిలో యాభై రూపాయల నోటు ముందుకు జాపి. "ఇది అమ్మగారి కియ్యండి" అన్నాడు.
"ఎందుకు?" అడిగాడు భాగవతార్.
"నిన్న నా టాక్సీలో ఆవిడ్ని తిప్పాను. వందరూపాయల నోటు యిచ్చారు. అప్పుడు నాదగ్గిర చిల్లర లేదు. ఇప్పుడు తెచ్చాను. తీసుకొని మీ భార్యగారి కివ్వండి. నేవెళ్ళాలి"
బొమ్మలా నిలబడ్డ భాగవతార్ చేతిలో యాభై రూపాయల నోటు పెట్టేసి వెళ్ళిపోయాడు టాక్సీ డ్రైవరు. అతడు లోలోపల నవ్వుకుంటున్నట్లు తోచింది భాగవతార్ కి.
"మీ భార్యగారికివ్వండి" అని ఎంత వెటకారంగా అన్నాడు వాడు. మృదుల స్నానం చేసి జీన్స్ లో తయారై వచ్చింది. స్నానం చేసి దువ్వుకోకుండా వదిలేసిన జుట్టు ఫాన్ గాలికి విశృంఖలంగా ముఖం మీద చిందులు వేస్తోంది. కాంతివంతమైన కళ్ళు ఎప్పటిలాగే నవ్వుతున్నట్లుగానే వున్నాయి. మృదులలో గొప్ప ఆకర్షణ ఏ సందర్భంలో యెప్పుడు చూసినా నవ్వుతున్నట్లే కనిపించడం.
"టాక్సివాడు యాభై రూపాయలిచ్చాడు." ఏభై రూపాయల నోటు ఆమె వేపు చాచాడు భాగవతార్. అది చూడగానే మృదుల ముఖం పాలిపోతుందని టాక్సీలో వెళ్ళినందుకు ఏవేవో కథలు కల్పించి చెప్పడానికి ప్రయత్నిస్తుందని ఊహించాడు. అయితే మృదుల అతి మామూలుగా "ఆనోటు నీ పర్సులోనే వుండనీ. ఎవరిదగ్గరుంటేనేం? అదిసరే_రాత్రంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? అట్నుంచి అటే మరో ప్రోగ్రాంకి వెళ్ళావా? నీకోసం చూసి చూసి నిద్రలోకి జారిపోయాను. రాలేకపోతే ఫోనైనా చెయ్యొద్దా" ముద్దుగా కోప్పడింది.
నిర్ఘాంతపోయాడు. "ఇదేమిటి" ఇవన్నీ తను అనవలసిన మాటలు కదూ!
"నువ్వెక్కడికెళ్ళావు రాత్రి?"
'నేనా!...ఎక్కణ్ణుంచి మొదలు పెట్టను?" ఆలోచిస్తూ అంది.
జుట్టు పీక్కోబోయి ఆగిపోయి "నిజంచెప్పు" అన్నాడు కళ్ళెర్రజేసి గద్దిస్తూ. ఒక్క అడుగు వెనక్కి వేసింది. "అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమిటి?"
"తప్పుచేసిన వాళ్ళకి అబద్ధాలతో అవసరం తప్పదు."
"ప్రాస బ్రహ్మాండంగా వుంది. కాని అసలు తప్పంటే యేమిటంటా? ఏది తప్పో - ఏది ఒప్పో నిర్ణయించేవాళ్ళెవరుట?"
తడబడిపోయాడు భాగవతార్. ఈ పిల్ల మామూలు ఆడవాళ్ళల్లా ఏడ్చినా దెబ్బలాడినా - భయపడినా - అతడు అర్ధం చేసుకోగలిగేవాడు కాని అతని కంతకుముందు పరిచయంలేని సరికొత్త పద్ధతిలో మాట్లాడేస్తోంది. అమాయకంగా కనపడే యీ అతి తెలివైన పిల్ల. సమాధానం చెప్పలేకపోతున్నాడు సరికదా బుఱ్ఱ పనిచేయడం లేదు. కళ్ళప్పజెప్పి చూసాడు.
"రాత్రి ఎప్పుడొచ్చావు?" బోనులో ముద్దాయిని నిలదీస్తున్న లాయర్ లా అడిగాడు.
"ఎప్పుడొచ్చానో సరిగ్గా టైమ్ చూసుకోలేదు. టాక్సీలో వచ్చాను. నా తాళం చెవితో తలుపు తీసుకుని బెడ్ రూమ్ లో కొచ్చి పడుకున్నాను. ఏముంది యిందులో."
"నేను గుమ్మం దగ్గిరే కుర్చీలో కూర్చున్నాను కదా! నాక్కనపడకుండా ఎలా వచ్చావు?"
"ఏవిటీ.... రాత్రంతా" ....వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయి పడిపడి నవ్వుతూ, నవ్వుల మధ్య ఒక్కొక్క మాటా మాట్లాడుతూ_
"ఇక్కడ .... ఈ కుర్చీలో.... రాత్రం....తా కూర్చునే...." పొట్ట చేత్తో పుచ్చుకుని నవ్వేసింది. బిక్క చచ్చిపోయాడు భాగవతార్. ఎగురుతోన్న ఆ జుట్టు పట్టుకుని ఎడాపెడా వాయించాలనుకుంది. ఆ పని ఎందుకు చెయ్యలేక పోతున్నాడో అతనికే అర్ధం కావటంలేదు. నవ్వాపుకుని, చటుక్కున అతని మెడచుట్టూ చేతులువేసి నుదుటిమీద ముద్దు పెట్టుకుని, "ఎంత ప్రేమ నేనంటే" అంది గోముగా.
"ఎలా వచ్చావు? లోపలికి" ఏడుపు గొంతుతో అడిగాడు.
"సింపుల్. నువ్వు తలుపు దగ్గిర కుర్చీ వేసుకోవడానికి ముందే వచ్చి లోపల పడుకుని వుంటాను. నువ్వు ప్రేమలో మునిగి తేలిపోతూ పైన చూడకుండానే గుమ్మందగ్గర కాపలా కాసి వుంటావు."
"ఆ...." అన్నాడు నోరు తెరిచి. ఆ నోరు రెండు చేతులతో మూసి "దోమలు దూర్తాయి. వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువైపోయి దోమలు పెరిగిపోతున్నాయి" నవ్వింది.
"ఈ గంద్రగోళంలో తను అడగదల్చుకున్నదేమిటో మర్చిపోయాడు భాగవతార్. అతను భుజంచుట్టూ చెయ్యివేసి, "తెల్లవార్లూ సరిగ్గా నిద్రలేదేమో? కాస్సేపు రెస్ట్ తీసుకో. లేచేసరికి వంటమనిషితో వేడివేడి కాపీ రెడీ చేయిస్తాను." అని చెయ్యి పట్టుకుని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళి మంచంమీద పడుకోబెట్టి ఫాన్ వేసి మెత్తటి కాశ్మీర్ శాలువా కప్పింది. తనకంటె ఇరవై యేళ్ళు చిన్నదైన ఆ అమ్మాయి చేతుల్లో నలభైయేళ్ల పెద్దమనిషి పసివాడిలా మారిపోయి నిద్రలోకి జారిపోయాడు. అతను లేచేసరికి ఉదయం పదకొండు గంటలైంది. బెడ్ రూమ్ కిటికీ తెరలన్నీ లాగేసి చీకటిగా వుంచడం వల్ల సూర్యకిరణాలు లోపలికి రాక అతనికి పొద్దెక్కుతోందనే స్పృహ కలగలేదు. గడియారం చూసి ఖంగారు పడిపోయి మంచానికున్న కాలింగ్ బెల్ నొక్కాడు గట్టిగా. వంటమనిషి వేడి కాపీ కప్పుతో అతని ముందుకొచ్చి కాఫీ సైడ్ టేబిల్ మీద పెట్టి చిన్న స్లిప్ చేతికందించింది.
"డియర్ బి"
నువ్వు అతి గాఢంగా- అంత సుఖనిద్ర పాడు చెయ్యాలనిపించలేదు. అర్జెంటు పనిమీద వెళుతున్నాను. వివరాలు వచ్చాక.
విత్ కిసెస్ - యమ్.