"మీ బెడ్ రూమ్ లో, పరుపులా, తలగడకింద పురుగులు కానీ నల్లులుగానీ చేరకుండా వుండాలీ అంటే నాలుగైదు మిరియా గింజల్ని అక్కడ వుంచాలి."
కేవలం టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే అలాంటి ప్రసక్తి తెచ్చిన రుత్వి వూహించలేదు అక్కడున్న ప్రతి యువతీ అంతగా రియాక్టవుతుందని.
"మా ఉప్పు జాడీలో బాగా నీరు చేరుతోంది రుత్విగారూ" వర్షాకాలంలో మరీనూ.
"కొన్ని పచ్చి మిరపకాయలు వేయండి మీరు పట్టదు"
"కారం డబ్బాలో పురుగు పట్టకుండా వుండాలంటే."
"కొన్ని వేపాకులేయండి."
"మా ఫ్రిజ్ అంతా దుర్వాసన వస్తోంది రుత్వీ."
"అయ్యోపాపం" బోలెడంత బాధని అభినయించాడు.
"కొన్ని బొగ్గుల్ని పళ్లెంలో పెట్టి ఫ్రిజ్ లోవుంచితే ఆ దుర్గందాన్ని బొగ్గులు లాగేసుకుంటాయి."
మరో యువతి లేచింది "నా లిప్ స్టిక్ మరకలు మా ఆయన షర్టుపై పడుతుంటాయి తరచుగా. ఎంత ఉతికినా పోవడంలేదు. "
"ఆ మరకమీద గ్లిజరిన్ పోసి ఓ గంట నానబెట్టి వేడినీళ్లతో తడిసి సబ్బురాస్తే మొత్తం మరకలు మాయమౌతాయి."
"స్టాపిట్" కమలాదాసు అరిచింది అసహనంగా.
హఠాత్తుగా అక్కడ నిశ్సబ్దం ఆవరించింది.
"రుత్విని మనం పిలిచింది ఇలాంటి చిట్కాల గురించి తెలుసుకోవడానకికాదు. ఆయుర్వేదం గురించి అనుమానాలని నివృత్తి చేసుకోవాలి."
ఇంతకన్నా అదను రాదన్న ఓ మధ్య వయస్కురాలు రుత్విని వెంటనే అడిగింది.
"మా వారి కిడ్నీస్ లో రాళ్లున్నాయి అంటున్నారు డాక్టర్లు. కాకపోతే ఆయన కాస్త భోజనప్రియుడు మందులు వాడుతున్నారనుకోండి."
"మీ వారికి ఉలవచారు అలవాటు చేయండి" ఠక్కున జవాబు చెప్పాడు.
"డయాబెటిస్ వున్న వాళ్లు కూడా ఉలవచారు వాడొచ్చు. ముల్లంగి ఆకునుగాని, దుంపనిగాని దంచి ఆ రసంతో వులవచారు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోతాయి. వాతానికి, పక్షవాతానికి, క్షయ వ్యాధికి వులవచారు మంచిదే."
"క్షయవ్యాధికి మజ్జిగ కూడా మంచిదంటారుగా" అందామె. తనకు తెలిసింది నలుగురికీ తెలియచెప్పడమనే ఆలోచనతోకాక రుత్విని ఇంప్రెస్ చేయాలనుకుంది.
ఇప్పటికే సశ్య వచ్చి చాలాసేపు అవడంతో సంశయంగా సశ్య వేపు తల తిప్పాడు.
తన అంచనా తప్పుకాలేదు. సశ్య చాలా సీరియస్ గా తననే చూస్తోంది రెప్పవాల్చకుండా.
"వెళ్లాలని తొందరగా వున్నట్టుంది పాపం" అంది శాంత సశ్యని, రుత్విని మార్చి మార్చి చూస్తూ.
"ఒన్ మినిట్ సశ్యా" సూటిగా సశ్యతోనే అనేశాడు రుత్వి "వెళదాం"
ఆఖరి ప్రశ్నకి జవాబు చెప్పి వెళ్లిపోవాలనుకుంటూ ఇందాక మజ్జిగ గురించి మాటాడిన స్త్రీని చూస్తూ అన్నాడు.
"మజ్జిగ తాగితే మనుషులు దేవతలౌతారన్నది ఆయుర్వేదం తెలియజెబుతుంది. మజ్జిగ తాగితే చంద్రుడికి క్షయ వచ్చేదికాదు. మజ్జిగ అలవాటు వుంటే వినాయకుడికి పొట్ట పెరిగేదికాదు. మజ్జిగ తాగకనే కుబేరుడికి కష్టు రోగం వచ్చింది. ఇలా యోగరత్నాకారంలో మజ్జిగ ప్రశస్తి గురించి చాలా రాయబడింది."
" మేమంతా మజ్జిగ తాగుతున్నాంగానీ మాకెందుకు పని చేయడంలేదట" దీర్ఘందీసింది ప్రౌఢ.
కోపం తెచ్చుకోలేదు రుత్వి" కారణం ఒక్కటే మేడమ్! మనం సాంకేతికంగా చాలా ఎదిగి చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. ఉదాహరణకి మీ ఇంట్లో వుండే ప్రిజ్ ని తీసుకుందాం. అందులో పెరుగుని వుంచుతారు చల్లగా, రుచిగా వుండాలని. అవునా?'
"అయితే" విస్మయంగా చూసిందామె అదో తప్పా అన్నట్లుగా.
"అసలు పెరుగుని ఫ్రిజ్ లో పెట్టడం పెద్ద తప్పు."
అక్కడున్న ప్రతి యువతి ఆశ్చర్యపోయింది రుత్వి స్టేట్ మెంట్ కి.
"పాలని తోడు పెట్టడానికి మనం మజ్జిగ చుక్కలు వేస్తాం. అలా 'లాక్టోబెసిల్లె' అనే సూక్ష్మజీవిని పాలలో ప్రవేశపెడతాం. ఆ సూక్ష్మజీవే పాలని పెరుగుగా మార్చేది. పెరుగునిగాని, మజ్జిగనిగానీ మనం తీసుకోవడం ద్వారా ఈ లాక్టోబేసిల్లె మన శరీరంలోకి ప్రవేశించి ప్రేవుల్లోని మ్యూకాస్ పొరని సంరక్షిస్తుంది. అందువలన ప్రేవులు బలబడతాయి. అమీబియాసిస్, టైఫాయిడ్, కానిస్టివ్రేన్ లాంటి చాలా జబ్బుల్ని నయం చేసేది ఈ సూక్ష్మ క్రిమే అని చాలామందికి తెలియదు.
ఆగాడు క్షణం.
"అలాంటి లాక్టోబేసిల్లె పెరుగుని మనం ఫ్రిజ్ లో వుంచడం మూలంగా చనిపోతుంది. మజ్జిగ తాగినా ఫలితం దక్కకుండాపోతోంది."
అంతా తెల్లమొహాలు వేసుకుని చూస్తుండగానే అందరి దగ్గరా ముఖ్యంగా కమలాదాసు దగ్గర సెలవు తీసుకున్నాడు. సశ్యతోపాటు కాన్ ఫెరెన్స్ హాల్లోనుంచి బయటికి నడిచాడు రుత్వి వేగంగా..
ద్వారం బయటికి వస్తూ "నువ్వు కంప్యూటర్ ఇంజనీరన్న బోర్డు పీకేసి డాక్టరులా బోర్డు పెట్టికుంటే బెటరు" అంది చిరాగ్గా.
"కోపం తెచ్చుకోకు" నచ్చచెప్పబోయాడు.
"ఒళ్ళు మండిపోయింది అక్కడున్న ఆడవాళ్ళని చూడగానే" సశ్య మొహం మరింత ఎరుపెక్కింది.
"మండాల్సింది వాళ్లకి."
"అదేం."
"హాల్లోకి వస్తూనే పెద్ద హడావుడికి కారణమయ్యావుగా" సశ్య అర్దంకానట్లు చూస్తుంటే చెప్పాడు.
"నిజం సశ్యా! అక్కడున్న వాళ్ళంతా కాలక్షేపం కోసమోలేదూ!వాళ్ల భేషజాలు ప్రదర్శించుకోటానికి కలిసేవాళ్లే తప్ప వాళ్లదసలు స్నేహంకాదు. అందుకే నువ్వు కమలాదాసుకి చురకంటించేసరికి మరో లేడీ ఆనందపడింది. కాబట్టే ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయ్యే రభసకి నువ్వు మూలం అంటున్నాను"
"రభస" అంటే?" రెస్టారెంటులోకి దారితీస్తూ అడిగింది సశ్య.
"అలజడి అనే పదానికి సంస్కృతంలో రభస అంటారు. అసలు కుక్కలు కరిస్తే వచ్చే జబ్బు రాహీస్ అంటారకే దానికి మూలం కూడా ఆ రభసనే పదమే"