Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 47


    "ముందా చిరుతిళ్లు మానేయండి" ఠక్కున అన్నాడు రుత్వి. "ప్రతిరోజూ ఉదయం ఓ గ్లాసు నీళ్లలో నిమ్మకాయ రసం రెండు చెంచాల అడవితేనె కలుపుకుని తాగండి.  వీలయితే ఉలవ గుగ్గిళ్లు తినండి సన్నబడతారు."

 

    "చాలా రోజులుగా నన్నోప్రశ్న వేధిస్తుంది రుత్విగారూ" బిడియాన్ని అదిమిపెట్టుకుంటూ అడిగిందో  మధ్య తరగతి స్త్రీ. "ఈ మధ్య మావారు తరచూ బూడిద గుమ్మడికాయను కూరగానో, మరో రూపంలోనో వాడాలని నన్ను తెగ హింసించి రోజూ  తీసుకొస్తున్నారు.  నాకు అదంటేనే అసహ్యం. అసలు బూడిద గుమ్మిడికాయ ఇంటిముందు వేలాడగట్టడానికే తప్ప వంటకి తిండికి  పనికిరాదంటే వినరు."

 

    "మీరు పొరపడ్డారని చెప్పడానికి చింతిస్తున్నాను మేడమ్!బూడిద గుమ్మడికాయ మంగలఫ్రదమైంది కాబట్టి ఇంటిముందు వేలాడదీస్తారుగానీ ఇంకా కాయపైన బూడిద సరిగా పట్టని బూడిద గుమ్మడికాయలు వండుకు తింటే శరీరానికి ఎంత మంచిదీ మీకు తెలీదు. బూడిద గుమ్మడికాయ చలువ చేసే చల్లని ఔషదం. లివర్ వ్యాధులకి మంచిది. బూడిద గుమ్మడివేరుని దంచి అరచెంచా పొడిని  వేడి నీటితో కలిపి తాగితే ఉబ్బసం రోగాలు, ఆయాసం తగ్గి శ్వాస సులభమవుతుంది ఊపిరితిత్తులకి బలాన్ని ఇవ్వడమే కాక రక్తపుష్టిని కలిగిస్తుంది .అమీబియాసిస్ వ్యాధితో బాధపడే రోగులు ప్రేవుల లోపల రాలిపోయే మ్యూకస్ పొరను తిరిగి నిర్మించడంలో సాయపడుతుంది."

 

    విస్మయంగా చూస్తున్న స్త్రీల ఆసక్తిని గమనిస్తూ క్షణమాగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

 

    "బూడిదగుమ్మడి, ఉలవలు వడియాలు పెట్టుకుని తింటే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.

 

    "అది సరే రుత్వీ" ఆర్దోక్తిగా అంది కమలాదాసు "దాంపత్య జీవితానికి దానివలన ఏమన్నా వుపయోగముంటే చెప్పు. అప్పుడు మా శాంతకాస్త శాంతిస్తుంది."

 

    ఇందాక బూడిద గుమ్మడికాయ గురించి ప్రశ్నడిగిన యువతి నవ్వింది మృదువుగా. "అవును. అలాంటిదేమన్నా వుంటే నేనూ బూడిద గుమ్మడికాయమీద ఇష్టాన్ని పెంచుకుంటాను."

 

     "మీకు బూడిదగుమ్మడికాయ ఆహారాన్ని  సరాసరి తీసుకోవడం కష్టమయితే ఆయుర్వేద ఔషదాలు అమ్మేచోట కుష్మాండలేహ్యమనే పేరుతో దొరుకుతుంది శాంతిగారూ! ఒకటి రెండు చెంచాలు పాలతో తీసుకుంటే మీకు ఇబ్బంది వుండదు" అన్నాడు రుత్వి.

 

    "జవాబు దాటవేయకు రుత్వీ.... " కమలాదాస్ మళ్లీ రెట్టించింది. "దాంపత్య జీవితానికి బూడిద గుమ్మడికాయ ఉపయోగమా కాదా అది చెప్పు."

 

    గొల్లుమని నవ్వారు స్త్రీలంతా.

 

    "మీవారికి డయాబెడిస్ వుందా?" అడిగాడు రుత్వి.

 

    "అవును వుంది."

 

    "అందుకే ఏ ఆయుర్వేద వైద్యుడో మీ వారికి సలహా ఇచ్చుంటాడు శాంతగారూ! మీకు తెలీదు. మగతనానికి నూరేళ్లు ఆయువు పోసే బూడిద గుమ్మడికాయ ప్రత్యేకించి మధుమేహ వ్యాధి వున్న వాళ్లకి వరప్రసాదం, మధుమేహ వ్యాధి వున్న వాళ్లు సహజంగా లైగింక వాంఛ, శక్తితగ్గి పోతుంటాయిగా అలాంటి పరిస్థితి నుంచి  కాపాడుతుంది ఈ బూడిద గుమ్మడికాయ."

 

    "గివ్ హిమ్ ఎ బిగ్ హేండ్" కమలాదాసుతో సహా స్త్రీలంతా చప్పట్లు కొడుతుంటే తన భర్త విషయం అందరికీ తెలిసిపోయినట్టు శాంత తలవంచుకుంది.

 

    అదిగో సరిగ్గా ఆ సమయంలో హాల్లోకి అడుగుపెట్టింది సశ్య.

 

    సీరియస్ గా అంతా పరికించింది సశ్య.

 

    "మొన్నెప్పుడో  హాలిడే ఇన్ రెస్టారెంట్ లో కనిపించిన వృద్ద నారీ మణులే. కాకపోతే సంఖ్య ఎక్కువగా వుంది.

 

    సాధ్యమయినంత త్వరలో అక్కడినుంచి వెళ్లిపోవాలనుకుంటున్న రుత్వికి సశ్య రాక చాలా వూరటనిచ్చింది.


 
    ఏదో చెప్పి అక్కడనుంచి సశ్యతోబాటు వెళ్లిపోవడం కోసం కాదు.

 

    రుత్వి ఆలోచనల్ని గమనించిందేమో కమలాదాసు సశ్యని చూస్తూ అనేసింది అనాలోచితంగా.

 

    "పాపం నీ ఫ్రెండ్ నిన్ను వెదుక్కుంటూ వచ్చినట్టుంది రుత్వీ."

 

    "ఏం"వెంటనే రియాక్టయింది సశ్య కూడా "మీకేమన్నా అభ్యంతరమా?"

 

    సశ్య ఇంత ఫాస్ట్ గా కౌంటర్ ఇస్తుందని వూహించని కమలాదాసు ఏం మాట్లాడాలో తోచక అవాక్కయి చూస్తుంటే చాలా ఆనందపడిపోయింది అక్కడ వున్న స్త్రీలలో ఓ మూలు కూర్చున్న మేరీ.

 

    ఆమె కూడా బాగా వున్నింటి ఆడదే అయినా ప్రతిదాంట్లోనూ కమలాదాసు ఎక్కువ చొచ్చుకుపోయి పాపులారిటీ సంపాదించడంతో తరచూ అసూయపడడం అలవాటే "పాపం కమలాదాసు ఆ  అమ్మాయి ఎవరయినాగానీ గోడకేసి మేకు దిగ్గొట్టినట్టు జవాబు చెప్పడంతో షాక్ తిన్నట్టయింది" అంది.

 

    ఫకాలున నవ్వారు కమలాదాసు ప్రత్యర్దులయిన స్త్రీలు కొందరు.

 

    వాతావరణం  వేడెక్కడాన్ని గమనించిన రుత్వి చల్లబరచాలనుకుంటూ అన్నాడు. "మేకు చివర కాస్త కొబ్బరినూనె రాయాల్సింది."

 

    అర్దంకానట్టు చూసింది మేరీతోపాటు కమలాదాసు కూడా.

 

    "అంతేగా" ఓ సైంటిఫిక్ చిట్కాలా చెప్పాడు.

 

    "గోడకి మేకు కొట్టేటప్పుడు మేకు చివర భాగానికి కొబ్బరినూనె రాస్తే సులభంగా గోడలోకి దిగుతుంది.

 

    "పాపం కమలాదాసు" మరోసారి అందుకుంది మేరి "మేకు దిగడంలో ఇబ్బందిలేకుండా  రుత్వి సాయం చేస్తున్నాడనుకుంటా. '

 

    కమలాదాసు మేరీని కాదు రుత్వికేసి సీరియస్ గా చూసింది.
 


    లాభంలేదు వెంటనే అందర్నీ డైవర్ట్ చేయకపోతే సోకాల్డ్ మహిళామంలి నాగరిక యువతులు బలాబలాలు తేల్చుకునేట్లున్నారని బోధపడింది రుత్వికి.

 

    "నేను కమలాదాసుగారికి మాత్రమే సాయం చేయాలనుకోవడం లేదు మేడమ్" మేరీని చూస్తూ అన్నాడు.

 

    "మీకు కూడా.... మీ ఇంట్లో పంచదార డబ్బా చీమలు పడుతుంది కదూ."

 

    పంచదారవున్న ప్రతి డబ్బాచుట్టూ చీమలు చేరడం సహజం అనుకోలేదు  మేరీ. మకలాదాసుకన్నా రుత్వి తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా ఆనందంగా -

 

    "యా... నిజంగా ఇంట్లో పంచదారకి చీమలు పడుతున్నాయి" అనేసింది ఉత్సాహంగా.

 

    "అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే..... ఆ డబ్బా చుట్టూ పసుపు చల్లండి. చీమలు చేరవు"

 

    "రియల్లీ"

 

    "అంతేకాదు" మేరి ఇంటి సంగతి అంతా తెలిసినట్లు మరో చిట్కా చెప్పాడు.

 Previous Page Next Page